కంగారూ మదర్ కేర్

-కందేపి రాణి ప్రసాద్

         ఆస్ట్రేలియా దేశంలోని అడవుల్లో కంగారూలు ఎక్కువగా నివసిస్తాయి. కంగారూలను ఆస్ట్రేలియా దేశానికి చిహ్నంగా కూడా సూచిస్తారు. కంగారూలు చాలా తమాషాగా ఉంటా యి. ముందు కాళ్ళు పొట్టిగా, వెనక కాళ్ళు పొడుగ్గా బలంగా ఉంటాయి. అందువలన ఎక్కువగా రెండు కాళ్ళతోనే నడుస్తూ ఉండటం వల్ల గెంతుతూ నడుస్తున్నట్లుగా ఉంటుంది కంగారూను ఇంకో విషయంలో కూడా విచిత్రంగా చెప్పుకుంటాం. కంగారూలు వాటి పిల్లల్ని పొట్ట సంచిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ఇది ఏ జంతువులోనూ కనిపించని విచిత్ర లక్షణం. అందుకే ఇవి వైవిధ్యంగా ఉంటాయి.

         అడవిలో ఒక చెట్టు కింద కంగారూలన్నీ చేరి మాట్లాడుకుంటున్నాయి. “మన అనిత కంగారూ వాళ్ళ కోడలు కన్నదా?” అడిగింది లక్ష్మి కంగారూ తన పక్కన కూర్చున్న రాధ కంగారూను. “ఇంకా లేదనుకుంటా! ఇవాళ్ళో రేపో కావచ్చు” అంటూ రాధ కంగారూ సమాధానం చెప్పింది. “అదే అనిత కనిపించకపోతేనూ కాన్పు అయిందేమో ఆను కున్నాను” అన్నది లక్ష్మి కంగారూ!

         అంతలోనే అనిత కంగారూ తన ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చింది. “లక్ష్మీ, రాధా! కాన్పు కష్టమయ్యేలా ఉన్నది. వైద్యురాలిని పిలుచుకోస్తారా నొప్పులు వస్తున్నాయి గానీ ప్రసవం కావటం లేదు” వెచ్చగా అన్నది అనిత కంగారుగా.

         వెంటనే ఎలుగుబంటి వైద్యులు గారిని తీసుకువచ్చారు. ఎలుగుబంటి కంగారూను పరీక్షించింది. మామూలు ప్రసవం అయ్యేలా లేదు ఆపరేషన్ చెయ్యాలి” అంటూ ఎలుగు బంటి ఆపరేషన్ కు సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటున్నది.

         కొద్ది సేపటి తరువాత ఎలుగుబంటి ఆపరేషన్ చేసి కంగారూ బిడ్డను బయటకు తీసింది. కంగారూ బిడ్డ చాలా చిన్నగా ఉన్నవి. “ఇంకా కొన్ని రోజులు కడుపులో ఉండవల సింది. బిడ్డ ఇంకా పెరగాలి కానీ అత్యవసరం అని ఆపరేషన్ చేసి బయటకు తీశాము. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఎలుగుబంటి చెబుతూ ఉన్నది.

         అనిత భయపడుతూ ఎలుగుబంటిని ఇలా అడిగింది – తల్లీబిడ్డలకు ఏమీ ప్రమాదం లేదు కదా! మనుషులకు వచ్చే సమస్యలు మనక్కూడా వస్తున్నాయేమిటి.
“అవును. బిడ్డ బరువు తక్కువగా ఉన్నది కాబట్టి బిడ్డను మీ పొట్ట సంచిలో పెట్టుకునే ఉండాలి. దాని వలన తల్లి శరీరం బిడ్డ శరీరానికి ఆనుకుని ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉంటుంది. నేనింకా చాలా జాగ్రత్తలు చెపుతాను వాటిని చక్కగా పాటించాలి” చెప్పింది ఎలుగులుంటి తల్లి కంగారుకు. ఇవ్వాల్సిన మందులు ఇస్తూ అనిత కంగారుకు జాగ్రత్త లు చెప్పింది.

         “వైద్యులు గారూ! మేము మామూలుగా కూడా బిడ్డలు పుట్టాక మా పొట్ట సంచిలోనే పెట్టుకుని తిరుగుతాము కదా! ఇప్పుడెందుకిలా చెపుతున్నారు.” అని అనిత కంగారూ అడిగింది అనుమానంగా.

         “అవును అనిత కంగారూ! మీకున్న ఈ ప్రత్యేకమైన లక్షణమే జంతుజాతిలో మిమ్మల్ని అరుదైన జంతువులుగా గుర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు కేవలం పొట్ట సంచి లో పెట్టుకోవడమే కాదు. బిడ్డను గుండెలకు ఆనించి పడుకోబెట్టుకోవాలి. తల్లి శరీరానికి బిడ్డ శరీరము అతుక్కునే ఉండాలి. తల్లి హృదయస్పందన బిడ్డకు వినిపిస్తూఉంటుంది. అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నట్లుగానే భావిస్తుంది” ఎలుగు బంటి నిదానంగా అన్ని విషయాలూ వివరిస్తూ చెపుతున్నది.

         “వైద్యులు గారూ, మరి బిడ్డ పాలను మామాలుగానే తాగుతుందా . బిడ్డకు ఏమీ జబ్బులు రావు కదా!” భయంగా అడిగింది అనిత కంగారూ.

         బిడ్డకు ఏమీ ప్రమాదం లేదు. కానీ తల్లి ఒంటికి ఆనుకుని ఉంటేనే జబ్బులు రాకుండా ఉంటాయి. బిడ్డను గుండెకు ఆనించి పడుకో బెట్టుకుంటే పాలను శ్రమ లేకుండా తాగుతుంది. బిడ్డ తాగుతుంటే పాలు కూడా ఎక్కువగా స్రవిస్తాయి. ఈ మధ్య మనుషుల్లో కూడా బరువు తక్కువగా పుట్టిన వారిని ఇలాగే తల్లి గుండెలకు ఆనించి పడుకోబెట్టే విధానాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళు ఈ విధానానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? “కంగారూ మదర్ కేర్” అంటారు. మీ పేరే పెట్టుకున్నారు ఎలుగుబంటి గొప్పగా చెప్పింది.

         లక్ష్మి కంగారూ, రాధ కంగారూ, అనిత కంగారూ ఆశ్చర్యంగా వింటున్నాయి. మనుషులు బిడ్డల వైద్యానికి తమ పేరు పెట్టుకోవటాన్ని గొప్పగా భావించాయి. ఆ విషయాన్ని అన్ని కంగారూలకు చేరవేశాయి. అన్ని కంగారూలు సంతోషంతో నృత్యం చేశాయి.

         అనిత కంగారూ వాళ్ళ కోడలిని మనవరాలిని జాగ్రత్తగా చూసుకున్నది. బిడ్డ బరువు పెరిగింది. పొట్ట సంచిలో షికారుకు వెళుతున్నది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.