స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’

  -డా. కొండపల్లి నీహారిణి

          కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల సంవేదన అక్షరాక్షరంలో కనిపిస్తుంది. డాక్టర్ కె. గీత ‘అపరాజిత’ కవితల సంకలనాన్ని ప్రతిష్టాత్మకంగా ముద్రించి, ఆవిష్కరణ సభ నిర్వహించి సాహిత్య రంగంలో ఒక అలజడిని సృష్టించింది. ఒక హల్చల్ ని చేసింది. యస్! కచ్చితంగా ఇది అలజడే, కచ్చితంగా ఇది హల్చలే! స్త్రీవాదం ఎక్కడుంది పత్తా లేకుండా పోయింది అని ఒక అణచివేత స్వరంతో మాట్లాడిన వాళ్ళకి ఒక ధిక్కార స్వరం వినిపించింది.

          స్త్రీవాదం అనగానే రకరకాల అభిప్రాయాలను రకరకాల అనుమానాలను రేకెత్తించి ఆ మాట ఎత్తడానికే భయపడేలా సాహిత్య విమర్శకులు కొందరు చేయడం వలన కవయిత్రులు కూడా అదే నిజమో ఏమో అని నమ్మే ఒక ఆపదలో పడిపోయారు. కానీ కవయిత్రులంతా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా తమ గొంతుకను వినిపిస్తూనే ఉన్నారు! వాళ్ళు రాసే కవిత్వంలో ఉన్న తమ బాధనే స్త్రీవాద కవిత్వం అని అనుకో లేదు, అలా అనుకోకుండా లేకుండా చేశారు సాహిత్య విమర్శకులు! ఘాటైన పదాలతో రాస్తేనే స్త్రీవాదమేమో అనుకుని, పురుష అహంకారాన్ని, పితృస్వామ్యాన్ని చిన్న చిన్న భావాలలో ఎత్తి చూపే కవిత్వమంతా స్త్రీవాద కవిత్వమే అని అనుకోలేదు. తాను కోల్పో తున్న జీవితంలోని అంశాలను చూపేదంతా స్త్రీవాద కవిత్వమే అని అనుకోలేని పరిస్థితి లో పడిపోయారు. 1993లో వచ్చిన నీలి మేఘాలు కవిత సంకలనంలోని కొన్ని కవితలను మాత్రమే విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఒక భయానకమైనటు వంటి పరిస్థితిని కల్పింప చేసి ఇక రాయద్దు అనే పరిస్థితిని కల్పింప చేశారు. కానీ స్త్రీలు పడే మనోవేదనతో పాటు శారీరక వేదన ఎంతలా ఉంటుంది అనేది నాలుగు మాటల్లో రాసి చూపిస్తేనే సహించలేకపోయిన పురుష ప్రపంచం ఇలా రాయడం తప్పు అని చెప్పి గొప్ప గొప్ప కవులు కూడా తమదైన పురుష మనస్తత్వాన్ని నిరూపించుకున్నారు. అటు వంటి సాహిత్య విమర్శ వ్యాసాలను రాసి, టాపిక్  వచ్చినప్పుడల్లా మాట్లాడి, స్త్రీవాదం అంటే ఏదో తప్పు చేస్తున్నామా అనే ఒక భావనను కల్పింప చేశారు, ఒక భయంలో పడి వేశారు. ఇలా అనడం బహుశా వాళ్ళకి కంటగింపుగా ఉండవచ్చు కానీ, ఇదే అక్షర సత్యం. సరసమైన కథలు అంటూ అశ్లీల సాహిత్యాన్ని వాడు రాసిన దాన్ని సమర్ధించారు కానీ డెలివరీ రూమ్ కష్టాలను రాస్తే అది అశ్లీలమై కూర్చుంది. ప్రేమ శృంగారము అనేవి ఎంతో పవిత్రమైనవి. వాటి పేరుతో చేసే అరాచకాలను, దుర్మార్గాలను మాత్రమే తప్పని నిరసిస్తూ రాసిన కవిత్వం నచ్చకుండా కూర్చున్నది. అశ్లీలమైన వీడియోలు, బూతు సినిమాలు తీస్తే, మన ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారే మన అమ్మగా, మన అక్కగా, మన చెల్లెలుగా, మన కూతురుగా, మన ఇళ్ళల్లోనూ ఆడవాళ్ళున్నారే ఇలాగే లోకంలో అందరూ ఆడవాళ్ళు కూడా కదా అనే సోయి లేకుండా ఒక ఉద్యమంగా తీసుకురాకుండా స్త్రీవాద కవిత్వం మీద ఎందుకు అంత తీవ్ర విమర్శలు తెలిపారో అర్థం కాదు. కుల మత వర్గ ప్రాతిపదికన చూస్తూ పోతే ఇది ఒక అంతులేని వింతైన బాధాకర విషయం.

          వైజ్ఞానిక శాస్త్రంలో ఆరోగ్య సమస్యలను గురించి ప్రతి అంగాన్ని, శరీర అంతర్భాగం లో ఉన్నటు వంటి ప్రతి ఒక్క అంగాన్ని,  ఆర్గాన్ ని కూడా వివరంగా లోకానికి తెలిపిన డాక్టర్స్ ,సైంటిస్టులు కూడా ఒక ప్రాణికి జీవాన్ని బ్రతుకుని ఇచ్చే గర్భాశయం గురించి ఒక్క మాట కూడా వివరించలేదు చాలా కాలం వరకు! ఏం? అది తప్పా? చెప్పకూడనిదా? కాదు! చెప్పడం తప్పు కాదని వాళ్ళకూ తెలుసు!! గర్భాశయం గురించి మంచి చెడులను గురించి చెబితే సమాజానికి మేలు జరుగుతుంది అని అందరికీ తెలుసు. కానీ, వాళ్ళలో కూడా ఈ విషయం మీద ఫోకస్ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇది ఒప్పుకోరు. అదీ తెలుసు! ఎవరో ఒప్పుకోవడం కొరకు కాదు ఇప్పుడు ప్రశ్నించే తత్వమే అవసరం అని అందరూ అంటున్న ఈ రోజుల్లో ఇవన్నీ ఒకసారి వివేచన చేసుకోవడం అవసరం. చాలా ఏళ్ళ వరకు గర్భాశయం విషయం వెలుగులోకి రానివ్వలేదు. ఒక జీవి మరొక జీవికి జన్మనివ్వడం అనేది కేవలం స్త్రీ జాతికి సంబంధించిందే! అది జంతువులకైనా, మానవులకైనా! ఇది తెలియదా? అందరికీ తెలుసు. లోకానికి అందరికీ తెలుసు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రజలందరికీ తెలుసు కానీ, ఈ విషయానికి ఎక్కువ విలువ ఇస్తే స్త్రీలు తామే గొప్ప అనుకుంటారేమో అని ఒక భయంతో ఒక అనుమానంతో స్త్రీల గర్భధారణ సైన్స్ ని వెలుగులోకి రాకుండా చేశారు. ఈ మధ్య కదా ఇంతగా తెలుస్తోంది! ఇది స్త్రీవాద కవిత్వంలో బయటపడింది. శృంగారం అందమైన భావననే కానీ స్త్రీలకు తెలియకుండా హింస చేసే పురుషుల స్వభావాలను బయటపెట్టిన స్త్రీవాద కవిత్వాన్ని సాహిత్య విమర్శ కారులు అసభ్యంగా ఉందని చిత్రించారే తప్ప అందులో నిజాయితీ కూడా ఉంది అని చెప్పలేదు. ఈ విషయాలన్నీ ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది.

          అపరాజిత సంకలనంలో చిత్రించిన కవిత్వం అంతా స్త్రీ జీవితమే! పాఠకులను తప్పకుండా ఆలోచనలో పడేసే కవిత్వమే. 1993 నుండి 2022 వరకు ఉన్న స్త్రీల కవిత్వం ఇందులో ఉన్నది.  93 కవయిత్రులు ఇందులో పాల్గొన్నారు. ఈ సంకలనానికి తన అభిప్రాయాన్ని రాస్తూ, గీత “మౌనాన్ని బద్దలు కొట్టే అపరాజిత” అని అనడం ఎంతో సబబైన మాట!

          శిలా లోలిత తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ,” అపజయం ఎరుగని అవిశ్రాంత గీతం” అనడం సత్య దూరమైంది కాదు. మానవ జీవన సౌందర్యాన్ని ఓడిసి పట్టుకున్న పిడికిల్ల సమూహం ఇది అని శిలాలోలిత చెప్పడంలో సామాజిక కోణమే కనిపిస్తుంది. సమాజం అంటే స్త్రీ పురుషులు. పిల్లలు పెద్దలు అనాధలు అన్నార్థులు అందరూ వస్తారు.

          ఇంత సంయమనము కనిపిస్తుంది ఈ కవితలలో అనే దృష్టి కోణంతో రాశారు. స్త్రీవాదమంటే పురుష ద్వేషం కలిగించడం అని కాదు అనీ, ఒక సమయోచిత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాశారు. ఈ అపరాజితలో కవితలన్నీ అలాగే ఉన్నాయి.

          ఇంకా స్త్రీవాదం గురించి చెప్పాల్సి వస్తోంది రాయాల్సిస్తోంది అని ఒక ఆలోచనలో పడేసే సందర్భంలో ఉన్నాం మనం. మానవత్వం మంట కలిసిపోతున్న రోజులు కదా తప్పదు! కాత్యాయని విద్మహే గారు అపరాజిత కవిత సంకలనానికి ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశారు. ఈ పుస్తకానికి చివరలో ఉన్న “స్త్రీవాద కవిత్వ అడుగుజాడలు” అనే ఈ ఆర్టికల్ ఒక్కటి చాలు ఎక్కడెక్కడ ఏఏ రూపాలలో స్త్రీలు వివక్షకు గురి అవుతున్నారు ఎక్కడెక్కడ వివక్షలను కవయిత్రులు ఎండగట్టారు అనేది తెలుస్తుందని.

          లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్ చేంజ్ ఇట్! బాటిల్స్ ల్లో మునిగిపోతున్న పురుష ప్రపంచా న్ని తట్టుకునే శక్తి స్త్రీలకు కలగాలి ఇదీ పరిస్థితి. కరిగిపోతున్న కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో తెలియని లోకమా ఇది? తెలుసు ఇదీ అందరికీ తెలుసు! కుటుంబం అనగానే ఇల్లు పిల్లలు సంసారము ఇవే కదా వీటన్నింటికీ మూలాధారం ఎవరు? స్త్రీ, మహిళ, ఆడపిల్ల, అమ్మాయి! వీళ్ళందరి బాధ్యత మాదే అని మగ జాతి అంతా అనుకున్న రోజే అందరి జీవితాల్లో ఆనందం వెలువరిస్తుంది.

          ” దేశాలు జాతులు స్వతంత్రం అవుతున్నా, స్త్రీలు ఎందుకు స్వతంత్రులు కాలేరు అన్న ప్రశ్నతో అందుకు అవరోధంగా ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కారణాల శోధనలో పితృస్వామ్యం ఒక బలమైన శక్తిగా అర్థమైన మాటచోట స్త్రీవాదం పుట్టింది” అంటూ, “కుటుంబం కులం మతం రాజ్యం మొదలైన వ్యవస్థల ద్వారా స్త్రీ శరీరాన్ని చైతన్యాన్ని జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటుంది.”అంటూ ‘అపరాజిత’ స్త్రీవాద కవిత్వ అడుగుజాడలు”అంటూ కాత్యాని విద్మహే రాసిన మాటలు అందరూ మాటలు మనసుపెట్టి ఆలోచించాల్సిన మాటలు.

          అస్మిత తరపున 1993లో నీలి మేఘాలు వచ్చి గొప్ప సంకలనంగా కీర్తిని అందు కున్నది. కొత్తగా కలాలు పట్టిన కవయిత్రులకు ఒక ఊతగర్రగా నిలిచింది. ఓల్గా, వసంత కన్నాభిరాన్ గార్ల వలన ముప్ఫై ఏడుగురు కవయిత్రుల ధిక్కార స్వరం ఆ నాడు కొత్తగా పరిచయమైంది, స్త్రీలు తమ తమ గళాలు సవరించుకున్నారు.

          శీలా సుభద్ర దేవి భార్గవీ రావుల సంపాదకత్వంలో వచ్చిన 100  మంది కవయిత్రుల కవిత్వం ‘ముద్ర’ పేరుతో సంకలనంగా వచ్చి కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తించింది. “నాకు తెలిసినంత వరకు స్త్రీలందరి జీవితాలలో అడుగడుగునా ముళ్ళు సంకళ్ళే” అని చెప్పిన గీత, స్త్రీవాదం పని అయిపోలేదని కొత్త అస్త్రాన్ని ధరించి పోరాటంలో ముందుకు సాగుతూనే ఉందని తెలియజేయడానికి అపరాజితతో ముందుకు వచ్చిందని అనడం వందకు వంద శాతం నిజం. తనదైన ధిక్కర స్వరంతో ఈ ‘అపరాజిత’ చరిత్రను సృష్టించింది అనడం అతిశయోక్తి కాదు. స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న ఈ అపరాజిత స్త్రీ అస్తిత్వ గ్రంథం.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.