యాదోంకి బారాత్-11

-వారాల ఆనంద్

సామాజిక పోరాటాలూ- ఉన్నత చదువులు- యునివర్సిటీలో చేరిక 

నాకు తెలిసి నేను మధ్య తరగతి జీవిని. పట్టణ వాసన వున్న వాణ్ని. చాలా వాటిని ప్రేమించాను, అభిమానించాను, ఆరాధించాను, ప్రేరణ పొందాను. కానీ, అందులోకి దిగలేదు కాళ్ళకు మట్టి అంటలేదు, ఒంటికి సురుకూ అంటలేదు. కానీ నేను నా విశ్వాసాల్ని, ప్రేమల్ని అభిమానాన్ని అట్లే ఉంచుకున్నాను. మారలేదు. నమ్మిన దానికి ఎప్పుడూ వ్యతిరేకమయితే కాలేదు. శత్రువుగానయితే మారలేదు. బహుశా నేను నమ్మింది మనసావాచా అనుసరించింది ఇదే.

          పేర్లెందుకు గానీ కొందరు నాకు మిత్రులే ఒకప్పుడు ఏమి చెప్పారు? ఎట్లా వున్నారు? ఎంతమందిని చైతన్య పరిచారు? ఇప్పుడు ఎక్కడ వున్నారు? ఏం చేస్తున్నారు? చూస్తూ వుంటే ఆలోచిస్తే చాలా బాధగా వుంటుంది. సరే కాలం గడిచిన కొద్దీ వయసు పెరిగిన కొద్దీ మార్పు సహజమే అనుకున్నా.. వారిలో కొందరు ఇప్పటికీ గత చరిత్ర గురించే చెప్పు కోవడం..దాని వెలుగుననే చెలామనయ్యేందుకు ప్రయత్నించడం చూస్తే చాల కష్టం కలుగుతుంది. చూస్తూ వుండడం తప్ప ఏం చేయగలం…

***

          నేను డిగ్రీ చదువుతున్న కాలంలోనూ తర్వాత ఖాళీగా వున్న ఏడాదిలోనూ ఉస్మానియా కాంపస్ లో చేరిన కాలంలోనూ సామాజికంగా అనేక మార్పులు జరిగాయి. 69 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1975లో ఇందిరాగాంధీ పాలనలో దేశంలో ఎమర్జెన్సీ దాని ప్రభావాలూ చూసాం. కాలేజీల్లో, యునివర్సిటీల్లో కదలిక మొదలైంది. ఆలోచన ఆరంభమయింది. ఆందోళనా శురూ అయింది. అంతే కాదు అప్పటిదాకా కల్లా కపటం తెలీని తెలంగాణా పల్లెలు క్రమంగా చైతన్యం సంతరించుకోవడం ఆరంభించాయి.ఉత్తర తెలంగాణా అందులో ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా పల్లెలు అప్పటిదాకా వున్న పల్లెల్లా లేవు. పచ్చగా లేవు. అప్పటిదాకా అవి నిజాం కాలంలో దేశ్ ముఖ్ లు, జమీందార్లు తర్వాత దొరల పాలన దౌర్జన్యాలను చవిచూసాయి. తర్వాత దొరల ఆగడాలనుప్రశ్నించే వారిని హింసించే వారు. గ్రామ పెద్దలు పంచాయితీలు నిర్వహించి ఇష్టానుసారం తీర్పులు చెప్పి దడువతులు (డిపాజిట్లు) కూడా తిరిగి ఇచ్చేవారు కాదు. తీర్పులు ఎట్లున్నా అడిగే స్థితి వుండేది కాదు. వెట్టి చాకిరీ సర్వ సాధారణం. ఇట్లా అనేక అష్ట కష్టాలు పడుతున్న పల్లెల్లో క్రమంగా చలనం మొదలయింది అప్పుడే. 75 ఎమర్జెన్సీకి ముందే ప్రారంభమయినప్పటికీ అత్యవసర చట్టం అమలులో వున్న కాలంలో  రహస్యం గా నడిచిన కార్యకలాపాలు ఎమర్జెన్సీ ఎత్తేసాక ఉద్రుతమయ్యాయి. మా కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా రెండు గ్రామాలు ప్రధాన వేదికలయ్యాయి. అవి సిరిసిల్లా తాలూకా లోని నిమ్మపల్లి, జగిత్యాల తాలూకా లోని మద్దునూరు. ఆ గ్రామాల్లో ఏర్పడ్డ రైతుకూలీ సంఘాలు దేశంలోనే సంచలనం సృష్టించాయి. పట్టణాల్లోనూ నగరాల్లోనూ వున్న యువకులు విద్యార్థులు అనేక మంది “గ్రామాలకు తరలండి” ( GO TO VILLAGE CAMPAIGN) అన్న పిలుపు నందుకుని పలు గ్రామాలకు చేరారు. పాలేర్ల జీతాలు పెంచాలని, వ్యవసాయ కూలీ రెట్లు పెంచాలని అంతా ఐకమత్యంగా పోరాటం ఆరంభించారు. జగిత్యాల ప్రాంత ఉద్యమం 9 సెప్టెంబర్ 1978 రోజు నాటికి “జైత్రయాత్ర” స్థాయికి చేరింది. జగిత్యాల పట్టణంలో పాత బస్స్టాండ్ పక్కనే వున్న డిగ్రీ కాలేజీ మైదానంలో రైతుకూలీ సంఘం నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఊరేగింపు నిర్వహిం చారు. జగిత్యాల జైత్రయాత్ర పేర ప్రసిద్ది పొందిన ఆ నాటి కార్యక్రమం మొత్తం నక్సలైట్ ఉద్యమానికి గొప్ప ప్రేరణగా నిలిచింది.

          ఇవన్నీ వింటూ వాటి గురించి తెలుసుకుంటూ వుండేవాళ్ళం. జైత్రయాత్ర ప్రేరణ తో అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులు ఎదిగారు. 78- 79 ప్రాంతంలోనే నేనూ మా మిత్రుడు డి.వెంకటేశ్వర్ రావు కలిసి కవిత్వం మీద అభిమానంతో జగిత్యాల వెళ్ళి అలిశెట్టిని తన పూర్ణిమా స్టూడియోలో కలిసాం. కలిసింది మొదటిసారే అయినా ఎంతో ఆప్యాయంగా స్నేహంగా మాట్లాడుకున్నాం. తర్వాత మా స్నేహం చాలా ఏళ్ళపాటు సాగింది. కలిసి కవిత్వం రాసాం. తర్వాతి కాలంలో జింబో, వజ్జల, పి.ఎస్.రవీంద్ర, నేనూ, అలిశెట్టి కలిసి “లయ” కవితా సంకలనం వేసాము. ఇదిట్లా వుంటే ఎమర్జెన్సీ రోజుల్లో సిరిసిల్లాకు చెందిన కొందరు కవులు ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకాన్ని కీర్తిస్తూ రాసారు. వాటితో సంకలనమూ ముద్రించారు. దాని పై చాలా విమర్శలు వచ్చాయి. అది వేరే విషయం.

***

          వేములవాడలో మరో మరపురాని సంఘటన అప్పటి గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ పర్యటన. వేములవాడ గొప్ప శైవ క్షేత్రం కనుక మొదటి నుంచీ ప్రముఖుల రాక పోకలు ఎక్కువే. అందులో భాగంగానే 78లో ఒక రోజు అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ పర్యటన ఏర్పాటు అయింది. వేములవాడలో  సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయి పోలీసు స్టేషన్ ఉండేది. సిరిసిల్లా సర్కిల్ స్థాయి, జగిత్యాల డివిజన్ (డీ.ఎస్.పీ) స్థాయిలో వుండేది. గవర్నర్ పర్యటన కనుక భారీగానే బందోబస్తు ఏర్పాటు అయింది. మేమంతా ఎప్పటిలాగే  ఉదయమే గుడి ముందుకు వెళ్ళి తర్వాత వెంగయ్యను కలిసి హోటల్లో టీ తాగే కార్యక్రమంలో వున్నాం. గవర్నర్ ను వీలయితే చూడాలనీ అనుకున్నాం. ఇంకో వైపు గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రైతు కూలీ సంఘం నేతృత్వంలో చలపతి రావు తదితరులు వందల మంది రైతులతో సహా గుడి ముందుకు చేరుకున్నారు. గవర్నర్ దైవదర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని ‘బేటా ఇదర్ ఆవో’ అని నాయకుణ్ణి పిలిచి వినతి పత్రం తీసుకుంది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. అంతా ప్రేక్షకుల్లా చూస్తున్న మేమంతా ఇళ్ళకు బయలుదేరాం. ఇట్లా ఇండ్లకు చేరామో లేదో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏమయిందో స్పష్టంగా తెలీదు కాని గవర్నర్ వెళ్ళి పోగానే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు కనిపించిన వాళ్ళను కనిపించినట్టు దుకాణా దార్లతో సహా వీరు వారని లేకుండా కనించిన వాణ్ని కనిపించినట్టు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. స్టూడియోలో వున్న మా మిత్రుడు వెంగయ్యను కూడా అరెస్ట్ చేసారు. మేమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. రెండు నిముషాలు గుడి దగ్గర ఆగి వుంటే మా పరిస్థితీ అంతే. దెబ్బలుతిన్నవాళ్ళు తీవ్రంగా తిన్నారు. స్టేషన్ లో పెట్టిన వాళ్ళను మర్నాటికి గానీ విడిచి పెట్టలేదు. అట్లా గవర్నర్ పర్యటన బాధాకరమయిన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

***  

          ఈ నేపధ్యంలో నేను హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ లో చేరాను. అడ్మిషన్ పూర్తి కాగానే అప్పటికే హైదరాబాద్లో మోజం జాహీ మార్కెట్ ప్రాంతంలో రూము తీసుకుని ఉంటున్న బావ మంగారి శివప్రసాద్ రూముకు చేరుకున్నా ను. తను అప్పుడు మ్మసాబ్ టాంక్ పాలీటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. జింబో కూడా అప్పటికే కొంత కాలంగా అక్కడ వున్నాడు. పక్క రూములో విజయకుమార్, అశోక్ కుమార్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు వుండేవారు. తర్వాత అంతా మంచి స్నేహితులమయ్యాం. ఉస్మానియాలో హాస్టల్ వసతి ఏర్పడే దాకా అక్కడే వున్నాం. జింబో కి ఉస్మానియా లా  కాలేజీలో సీటు వచ్చింది. తనకు వెంటనే ‘ఈ’ హాస్టల్ లో వసతి ఏర్పాటయింది. నాకే ఆర్ట్స్ కాలేజీ కనుక ఎ హాస్టల్ లో రూముల్లేక పోయాయి. దాంతో వుండడానికి వసతి లేదు. మెస్ ఇచ్చారు. బాగా ఇబ్బందిగా వుండేది. అప్పుడు జింబో వాళ్ళ రూము 28 లోనే గెస్ట్ గా వున్నాను. నేనూ జింబో, కరీంనగర్ కే చెందిన నలిమెల వీరేశం, భోన్గిర్ కి చెందిన దామోదర్ రెడ్డిలము రూములో వుండేవాళ్ళం. లైబ్రరీ సైన్స్ క్లాసులు కూడా ఆర్ట్స్ కాలేజీలో రూముల్లేక ‘డి’ హాస్టల్ లో వున్న చివరి గదుల్లో నడిచేవి. చాలా అనామకంగా అనిపించేది. పేరుకు యునివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులం కానీ ఎక్కడో షెడ్డుల్లో మా క్లాసులు, ఘోరంగా వుండేది. కానీ ఏమి చేయగలం. డిపార్ట్మెంట్ లో ఆచార్యులుగా  ఏ.ఏ.ఎన్.రాజు, వేణుగోపాల్, ఎం. లక్ష్మన్ రావులు క్లాసులు చెప్పే వారు. రాజు సర్ డిపార్ట్మెంట్ హెడ్, వేణుగోపాల్ సర్ కొంత సీరియస్ గా వుండే వాడు. లక్ష్మణ్ రావు సర్ సరదాగా స్టూడెంట్స్ తో స్నేహంగా వుండేవారు. సబ్జెక్ట్ అంతా కొత్త. క్లాసిఫికేషన్, కాటలాగింగ్, బిబిలియో గ్రఫీ, ఇట్లా వుండేది. మొదట్లో అంతా గందరగోళం. తర్వాత సర్దు కుంది. క్లాసులో ముప్పై మంది విద్యార్థులం. ముగ్గురు అమ్మాయిలు హన్నా సునీత, లక్ష్మిశకుంతల, మరొకరు. మిగతా అంతా అబ్బాయిలమే. ఇంతలో కాలేజీ ఎన్నిక లొచ్చాయి. యూనివర్సిటీ మొత్తం విద్యార్తి రాజకీయాలతో అట్టుడికి పోతూ వుండేది. కాంపస్ లోని వివిధ కాలేజీలు వివిధ విద్యార్థి సంఘాలకు ఆలవాలంగా ఉండేవి. ఇంజినీరింగ్ కాలేజీ మరియు ఆర్ట్స్ కాలేజీ లు పీ.డీ. ఎస్,యు. కు, సైన్స్ కాలేజీ ఆర్.ఎస్.యు. కు లా కాలేజీ ఏబీవీపీ లకు పెట్టని కోటలా ఉండేవి. మా కాలేజే ఎన్నికల్లో పీడీఎస్యు మరియు ఇతర లెఫ్ట్ విద్యా సంఘాలు కలిసి పానెల్ ప్రకటించాయి. అధ్యక్ష స్థానానికి పీ.డీ.ఎస్.యు కు చెందిన తులా  రాజేంద్ర కుమార్, కార్యదర్శి స్థానానికి లక్ష్మీకాంత్ రావు నిలబడ్డారు. ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో మా క్లాస్ నుండి నూరుశాతం రాజేంద్ర కుమార్ పానెల్ కి మద్దతుగా వున్నాం. క్లాసులో మెజారిటీ లెఫ్ట్ భావజాల మద్దతుదారులు ఉండడం ఒక కారణ మయితే మరొకటి మా క్లాసులని ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి మార్చాలనే డిమాండ్ మరొకటి. అట్లా రాజేంద్ర కుమార్ పానెల్ ఘన విజయం సాధించడంలో మేము ప్రధాన పాత్ర పోషించాం. ఎన్నికల ఫలితాల తర్వాత డిపార్ట్మెంట్ ను ఆర్ట్స్ కాలేజీకి మార్చారు. క్లాసులు నడిచిన ‘డి’ హాస్టల్ రూముల్ని మాకు ఉండేందుకు కేటాయించారు. నేను సీతారాములు ఒక రూములోకి చేరాం. ఇక క్లాసులో కరీంనగర్ జిల్లాకే చెందినా గోపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, డి. మనోహర్, వరంగల్ కు చెందిన సంపత్ కుమార్ రావు, రవీంద్రా చారి, ఉమాశంకర్ తదితరులం చాలా క్లోజ్ గా వుండే వాళ్ళం. వీళ్ళల్లో చాలా మంది అప్పటికే పీజీ కోర్సులు పూర్తి చేసి వచ్చినవారు. నర్సింగ్ రావు ఎం.ఎస్సీ, మనోహర్ ఎం.ఏ ఇంగ్లిష్,,, ఇక ఉమాశంకర్ లాంటి వాళ్ళు ఇన్ సర్విస్ లో వున్నవాళ్ళు. అయితే అందరమూ ఎంతో స్నేహంగా ప్రేమగా వుండేవాళ్ళం. ఇక మనోహర్ తో పరిచయమయిన మరో మిత్రుడు డి.దామోదర్ రావు ఇప్పుడు నమస్తే తెలంగాణా దిన పత్రిక ఎం.డీ.గా వున్నాడు. ఇక గోపాల్ రెడ్డి హిస్టరీ అధ్యాపకుడిగా చేరి కొన్నేళ్ళు నాతో పాటు ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో పని చేసాడు. సి.హెచ్.నరసింగ రావు కరీంనగర్ లో ఏర్పాటయిన పీజీ సెంటర్ లో లైబ్రేరియన్ గా చేరి చాలా కాలం పని చేసాడు. మనోహర్ ఇంగ్లీషు అధ్యాపకుడయి వరంగల్ లో స్థిరపడ్డాడు. ఉమాశంకర్ వరంగల్ ప్రాంతీయ గ్రంధాలయంలో చాలా కాలం చీఫ్ గా పనిచేసాడు. సంపత్ నేను మాత్రం మొదట వివిధ జూనియర్ కాలేజీల్లో పనిచేసి తర్వాత డిగ్రీ కాలేజీలో సర్విస్ చేసాం. దురదృష్టం ఏమంటే గోపాల్ రెడ్డి, ఉమాశంకర్ లు అనారోగ్యంతోనూ, నర్సింగ్ రావు దొంగల దాడిలోనూ చనిపోయి దూరమయ్యారు.

***

          ఇక డీ హాస్టల్ లో వుండే కాలంలోనే జింబో క్లాస్ మేట్ అయిన నందిగం కృష్ణారావు పరిచయం గొప్ప అనుభవం. ప్రతిభావంతుడయిన గొప్ప రచయిత నందిగం కృష్ణారావు చాల క్లోస్ గా ఉండేవాడు. అప్పటి నుంచీ వున్న స్నేహం ఇప్పటికీ అంతే ఆప్యాయంగా సాగుతున్నది. ఆయన వచన రచనా శైలి ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టం. అంత మంచి వ్యంగ్యాత్మక వచనం రాసే వాళ్ళు మాలో చాలా అరుదు.

***

అదే సమయంలో సికిందరాబాద్ ఎస్పీ కాలేజీలో డిగ్రీలో చదువుతున్న వేములవాడ మిత్రుడు సాంబశివుడు నా కెంతో దగ్గరయ్యాడు. తాను ఆర్ట్స్ కాలేజీ వెనకాల రైల్వే స్టేషన్ అవతల బౌద్ధ నగర్ లో వుండే తమ మేనమామ ఇంట్లో వుండేవాడు. ప్రతి రెండు రోజులకొక సారి ఇద్దరమూ కాంపస్ లోనో, వాళ్ళ ఇంటి దగ్గరో కలిసేవాళ్ళం. వాళ్ళ ఇంటి దగ్గరయితే హోటల్ షోలా మా అడ్డా. లేకుంటే సీతాఫల్ మండిలో వున్న మరి ఇరానీ హోటల్ లో చాయ్ అడ్డా. ఆ హోటల్ లో మనం కోరిన పాటల్ని డబ్బులు ఇస్తే వేసే వాళ్ళు. అట్లా పాటలు వింటూ ఏవో చర్చలు చేస్తూ వుండేవాళ్ళం. అదే టైంలో సాంబ శివుడు బావమరిది పూర్ణచందర్ పరిచయం కూడా.

          అట్లా కాంపస్ లో లైబ్రరీ సైన్స్ కాలంలో సాంబశివుడు నేను ఎంతో దగ్గరయ్యాం.      

          ఇంకా అదే సమయంలో సాహితీ మిత్రులు నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మరీ విజయరావు, అంబటి సురేందర్ రాజు, గుడిహాళం రఘునాధం ఇట్లా అనేక మందితో పరిచయాలూ స్నేహాలూ కుదిరాయి…

***

ఉస్మానియా- ప్రవేశం- వ్యక్తిత్వపరిణామం

జీవన గమనంలో ప్రయాణాలు చిత్రంగా సాగుతాయి. అన్నీ అనుకున్నట్టుగా సాగవు. మలుపులూ వెరపులూ సాధారణం. ఊహించినవేవీ జరగకపోవచ్చు. అనూహ్యమయినవి అనేకం మన ముందుకు రావచ్చు. అయినా ప్రవాహం ఆగదు. ఒక్కోసారి ఈదుకుంటూ ఒడ్డుకు చేరతాం. ఇంకోసారి కొట్టుకుపోతాం. నా విషయంలో సరిగ్గా అట్లే జరిగింది. చిన్నప్పటి మెడికల్ కల ముగిసిన తర్వాత ఉస్మానియాలో చేరాలని, చదవాలన్నది కోరికే కాదు ఒక రకంగా లక్ష్యం కూడా. ప్రవేశం సరే కానీ ఊహించని విధంగా లైబ్రరీ సైన్స్ లో చేరడం పెద్ద మలుపు. అప్పటికి పేరే తెలీని కోర్సు. అందులో ఏముంటుందో తెలీదు. ఏమి జరగబోతున్నదో తెలీదు. కేవలం మిత్రుడు మదన్ సలహా.. యునివర్సిటీలో చేరాలన్న కోరిక… ఎంట్రన్స్ లో దొరికిన సీటు అంతే. అట్లా కాంపస్ లో వచ్చి పడ్డాను. కరీంనగర్ లాంటి చిన్న కాలువ లోంచి మహాసముద్రంలో పడ్డట్టు అయింది. కోర్సులో ప్రవేశం అయితే దొరికింది కానీ. హాస్టల్ లో గది లేదు. భోజనం వుంది కాని నీడ లేదు. పేరుకు ఆర్ట్స్ కాలేజీ. కానీ క్లాసులు ‘డి’ హాస్టల్ గదుల్లో. అంతా ఆగమ్య గోచరం.

          సరే రాజుమామ (జింబో) వాళ్ళ ‘ఈ’ హాస్టల్ లోని తన రూము 28 లో అతిథిగా ఉండిపోయాను. తనేమో యూనివర్సిటీలో చేరగానే చాలా ఆక్టివ్ అయిపోయాడు. విజయ్ లాంటి మిత్రుల ప్రోత్సాహంతో ఎన్నికలు అవీ బిజీ అయ్యాడు. నాకేమో హాస్టలు, క్లాసులు అంతా కొత్త. అట్లా మొదలయింది నా యూనివర్సిటీ ప్రయాణం.

          నిజానికి చదువుల్లో మొదటి నుంచీ నేను ఫర్వాలేదు. కానీ టెన్త్ వరకు కంపోజిట్ మాత్స్, ఇంటర్ లో మెడికల్ కలలతో జీవశాస్త్రం, డిగ్రీ కొచ్చేసరికి పీజీ కెమిస్ట్రీ కోసం ఫిజికల్ సైన్స్..అట్లా భిన్నమయిన సబ్జెక్ట్స్ తో  ‘ఘర్ కా న ఘాట్ కా’ అయింది మన చదువు. వాటితో పాటు సాహిత్యం పట్ల ఏర్పడ్డ ఇష్టం అనుబంధం. చదవడం రాయడం మరో మలుపు. ఇక లైబ్రరీ సైన్స్ కొచ్చే సరికి అంతా కొత్త. కన్ఫ్యూజన్. ప్రొఫెసర్ రాజు వచ్చి ఎస్. ఆర్. రంగనాథన్ అంటూ క్లాసిఫికేషన్ చెప్పేవాడు. కోలన్ క్లాసిఫికేషన్ సబ్జెక్టులను లైబ్రరీ కోసం ఎట్లా విభాజించాలో చెప్పేవాడు. పాస్చులెట్స్ నుంచి మొదలు అనేక కొత్త కొత్త పదాలు, సూత్రాలతో వివరిస్తుంటే తెలిసినట్టు అనిపిస్తూనే ఏమీ తెలీక పోయేది. వామ్మో వామ్మో.. ఇంగ్లీషులో ఎక్కడి ఎక్కడి పదాలో వచ్చేవి. గణిత శాస్త్ర ఆచార్యుడు ఎస్. ఆర్. రంగనాథన్ రూపొందించిన ఆ సూత్రాలు మా దుంప తెంచేవి. ఇక రాజు గారే డేవీ డెసిమల్ క్లాసిఫికేషన్ చెప్పేవాడు. ఇక మరో వైపు కాటలాగింగ్ దాంట్లో మళ్ళీ ఎస్. ఆర్. రంగనాథన్.. క్లాసిఫైడ్ కాటలాగ్, దాంతో పాటు ఎ.ఎ.సి.ఆర్. మరి వైపు బిబిలియోగ్రఫీ అంటూ వేణుగోపాల్ సర్.. మరోవైపు మేనేజిమెంటు ఇంకా ఎన్నో. థియరీ తో పాటు ప్రాక్టికల్స్. యూనివర్సిటీ చదువులా వుండేది కాదు. ప్రైమరీ స్కూలులాగా వుండేది. ఊపిరాడని క్లాసులు. ‘డి’ హాస్టల్ లో క్లాసులు జరిగినన్ని రోజులు అంతా ఎక్కడో ఎడారిలో వున్నా ఫీలింగ్. ఒకసారి ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి మారిం తర్వాత జనం కనిపించడం మొదలు పెట్టారు. కలర్స్ కనిపించడంతో మౌనంగానే అయినా పరిస్థితి ఎంతో కొంత ఉత్సాహంగా మారింది. అమ్మయ్య యూనివర్సిటీకి వచ్చాం అని అందరమూ ఊపిరి పీల్చుకున్నాం. బయట అది మంచి కోర్సు వెంటనే ఉద్యోగం దొరుకు తుంది అని పేరు. ఏంటో అంతా కన్ఫ్యూజన్ లోనే కోర్సు ముగిసింది. యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ వాటిల్లో ఉత్సాహంగా పాల్గొనే చొరవ చూపలేదు. అట్లా ఆ విద్యా సంవత్సరం ముగిసింది. సంపత్ కుమార్, గోపాల్ రెడ్డి, సీతారాములు, ఉమాశంకర్, రవీంద్ర చారి, నర్సింగ్ రావు, మనోహర్ ఇట్లా కొంత మంది క్లాస్మేట్స్ తో క్లోజ్ గా వుండేవాన్ని. మిత్రులంతా నా కున్న సాహిత్య అభిలాష పట్ల అభిమానంగా చూసేవారు. మొత్తం మీద లైబ్రరీ సైన్స్ ప్రధమ ద్వితీయ సెమిస్టర్ పరీక్షలు అయ్యాయనిపించాను. పరీక్షలు రాసి కరీంనగర్ కు వచ్చేసాను. ఏం చేయాలో అని ఆలోచిస్తున్న రోజులు. మళ్ళీ కరీంనగర్ ఫ్రెండ్స్ నా కంపనీ. వెంకటేష్, కృష్ణ, సుధాకర స్వామి, ప్రసాద్, మోహన స్వామిలతో కాలం గడుస్తున్న వేళ ఒక రోజు హైదరా బాద్లో కాంపస్ లో వున్న జింబో నుంచి ఇన్లాండ్ లెటర్ వచ్చింది. తెరిచి చూస్తే ఒకే వాక్యం ఫస్ట్ క్లాస్ కి అభినందనలు. అంతే ఉత్సాహంగా అనిపించింది. అమ్మయ్య చాలా చిత్రం గా అప్పటిదాకా అకాడెమిక్ పరీక్షల్లో నాకున్న 60% గెట్టును లైబ్రరీ సైన్స్లో దాటేసాను.  అప్పుడు నాన్న ధనగర్వాడి హై స్కూలులో పని చేస్తున్నారు, వెళ్ళి చెప్పాను. ఉత్తరం చూపించాను. అంతేనా ఇంకేమీ రాయలేదా పర్సంటేజీ అదీ అని అడిగాడు. నవ్వు కున్నాం. మేక్ మెర్రి అన్నాడు.

          అట్లా లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ ప్రస్థానం ముగిసింది. అప్పటికి ఉస్మానియాలో పీజీ లేదు. ఎట్లయినా కాంపస్ లో వుండాలి ఒక సారి కాంపస్ అలవాటు అయిన తర్వాత విడిచి వెళ్ళడం అంత ఈజీ కాదు. అప్పటికే నాకున్న ఎంతో మంది మిత్రులు ఒకటి తర్వాత మరోటి కోర్సులు చేస్తూ అక్కడే వున్నారు. ఇంకో కారణం ఆ కాలంలో వున్నతీవ్ర నిరుద్యోగం. బయటకు వెళ్తే ఏం చేయాలన్నది ప్రధాన ప్రశ్న. కాంపస్ లో ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్.  లైబ్రరీ సైన్స్ ఫలితాల తర్వాత కాంపస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేర్లు నమోదు చేసుకున్నాం మా బాచ్ అందరం. ఉద్యోగం అంత తొందరగా వస్తుందన్న విశ్వాసం వుండేది కాదు. ఏదయినా పీజీ కోర్సులో చేరాలి. ఇంగ్లీష్ అంతగా రాదు. తెలుగులో చేరాలి కానీ నాది ఇంటర్ నుండి హిందీ సెకండ్ లాంగ్వేజ్. మాతృభాష తెలుగు అదే వస్తుంది హిందీలో చేరితే మరో భాష నేర్చుకోవచ్చు నన్నది అప్పటి నా ఫిలాసఫీ. హిందీ సినిమాలు, హిందీ పాటలు మరో కారణం. వెరసి అప్పటికి రెండు భాషల్లోనూ అంతగా ప్రావీణ్యం ఎమీ రాలేదు. కాని, ఎం.ఏ. తెలుగుకు అర్హత లేకుండా పోయింది. ఎంత సాహిత్యం చదివితే, తెలిస్తే మాత్రం ఏముంది. రూల్స్ కదా ముఖ్యం. సో నేను ఎం.ఏ.ఫిలాసఫీలో చేరాను.

***

          ఇదిట్లా వుంటే కాంపస్ లో వున్న కాలంలో పలుసార్లు ఖైరతాబాద్ లో వున్న మా మేనత్త కాశమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాణ్ని. అక్కడ నలుగురు మేన బావలు. జగద దాస్, శ్రీనివాస్, బాబురావు, శ్యాం సుందర్. ముగ్గురు వదినలు తారక్క, విజయ, బేబి. ఇల్లంతా గోల గోల గా వుండేది. మా కరీంనగర్ మిఠాయి దుకాణం ఇల్లులాగా వుండేది. అందులో బాబురావు బావతో కలిసి సిన్మాలకు పోయెవాణ్ని. దాదాపు నా ఏజ్  గ్రూప్ అయిన బేబి కొంత ఫ్రీగా వుండేది. ఇక శ్రీనివాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బి.నర్సింగ్ రావు, వైకుంఠం, చంద్ర తదితరులతో కలిసి చదివాడు. తనకే మా పెదనాన్న జగన్నాధం గారి బిడ్డ శోభక్కను ఇచ్చి పెళ్ళి చేసారు. తర్వాతి కాలంలో మా చెల్లెలు మంజులను కూడా ఆ ఇంటికే శ్యాం బావకిచ్చి పెళ్ళి చేసారు. ఖైరతాబాద్ లో ఇంకో విషయం ప్రముఖ కవి కే. శివారెడ్డి వాళ్ళ ఇల్లు పక్కనే వుండేది. అప్పుడప్పుడూ కలిసే వాణ్ని. ఒకటి రెండు సార్లు ద్వారకాకు కూడా పోయిన గుర్తు.

          ఇక కాంపస్ లో వుండగా లాలపేట్ లో వున్నా రాం టాకీసులోనూ, చిలకల గూడలో వున్న శ్రీదేవి లోనూ సినిమాలు చూసిన గుర్తు. ఇక యూనివర్సిటీ లోని ‘టాగోర్’ ఆడిటోరియంలో కూడా ఒకటో రెండో ఆర్ట్ సినిమాలు చూసాను.

***

          ఎం.ఏ. ఫిలాసఫిలో చేరాక మర్రి విజయ రావు నా క్లాస్మేట్ అయ్యాడు. అప్పటికే తాను తెలుగు పూర్తి చేసాడు. ఇద్దరమూ ‘డి’ హాస్టల్ లో చేరాం. అప్పటికే విజయరావు అనేక మంది కవులు, రచయితలతో అనుబంధం కలిగి వున్నవాడు. ఇక మా ఇద్దరితో పాటు జింబో, నందిగం కృష్ణా రావులు కూడా మా రూములో చేరారు. మంచి సాహిత్య వాతావరణం వుండేది.

          అప్పుడే ’ ఆంధ్ర జ్యోతి వార పత్రికలో నా కవిత వచ్చింది..

“ ఈ సమాజం

అచ్చుతప్పులున్న

ఓ గొప్ప పుస్తకం

ఇప్పుడు కావాల్సింది

తప్పొప్పుల పట్టిక తయారుచేయడం కాదు

ఆ పుస్తకం

పునర్ముద్రణ జరగాలి”  ఆ కవిత పలువురి దృష్టిని ఆకర్షించింది.

అప్పుడు జింబో రాసిన కవిత

‘ నే చచ్చి పోతాననే

కదూ నీ బాధ

పిచ్చివాడా

ఈ లోకంలో

మనం బతికింది

తొమ్మిది మాసాలే’

అప్పుడు చాలా హిట్టయిన కవిత ఇది.

కవితలు రాస్తూ పత్రికల్లో వస్తూవుండడం పెద్ద ఊపుగా వుండేది.     

          ‘ఏ’ హాస్టల్ కు వెళ్ళి వచ్చేవాళ్ళం. అక్కడ నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారయణ రెడ్డి, గుడిహాళం రఘునాధం, అంబటి సురేందర్ రాజు మొదలయిన ఎంతో మంది కవులు వుండేవాళ్ళు క్రమంగా వాళ్ళతో స్నేహం కుదిరింది. అంతా ఒకే సాహితీ గూటికి చెందిన వాళ్ళం కదా. నందిని సిధారెడ్డి అప్పటికే కవిత్వం రాయడంతో పాటు మంచి ఆర్గనైజర్ గా ఉండేవాడు. సుంకిరెడ్డికి సాహిత్యంతో పాటు ప్రేమ కథ ఎదో వుండేది. సురేందర్ రాజు బాగా చదువుకున్న వాడని అనేవాళ్ళు. నీషే గురించి ఇంకా పలువురు తత్వవేత్తల గురించి బాగా చదివాడని విజయ రావు చెప్పేవాడు. కేవలం చదువుకుంటే ఏం లాభం భై ఏదయినా రాయాలి చెప్పాలి కదా అని నెను అనేవాడిని. అందరమూ క్లోజ్ గానే వుండేవాళ్ళం. ఎందుకోగాని రఘునాధం నాకు కొంచెం ఎక్కువ నచ్చేవాడు. 

ఈ క్రమంలోనే ఉస్మానియాలో ఒక సాహిత్య సంస్థ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అంతా ఆర్ట్స్ కాలేజీ ముందు పలుసార్లు కూర్చున్నాం. చర్చించాం. పేరేమి పెట్టాలనే చర్చ వచ్చింది. ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ అన్న పేరు చర్చకు వచ్చింది. అయితే అది ఝరి పోయెట్రీ సర్కిల్ లాగా వుంది అన్న అభ్యంతరం చెప్పారు. నేనయితే ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ నే సమర్థించాను. అదే ఖాయమయింది. కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసారు. నిర్వహించారు.

 

***

          ఇంతలో నాకు జూనియర్ కాలేజీలలో లైబ్రరియన్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ కు కాల్ లెటర్ వచ్చింది. కొంచెం ఆశ్చర్యం వేసిందని అంత తొందరలో కాల్ వస్తుందని అనుకోలేదు. కానీ ఏం చేద్దాం వెళ్ళాల్సిందే. అందరేమో ఉద్యోగం వచ్చేసినట్టేనని అని అభినందించారు. ఇంటర్వ్యు కోసం పెద్దగా ఏమీ తయారు కాలేదు. ఖైరతాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసుకి వెళ్ళాను. బోర్డులో ఒక జాయింట్ డైరెక్టర్  మరెవరో వున్నారు.  ఆయన కీచుగొంతు సుబ్బారాజు గారని పెద్ద పేరున్న అధికారి. ఏవో ప్రశ్న లడిగారు. నేనేవో చెప్పాను. ఒకే అన్నారు. నిరాసక్తంగానే బయటకు వచ్చాను. అక్కడెవరో చెప్పారు. ఈ ఉద్యోగాలు ఎక్కువున్నాయి. అభ్యర్థులు తక్కువ అని. తిరిగి కాంపస్ కు వచ్చేసాను. ఒక వేళ ఉద్యోగం వస్తే నా ఎం.ఏ. ఎట్లా అన్న ఆలోచన వచ్చింది. అప్పుడే ఎక్స్ టర్నల్ పరీక్షల కోసం యూనివర్సిటీ ప్రకటన వచ్చింది. ఇంకే ముంది.. జింబోనేను ఇంకా కొంత మంది మిత్రులం కట్టేశాం. నేను కరీంనగర్ కు వచ్చేసాను. ఒక రోజు నేను వెంకటేష్ తదితర మిత్రులం ఫయిర్ స్టేషన్ దగ్గరలో ఒక షాపులో వుండగా పోస్ట్ మాన్ నన్ను చూసి సార్ మీకు ఒక రిజిస్టర్ లెటర్ అన్నాడు. ఇంకే ముంది అనుకునట్టుగానే అపాయింట్ మెంట్ లెటర్. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్ గా నియమించారు. అంతా అభినందించారు కానీ నాకే లోపల ఎదో ఒక మీమాంస ఈ నౌకరీ లో చేరడమా…. ఇంకా చదువుకోవడమా.. ‘అందరూ ఉద్యోగాలు రాక ఏడిస్తే నువ్వేమిట్రా’ అన్నారు మిత్రులు… వెంటనే జాయిన్ కాలేదు. మూడు-నాలుగు రోజుల తర్వాత 18 జనవరి 1980 రోజున మంథని కాలేజీలో జాయిన్ అయ్యాను…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.