వ్యాధితో పోరాటం-20

కనకదుర్గ

          నేను కాపురానికి వచ్చినపుడు శ్రీని, నేను రెండేళ్ళ వరకు పిల్లలు వద్దని అనుకు న్నాము. నేను జర్నలిజం చేసి జాబ్ చేయాలని నా కోరిక. కానీ నేను వచ్చిన నెల తర్వాత నుండే నేను నెల తప్పానా లేదా అని ఆరాలు మొదలయ్యాయి ఇంట్లో. నెల నెల బయట కూర్చుంటానని అనుకున్నారు. మా అత్తగారు శైలజతో కష్టం అవుతుందని బయట కూర్చోవడం మానేసారని, శైలజ కూడా కూర్చోదు కాబట్టి నేను ఆ ఆచారం పాటించక్కర లేదని శ్రీని చెప్పాడు. అందుకని నెల నెల కొడుకుని అడిగేవారు మా అత్తగారు. నేను భారతీయ విధ్యాభవన్ లో జర్నలిజం డిప్లొమా కోర్స్ లో చేరాను. శ్రీని నన్ను చదువు కోమని ప్రోత్సహించాడు, ఫీజ్ కట్టినప్పుడు నాకు కాస్త బాధేసింది. ఇవన్నీ అయిపోయి, నాకు జాబ్ వచ్చాక పెళ్ళి చేసుకుని ఉంటే ఇలా ఆర్ధికంగా ఎవరి మీద ఆధారపడే అవకాశం వచ్చేది కాదు. మా ఇంట్లో ఉన్నపుడు కాలేజ్ కి వెళ్ళడానికి, అత్తగారింట్లో ఉన్న పుడు కాలేజ్ కి వెళ్ళడానికి చాలా తేడా అనిపించేది. అమ్మ, నాన్న దగ్గర ఉన్నపుడు కాస్త స్వేచ్చ ఉండేది. మా అమ్మ నేను కాలేజ్ నుండి వచ్చే టైమ్ కి గేట్ దగ్గర నిల్చుని ఎదురు చూస్తూ ఉండేది. ఇక్కడ నేను కాలేజ్ కి వెళ్ళే టైమ్ కి మా అత్తగారు, అమ్మమ్మ గారు, శైలు భోజనం లేట్ గా చేసి 3.30-4 గంటలకు పడుకునేవారు. నేను చప్పుడు కాకుండా లేచి అందరికీ టీ చేసి పెట్టి నేను తాగేసి, రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్ళేదాన్ని. వంట పొద్దున్నే అయ్యేది కాబట్టి అప్పుడే కూరలు తరిగి పెట్టడం, మిక్సీలో వేసేవి, వేసి ఇచ్చేదాన్ని, ఇల్లు ఊడవడం, వంట అయ్యాక కిచెన్ క్లీన్ చేసి పెట్టేదాన్ని.

          మొదట్లో శ్రీని కాలేజ్ కి వచ్చి పిక్ అప్ చేసుకునేవాడు, అంటే తన ఆఫీస్ ప్యారడైజ్, సికింద్రాబాద్ లో ఉండేది. అక్కడి నుండి బస్ లో వచ్చి నా క్లాసెస్ అయ్యాక మళ్ళీ బస్ లోనే వెళ్ళేవాళ్ళం. నాకు ఫ్రెండ్స్ తో కల్సి వెళ్ళి రావడం అలవాటు.సరదాగా కబుర్లు చెప్పుకుంటు వెళ్ళి వచ్చేవాళ్ళం. శ్రీని ఎక్కువగా మాట్లాడే వాడు కాదు. నాకు ఊరికే కూర్చోవడం ఇష్టం ఉండేది కాదు. క్లాస్ కబుర్లు, ఫ్రెండ్స్ గురించి, వనితా మహా విధ్యాలయలో చదువుకున్నప్పటి విషయాలు చెప్పేదాన్ని.

          ఇంట్లో ఏం జరుగుతుంది, అంటే నాకు అడ్జస్ట్ కావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది తను సపోర్ట్ ఇవ్వడమో, నేనొకటి చెబితే వారు మరో రకంగా అర్ధం చేసుకోకుండా తను కొద్దిగా ఇద్దరి మధ్యన కమ్యునికేషన్ గ్యాప్ రాకుండా సాయం చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. నేను చెప్పింది విని వాళ్ళకి గట్టిగా అరవొద్దని, నేను చదువుకోవాలని చెప్పేవాడు.

          దాంతో వాళ్ళకి నేనూ వాళ్ళతో ఇంట్లో మనిషిగా కలిసిపోవడానికి ప్రయత్నిస్తు న్నానని అనుకునే అవకాశం పోయింది. వాళ్ళ మనసుల్లో, “అబ్బో ఆమె పెద్ద చదువులు చదువుకుంటుంది మనం ఆమెని విసిగించకూడదు.” అంటే నేను వాళ్ళతో కలిసి పోవడానికి చేసిన ప్రయత్నాలన్నివేస్ట్ అయిపోయాయి. కొత్తగా వచ్చిన కోడలికి, ఇంట్లో అందరి సభ్యులకి మధ్య అపార్ధాలు రాకుండా చూసుకోవలసిన భాద్యత కొడుకుదే! నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానో పూర్తిగా వినకుండానే తనకి తోచింది చేసేసేవాడు. అది శ్రీని తప్పు కాకపోవొచ్చు. వచ్చే భార్య రాగానే ఇంట్లో వారినందరిని అర్ధం చేసుకుని, వారి కిష్టమయినట్టుగా మసలుకోవాలని చాలా మంది అబ్బాయిలు, పురుషులు కోరుకుంటారు. వారు కోరుకున్నట్టుగా కాకుండా కొద్దిగా వేరే మనస్తత్వం కల వ్యక్తి వస్తే తన నుండి ఏదో ఆశిస్తుంది అనే పరిస్థితి వచ్చినపుడే అంతా తారుమారు అవుతుంది.

          శైలజ ట్రీట్మ్ంట్ దగ్గరికి వస్తే రెండు నెలలు దాటాక మళ్ళీ నేను, మా అత్తగారు కల్సి అదే న్యూరాలజిస్ట్ వద్దకు తీసుకువెళ్ళాము. డాక్టర్ గారు బిజీగా ఉన్నారు. మా వంతు రాగానే వెళ్ళాము. ఆయన మమ్మల్ని చూడగానే, “ఏమ్మా! ఎక్కడ మాయ మయ్యారు? నేను రెండు వారాల తరవాత అంటే రెండు నెల్ల తర్వాత వస్తారా? ఎందు కింత లేట్ గా వచ్చారు?” అని అడిగారు శైలజ చెయ్యి పట్టుకుని చూస్తూ.

          “ఆంటే మాకు కొచెం భయమేసింది. మెదడు సర్జరీ కదా, ఏమన్నా జరగరానిది జరిగితే…. ఉన్నది ఒక్క ఆడపిల్ల…”

          “ఒక్క ఆడపిల్లనే అమ్మా! ఆమె వణుకుతూ, ఎపుడు పడుతుందో తెలియదు, తన పనులు తను చేసుకోలేదు, మేము సర్జరీ చేసి కొంచెమన్నా కంట్రోల్లోకి తీసుకు వద్దామని అనుకున్నాము. మా మీదనే మీకు నమ్మకం లేదు. మీ ఆయన ఏడి? పిల్ల భాద్యత ఒక తల్లి, ఈమె ఎవరు? మీ కోడలుదేనా? ఆయనకి పిల్ల గురించి ఫికర్ లేదా?” అని కడిగేసారు.

          నేను, మా త్తగారు కల్సి, “ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారండీ. అందుకే రాలేక పోయారు…” మాట మధ్యలోనే ఆపేసి, “అందరికీ  ఉంటాయమ్మా పనులు. అయినా తీరిక చేసుకుని వస్తారు పిల్ల ఆరోగ్యం, భవిష్యత్తు గురించి భాద ఉన్న వారయితే,” అని “ఇది అయ్యే పని కాదమ్మా! మీకు డాక్టర్ల పైన నమ్మకం కూడా ఉండాలి. మీరు మొదటిసారి వచ్చినపుడు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అనిపించి త్వరగా రమ్మని చెప్పాను. పిల్ల పెద్దదయిపోతుంది. అప్పటికి ఇప్పటికి పరిస్థితి మారిపోయుంటుందమ్మా!”

          “సార్ చూడండి, ఏ కొంచెం అవకాశం ఉన్నా ప్లీజ్ ట్రై చేయండి సార్. సో సారీ ఫర్ నాట్ కమింగ్ ఆన్ టైమ్….” 

          “లేదమ్మా! ఇట్స్ నాట్ పాసిబుల్, వేరే పేషెంట్స్ ఉన్నారు, నమస్తే!” అని తర్వాత పేశంట్ ని పిలిచారు.

          ఇక అక్కడ చేసేదేమి లేక వెనక్కి తిరిగి వచ్చాము.

          వచ్చినప్పట్నుండి పిల్లకి మంచి అవకాశం పోయినట్టు డీలా పడిపోయారు.

          శైలజది నాది ఒకటే వయసు. ఒక నెల తేడా అంతే. ఇంట్లో ఉండి ఊరికే అందరితో గొడవలు పెట్టుకుంటూ, ఏ వ్యాపకం లేకుండా ఉండడానికి తను వృద్దురాలు కాదు.వీళ్ళకీ స్కూల్స్ ఉంటాయి. చిన్నపుడు పంపించారు కాని అది మానేయాల్సి వచ్చింది. మారేడ్ పల్లీలో ఒక స్కూల్ ఉందని తనకి వెళ్ళి వస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. వాళ్ళు పద్దతులు, వాళ్ళ పనులెలా చేసుకోవాలో నేర్పిస్తారు అని చెబితే, అందరూ ఆలోచించు కుని సరే ట్రై చేద్దామని అన్నారు. మా అత్తగారి స్కూల్ ఫ్రెండ్ తను కార్లో తీసుకువెళ్తానని చెప్పారు. నేను, మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్ కార్లో  శైలజని తీసుకుని వెళ్ళాము. అది చిన్న బిల్డింగే, లోపలికి వెళ్ళాము. అక్కడ శైలజ లాంటి పిల్లలు అన్ని వయసుల వారు ఆడ, మగ పిల్లలున్నారు. అక్కడ పని చేస్తున్న అసిస్టెంట్ టీచర్లు, ఆయాలు, “ఎంత అందంగా ఉందమ్మా పిల్లా! ముట్టుకుంటే దీపం పెట్టుకోవొచ్చు,” అని అంటూనే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. మా అత్తగారిని చాలా ప్రశ్నలు వేసారు శైలజ గురించి. అక్కడ పెద్ద పిల్లలున్నారు కదా ఈజీగానే చేర్చుకుంటారనుకున్నాము. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న అని అడిగారు,  “ప్రతి నెల బహిష్టు వచ్చినప్పుడు తనంతట తను ప్యాడ్స్ మార్చుకోగలుగుతుందా?”

          “తను వణుకుతుంది కదా, చేసుకోలేదు. సాయం కావాలి.” అని చెప్పగానే అందరి మొహాలు ఢల్ అయిపోయాయి. అప్పటి వరకు, ” మా బడికి వస్తావా? మాతో ఆడు కుంటావా?” అన్న వాళ్ళు కామ్ అయిపోయారు.

          ప్రతి స్కూల్లో ఇలానే పెద్దమనిషయిన పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన ముఖ్యమైన విషయం. అది రాకపోతే అడ్మిషన్ రాదు.

          మళ్ళీ మొహాలు వేళ్ళాడేసుకుని ఇంటికి చేరాము.

          ఇన్ని రోజులు పెద్ద డాక్టర్లు, స్కూళ్ళ గురించి చర్చలు మానేసారు. ఎపుడయినా అవసరం పడితే సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకువెళ్ళడం, ఆయన ఏమైన మందులు మార్చాల్సి వస్తే మార్చేవారు.

          నేను వచ్చినప్పటి నుండి ఇవన్నీ మొదలయ్యాయి మళ్ళీ అంటే, ఆడపడుచుకి అన్ని పనులు చేయడం వదినకు ఇష్టం లేదు, తనని బరువనుకుంటుందని అందుకే ఇవన్నీ మొదలు పెట్టింది అని అమ్మమ్మగారు, ఇరుగు పొరుగు వారి చెవిలో వేయడం మా అత్తా, మామగార్లు వారి జాలి చూపులు, జాలి మాటల భారిన పడ్డారు. ముందు వారి కాలోచన లేకున్నా నలుగురూ అనేసరికి అది నిజమే అని అనిపించసాగింది. నాకు చాలా బాధేసింది.

          నాకు ఇంట్లో వారయినా, బయటవారయినా ఎవరైనా బాధ పడుతుంటే చూడలేను, వాళ్ళకు నాకు వీలైనంత సాయం చేయడానికి ప్రయత్నం చేసేదాన్ని. ముఖ్యంగా చిన్న, చిన్న పిల్లలు బడికెళ్ళకుండా పని చేస్తుంటే బాధ ఒకటే కాదు, మన వ్యవస్థ ఎంతలా విఫలమైపోయిందో అర్ధం అవుతుంది. ఎంత మంది ఎక్కువ పిల్లల్ని కంటే అంత మంది సంపాదించే చేతులుంటాయి ఇంట్లో అనుకుంటూ పిల్లల్ని కనడం, హాయిగా ఆడుతూ పాడుతూ పెరగాల్సిన పిల్లలు ఏ పని దొరికితే అది చేసుకుంటూ, చిన్నపిల్లలు కాబట్టి తక్కువ డబ్బులిస్తే అవి తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడం పెట్టిన తిండి తిని పడుకోవడం తల్చుకుంటే వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండేది. మా ఇంటి దగ్గర ఫ్యాక్టరీ లుండేవి. ఎండాకాలం చిన్న పిల్లలకు బిందెలిచ్చి రిజర్వాయర్ నుండి నీళ్ళు తీసుకు రమ్మనేవారు. చిన్న పిల్లలు, పెద్ద బిందెలు మోయలేక మా ఇంటి గోడ మీద దింపి, కాసేపు గోడ పైన కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. నేను వాళ్ళకి ఇంట్లో ఉన్న అరటి పళ్ళు, జామకాయలు ఇచ్చి అవి తిన్నాక మంచినీళ్ళు ఇచ్చేదాన్ని. ఒకరోజు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ అమ్మా, నాన్నా ఏం చేస్తారు ? అని అడిగాను. చెప్పి వెళ్ళి పోయారు. కొన్ని రోజుల తరవాత నేనడిగాను ఆ పిల్లల్ని, “నేను మీకు చదువు చెబ్తాను సాయంత్రం పూట వస్తారా?” వెంటనే వాళ్ళు గోడ దిగేసి, నా వైపు పిచ్చిదానిలా చూసి, “మేము చదువుకోము. మేం పని చేసుకోవాలి. చదువుకుంటే మాకు తిండి రాదు.” అని వెళ్ళిపోయారు.

          నేనపుడు 15-16 ఏళ్ళ వయసు. ఫేయిలయ్యాను ఫట్ మని! నేనేదో పెద్ద మధర్ థెరిస్సా అని చెప్పుకోవడం లేదు. అప్పటి నుండి బాల కార్మికులను గమనించడం చేసేదాన్ని. ఎప్పటికయినా వాళ్ళకి ఏదైనా చేయాలనే కోరిక ఉండేది.

          వనితా మహావిధ్యాలయంలో ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీలో నర్మద అనే అమ్మాయి ఫ్రెండ్ అయ్యింది. చాలా సన్నగా ఉండేది. గొంతు బావుండేది పాత హిందీ, తెలుగు సినిమా పాటలు పాడేది. కానీ చాలా వీక్ గా ఉండేది. మాట్లాడడం కూడా కొంచెం అమాయకంగా మాట్లాడేది, అలిగేది, కోపం త్వరగా వచ్చేది. బాగానే చదివేది. తండ్రి తాగుతాడని, తల్లి ఎప్పుడు పూజలు చేస్తుందని, తనకి ఇద్దరన్నలున్నారని వైజాగ్ లో చదువుకుంటారని చెప్టుండేది. మెట్లు ఎక్కేపుడు తనకి ఆయాసం వచ్చేది. తండ్రి పట్టించుకోడు, తల్లి ఎపుడూ పూజలు చేస్తుండేది. నర్మదని పట్టించుకోవడానికి ఎవరూ లేరు. ఫ్రెండ్సందరం కలిసి తనని మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్దాము అన్నపుడు మా ఫ్రెండ్స్ కి ముందు నచ్చలేదు. “పిల్లల్నిచూసుకునే భాధ్యత తల్లితండ్రులది, మనది కాదు. నీకెందుకు ఈ విషయాలన్ని,” అన్నారు. 

          “అందరికీ మంచి పేరెంట్స్ ఉండాలని లేదు కదా! తనే చెబ్తుంది కదా, తండ్రి పట్టించుకోడని, తల్లికి పూజలు తప్ప ఏమి తెలియదని. జ్వరం వస్తే తల మీద నీళ్ళు పోసి మొహానికి కుంకుమ రాస్తుందని. మనమదరం కల్సి డబ్బులు కలెక్ట్ చేసి డాక్టర్ ఫీజ్, మందులు కొందాము. మీరు హెల్ప్ చేస్తేనే తన ఆరోగ్యం బాగుపడ్తుంది. ఆలోచిం చుకొని చెప్పండి,” అన్నాను.

          ఫాతిమా, అను, లత, నేను,రాధ ఉండేవాళ్ళం మా గ్రూప్ లో. ఫాతిమా నేను కాలేజ్ కి కల్సి వెళ్ళి వచ్చే వాళ్ళం. తను, రాధ, వెంటనే ఓకే అన్నారు. అను, లత మర్నాడు ఓకే అన్నారు. మాకు పాకెట్ మనీ అంటూ వేరేగా ఉండేది కాదు. లంచ్ కోసమని, బస్ ఎపుడైనా మిస్ అయితే అని ఎమర్జెన్సీ డబ్బులిచ్చేవారు ఇంట్లో. వాటిలో నుండే డబ్బులు తీసుకొని మేము నర్మదని ఒక హాస్పిటల్ లో రూ.30 కడితే 3 సార్లు చూసేవారు. డా.సాహు గారి దగ్గరకే మా కుటుంబమంతా వెళ్ళేవాళ్ళం. చాలా మంచి డాక్టర్. ఆయన వారానికి 3 సార్లు హరిప్రియా హాస్పిటల్, మదీనా, ఓల్డ్ సిటీలో ఉండేది. అక్కడ అప్పాయింట్మెంట్ కాలేజ్ తరవాతే తీసుకుని వెళ్ళేవాళ్ళం. మొదటిసారి అన్ని చెక్ చేసి వీక్ నెస్ కి మందులు రాసి ఇచ్చారు. కొన్నాళ్ళల్లో బాగా కోలుకుంది. సెలవులు వచ్చినపుడు నర్మద వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్తానని, మీరందరూ నా కోసం ఇంత చేసారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని అన్నది. వాళ్ళ అమ్మ పై నమ్మకం లేదు మాకు, ఇంటి నుండే బయటికి ఎక్కువగా రాని మనిషి ఇంత దూరం వస్తుందా అని మా అనుమానం. మేము రెండు వారాలకోసారి ఒకొక్కరం వంతుల వారీగా తీసుకెళ్తామని చెప్పాము. కానీ నర్మద అస్సలు వినలేదు. ప్రిస్క్రిప్షన్స్ అన్ని తీసుకొని వాళ్ళ అన్నయ్యలు సెలవలకు వస్తారు వారితో వెళ్తానని గట్టిగా చెప్పింది. అప్పుడు ఎవ్వరి దగ్గర ఫోన్ లు లేవు. చేసేది లేక తనని నమ్మాల్సి వచ్చింది.

          సెలవుల తర్వాత కొన్ని రోజులు కాలేజ్ కి బాగానే వచ్చింది. ఒకరోజు క్లాస్ లో కళ్ళు తిరిగి పడిపోయింది, దాంతో పాటు తనకి తెలియకుండానే విరేచనం అయిపోయింది. తను వేరే క్లాస్ లో ఉంది. ఒకమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పిల్చి తీసుకెళ్తూ ఏం జరిగిందో చెప్పింది. నేను మా గ్రూప్ వాళ్ళందరిని పిల్చుకుని రమ్మని చెప్పాను. చాలా మంది ముక్కులు మూసుకుని బయటకి వచ్చి నిల్చున్నారు. లెక్చరర్ నర్మదకి కొంచేం దూరం నిల్చుని, “నర్మద, నర్మద,’’ అని పిలుస్తుంది.

          నేను గ్లాస్ లో నీళ్ళుపట్టుకెళ్ళి మొహం మీద చల్లాను. కదలిక లేదు. లెక్చరర్ నా చేతిలో నుండి నీళ్ళు తీసుకుని కొద్దిగా ఎక్కువ నీళ్ళు తీసుకుని నర్మద పై చల్లి, మొహం నీళ్ళతో తుడ్చింది. మెల్లిగా కదిలింది. చాలా నీరసంగా ఉంది. “ఏమైంది?” అంది లేవడానికి ప్రయత్నిస్తూ.

          “యూ జస్ట్ ఫేంటెడ్, డోంట్ గెట్ అప్,” అని “కాల్ యాదమ్మ టు క్లీన్ ద ప్లేస్.”

          రాధ, నర్మద దగ్గర నిల్చొని తన చెయ్యి పట్టుకుంది. నర్మద అయోమయంగా చూస్తుంది.

          “సంధ్యా కమ్ విత్ మి,” అంటే నేను తనతో బయటకెళ్ళాను.

          “ఏం జరుగుతుంది నర్మద హెల్త్ విషయంలో” అని అడిగింది.

          “తను చాలా వీక్ మేడం, మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉంటే చాలా ఆయాసం వచ్చేది. అందుకని మా గ్రూప్లో ఫ్రెండ్స్ కలిసి మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఆయన ఇచ్చిన  టానిక్స్, మందులు పని చేసాయి. షి బికేమ్ హెల్థీ! హాలిడేస్ లో వాళ్ళఅన్నయ్య లతో డాక్టర్ దగ్గరికి వెప్ళ్తానని చెప్పింది. సరిగ్గా వెళ్ళిందో లేదో.”

          “ఓకే. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రైయింగ్ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్. ఇపుడు ఏం చేద్దాం? హాస్పిటల్ కి తీసుకెళ్తారా? ఇంటికా?”

          “ఈరోజు ఆ డాక్టర్ క్లినిక్ కి రాడు మేడమ్. 2 రోజుల తరవాత వస్తారు. తను ఎలా ఉందో చూసి, తను ఇపుడు నార్మల్ గా ఉంటే ఇంటికి తీసుకెళ్ళి రెండు రోజుల తర్వాత డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తాం. లాస్ట్ అండ్ ఫౌండ్ లో బట్టలుంటాయి అందులో నుండి తన సైజ్ చూసి చేంజ్ చేసి తీసుకెళ్ళండి, లెట్ మి నో హౌ షి ఈజ్ డూయింగ్ టుమారో! ఒకే బేట ఆల్ ది బెస్ట్!.” అని వెళ్ళిపోయింది లెక్చరర్.

          నేను క్లాస్ లోపలికొచ్చేసరికి ఎవ్వరు లేరు. ప్రక్కన క్లాస్ ఖాళీగా ఉంటే అక్కడికి తీసుకెళ్ళారు మా ఫ్రెండ్స్.

          నర్మద లేచి బట్టలు చేంజ్ చేసుకుని గలగలా కబుర్లు చెబుతుంది.

          “నర్మద ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యూ ఓకే? అసలేమయింది? నేనొచ్చేసరికి స్పృహలో లేవు. కళ్ళు తిరిగాయా? ఎక్కడైనా నొప్పిగా అనిపించిందా?” అని అడిగా.

          “నాకేమీ తెలీదు. సడన్ గా కళ్ళు బైర్లు కమ్మాయి, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు!” అంది.

          “ఇపుడెలా ఉంది? హాస్పిటల్ కి వెళ్దామా? ఇంటికి వెళ్దామా?”

          “ఎందుకు హాస్పిటల్ కు? ఇంటికే వెళ్దాము.” అంది.

          తనని ఇంటికి తీసుకెళ్ళి దింపి వాళ్ళమ్మని అడిగాము. “ఇంతకు ముందెపుడయినా ఇలా జరిగిందా? ఎండాకాలం సెలవుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అసలు?”

          “చినప్పుడు ఒకటి, రెండు సార్లయిందమ్మా. తర్వాత మళ్ళీ ఇపుడే. మీరు తీసుకెళ్ళే డాక్టర్ గారు మాకు చాలా దూరం కదమ్మా, అందుకని మా పెద్దబ్బాయి ఇక్కడే దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదిగో ఈ మందులు రాసిచ్చాడు.” అని మందుల ప్రిస్క్రిప్షన్లు చూపించింది. నర్మద మాములు మనిషిలా హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడ్తుంది. వాళ్ళమ్మ పకోడీలు చేసి పెట్టింది, తినేసి నర్మదకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే తీసుకోమని మళ్ళీ కాలేజ్ కి వచినఫ్ఫుడు నోట్స్ రాసుకోవచ్చని ఏం కంగారు పడవద్దని చెప్పి బయల్దేరాము.

          రెండు మూడు రోజులయినా నర్మద కాలేజ్ కి రాలేదు. వాళ్ళీంటి దగ్గర నుండి వచ్చే పిల్లలనడిగితే నర్మదను నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారని, తనకు అస్సలు బాగా లేదని, డాక్టర్లు హార్ట్ ప్రాబ్లెం అంటున్నారని చెప్పారు. మేము వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాము. ఐ.వి ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. ఎక్కడా వేన్ దొర్క్క పోతే అరికాలు పై భాగంలో పెట్టారు. కానీ ఎందుకు చెప్పలేదు. పడుకుని ఉంది. మేం వచ్చిన చప్పుడు వినగానే లేచింది. మాములుగానే మాట్లాడింది.

          “నర్మద నీకు గుండెలో నొప్పిగా ఉందా? మరి మాతో గానీ, మనం వెళ్ళిన డాక్టర్ దగ్గర ఎందుకు చెప్పలేదు నువ్వు?”

          “ముందు నుండి ఆయాసం,” అని వాళ్ళమ్మ చెప్పబోయింది. మొహం నిండా పసుపు, కుంకుమలు పూసుకుంది. నర్మదకు కూడా నుదుటి పైన పెద్దగా పెట్టింది.

          “నువ్వు చెప్పు నర్మద,”అన్నాను.

          “అహ నొప్పి లేదు, కానీ నడుస్తుంటే చాలా ఆయాసం వచ్చేది.”

          “ఇప్పుడు డాక్టర్లేం అంటున్నారు?,” అని అపుడే వచ్చిన నర్మద అన్నయ్యని పక్కకి తీసుకెళ్ళీ అడిగా.

          “పరీక్షలన్నీ చేస్తున్నారు,కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, కొన్నిరాలేదింకా.”

          “ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ లో ఏం తెలిసింది.”

          “చాలా కష్టమంటున్నారు.”

          “కష్టమెందుకవుతుంది? ఇపుడేగా తెలిసింది. ట్రీట్మెంట్ చేస్తే బాగవుతుంది కదా!” కాస్త గట్టిగానే అన్నాను.

          మా ఫ్రెండ్స్ నన్ను కామ్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

          “మీకంటే ఎక్కువగా మేము బాధ పడ్తున్నామండీ! ఈ ప్రాబ్లెం చాలా ఏళ్ళ నుండి ఉంది, స్పెషలిస్ట్స్ కి చూపిస్తే తెలిసేది. కానీ మా నాన్న చూపించలేదు, మా అమ్మకి ఏమి తెలీదు. మేము హైస్కూల్ అయిపోగానే వైజాగ్ కి వెళ్ళిపోయాము….”

          “మీరేం చేస్తున్నారు? మా అన్నయ్యలింత గొప్పవాళ్ళు, ఇంత మంచివాళ్ళు అని మీ గురించి గొప్పగా చెప్పేది మీ ముద్దుల చెల్లెలు. తన పై ప్రేమని ఇలా చూపించు కున్నారు మీరు.” అన్నాను కోపంగా.

          “ఇక్కడ కాకపోతే రాయవెల్లూర్ కి, హార్ట్ స్పెషలైజేషన్ హాస్పిటల్స్ బోలెడున్నాయి అక్కడికి తీసుకెళ్ళండి. కానీ అపుడే డాక్టర్లు, మీరు చేతులెత్తెస్తే ఎలా?’

          “దుర్గా. మెల్లిగా.నర్మద వింటుంది.” అని ఫాతిమా.

          నర్మద తను రాసుకోవాల్సిన నోట్స్ గురించి అడుగుతుంది. నాకు విపరీతమైన కోపం, దు:ఖం పొంగుకొస్తున్నాయి.

          “సారీ దుర్గా గారు! మేము రిపోర్ట్స్ అన్నీ పెద్ద పెద్ద హార్ట్ స్పెషలిస్ట్స్ కి పంపిస్తునే ఉన్నాము. కానీ ఎవ్వరి దగ్గరి నుండి పాజిటివ్ రిప్లై రావడం లేదు. ఇది మాకు కూడా షాకే. ఉన్న ఒక్కగానొక్క చెల్లెలు ఇలా బాధ పడ్తుంటే మాకు మాత్రం సంతోషంగా ఉంటుందా…” గొంతు గద్గ్దమైంది.

          రోజూ వెళ్ళి చూసి రావడం. తను నోట్స్ , క్లాసుల గురించి అడగడం, మెల్లిగా మాట తక్కువైంది, ఆక్సిజన్ పెట్టారు, మగతగా ఉండేది.

          ఆ రాత్రి బాగా ఎక్కువవ్వడం తను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళడం జరిగింది.

          అమ్మాయని చిన్నప్పటి నుండి ట్రీట్మెంట్ ఇప్పించలేదని హాస్పిటల్ లో మాట్లాడు కుంటున్నారు.

          వాళ్ళ నాన్నని ఎప్పుడు చూడలేదు, ఒక్కసారి ఆయన్ని కలిసి ఇది నిజమేనా అని అడిగి పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలనే ఆవేశంతో వాళ్ళింటికి వెళ్ళాము.

          కానీ మేమెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి, వాళ్ళూరికి వెళ్ళారట. పక్క వాళ్ళని అడిగితే అమ్మాయి శవాన్ని ఇంటికి కూడా తీసుకురాలేదని, ఈ వార్త తెలిసి కొంత మంది బంధువు లొచ్చారని వాళ్ళకి నిరాశే మిగిలిందని, ఆ తర్వాత పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోయారని, అన్నయ్యలిద్దరూ వైజాగ్ కెళ్ళిపోయారని చెప్పారు.

          నర్మద తమ పిల్లలతో ఆడుకునేదని, పిల్లలు నర్మదక్క బాగయిపోయి తిరిగి వచ్చి వారితో ఆడుకుంటుందని ఎదురు చూస్తున్నారని చెప్పగానే దు:ఖం కట్టలు తెంచుకు వచ్చింది.

          ఇది నా జీవితంలో బాగా ప్రభావితం చేసిన సంఘటన. తను అలా చనిపోవడంవల్ల భరించలేని బాధ, ఆవేశం ఎలాగైనా నర్మదకు జరిగిన అన్యాయం అందరికి తెలియాలని నా కోరిక. మేము చూసింది ఇదొక్క సంఘటన, కానీ రోజు ఇలాంటివి ఎన్ని జరుగు తున్నాయో మనకు తెలీదు. డెక్కన్ క్రానికల్ వాళ్ళు యూత్ పేజి ఉండేది అప్పుడు. ఆ పేజికి జరిగిందంతా రాసి పంపించాను. అది రెండోరోజే పబ్లిష్ అయ్యింది. కాలేజ్ లో మా లెక్చరర్లు చూసారు, పిలిచి మాట్లాడారు. బాధపడవద్దని చెప్పారు. క్లాస్ లో గ్రూప్స్ ఉండేవి. ముందు నుండి కాన్వెంట్ లో చదువుకున్న వారు మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారు, బాగా డబ్బున్నవారు, వీరికి చదువు పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ మేకప్, రొమాం టిక్ నవలలు చదువుతూ, రోజు రకరకాల బట్టలు వేసుకుని, మాడల్స్ లా తిరుగు తుంటారు కాలేజ్ లో, క్యాంటీన్ లో కూర్చొని తింటూ, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తూ టైమ్ పాస్ చేస్తుంటారు. మెజారిటీ గ్రూప్ మధ్య తరగతి నుండి వచ్చిన వారు. వీరిలో కొంత మంది కాలేజ్ కి వచ్చాకే ఇంగ్లీష్ మాట్లాడటం మొదలు పెట్టిన వారుంటారు. వీరు ఒకసారి స్నేహితులయితే కష్ట, సుఖాల్లో అన్ని కలిసి పంచుకుంటారు.

          మా క్లాస్ స్నేహితులు, కొంత మంది ఇతర క్లాస్ వారు వచ్చి ఆర్టికల్ గురించి మాట్లాడి వెళ్ళారు. వాళ్ళ అభిప్రాయాలు నాతో పంచుకున్నారు నర్మద గురించి.

          కానీ కాలేజ్ మొత్తం బయటకు వచ్చి నర్మద ఆడపిల్లని తల్లితండ్రులు ట్రీట్మెంట్ ఇప్పించక పోవడమంత అన్యాయం మరోటి లేదు.

          కాలేజ్ పిల్లలంతా కలిసి కనీసం నర్మద తల్లి తండ్రులు వచ్చి తాము ఎందుకలా చేసారో చెప్పమని డిమాండ్ చేస్తారనుకున్నాను.

          కానీ రెండ్రోజుల్లో అంతా సద్దుమణిగిపోయింది. నాకు చాలా ఎక్కువగా షాక్ అయ్యింది. మా ఇంట్లో అమ్మానాన్నతో తలనొప్పిగా ఉందంటేనే జ్వరంగా ఉందా? అలసిపోయావా? ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటావా? డాక్టర్ దగ్గరకి వెళ్దామా? టాబ్లెట్ వేసుకుంటావా అని కంగారు పడతారు. అలాంటిదీ చిన్నప్పటి నుండి పిల్లకి హార్ట్ లో పెద్ద సమస్య ఉంది ట్రీట్మెంట్ ఇప్పించకపోతే ఎక్కువ ఏళ్ళు బ్రతకదని చెప్పినా కూడా ఏమి చేయించకపోతే ఏంటీ అర్ధం? తండ్రి మంచి కాలేజ్ లో లెక్చరరుగా పని చేస్తున్నాడు. మంచి సంపాదనే ఉంటుంది. నర్మద అన్నయ్యల గురించి చెబుతూ తండ్రి వాళ్ళ చదువుకు డబ్బులివ్వడని పొద్దున్న పని చేసుకుంటూ, ఈవినింగ్ కాలేజ్ లో చదువుకుంటున్నారని చెప్పేది. తన జీతం తాగుడికే ఖర్చు పెట్టేవాడేమో! డబ్బు లేని వారు కూడా తమ పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించడానికి చందాలేసుకుని, అప్పో సప్పో చేసి మరీ పిల్లల ప్రాణాలు కాపాడుకుంటారు. ఎవ్వరికైనా ఆరోగ్య సంరక్షణ, చికిత్స లకు ప్రభుత్వం ఫ్రీగా ట్రీట్మెంట్స్ చేయించే పద్దతి ఉండాలి.

          నర్మదకు సరిగ్గా చికిత్స చేయించలేకపోయాము, ముందే తెలిస్తే డొనేషన్స్ కలెక్ట్ చేసి మరీ సర్జరీలు చేయించేవాళ్ళమేమో? అనే ఆలోచన ఎక్కువైంది. బాగా డిప్రెస్ అయ్యాను. ఏ పని సరిగ్గా చేయలేకపోయాను. ఆ డిప్రెషన్ లో నుండి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.