నా జీవన యానంలో- రెండవభాగం- 33

-కె.వరలక్ష్మి

          మా ఊళ్ళో ఎరకలి ఎరకమ్మ అనే ఆవిడుండేది. మా అమ్మకి పురుళ్ళన్నీ ఆవిడే పోసిందట. ఆ వృత్తి ఆగిపోయినా పండగలకి పాత చీరలిచ్చీ, బియ్యం – పిండివంటలు పెట్టీ,  ఆమెని అందరూ మర్యాదగా చూసేవారు. మనిషి వంగిపోయే వరకూ చాలా కాలం బతికింది. పండగొస్తే నా దగ్గరికి కూడా వచ్చేది. వచ్చినప్పుడల్లా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఓ కథ చెప్పేది. ఎంత దానివయ్యావమ్మా అంటూ నా బుగ్గలు పుణికేది. అలా ఆ ముందు సంవత్సరం తన చెప్పిన కథే  ‘మంత్రసాని’ కథగా రూపు దిద్దుకుంది.

          2004లో పులికంటి సాహితీ సత్కృతి పోటీలో మొదటి బహుమతి పొందింది. తిరుపతి భీమాస్ డీలక్స్ హాల్లో సభ గ్రాండ్ గా జరిగింది. ఉదయం నేను ట్రైన్ దిగంగానే ఫోన్ చేస్తే పులికంటి కృష్ణారెడ్డి గారు సాదరంగా ఆహ్వానించి ఆయన మిత్రులైన రాజా రామ మోహన రావు గారు, భమిడిపాటి జగన్నాధ రావు గారు మొదలైన వారికి ఎకామిడేషన్ ఇచ్చిన wood side హోటల్లో నాకూ ఒక రూమ్ ఇచ్చారు. నేను ఇంటి దగ్గరున్నప్పుడే ఫోన్లో అడిగితే సభ ముగిసేక గెస్టులందర్నీ తిరుమల కొండ పైకి తీసుకెళ్తాం అన్నారు. అందుకని నేను తిరుగు ప్రయాణం రిజర్వేషన్ మర్నాటికి చేయించుకున్నాను. తీరా, కారులో చోటు లేదని, బస్సులో వచ్చేయమని వాళ్ళంతా నన్నొదిలేసి వెళ్ళిపోయారు. బస్సులో కొండపైకి వెళ్తే వాళ్ళు ఉంటామన్న చోట లేరు. ఫోన్ చేస్తే ఎవరూ పలకలేదు. వాళ్లకు V.I.P దర్శనం ఏర్పాటు ఉంది. అప్పటికప్పుడు నాకు దర్శనం ఎలా  వీలవుతుంది. కొండపైన అంత జనంలో ఒక్కదాన్నైపోయాను. బేగ్ బరువు మొయ్యలేక ఏదో ఒక రూమ్ కోసం ప్రయత్నిస్తే తెలిసింది. తిరుమలలో ఒక్కరికి రూమ్ ఇవ్వరట. నా పరిస్థితి ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టైంది. నిస్సహాయంగా దిక్కులు చూస్తున్న నన్ను ఓ పన్నెండేళ్ళ పిల్లవాడు పలకరించాడు- “డబ్బులిస్తారా మీ బేగ్ పట్టుకుంటాను” అని, “సరే” అని బయలుదేరి గుడి చుట్టూ మూడు రౌండ్లు కొట్టినా ఎక్కడా రూమ్ దొరకలేదు. “నాతో రండి” అని ఆ పిల్లవాడు రద్దీగా ఉన్న దుకాణాల మధ్య సందులోకి దారి తీశాడు. నాకు భయం వేసి ఆగిపోయాను. వెనక్కి తిరిగి వైకుంఠం హోటల్ కెళ్ళి నాతో పాటు ఆ అబ్బాయికీ టిఫిన్ ఇప్పించి అతను అడిగిన ఇరవై రూ. ఇచ్చి పంపించేసాను.

          కొంత స్థిమితంగా గమనిస్తే తెలిసింది. ఆ హోటల్ పైన గదులు కర్ణాటక గెస్ట్ హౌస్ వి. అక్కడ గుమస్తా బి.శివయ్య తెలుగువాడు. రచయితలు అంటే అభిమానం కలవాడు. నా చేతిలో షీల్డు, పూలమాలలు చూసి నా తరపున అతను హామీ ఉండి రూమ్ ఇప్పించాడు. అతనికి నా బుక్స్ ఇచ్చాను. ఇప్పటికీ అతను ఫోన్లో పలకరిస్తూ ఉంటాడు.

          తెల్లవారుజామున సుప్రభాత సేవ అర్చన మంత్రాలకు మెలకువ వచ్చింది. బైటి
మెట్లు మీది కెళ్ళి ఎడమ వైపు తిరిగితే లైట్ల వెలుగులో మెరిసిపోతున్న స్వర్ణ గోపురం. భక్తితో మనసు పులకించినా ఒంటరితనపు దిగులు. మెట్లకి ఎదురుగా మొత్తం కూల్చేసి, గర్భగుడిని మాత్రం మిగిల్చిన ఆలయంలో చీకట్లో దేవుడిని హారతితో అర్చిస్తున్న వృద్ధ పూజారిని చూస్తూ నిల్చున్నాను. దేవుడెవరో తెలీలేదు.

త్వరలోనే కన్నడ కాంప్లెక్స్ ను కూడా కూల్చేస్తారని శివయ్య చెప్పాడు. కన్నడ ధ్యాన మందిరంలో ఒక గంట కూర్చుని 9:30 a.m కి క్యూలో నిలబడి 1 p. m కి బైటికొచ్చి, హోటల్లో తిని ఓ గంట రెస్ట్ తీసుకుని రూమ్ వెకేట్ చేసి శివయ్యకి కృతజ్ఞతలు చెప్పి బస్సులో తిరుపతికి వచ్చి తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కి  మర్నాడు ఉదయానికి ఇంటికి చేరుకున్నాను. అలా ఆ ప్రయాణం మరచిపోలేని ప్రయాణమైంది.

          2004 జనవరి 17 న చాసో (చాగంటి సోమయాజులు. అది ఆయన పుట్టినరోజు)
అవార్డు సభ జరిగింది. విజయనగరంలో నా కథల మీద కాత్యాయనీ విద్మహే మాట్లాడేరు. మా అందరికీ బస్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న రాజా ఇంటర్నేషనల్ హోటల్లో రూమ్స్ ఇచ్చారు. కాళీపట్నం రామారావు గారు ముఖ్య వక్త. ఉత్తరాంధ్ర రచయితలు చాలామంది వచ్చారు. చాసో గారి కుమార్తె తులసి గారు మధ్యాహ్నం మమ్మలనందరినీ  తన ఇంటికి తీసుకెళ్ళేరు. అక్కడ వారి తల్లి గారిని, చాసో పెద్ద కొడుకు, కోడలు, మనవడు, చిన్న కూతురు కృష్ణకుమారి గారిని కలిసాం. సభ అద్భుతంగా జరిగింది. అక్కడే డిన్నర్ తర్వాత విచ్చేసిన వారంతా నన్ను చుట్టుముట్టేసి నా స్పీచ్ ని మెచ్చుకున్నారు. పెద్దలు ఆశీర్వదించేరు. పిన్నలు అభినందించేరు. ఆ అవార్డు అందుకున్న సందర్భంగా విశాఖ ఆలిండియా రేడియో నాతో ఇంటర్వ్యూ బ్రాడ్ కాస్ట్ చేసింది. ఆ సందర్భంగా సింహాచలంలో మా ఆడపడుచు ఇంట్లో ఉండవలసి వచ్చింది. నేను కథలు రాసి డబ్బులు సంపాదించేస్తున్నానని మా ఆడపడుచు అకారణంగా నా మీద విషం కక్కింది. సాహిత్యం లో ఏ మాత్రం పరిచయం లేని వాళ్ళు నా తోబుట్టువులు, మోహన్ తోబుట్టువులు అలా ఏదో విధంగా సాధిస్తూ ఉండేవాళ్ళు.

అవార్డు అందుకున్న సందర్భంగా అబ్బూరి ఛాయా దేవి గారు, పి.సత్యవతి గారు మొదలైన రచయితలెందరి నుంచో అభినందనలు అందుకున్నాను.

మోహన్ పెన్షన్ కి సంబంధించిన పనులన్నీ పిఠాపురం డిప్యూటీ D.E. O ఆఫీసులోని షరీఫ్ ఉచితంగా చేసి పెట్టాడు. ఎక్కడా మీరు ఎవరికీ లంచాలు ఇవ్వకండి అన్నాడు. ఆఫీసుల్లో షరీఫ్ లాంటి యువకులు ఉంటే అందరికీ ఎంతో మేలు జరుగుతుంది.

2004 మార్చి 5 న శ్రీ కొంగర జగ్గయ్య గారు కాలం చేశారు. ఆయన గొప్ప నటులు, సాహితీ మిత్రులు నాకు. పేపర్లలో నా అవార్డుల సంగతి చూస్తే కానీ మా ఊరి వాళ్ళకు నేనొక రచయితనని తెలియలేదు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న M.L.A,  ఇతర పార్టీ సభ్యులు; మార్చి 21 ఉగాది రోజున లైన్స్ క్లబ్, ఆర్యవైశ్య సంఘం, వైశ్య లేడీస్ క్లబ్, ఆదర్శ మహిళా మండలి సంస్థల వారు విడివిడిగా ఘన సన్మానాలు చేశారు నాకు.

          వ్యసనం మనిషిని నాశనం చేయడంతో ఊరుకోదు. ఆ మనిషిని నమ్ముకున్న వారి
జీవితాన్ని చేదు పాటగా మార్చగలదు. మా మోహన్ తో నా జీవితం అలా ఉంది చేదు చేదు పాటలా. అతను నన్ను పిలవడానికి కష్టపడకూడదని చప్పుడు చేసే చీల్చిన వెదురు బెత్తం ఒకటి అతని మంచం మీద ఉంచేను. పగలు సరే, రాత్రి కూడా నన్ను నిద్ర పోనీయకుండా దడాదడా మంచం పట్టె కేసి బాదుతూ ఉండేవాడు. దాంతో రాత్రి, పగలు నిద్ర ఉండేది కాదు. మగ్గులోకి యూరిన్ పోసి బెడ్ రూమ్ లో వొంపేసేవాడు లేదా పక్కనే ఉన్న నా మంచం మీదకి విసిరేసేవాడు. అతన్ని చూడటానికి ఒప్పుకున్న భాస్కర్ తన వల్ల కాదు అనేలాగా పక్క బట్టల మీద యూరిన్, మోషన్స్ చేసేవాడు. ఒకసారి నేను బయట తాళం పెట్టి, పళ్ళు కొనడానికి వెళ్ళి వచ్చేసరికి పోర్టికోలో స్తంభానికి ఓ కాలు పైకి మడిచి చేరబడి తన్మయంగా సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. బిత్తర పోయి వెర్రి మొహం వేసాను. బయట వేసిన తాళం వేసినట్టే ఉంది. వెనకవైపు నుంచి తలుపులు తీసుకుని మెట్లపక్క సందులో నుంచి గోడ పట్టుకుని బయటికి వచ్చి ఎదురింటి ముసలావిడ చేత సిగరెట్లు తెప్పించుకున్నాడట. నేను బయటికి వెళ్తే తరచుగా అలాగే చేస్తున్నాడట.


అతన్ని పడుకోబెట్టి సేవలు చేస్తున్న నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అనిపించింది. ఏటికి ఎదురీదే చోదక శక్తి ఎవరికి ఎవరిస్తారు? వారికి వారే ధైర్యం తెచ్చుకుని నిలబడాలి. ఇది ఏటికి ఎదురీదటం కాదు. సముద్రానికి ఎదురీదటం. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఇలా రాస్తున్నాను కానీ అప్పటి నా మనోవేదన నన్న అమితంగా కృంగదీసేది. చుట్టం చూపుకొచ్చే వాళ్ళంతా ‘అయ్యో పాపం’ అని అతన్ని చూసి జాలి పడుతున్నారే తప్ప నన్ను చూసి జాలి పడే వాళ్ళెవరూ లేకపోయారు.

          ఆనాటి నా పాట్లు కొన్ని ‘అతడు-నేను’ కథగా మార్చి రాసినది 2004 రచన మంత్లీలోను; అదే కథ సాహిత్య ప్రస్థానంలోనూ వచ్చింది. ఒకే కథ రెండు పత్రికల్లో ఎలా వస్తుందంటే
మొదట ఓ పత్రికలో వచ్చిన కథ నచ్చి, రెండో పత్రిక వాళ్ళు మన అనుమతి పొంది వాళ్ళూ వేస్తారు.

మళ్ళీ వెనక్కి వస్తే అతని చండాలాల్ని శుభ్రం చేస్తూ రోజుకి నాలుగైదు సార్లు స్నానం చేయవలసి వచ్చేది. ఎప్పుడు చూసినా నీళ్ళలో నాన్తున్నట్టే అనిపించేది. అదిలా ఉంటే మోహన్ తర్వాత ఏలేశ్వరం స్కూల్ H. M గా వచ్చినాయన E.L’s తాలూకా డబ్బులు తెచ్చి ఇస్తూ నాలుగు వేలు ట్రెజరీ వాళ్ళకు లంచం ఇచ్చానని తగ్గించి ఇచ్చాడు. “అదికాక అన్నిటికీ కలిపి 2% చొప్పున అడుగుతున్నారు లక్ష పైనే ఇవ్వాల్సి ఉంటుంది మీరు” అన్నాడు. జబ్బుతో ఉన్న మనిషి మీద వాళ్ళు చూపిస్తున్న జాలి అది.


నాకైతే S.T.O కి కంప్లైంట్ ఇచ్చేద్దామా అనిపించింది. ‘మీరెవ్వరికీ ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు’ అని షరీఫ్ అన్న మాట గుర్తుకొచ్చి అతని సాయాన్ని తీసుకుందాం అనుకున్నాను. ఈ గందరగోళాల మధ్య సాహిత్యానికి ఒక అర కేటాయించి ఉంచుకోవడం నాకు కొంత సాంత్వన నిచ్చేది.

విశాఖ రేడియో వాళ్ళు బమ్మిడి జగదీశ్వర్ రావు రాసిన ‘అమ్మ చెప్పిన కతలు’ పుస్తకం పంపి దాని మీద రివ్యూ రాసి చదవడానికి రమ్మన్నారు.

          మే 6న రికార్డింగ్ కి వెళ్ళినప్పుడు భరాగో గారిని పలకరించి వచ్చాను. ఆయన అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి మరో ఆహ్వానం ఎదురు చూస్తోంది విశాఖపట్నం నుంచి. R.S.కృష్ణమూర్తి కథల పోటీల్లో నా ‘ప్రస్థానం’ కథ మొదటి బహుమతికి ఎన్నికైందని జూన్ 6న ఆ ఫంక్షన్ కి రమ్మని. నా పోయెట్రీ బుక్ ఆమె మీద ‘శ్రీ ఆవంత్స సోమ సుందర్’ విశాలాంధ్రలో మంచి రివ్యూ రాశారు. జీవితంలో ఇవన్నీ ఊరడింపులు. ఆనందాన్ని ఇచ్చే పన్నీటి జల్లులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.