ఆత్మవిశ్వాసం

-ఆదూరి హైమావతి 

          శైలేష్ నాన్నగారు బెంగుళూర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అమ్మ, నాన్నలతో కల్సి సంక్రాంతి శలవులకు బామ్మగారి ఊరికి వచ్చాడు ఎనిమిదేళ్ళ శైలేష్. ఆ రోజు ఉదయం ఎంతకూ నిద్రలేవని శైలేష్ ను అమ్మ హంసిని నిద్ర లేపుతుంటే అటూ ఇటూ తిరిగి
పడుకుంటున్నాడు. హంసిని వాడు కప్పుకున్న దుప్పటి లాగేసి వాడి బధ్ధకం వదల గొట్టను “శైలేష్! టైం ఎనిమిదైంది లే. తాతగారు, బామ్మగారూ ఎప్పుడో లేచేసి తోటపని చేస్తున్నారు. చూడూ!” అంటూ లేపి కూర్చోబెట్టింది.

          వాడు బామ్మ, తాతగారు అనేమాట వినగానే ఒక్క ఉదుటున మంచం మీంచీ దూకి
తోటలోకి పరుగెట్టాడు. వాడికి తాతగారంటే అమిత ప్రేమ, గౌరవమూనూ. బామ్మ చెప్పే కధలూ, చేసిపెట్టే వంటకాలూ వాడికి మహాప్రీతి. అక్కడ వాడి తాతగారు వాసుదేవయ్య 70 ఏళ్ళ వయస్సులోనూ చక్కగా గడ్డపారతో త్రవ్వి మొక్కలు నాటుతుండటం, బామ్మ ఆయన త్రవ్విన మట్టిని బయటికి లాగడం చూసిన శైలేష్ కు ఆశ్చర్యమేసింది.

          “గుడ్ మార్నింగ్ తాతగారూ! బామ్మగారూ! అప్పుడే లేచేశారా! ఏం చేస్తున్నారూ! ” అంటూ దగ్గరికి వెళ్ళాడు.

          “కమాన్ బాబూ! మొక్కలు నాటుతున్నాము! బామ్మకు ఇష్టమైన పూలమొక్కలు” అంటూ విశ్రాంతి కోసం పక్కనే ఉన్న సిమెంట్ చెప్టామీద కూర్చున్నారు.

          “నే వెళ్ళి టిఫిన్ పని చూస్తాను. ఇద్దరూ కబుర్లాడుకోండి” అని బామ్మ లోనికి వెళ్ళి పోయింది.

          “తాతగారూ! అంతచిన్న మొక్కలు నాటను ఇంత పెద్ద గుంట త్రవ్వాలా!” అని
అడిగాడు శైలేష్.

          తాతగారు నవ్వుతూ “అవునురా బాబూ! మొక్కకు వేళ్ళే ముఖ్యం, ఆధారం కదా! వేళ్ళు లోతుగా వెళ్ళాలంటే నేలను బాగా గుల్లచేయాలి. అప్పుడూ వేళ్ళు సులువుగా లోపలికి వ్యాపించి చెట్టుకు మంచి ఆధారమవుతాయి” అని చెప్పగానే శైలేష్ “తాతగారూ! మనం నీరుపోస్తాం కదా! వేళ్ళూ లోపలికి వెళ్ళవా! మళ్ళా త్రవ్వడం ఎందుకూ! ఈ పెద్ద చెట్లకూ మీరు త్రవ్వి పాదులు చేస్తు న్నారెందుకండీ” అని అడిగాడు.

          పక్కనే వున్న మామిడి, కరివేప, జామ వంటి పెద్ద ఫలవృక్షాలకూ తాతా, బామ్మా కలిసి పాదులు చేసినట్లు, చూడగానే తెలుస్తున్నది.

          ” బాబూ! పెద్దవైనా చిన్నవైనా భూమి గుల్లగా ఉంటే వేళ్ళు సులువుగా లోపలికి
వ్యాపిస్తాయి.”

          “తాతగారూ ! ఇది పెద్దమామిడి చెట్టుకదా! దీని వేళ్ళు ఎంతదూరం వెళ్ళి ఉంటాయి. అవి ఎంత పెద్దగా ఉంటాయి. అసలా వేళ్ళు ఇంత పెద్ద చెట్టును ఎలా నిలుపుతున్నాయీ?” అంటూ తన సందేహం వెలిబుచ్చాడు.

“ఒరే శైలూ! ఇలాచూడూ! ఇవి ఈ మొక్క వ్రేళ్ళు,” అంటూ లేచి తాను నాటుతున్న మొక్క ను చూపుతూ చెప్పసాగారు.” ఈమొక్కను ఇలా గుల్లచేసిన ఈ గుంతలో పెట్టి, లోతుగా వేళ్ళు ఉంచి మన్నుతో కప్పి వేళ్ళను పూర్తిగా కప్పేయాలి. ఆ తర్వాత ఇలా నీరు నా దోసిట్లో పొయ్యి” అంటూ దోసిలిపట్టగా శైలేష్ నీరు మగ్గుతో తాతగారి దోసిట్లో పోయ సాగాడు. అప్పుడు వేళ్ళన్నీ లోపలికి వెళ్ళి, మొక్క చక్కగా నిలబడింది.

          “చూసావా! వేళ్ళు లోపలికి పోగానే మొక్క చక్కగా నిలబడింది. అంటే వేళ్ళు మొక్క కు ఆధారం అని అర్ధమైంది కదా! మనకు మనకాళ్ళే ఆధారం కదా! కాళ్ళుబలంగా ఆరోగ్యంగా ఉంటే మనం ఎంతదూరమైనా నడువగలం, నిలబడగలం. అంతే కాదు శైలేష్! మన కాలిబలం, దీన్నే పిక్కబలం అనికూడా అంటారు. మనం ఎంత దూరం నడవగలము అనే విశ్వాసం మన పిక్కబలం మీద ఆధారపడి ఉంటుంది. మన  విశ్వాసా న్ని బట్టే మనం నడవగలుగుతాం.

          ప్రతిదానికీ ముందు మనకు మనపైన విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నేను ఈ
వయస్సులో ‘ఈ తోటపని చేయలేను’ అనుకుంటే ఏమీ చేయలేను. ‘నేనెందుకు
చేయలేనూ? చేయగలను’ అనే విశ్వాసం ఉంటే తప్పక చేయగలం. మన గోలూ, మన ఎయిమూ ముందుగా మనం నిర్ణయించుకోవాలి.’

          ‘తాతగారూ మనం దేవుని నుంచీ వచ్చాం అని మీరు నిన్నచెప్పారు కదా! తిరిగి
మనం అక్కడికి వెళ్ళగలమా! అసలు మనం పుట్టటం, మరణించడం అనేదే లేదన్నారే!’

          ‘ఔనురా! జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చింది. తిరిగి పరమాత్మలోనే కలుస్తుంది. ఈ శరీరం ఒక చొక్కా, ఇది చిరిగిపోతే కొత్తచొక్కా తొడుక్కుంటాం కదా! అంతే. ఐతే మనం మరలా పుట్టకుండా భగవంతునిలో కలసిపోవాలీ అంటే మన జీవితంలో మనం మంచి పనులే చేయాలి, మంచి మనసుతో జీవించాలి, సేవలు చేయాలి, నిస్వార్ధంగా జీవించాలి. తోటిమానవులకు చేతనైన సాయం చేయాలి. ఈ చెట్లను చూడూ ఎలా మనకు
బోలెడన్నికాయలు ఇస్తున్నాయో! వేళ్ళు – ఆత్మ విశ్వాసము Root is the base of the Plant, Stem మాను-ఆత్మతృప్తి -self satisfaction, కొమ్మలు ఆకులు-ఆత్మ త్యాగం self satis faction, ఫలాలు-ఆత్మ తృప్తి -self realization, అది చివరకు ఆత్మ సాక్షాత్కారానికి తీసుకెళుతుంది. చెట్టు లక్ష్యం పండ్లు కాయడం. మానవుని లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము.
ఈ చెట్లే మనకు గురువులు.

          మొక్క నుండీ చెట్టుగా పెరిగి , కాయలనూ, పండ్లనూ మనకు ఇవ్వడమేకాక 
ఎండిపోయాక కూడ అమనం ఆమనునూ రకరకాల వాటికి వాడుకుంటాం కదా! అదన్న మాట.

          ముందుగా మన శక్తి మీద మనకు విశ్వాసం ఉండాలి.’ అని తాతగారు చెప్తూ
ఉండగా…

          “కదలిరండి వేడి వేడి పెసరట్టు, ఉప్మా చేసాను. చల్లారిపోతాయ్!” అంటూ వంట గది గుమ్మంలోంచీ బామ్మ కేకేయగానే,

          “పద నాన్నా! మీబామ్మ సైరన్ మోగించింది.” అంటూ చేతులు కడుక్కుని మనవడి తో కల్సి ఠీవిగా బయల్దేరారు తాతగారు లోపలకు.

విశ్వాసమే శ్వాసకావాలి.

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.