అందాల అండమాన్

-డా.కందేపి రాణి ప్రసాద్

          మా పిల్లలు సృజన్, స్వాప్నిక్ లు మెడిసిన్, బయోటెక్నాలజీ ఎక్జామ్స్ వ్రాసిన తర్వాత వచ్చిన హాలిడేస్ లో ఏదైనా టూర్ వెళ్దామని అడిగారు. చదివి చదివి వేడెక్కిన వాళ్ళ బుర్రల్ని కాస్త చల్లబరచి, మళ్ళీ వచ్చే ఎక్జామ్స్ కు కొత్త శక్తినీ, ఉత్సాహాన్ని ఇద్దామ ని అండమాన్, నికోబార్ దీవులు చూసి రావాలని ప్లాన్ చేసుకున్నాం. చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, మరియు ప్రపంచ వాసులందర్ని ఆకర్షించే బీచ్ లూ చూడాలన్న, ఆత్రుత ఒకవైపు, సునామీ సమయంలో అండమాన్ ఎంతగా నష్టపోయిందో గుర్తుకుతెచ్చుకుంటే బాధ ఒకవైపు ఇలా ఆలోచించుకుంటూ మేము నలుగురం (నేను, మావారు, పిల్లలిద్దరు) చెన్నై మీదుగా జెట్ ఎయిర్ వేస్ లో అండమాన్ బయల్దేరాం. ఆకాశం నుంచి చూస్తుంటే నీలం రంగు చీర పై అక్కడక్కడా ఆకుపచ్చని చుక్కలు పెయింట్ చేసినట్లుగా కనబడుతోంది విశాలమైన సముద్రంలో చెట్లున్న భూ భాగం. ఎప్పుడూ ఆకాశం అంచుల్లో ఎన్ని లక్షల టన్నుల పత్తో వెదజల్లినట్లుగా చుక్కలు పెయింట్ చేసినట్లుగా కనబడుతోంది విశాలమైన సముద్రంలో చెట్లున్న భూ భాగం. ఎప్పుడూ ఆకాశం అంచుల్లో ఎన్ని లక్షల టన్నుల పత్తో వెదజల్లినట్లుగా కనబడే మబ్బులు ఈ రోజు విమానానికి అడ్డంగా నిలబడి ఉన్నాయి. లేలేత సూర్య కిరణాల వెలుగుకి మబ్బులు, సాఫ్ట్ టాయ్స్ తయారీలో ఉపయోగించే సిల్కిఫర్ లా మెరుస్తున్నా యి. పాండా, డైనోసార్, ఏనుగు, టెడ్డీబేర్, చేప రకరకాల ఆకారాల్లో తెల్లని మబ్బుల్ని మలిచి నీలం రంగు నీళ్ళ పై దీవుల రక్షణకు గాను కాపలాగా ఎవరో అక్కడ నిలబెట్టి నట్లుగా ఉన్నాయి. విమానం సర్రుమని వాటి మధ్యలో నుంచి దూసుకుపోతుంటే చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల్లోని కీలుగుర్రం ఎక్కి ఆకాశయానం చేసే సాహస రాజకుమారులు గుర్తుకువచ్చారు. ఈ రోజెందుకో మబ్బులు విపరీతమైన తెల్లగా ఉన్నాయి. వీటినసలు దేనితో పోల్చాలి – పాలతోనా, మంచుతోనా ! మనసంతా ఆనందంతో నిండి దూదిపింజలా ఎగిరిపోవడమంటే ఇదేనేమో అన్పించింది

          మధ్యాహ్ననికి అండమాన్ దీవుల రాజధాని ఐన పోర్ట్ బ్లయర్ కు చేరుకున్నాం. పోర్ట్ బ్లయర్ లోని ‘వీరసావర్కార్ అంతర్జాతీయ విమనాశ్రయం’ నుండి హోటల్ కొచ్చి అన్నం తిని ‘కోర్బియన్స్ కోవ్ బీచ్’ చూడటానికి వెళ్ళాం. కొబ్బరి, తాటి చెట్లతో చిత్రకారుడు శ్రద్ధగా గీసిన చిత్రంలా ‘కోర్బియన్స్ కోవ్’ కనువిందు చేసింది. ఈ బీచ్ నుంచి సెల్యులార్ జైలు ఎదురుగా ఉన్న ‘రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్’ కు వెళ్ళాం. దారి పొడవునా ఇళ్ళన్నీ చెక్కతో నిర్మించినవి కనిపించాయి. ఇదంతా కొండల మయం. రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఒకవైపు చిల్డ్రన్ పార్క్, మరోవైపు మన టాంక్ బండ్ లా నీళ్ళు, నీళ్ళ మధ్యలో రాజీవ్ గాంధీ పూలమాల విసురుతున్నట్లుగా విగ్రహం ఉన్నాయి. ఆ విగ్రహం దాకా ఒక వారధిలా కత్తి ఉన్నది. పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి సైకిళ్ళు, ఉయ్యాలలు డైనోసార్ లాంటి బొమ్మలూ ఉన్నాయి.

          బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవులు భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ దీవులు 6,496 స్క్వేర్ కిలో మీటర్ల మేర వ్యాపించి ఉంటాయి. ఇక్కడి జనాభా 3,79,944. భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని నమ్మిన బంటు ‘హనుమాన్’ పేరు మీదుగా ‘అండమాన్’ పేరు వచ్చిందట. చోళుల కాలంలో నికోబార్ ను నక్కవరం అని పిలిచేవారట. తమిళంలో నక్కవరం అంటే నగ్నంగా ఉన్న మనిషి లేదా నగ్నంగా ఉన్న ఊరు అని అర్థం. ఇప్పటికీ నికోబార్ లోని ‘జారువా’ లు అనే ఆదివాసీ ప్రజలు దుస్తులు ధరించరంట. వారి స్వేచ్చకు, జీవనానికి భంగం కలగకూడదని ప్రభుత్వం ఎవరూ ఆ దీవుల్లోకి వెళ్ళకుండా నిషేధించింది. ఇక్కడ హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, ఇంగ్లీషు, నికోబారిస్ భాషలన్నీ అధికారిక భాషలు. బెంగాలీ, తమిళం, తెలుగు మీడియంలలో స్కూళ్ళు ఉన్నాయి. కలకత్తా, విశాఖపట్నం, చెన్నై సముద్ర తీరాలతో ఇక్కడికి ఎక్కువ రాకపోకలు జరగటం వలన ఈ మూడు భాషలూ ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండవచ్చేమో! ఇక్కడకు కూరగాయలు, వస్తువులు ఏవైనా చెన్నై నుంచి గానీ, కొలకత్తా నుంచి గానీ రావాలట. దీనికి కరెంటు తయారీ కూడా లేదట. అక్కడున్న కరెంటంతా జనరేటర్ ద్వారా సప్లై చేయబడుతుందంట. దీనికి గాను ఒక పవర్ హౌస్ నిర్మించబడి ఉన్నది. ఇవన్నీ తెలుసుకుంటే సముద్రం మధ్యలో నున్న ఓ మట్టిబెడ్డలా ఉన్న ఈ దీవిలో ఇన్ని సౌకర్యాలు కల్పించడమంటే మాటలు కాదు.

          అండమాన్ దీవులనగానే ప్రతివారికీ మొట్టమొదటగా గుర్తుకొచ్చేది సెల్యులార్ జైలే. ఇదొక కొండ పై ఉన్నది. దీన్ని కట్టడానికి కావలసిన ఇటుకలను బర్మా నుంచి తెప్పించా రంట. 1896 లో ఈ జైలు నిర్మాణం మొదలైంది. మధ్యలో ఒక టవర్ లా ఎత్తుగా కట్టి దాని చుట్టూ ఏడు గీతల్లా అంటే సైకిల్ చక్రం ఆకారంలో నిర్మించారు. టవర్ లో ఉండే సెక్యూరిటీ సిబ్బందికి జైలు మొత్తాన్ని ఒకేసారి పర్యవేక్షించే అవకాశం కలుగుతుందన్న మాట. ఒక్కొక్క విభాగం మూడు అంతస్తులుగానూ, మొత్తం కలిసి 698 సెల్స్ ఉన్నాయి. సోలిటరీ కన్ ఫైన్ మెంట్ పడిన వాళ్ళు ఇక్కడ ఉండటం వలన దీనికి సెల్యులార్ జైలు అని పేరు వచ్చింది. మేమక్కడ లైట్ షో చూశాం. అమర వీరులకు చిహ్నంగా ఒక జ్యోతి వెలుగుతూ ఉన్నది. వీర సావర్కార్ ఈ జైలు లోనే జీవతం గడిపాడట. అక్కడ వినాయక్ దామోదర్ సావర్కర్, ఇందు భూషణ్ రామ్, మహావీర్ సింగ్, బాబా బాన్ సింగ్, మోహన్ కిషోర్ నహ్ దాస్, పండిత్ రామ్ రబాబాళి, మోహిత్ మొయిత్రా మొదలైన స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలున్నాయ్. ఆ విగ్రహాలన్నింటికి కూడా కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి ఉన్నాయి. స్వాతంత్య్రం కోసం ఇంత మంది వీరులు పోరాడటమే కాకుండా ఇలాంటి శిక్షలను కూడా అనుభవించారా అని ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్పొడు స్తుంది. భారత స్వాతంత్య్రపోరాట సమయంలో ఖైదీలను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడకు తరలించింది. ఈ జైలును ‘కాలాపానీ’ అని కూడా అంటారు. దీని నిర్మాణం 1906 లో పూర్తి అయింది. ప్రస్తుతం ఈ జైలును నేషనల్ మెమోరియల్ మాన్యుమెంట్ గా ఉపయోగి స్తున్నారు.

          తెల్లవారి ఎనిమిది గంటల కల్లా తయారై ‘జెట్టీ’ దగ్గర కొచ్చేశాం. బస్సుల ఆగే స్థలాన్ని బస్టాండు అన్నట్లుగా ఫెర్రీలు ఉండే స్థలాన్ని ‘జెట్టీ’ అంటారు. ఫెర్రీ అంటే పెద్ద పడవ. దీంట్లో సుమారు 300 మంది పడతారు. రెండు అంతస్తులు ఉంటుంది. విమానం లో వలె లగేజీ తీసుకొని రసీదు ఇస్తారు. ఫెర్రీలో కాఫీషాప్ ఉంటుంది. చిప్స్, బిస్కెట్లు దొరుకుతున్నాయి. మాకు విండో పక్కన సీట్లు వచ్చాయి. నీళ్ళలో ఫెర్రీ వెళుతుంటే చాలా తమాషాగా ఉంది. మేము హావ్ లాక్ ఐలెండ్ వెళుతున్నాం. నీళ్ళు ముదురు నీలం రంగులో ఎండకు మెరుస్తున్నాయి. ఫెర్రీ వెనక భాగం అంతా నురగలతో నీళ్ళు తెల్లగా కనిపిస్తున్నాయి. రెండు గంటల ప్రయాణం తర్వాత హావ్ లాక్ దీవిలో అడుగుపెట్టాం. ఇది అండమాన్ దీవులన్నింటిలోకి పెద్ద దీవి. పోర్ట్ బ్లయర్ కు నార్త్ ఈస్ట్ లో 57 కి.మీల దూరంలో ఈ దీవి ఉన్నది. ఇండియాలోని బ్రిటిష్ జనరల్ హెన్రీ హావ్ లాక్ పేరు మీదుగా ఈ దీవి ‘హావ్ లాక్ దీవి’ గా పిలవబడుతోంది. ప్రస్తుతం ఈ దీవి బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన వారితో నిండి ఉన్నది. ఇక్కడ ఇన్న ఎలిఫెంట్ బీచ్, విజయానగర్ బీచ్ మొదలైన అనేక బీచుల్లో రాధానగర్ బీచ్ అందంగా ఉంటుంది. ఇది “బెస్ట్ బీచ్ ఇన్ ఆసియా” అని పేరు పొందింది. ఈ దీవిలో ఐదు గ్రామాలున్నాయ్. అవి గోవిందానగర్, బెజోయినగర్, శ్యామ్ నగర్, కృష్ణానగర్, రాధానగర్.

          ఇక్కడ హోటల్లో దిగి సాయంత్రం రాధానగర్ బీచ్ చూడటానికి వెళ్ళాం. మెలికలు తిరిగిన సన్నని రోడ్లు, మమ్మల్ని పట్టుకోండి చుద్దామన్నట్టుగా మా కారు కన్నా ముందుగా మమ్మల్ని కవ్విస్తూ పరిగెడుతున్నాయి. దారికి అటువైపు ఇటువైపు అంతా పచ్చదనమే. దారిలో రోడ్లు ప్రక్క బండ్లమీద బంగారం, పసుపు కలిపి నూరితే వచ్చే రంగులో బొద్దుగా ఉన్న అరటిపండ్లు కనువిందు చేస్తున్నాయి. అవి ఆకలి తీర్చడానికి కాదు చూడటానికి అందగా కనిపిస్తున్నాయనైనా కొందామనిపిస్తోంది. బీచ్ దగ్గర కొబ్బరి చెట్లు పొడవున్న యంటే నేల మీద పడుకుని చూస్తే తప్ప వాటి తలలు కనిపించేలా లేవు. ఒక్కొక్క బొంద నుండి దాదాపు లీటరు నీలు వస్తున్నాయి. తెల్లని ఇసుక రేనువుల పై మా పాదాలు మోపి సముద్రాన్ని చూస్తుంటే ఎన్నో రంగులుగా కనిపిస్తోంది. ముందున్న నీళ్ళు నీలంగా, మధ్యలో ఉన్న నీళ్ళు ఆకుపచ్చగా, దూరంగా వెనకున్న నీళ్ళు నల్లగా ఇలా రంగులు మారుస్తూ గమ్మత్తుగా ఉంది సముద్రం. కాసేపటికి పెద్ద వర్షం వచ్చింది. సముద్రం ఎదురుగా వర్షంలో తడుస్తూ, ఆకాశాన్ని తాకే చెట్ల మధ్యలో, దూరంగా కొండల మధ్య పొగ మంచు తెరలో పల్చగా కనిపిస్తున్న ఇంద్ర ధనస్సును చూస్తుంటే మేము సర్వం మర్చి పోయాం.

          ఇంతకన్నా స్వర్గం ఎక్కడన్నా ఉంటుందా అనిపించింది. ఆ వాన నీళ్ళను కాసిని మా గుండె గదుల్లో నింపుకొని హావ్ లాక్ దీవి నుండి అండమాన్ వచ్చేశాం. వచ్చేటపుడు నీళ్ళు ఏదో ప్రళయ రూపంలా ఎగసిపడుతున్నాయి. నీళ్ళు కూడా నల్లగా తారులాగా ఉన్నాయి. వెళ్ళేటపుడు అంత ఆనందం కలిగించిన నీళ్ళు వచ్చేటపుడు ఎంతో భయపెట్టాయి.

          తెల్లవారి రాస్ ఐలాండ్ వెళ్ళాం. మా బోటు పేరు M.V.King cruise. డేనియల్ రాస్ అనే అతను ఈ దీవిని మొదటిసారిగా కనిపెట్టడం వలన ఈ దీవికా పేరు వచ్చింది. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో ఇక్కడ బాంబ్ ఎటాక్ జరిగిందట. తరువాత వైపరు ఐలండ్ చూశాం. నార్త్ బే లో స్విమ్మింగ్ చేశాం. అక్కడ కోరల్స్ చాల ఉన్నాయి. బోట్ కు అడుగున ఉన్న అద్దం ద్వారా సముద్రం లోపల ఉన్న పెద్ద పెద్ద కోరల్స్ చూశాం. అండమాన్ లో ‘సాగరిక’ అనే గవర్నమెంట్ హండీ క్రాఫ్ట్స్ షాపుకు వెళ్ళాం. అక్కడ అన్ని వస్తువులూ ఎంతో అందంగా ఉన్నాయి. నచ్చినవి కొనుక్కొని, అండమాన్ అందాల్ని కళ్ళలో నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.