
అనుబంధాలు-ఆవేశాలు – 10
– ప్రమీల సూర్యదేవర
ఆ రోజు రానే వచ్చింది. రాధాదేవి దగ్గర నుండి అనుమతి వచ్చింది. ముందుగా భ్రమరతో మాట్లాడాలని నిర్ణయించుకుని అమ్మ పాటించమని చెప్పిన జాగ్రత్తల జాబితా అందుకుని, గోవిందుని తీసుకుని ప్రయాణమయ్యాను.
మేము మాట్లాడుకోవటనికి రాధాదేవి ఒక గది ఏర్పాటు చేసింది. భ్రమరను తీసుకు వచ్చిన తరువాత ఆమెతో వచ్చిన రక్షకభటులను ద్వారం బయటనే ఉండాలనీ, ఆమె కాళ్ళకు, చేతులకు వేసిన ఇనప గొలుసులు తీసి వేయాలనే నా రెండు అభ్యర్దనలను మన్నించినందుకు అధికారిణికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను.
భ్రమర వచ్చే సమయం దగ్గర పడుతున్న కొలదీ నా గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించి ముచ్చెమటలు పోసాయి. చేతిలొ ఉన్న రుమాలతో నుదుటి మీది చెమట ఎన్నిసార్లు తుడుచుకున్నా స్వేతబిందువులు పుడుతూనే ఉన్నాయి. ద్వారం బయట ఖంగుఖంగుమనే ఇనప గొలుసుల శబ్దం విని చటుక్కున లేచి నిల్చున్నాను. ముందుగా, నేనూ, రాధాదేవీ చేసుకున్న ఒప్పందం ప్రకారం రక్షకభటులు ఇనప గొలుసులు తీసి వేసి ద్వారం బయటే నిలబడి పోయారు.
తలుపు దగ్గరే నిలబడి పోయిన భ్రమరను నిశితంగ చూశాను. చామనఛాయ, ఎండి పోయిన చర్మం, చిక్కి శల్యమైన ముఖానికి పెద్దవనిపించే కళ్ళు , చిన్నినోరు, కవులు వర్ణించే కోటేరేసిన ముక్కు కాదు కాని ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడు ముఖానికి సరిపడా ఉండేదేమో. ఇప్పుడు చూస్తే మాత్రం కొచెం పెద్దదేమో అనిపిస్తుంది. ఆ రోజు కిటికీలో నుండి చూసిన ఇరువురిలో ఈ అమ్మాయి ఎవరై ఉంటుందో గ్రహించ లేక పోయాను. ఆమె ఫైల్లో ఉన్న ఫొటోకీ, నా ఎదురుగా నిల్చున్న యువతికీ పోలికే లేదు. ఆ రోజు ఆ కళ్ళల్లో కనుపించిన భయం, సిగ్గు, బాధల స్థానంలొ ఈ రోజు నిరాశ, నిస్తేజం, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఇరువురం ఒకరి కెదురుగ మరొకరం ఎంత కాలం నిల్చున్నామో గ్రహించ లేదు. ఐదు నిముషాలా? పది నిముషాలా? పదిహేను నిమషాలా?
ముందుగా నేను తేరుకుని, “మిస్ భ్రమర, ఇలా వచ్చి కూర్చోండి.” నామాట నాకే వినిపించనంత నెమ్మదిగ అన్నాను. దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుంటే కొడుతుందేమోనని (ఒకప్రక్క ఆమె అలా చేయదని నామనస్సు చెప్తున్నా) ఏ మూలో దాగి ఉన్న భయం నన్నలా చేయనీయ లేదు. కళ్ళెత్తి ఆమె నా వైపు చూసిన చూపు వాడిగా నా గుండల్లో గుచ్చు కున్నది. ఈసారి నేనెంత జాగరూకత వహించి, సాదాచీర, జాకెట్ ధరించి, చేతిగడియారం తప్ప వేరే ఆభరణాలు ఏమీ లేకుండా వచ్చినా ఇరువురం ధరించిన దుస్తుల్లోనూ, ఇరువురి బాహ్యరూపాల్లోనూ ఉన్న వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనుపించి సిగ్గుతో తల ఒంచుకున్నాను.
భ్రమర వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆమె ముఖంలొ ఏభావం కనిపించ లేదు.
నా క్లినిక్కి వచ్చే ఎంతో మంది మానసిక బలహీనత ఉన్న వారితో సులువుగ సంభాషణ ప్రారంభించ గలను. కాని ఈమెతో సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక బల్లమీద ఉన్న కాగితాలు కెలుకుతూ కూర్చున్నాను. ‘నీ వృత్తి నీవు నిర్వహించాలని నువ్వు వచ్చిన పని మరచిపోకు’ అని నా అంతరాత్మ నన్ను హెచ్చరించటంతో పుంజుకుని, భ్రమరగారు అని ఆమెను సంబోధించ బోయిన కంఠం పెగిలి మాట బయటకు రాలేదు. కష్టపడి కంఠం పెగిలించి, “నేను మిమ్మల్ని కలుసుకోవటానికి కారణం మీకెవరైన వివరించారా?” అడిగాను.
“లే” దన్నట్లు తల ఊపింది.
అవును మరి! ఇక్కడెవరికైన అంత తీరికా, ఓపికా ఎక్కడుంటుంది? ప్రతి రోజూ జరగ వలసిన దినచర్యలకే సిబ్బందికి కాలం సరిపోదు. అదేకాక అకస్మాత్తుగా కొందరు ఖైదీలు చెలరేపే ఆందోళనతొ వారికి వేరే విషయాలపై ధ్యాస ఉండదు. కారాగారాల్లో ఖైదీల జీవితం—-కారాగారంలొ ఉద్యోగం—-ఈ రెండింటిలో ఏది సులభమని తూచి చెప్పాలంటే ఒక రకంగా ఖైదీల జీవితమే సులభమని చెప్పుకోవచ్చు. తిండి, బట్ట , పడక, నిత్యావసరాలు తీర్చుకోవటానికి వసతులు (సౌఖ్యంగా లేకపోయినా) కలిగి బాధ్యతలు లేని జీవితం.
“నాపేరు నియతి, నేను మనశ్శాస్త్ర వైద్యురాలిని. పట్నంలో నా స్వంత క్లినిక్ ప్రారంభించి రెండు సంవత్సరాలనుండి చికిత్స చేస్తున్నాను. మా నాన్నగారు న్యాయవాది. నా చిన్నతనం నుండి నాన్నగారు వార్తాపత్రికల్లో ప్రచురించిన నేరాలు–వాటికి విధించిన శిక్షలు–తరచు నాకు వినిపించి నాతొ చర్చిస్తుండే వారు. న్యాయస్థానంలో తను వాదించిన కేసుల గురించి మాత్రం బహిరంగంగ అవి బయటకు వచ్చే వరకూ గూఢంగా ఉంచేవారు. ఆయన దగ్గర నేర్చుకున్న నీతిశాస్త్రమే నా క్లినిక్లోకూడ పాటిస్తాను. మన ఇరువురి సంభాషణ, మనం వ్యక్తపరుచుకున్న అభిప్రాయాలు, భావాలు ఈ నాలుగు గోడల మధ్యే ఉంటాయని మీకు వాగ్దానం చేసి చెప్తున్నాను. ఈ గదిని దాటి ఎట్టి పరిసితుల్లోనూ మీ అనుమతి లేకుండా బయటకు రావు.” ఈ చివరి మాట చాలా నమ్మకంగా చెప్పాను.
భ్రమర ఒంచిన తల ఎత్త లేదు. ఆ ముఖంలొ ఏమి భావాలు కదలాడుతున్నాయో తెలియదు. నా చేతి సంచిలో నుండి ప్లాస్టిక్ కాగితంలో చుట్టి ఉన్న పిప్పరమెంటు బిళ్ళలు బయటకు తీసి ఒకటి నేను తీసుకుని చేయిచాచి భ్రమర ముందు పెట్టాను. వాటి వైపు చూడనైనా లేదు. కొంచెంసేపు చూసి పైకి వినిపించకుండ నిట్టూర్పు విడుస్తూ నాచేయి వెనక్కు తీసుకున్నాను.
రక్షకభటులు వచ్చి తలుపు తట్టి , ఖైదీని తీసుకు వెళ్ళే సమయం ఆసన్నమైనదని చెప్పే వరకు ఇద్దరం మౌనంగ కూర్చున్నాం. భ్రమర చేతిపై ఉన్న పుట్టుమచ్చనీ, అంట కత్తిరించిన జుట్టులో నుండి కనుపిస్తున్న పాపడిని, ఒకప్పుడు చెవులకు కమ్మలు వుండేవి అని చెప్పటానికి గుర్తుగా ఉన్న చిన్ని రంధ్రాలనీ, కుడివైపు ముక్కుకొక రంధ్రాన్నీ, చిక్కి శల్యమై వూచకడ్డీల్లా ఉన్న ఆమె చేతులనూ, మట్టి పేరుకుని మురికిగా ఉన్న గోళ్ళనూ మార్చి మార్చిచూస్తూ, కూర్చున్నాను.
భ్రమరలో మాత్రం కదలిక లేదు. వచ్చినప్పుడెలా కూర్చుందో తనను తీసుకు వెళ్ళటానికి వచ్చినప్పుడు కూడా అలాగే కూర్చున్నది.
“ప్రతి బుధవారం ఇక్కడకు వచ్చి మీతో గడపటానికి నాకు అనుమతి ఇచ్చారు. మళ్ళీ బుధవారం చూస్తా “,అని చెప్పాను కాగితాలు సర్దుకుంటూ.
రక్షకభటులు వచ్చి, ఆమె కాళ్ళకు, చేతులకు ఇనప గొలుసులు బిగిస్తుంటే అసలే ఒంచుకున్న ఆమె ముఖం సిగ్గుతో మరీ ఒంగి పోయింది. ద్వారం వరకు వెళ్ళి వెనక్కు తిరిగి ఒక్కసారి నా వైపు చూసి మరల వెంటనే ముఖం త్రిప్పుకుంది.
నామీద నమ్మకం కలిగి నాతో మాట్లాడటానికి ఎంత కాలం పడ్తుందో! అనుకుంటూ బయలు దేరాను.
మూడు వారాలు ఇదే వరుస. నేను వెళ్ళటం, వాళ్ళు భ్రమరను తీసుకు రావటం, ఆమె వెళ్ళి పోయే సమయం ఆసన్నమయ్యే వరకు ఇద్దరం ఒకరికెదురుగ మరొకరం కూర్చోవటం. కాని ఒకటి మాత్రం గ్రహించాను. మొదటి రోజులా మరీ బిగుసుకు పోయి కూర్చోవటం లేదు.
మూడవ బుధవారం నేను ఇంటికి రాగానే నాకోసం ఎవరో ఒక కుర్రాడు వచ్చి వెళ్ళాడని అమ్మ చెప్పింది.
“ఏమైన చెప్పాడా? ఎవరై ఉంటారా! అనుకుంటూ అడిగాను.
“ఏమీ చెప్పలేదమ్మ. పేరు నేనే అడిగాను. సురేష్ అని చెప్పాడు.”
ఆ పేరు వినగానే నా ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించింది. ఎందుకు వచ్చి ఉంటాడు? ఏదైనా సమాచారం తీసుకు వచ్చాడా? మళ్ళీ వస్తానన్నాడా? ఆత్రంగ అడిగాను.
“సాయంత్రం వస్తానన్నాడు.” అమ్మ టి.వి. సీరియల్లో నుండి తల ఎత్త కుండ అన్నది.
“అతని ఫోన్ నంబరైన అడిగావా?”
“లే” దన్నది.
అమ్మ ఎప్పుడూ ఇంతే! ఏ విషయం సరిగ్గ కనుక్కోదు. అదేమంటె, “బాగుందే, నేనేమైనా మీ నాన్నగారిలా న్యాయవాదినా? లేక నీలాగ సలహాలుచెప్పె వైద్యురాలినా?” అంటుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళ గోడు విని వాళ్ళకు సలహాలు చెప్పటమే నా పని అనుకుంటుంది. పైకి ఏమీ అనదు కాని ఆ పని తను కూడా చేయగలనని అనుకుంటుందని నా గట్టి నమ్మకం.
* * * * *
(మళ్ళీ కలుద్దాం )

1974, సెప్టంబర్ నుండి ఒహాయో రాష్ట్రంలో సిన్సనాటిలో నివసించి, 2004, జనవరి నెలలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోకి చేరుకున్నాము. నా మొట్ట మొదటి కథ ‘భయం’ 2007 డిసెంబర్ మరియు 2008 జనవరి ‘తెలుగునాడి’ మాసపత్రికలో ప్రచురించబడింది. రెండవ కథ ‘కదిలే బొమ్మలు’ 2010 ఏప్రియల్ నెలలో ‘విపుల’ మాసపత్రికలో ప్రచురించబడింది. 2003 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన మొదటి నవల ‘అనుబంధాలు-ఆవేశాలు’ చదివిన పాఠకులు ఇచ్చిన స్పందనతో రెండవ నవల ‘ అనురాగ సంగమం ‘ 2024 ఫిబ్రవరిలో ప్రచురించటం జరిగింది. హస్తినాపురం (ఆస్టిన్) సాహిత్య సభలో పాల్గొని నా స్వీయ రచనలు కొన్ని చదువుతుంటాను.

Story is nice ? it’s reminds that anything May happen in life like boats become ships, and ships may become boats ??