మిట్ట మధ్యాహ్నపు మరణం- 28

– గౌరీ కృపానందన్

          మాధవరావు ఆ క్షణంకోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులుగా ఈ కేసు గురించే నిద్రలో, మెలకువలో, రాత్రనక, పగలనకా ఆఖరికి కలలో కూడా దాని గురించే ఆలోచిస్తూ, ఇదిగో… ఇప్పుడు ఒక ముగింపుకు రాబోతుంది. రాకేష్ పట్టుబడ్డాడు. అతను ఎలా ఉంటాడు? ఏం చెబుతాడు? అందరూ మొదట అలాగే ఒట్టేసి చెబుతారు. ఒక్కొక్క సాక్ష్యంగా ముందుంచి అతన్ని బ్రేక్ చెయ్యాలి.

          మాధవరావు చేతిలో పార్క్ ఫోటో నుంచి ఎన్లార్జ్ చేయబడ్డ రాకేష్ ఫోటో, రివాల్వర్ ఉన్నాయి. ఒక వేళ అతను ఉన్నట్టుండి దాడి చేసినా చెయ్యవచ్చు. ఎక్కువ హడావుడి చెయ్యకుండా అతన్ని బెంగళూరు తీసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తరువాత తగిన విధంగా విచారణ చేసి నిజాన్ని కక్కించాలి.

          మైలాపూర్ పోలీస్ స్టేషన్ ప్రశాంతంగా ఉంది. గుమ్మం దగ్గర ఇద్దరు కూర్చుని ఉన్నారు. మాధవరావు లోపలికి వెళ్ళి రాజ పాండియన్ ని కలుసుకున్నారు.

          “రండి. మీరేనా మాధవరావు. ఫోన్ లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. నేరుగా చూడటం ఇదే మొదటిసారి. గ్లాడ్ టూ మీట్ యు.”

          “ఎక్కడ ఉన్నాడు?”

          “అదిగో కూర్చున్నాడు. చూడండి.”

          “రెసిస్ట్ చేయలేదా?”

          “నేను చెప్పానుగా. రాము లాంటి మంచి బాలుడిలాప్లెజంట్ యంగ్ మాన్.”

          లోపల గురిపెట్టిన తుపాకీల మధ్య రాకేష్ కూర్చుని ఉన్నాడు. మాధవరావు రావడం చూసి,“మిస్టర్ మాధవరావ్?” అని అన్నాడు.

          “యెస్” అన్నారు.

          “ఐయాం రాకేష్.”

          మాధవరావుకి అతన్ని చూడగానే ఇతనే ఫోటోలో ఉన్న వ్యక్తి అని తెలిసి పోయింది.

          “కంగ్రాజులేషన్స్! కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్లు నన్ను పట్టుకున్నారు. చెన్నై పోలీసు బలగం అంతా నా వెనకాల పడినట్లు ఉంది. కానీ, కారణం మాత్రం తెలియడం లేదు.”

          “తెలుసుకుంటారు రాకేష్! బెంగపడకండి.”

          “నేను బెంగ పడడంలేదు. నన్ను అరెస్ట్ చేయబోతున్నారా?”

          “అవును.”

          “బెయిలబిలా, నాన్ బెయిలబిలా?

          మాధవరావు అతన్ని సూటిగా చూశారు. అతని పెదవుల మీద కనబడిన చిరువవ్వు చాల తెలివి గలవాడిలా అనిపించింది. చిరాకు కలిగింది. ఆయనకి నచ్చలేదు.

          “మిస్టర్ రాకేష్! మిస్టర్ మూర్తిని హత్య చేసినందుకుగాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తు న్నాము.”

          “అలాగా. అయితే నేను ఇప్పుడు బెంగళూరుకి రావాలా?”

          “అవును. అక్కడ రేపు మేజిస్త్రేట్ కోర్టుకు వెళ్ళి ఒక రిమాండ్…”

          “చేతికి సంకెళ్ళు వేస్తారా?”

          “అవసరం లేదు. మీరు బాగానే సహకరిస్తున్నారుగా.”

          “నేను ఒక జెంటిల్ మాన్ మిస్టర్ మాధవరావ్! మీరు పంపిన టెలిగ్రాం చూశాను. నాకు నవ్వు వచ్చింది. ఇంత హాస్యాస్పదమైన తీర్మానాలను నేను ఇంత వరకూ ఎక్కడా కనీ-వినీ ఎరగను.”

          “ఆఖరున నవ్వుల పాలయ్యేది ఎవరు అని తరువాత తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వెంట వెళ్ళు.” రాజ పాండియన్ అన్నారు.

          “రాత్రికే బయలు దేరుతున్నారా? వెహికల్ కి ఏర్పాటు చేయమని చెప్పనా?” మాధవరావును అడిగారు.

          “అవును పాండియన్. రాత్రికే బయలు దేరుతాను. ఈ కేసును డిలే చేయడం నాకు ఇష్టం లేదు.”

          “కేసుడైరీ అన్నీ కంప్లీట్ అయ్యిందా? ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది?

          “కేమికో లీగల్, లాబ్ అన్నీ ముగించేసాము. ఇతనే.”

          “కానీ అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.”

          “మొదట్లో అలాగే ఉంటాడు. మనకి తెలిసినవన్నీ అతనికి తెలియవుగా?”

          “కంగ్రాజులేషన్స్! చాలా క్లిష్టమైన కేసు అని విన్నాను. ఉమగారింటికి కానిస్టేబుల్ ని పంపించాను. ఇన్వెస్టిగేషన్కి ఆమె రావాలా?”

          “వెంటనే రానక్కర లేదు. ఇంకా కొన్ని రోజుల తరువాత.”

          “చాలా తెలివిగా మాకు క్లూ పంపించింది ఆమె. ఆమెను చూసి కాస్త ధైర్యం చెప్పి వెళితే బాగా ఉంటుంది. షి మస్ట్ హావ్ బీన్ షేకెన్ అప్.”

          “సరే. ఇతడిని ఇక్కడే ఉండనివ్వండి. ఆమెను చూసి వస్తాను. ఆ లోపల బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే సరిగ్గా ఉంటుంది.”

          “వెళ్ళి రండి. నేను ఎక్కడికి పారిపోను” అన్నాడు రాకేష్. మాధవరావు అతని వైపు కోపంగా ఒక చూపు చూసి బయలు దేరారు. గది గుమ్మం దాటుతుండగా, రాకేష్,“కెన్ ఐ స్మోక్?” అని అడగడం వినిపించింది.

          ఆయనకి కాస్త తికమకగా అనిపించింది. ప్లాన్ చేసి నటిస్తున్నాడా? రేపే డి.సి.ని చూసి, వివరాలు తెలిపి, మేజిస్త్రేట్ ముందు నిలబెట్టాలి. అన్ని సాక్ష్యాలు తయారుగా ఉన్నాయి.

          జీప్ వచ్చి ఆగిన చప్పుడు వినగానే మూర్తి తల్లి లేచింది.“అయ్యో! మళ్ళీ పోలీసులు వచ్చారు. ఏమిటో ఈ విడ్డూరం! రాత్రివేళల్లో ప్రశాంతంగా పడుకున్నామని లేకుండా. ఇదిగో ఉమా! ఆనంద్!” అనిపిలిచింది.

          ఉమ ఉలిక్కి పడి లేచింది. కిటికీ నుంచి చూసింది. మాధవరావు టోపీని సరి చేసు కుంటూ నిలబడి ఉండడం చూసింది. వెంటనే వెళ్ళి తలుపు తీసింది.

          “హలో! ఏమీ లేదు. భయపడకండి. మిమ్మల్ని థాంక్ చేయడానికే వచ్చాను. చాలా ధైర్యంగా నడుచుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకు వెళ్తున్నాను. ఇట్స్ ఆల్ ఓవర్ ఉమా.”

          “అతనేనా సార్?”

          “అతనే. నా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి.”

          “ఉదాహరణకు….”

          “మూర్తి హత్య చేయబడిన కత్తి అతని ఫ్లాటులో దొరికింది.”

          “మై గాడ్! నేను అతనితో స్నేహంగా మాట్లాడుతూ ఉండేదాన్ని.”

          “ఏమన్నాడు?”

          “అతని వ్యక్తిగత విషయాలు, తల్లి తండ్రుల గురించి.” గొంతును తగ్గించి అన్నది. “అతనికి నా మీద ఒక విధమైన అబ్సెషన్ ప్రేమ ఉందట. నన్ను వెంటాడుతూ వచ్చాడు. నన్ను పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటున్నాడట.”

          “ఉమా! మీతో అతను మాట్లాడిన విషయాలు తెలిస్తే అతను చేసిన పనులకి మోటివ్ ఏమిటో తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ వారం చివరన మీరు బెంగళూరుకి రాగలరా?”

          “వస్తాను సార్. కనీసం ఈ పీడకల ముగిసి, కొత్త వేకువలో లేస్తే చాలు.”

          “మీకు విముక్తి దొరికింది. నేను వస్తాను”

          అంటూ బయలు దేరిన మాధవరావుతో…

          “అతనికి ఏ శిక్ష పడుతుంది?“ అని అడిగింది.

          “ఉరిశిక్ష తప్పదు. వస్తాను. ఉండండి.”

          ఉమ తలుపులు వేసుకుని లోపలికి వస్తూ ఉండగా గది గుమ్మం దగ్గిర అత్తగారు నిలబడి ఉండటం చూసి ఉలిక్కి పడింది.

          “ఏమయ్యింది?”

          “హంతకుడిని పట్టు కున్నారట.”

          “నువ్వు అతనితో మాట్లాడేదానివా?”

          “అతనే హంతకుడు అని తెలియక ముందు. ఏదో అడగాలని వస్తే మాట్లాడాను. అంతే.”

          “ముందే చెప్పాను. నువ్వు ఇలాగ తోడు లేకుండా ఎక్కడికి పడితే అక్కడికివెళ్ళడం, అడ్డమైన వాళ్ళతో మాట్లాడటం ఏమీ బాగాలేదు. మొగుడు పోయిన తరువాత ఇలా రాత్రిళ్ళలో తిరగడం మా ఇంటా వంటా లేదు. చెబుతున్నానని అనుకోకు. నీకు మనసు లో ఏదో ఉంది.”

          “నేను ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను. మీకు కావాల్సింది అదేగా.”

          “నేను ఆ అర్థంలో చెప్పలేదు. ఏది ఎలాగైనా నువ్వు ఈ ఇంటి కోడలివి. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నా మనసు ఎంత క్షోభపడుతుందో తెలుసా? మూర్తికీ అది తలవంపే కదా?”

          “అత్తయ్యా! ఏమిటి మీరనేది? నేను ఇంట్లోనే జైలు ఖైదీలా ఉండాలి. మూర్తి ఫోటోకి దండ వేసి, తెల్లచీర కట్టుకోవాలి. అంతేగా.”

          “తెల్లచీర కట్టుకోమని ఎవరన్నారు? ఈ ఉల్లి పొరల చీరలు వద్దంటున్నాను అంతే. ఇదిగో దేనినైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నువ్వు నాకు కూతురి లాంటి దానివి. నా కూతురికి ఈ గతి పట్టినా ఈ మాటే అంటాను.”

          “మా అమ్మ నన్ను శాసించినప్పుడు, నా యిష్టం వచ్చినట్లే ఉంటానని చెప్పేసాను.”

          “ఈ ఇంట్లో ఉండాలంటే..”

          “నేను ఈ ఇంట్లో ఉండబోవడం లేదు. మూర్తి ఎందుకు హత్య చేయబడ్డాడో తెలుసు కోవాలనుకున్నాను. తెలిసి పోయింది. ఇక ఈ ఇంటికీ నాకూ ఏ సంబంధమూ లేదు. రేపు ఉదయం మా యింటికి వెళ్ళిపోతాను.”

          “ఇదిగో చూడు. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు.”

          “నేనే నా యిష్టానుసారం వెళుతున్నాను అత్తయ్యా.”

***

          రాకేష్ చుట్టూ నలుగురు పోలీసు అధికారులు నిలబడి ఉన్నారు. పగటి పూటే అయినా గదిలో వెలుతురు తక్కువగా ఉంది. రాకేష్ తల పైన మాత్రం ప్రకాశవంతమైన లైటు వెలుగుతూ ఉంది. డి.సి. గోడకి ఆనుకుని నిలబడ్డారు. మాధవరావు కాస్త టెన్షన్ గా ఫీల్ అయ్యారు.

          రాకేష్ చిరువవ్వు చెదరకుండా, అందరినీ కలయచూస్తూ, తొణుకు బెణుకు లేకుండా జవాబులు ఇస్తున్నాడు.

          “మిస్టర్ రాకేష్! మళ్ళీ ప్రారంభించండి. ఆ రోజు ఉదయం ఏం చేశారు? ఆ హోటల్లో…”

          “ఎన్నిసార్లైనా చెబుతాను. ప్రోద్దున్న హోటల్ లో రూమ్ బుక్ చేశాను. రూమ్ నంబరు చెప్పనా?”

          “తెలుసు. రిజిస్టర్ లో చూశాము.”

          “మూర్తి ఉన్న బ్లాక్ కి ఎదురుగా ఉన్న బ్లాక్.”

          “మూర్తి ఉన్న గదికి మీరు ఆ రోజు ఉదయం వెళ్ళనే లేదా?’

          “వెళ్ళాను.”

          “ఎన్ని గంటలకి?”

          “సరిగ్గా చెప్పలేను. గడియారాన్ని చూడలేదు. సుమారుగా పదకొండు గంటలు అయి ఉండవచ్చు.”

          “ఎందుకు వెళ్ళారు?”

          “మూర్తిని చూసి మాట్లాడడానికి.”

          “ఏం మాట్లాడారు?”

          “ఉమ రత్నంలాంటి అమ్మాయని, ఆమెను భార్యగా పొందటం అతని అదృష్టమని, ఆమెను బాగా చూసుకోమని చెప్పాను.”

          “మూర్తిగారిని ముందే మీకు తెలుసా?”

          “తెలియదు.”

          “పరిచయం లేని వాళ్ళ దగ్గ నేరుగా వెళ్ళి వాళ్ళ భార్య గురించి పొగుడుతూ మాట్లాడ గలమా రాకేష్?”

          “పరిచయం చేసుకున్నాను.”

          “ఏమని?’

          “ఉమ యొక్క శ్రేయోభిలాషినని, ఉమ నాకు బంధువులాంటిది అని. దాన్నిమీకు పూర్తిగా వివరించలేని. చెప్పినా మీకు అర్థం కాదు.”

          “నిజంగానే అర్థం కావడం లేదు. మీరు వెళ్ళినప్పుడు మూర్తి బ్రతికే ఉన్నాడా?”

          “ఖచ్చితంగా… నాతో మాట్లాడాడు. యెస్. నిద్రపోతున్న అతన్ని నేనే లేపాను.”

          “లేపి మాట్లాడారు. తరువాత ఏం చేశారు?”

          “ఆ తరువాత రూమ్ కి వచ్చేశాను.”

          “ఎంత సేపు మాట్లాడారు?”

          “సుమారు పది నిమిషాలపాటు.”

          “మీరు గది నించి బైటకు వచ్చేటప్పుడు మూర్తి బ్రతికే ఉన్నాడు కదా.”

          “అవును. నిశ్చయంగా.”

          “మరి అద్దం మీద మాయ అని వ్రాసారెందుకు?”

          “ఏ అద్దం మీద? మాయ ఏమిటి?”

          “మూర్తి రూమ్ లో ఉన్న అద్దం మీద.”

          “నేనేమీ వ్రాయలేదు.”

          “అలాగా. మరి మూర్తిని ఎందుకు హత్య చేశారు?”

          “హత్య చేసి, అద్దం మీద మాయా అని వ్రాసి…”

          “హత్య నేను చేయలేదు. మళ్ళీ మళ్ళీ అలాగే అంటున్నారెందుకు?”

          డి.సి. మాధవరావును సైగ చేసి ఆపారు.

          “మిస్టర్ రాకేష్! ఈ ఆటను ఇంతటితో ముగించేద్దామని అనుకుంటున్నాను. మీరే ఆ హత్య చేసినట్లు మా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి.”

          “ఉంటే ఉంచుకోండి. నేను హత్య చెయ్యలేదు. అతన్ని ఎందుకు హత్య చేస్తాను? ఛ ఛ..”

          సిగరెట్ వెలిగించుకున్నాడు.

          “రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తారు?”

          “ఒకటీ రెండు.”

          “ఈ అరగంటలో నాలుగు సిగరెట్లు కాల్చారు మీరు.”

          “మీరు ప్రశ్నలు అడిగిన విధానానికి నేను నెర్వస్ గా ఫీల్ అవుతున్నాను. అందుకే.”

          “మిస్టర్ రాకేష్! అప్పర్ ప్యాలస్ ఆర్చర్డ్ లో 124 నంబరు ఇల్లు మీరు ఉంటున్నారు కదా.”

          “అవును.”

          “ఇల్లు ఉండగా హోటల్ లో ఎందుకు వచ్చి స్టే చేశారు?”

          “ఉమకి దగ్గరగా ఉండి, ఆమెను చూడాలని.”

          “మీ ఫ్లాటులో, మీ గదిలో ఉన్న మేజ డ్రాయరులో ఒక వస్తువును మేము చూసాము రాకేష్.”

          “అలాగా.”

          డి.సి. జాగ్రత్తగా పేపర్ పొట్లం తీసి విప్పుతుండగా రాకేష్ ఆసక్తిగా చూశాడు. టేబిల్ మీద ఆ కత్తిని, రక్తపు మరకలతో నిండిన షర్ట్  పెట్టారు.

          “దీనికి మీ జవాబు ఏమిటి?’

          “ఇవి?”

          “మూర్తిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి, అతని రక్తపు మరకలు అంటిన షర్ట్! మిస్టర్ రాకేష్! మీ ఇంట్లో, మీ గదిలో, మీ టేబిల్ సొరుగులో ఇవి ఎలా వచ్చాయో చెప్పగలరా?”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.