
నడక దారిలో-69
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా వివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ పోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది.నేను హెచ్చెమ్ గా రిటైర్ కావటం, పెద్దక్క మరణం,ప్రత్యేకతెలంగాణా, సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం ,వీర్రాజుగారికి బోయి భీమన్న,బాపూరమణల పురస్కారాలు-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ,నాకు అమృతలత అపురూప పురస్కారం,ఆషీ కాలేజీ ప్రహసనాలూ,పల్లవికి కరోనా వచ్చి తగ్గటం,వీర్రాజుగారి పెయింటింగ్స్, సేకరించిన ఆర్ట్ పుస్తకాలు రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్తులో అంకితోత్సవం , కుందుర్తి శతజయంతి,ప్రతిభా పురస్కారాలు ఎంపిక,వసుధ ఎంగేజ్మెంట్,సుశీలా నారాయణరెడ్డి అవార్డు,పాపికొండలు ప్రయాణం తర్వాత—)
***
వీర్రాజుగారు కరోనా సమయంలో ఇంట్లో వున్న కొడవటిగంటి, గోపీచంద్,మల్లాది, శ్రీపాద మొదలైన పాతతరం వారి పుస్తకాలు విపరీతంగా చదివేవారు.ఈ ఏడాది ఎందుచేతనో పుస్తకాలు చదవటం మానేసారు. మౌనంగా తనలోకంలో తాను ఉండేవారు. పుస్తకాలేవైనా చదవమని, ఏవైనా స్కెచైనా వేయమని అనేదాన్ని. ఒక్కసారిగా పెన్ను, పెన్సిల్ ముట్టకుండా తపోముద్రలో ఉండడం నాకు ఎందుకో చాలా భయం వేసింది.
ఈ సారి కూడా వీర్రాజుగారి పుట్టినరోజుకి మంచి బేకరీ నుండి కేకు తెప్పించటమే కాకుండా పల్లవీ,ఆషీ కలసి ఇంట్లో కేకు తయారుచేసారు.ప్రతీ పుట్టినరోజుకీ తప్పకుండా పొనుగోటి కృష్ణారెడ్డి,నాళేశ్వరం శంకరం వస్తారు.ఈ సారీ అలాగే వచ్చారు.
ఏదో ఒక సందర్భంలో తరుచూ ఎనభై మూడో ఏట చనిపోతానని ఒక కోయదొర చిన్నప్పుడు చెప్పాడని అంటూ వుండేవారు. లేదా సహస్ర చంద్రోదయం తనకు ఎప్పటికి అవుతుందని లెక్కలేయబోయే వారు. ఆషీని కాలెండర్ తీసుకు రమ్మని చెప్పి ఏడాదికి పౌర్ణమిలు ఎన్ని వున్నాయి లెక్క కట్టేవారు.మీకు జాతకాలు, జోస్యాలు నమ్మకం లేనప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తారు. మనసు పాడు జేసుకోడానికి తప్ప అని చేతిలోని కేలెండర్ లాక్కుని మందలించేదాన్ని. పంతులుగారిని పిలిచి సహస్రచంద్రోదయం చేసుకోటానికి ముహూర్తం పెట్టించమంటారా అని కోప్పడేదాన్ని. మాటిమాటికీ నీకన్నా నేను పదేళ్ళు పెద్దవాడిని అనీ, తానే ముందు వెళ్ళిపోతాననేట్లు మాట్లాడేవారు. మరణం వయసుని బట్టి రాదు అని వాతావరణాన్ని తేలిక పరచటమే కాకుండా రావూరి భరద్వాజ మొదలుకొని చాలామంది భార్యలమీద కావ్యాలు రాసారు, రాస్తున్నారు. నేనే ముందు పోతే మీరూ నా మీద ఓ కావ్యం రాస్తారా అని సరదాగా అడిగేదాన్ని. “నేను అస్సలు రాయను. అయినా రాస్తేనే నీపైన ప్రేమ ఉన్నట్లా” అని ఆయన తిరిగి అనేసరికి నేను చిన్నబుచ్చుకుని ‘అలా ఐతే నేనుకూడా మీమీద రాయను’ అని కోపంగా అనేదాన్ని.
పుస్తకాలు చదవమనీ, ఫేస్బుక్ లో ఆర్టిస్టుల చిత్రాలు చూపించీ ఎన్నిరకాలుగా ఆయన మనసు మరల్చాలని చూసినా కుదిరేదికాదు.ఎప్పుడైనా అన్వర్ వేసిన చిత్రాలు సెల్ ఫోన్ లో ఫేస్బుక్ లోంచి చూపించమని అడిగేవారు.నేను నెచ్చెలిలో రాస్తున్న ఆత్మకథ నడకదారిలో చదవమని ఇచ్చేదాన్ని.బాగా రాస్తున్నాననే వారు. ఈలోగా మా ఆడపడుచు మాలతి సంవత్సరీకాలు వచ్చాయి.ఆమె పోయినపుడు పల్లవీ, నేనూ ఒమిక్రాన్ వైరస్ బారిన పడి వుండటం చేత వెళ్ళలేదు.ఈ సారి వెళ్ళాము.మామరిది వాళ్ళూ యూ.ఎస్ లో వుండటం వలన వాళ్ళు లేరు.కుక్కట్ పల్లి వాళ్ళు కూడా కొందరే వచ్చారు.శిరీష తోడికోడళ్ళు వచ్చారు.అంతే బయట వారిని ఎవరినీ పిలవలేదు.
ఉద్యోగం పనిమీద కొన్ని నెలలకోసం హైదరాబాద్ కి బత్తుల ప్రకాశరావుగారి అబ్బాయి రావటంతో తల్లీ తండ్రీ కూడా వచ్చి వున్నారు.ఒకరోజు ప్రకాశరావు దంపతులు మా యింటికి వచ్చారు.ఆ రోజు మాత్రం వీర్రాజుగారు తన బాల్యమిత్రుడితో బాగానే కబుర్లు చెప్పారు.నాకు వచ్చిన సుశీలానారాయణరెడ్డి పురస్కారం గురించి గొప్పగా చెప్పి సన్మాన పత్రం చూపించారు.వాళ్ళు సాయంత్రం వరకూ వుండి వెళ్ళారు.
మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారాలు మూడేళ్ళవీ పెండింగ్ లో వున్నాయి.కమిటీ వాళ్ళం కరోనా కాలంలో ఎవరమూ కలుసుకోవటం కుదరలేదు.అంతే కాకుండా సుధామగారు చైతన్యపురిలో ఇల్లు అమ్మేసి కోకాపేటలో కొడుకు ఇంటికి దగ్గరలోనే అదే గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయారు.అందువలన మాడభూషి కమిటీ అందరం కలిసినట్లు వుంటుందని అందరం బయలు దేరాము.అందరం కలిసి సందడిగానే గడిపాము.సాయంత్రంవరకూ వుండి వెళ్తామని లేచాము.సుధామ దంపతులు కూడా మాకు వీడ్కోలు చెప్పేందుకు సెల్లార్ వరకూ వచ్చారు.ఇక కారు కదలబోతుంటే కారులోంచి వీర్రాజుగారు దిగి సుధామగారిని ప్రేమతో ఆలింగనం చేసుకుని తిరిగి కారు ఎక్కారు.
కుందుర్తి శతజయంతి పురస్కార గ్రహీతలు అందర్నీ సంప్రదించి వాళ్ళంతా పురస్కారం కొరకు హైదరాబాద్ రావటం కష్టసాధ్యంగా నిర్ణయించి,ఆ సమయానికి కుందుర్తి కవితకు కూడా ఇండియా రావటం కుదరదని మే 21 వతేదీన కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారాలు జూమ్ సమావేశంలో నిర్వహించాలని నిర్ణయించారు వీర్రాజుగారు.రాజమండ్రిలో మాకు ఇచ్చిన ముమెంటోలు బాగున్నాయని శతజయంతి పురస్కారాల మెమెంటోలకు కూడా స్వయంగా డిజైన్ వేసి వాట్సాప్ లో రవిప్రకాష్ కు పంపించి చేయించారు .అవి కూడా వచ్చేసాయి.అన్నీ నిర్ణయించుకున్నాడు కుందుర్తి కవిత తనకు యూ ఎస్ నుండి మరిది కుటుంబం వస్తుందని కార్యక్రమం పోస్ట్ పోన్ చేసి జూన్ లో పెట్టుకుందామని అంది.దాంతో వాయిదా పడింది.
వాణిశ్రీ,ఎమ్వీ రామిరెడ్డి దంపతులను తీసుకుని ఒక రోజు అకస్మాత్తుగా వచ్చింది.రామిరెడ్డి కూతురి వివాహా ఆహ్వానపత్రిక ఇవ్వటానికి వచ్చారు.రామిరెడ్డి వియ్యంకుడు ఒంటరి నవల రాసిన సన్నపరెడ్డి వెంకటరెడ్డి అట. తీరా వాళ్ళు వచ్చేసరికి పల్లవీ,ఆషీ,నేనూ గోరింటాకు చేతులకు పెట్టుకుని వున్నాము.వాళ్ళు వద్దన్నా చేతులు కడుక్కుని గబగబా వచ్చాను.ఈ లోగా వీర్రాజుగారు వాళ్ళతో మాట్లాడుతూ వున్నారు.పెళ్ళికి తప్పక రమ్మని మరీమరీ పిలిచారు. పెళ్ళికి పరిమి రాలేమని ఇక్కడ రిసెప్షన్ కి వస్తామని చెప్పాము.
ఆరోజు పల్లవీ,ఆషీ పల్లవి స్నేహితురాలి ఇంటికి వెళ్ళారు.సాయంత్రం విజిటర్స్ పార్కింగ్ లో మిల్లెట్సుతో చేసిన స్నాక్స్ ప్రదర్శన వుందనీ,వీలుంటే కొనమని చెప్పారు.సాయంత్రం లిఫ్టులో కాకుండా మెట్లు దిగి వెళ్ళాలని దిగుతుంటే చెప్పుజారి మెట్లమీద కూలబడ్డాను.మళ్ళాలేచి క్రిందికి వెళ్ళి కొనుక్కొని వచ్చాను.ఇంటికి వచ్చి వీర్రాజుగారితో మెట్లమీద జారిపడ్డానని చెప్తే,రెండు నెలలకి ఒకసారైనా పడటం నీకు ఆనవాయితే కదా అని నవ్వారు.నేను స్కూలికి వెళ్తున్న రోజుల్లో తరుచూ వచ్చేటప్పుడు లో షుగర్ అయిపోయి పడిపోయే దాన్ని.రిటైర్ అయ్యాక రెగ్యులర్ వాకింగ్ వలన ఆ సమస్య తగ్గింది.అందుకని ఆయన మాటలకి వుడుక్కున్నాను.అయితే అప్పుడు తెలియలేదు కానీ వెన్నులో చివరికొనకి బాగా దెబ్బతగిలి మర్నాటి నుంచి కూర్చోలేనంతగా నొప్పి ఎక్కువై నొప్పి తగ్గేందుకు మందువేసుకోవల్సి వచ్చింది..
వీర్రాజుగారు ఇటీవల రోజురోజుకూ బరువుతగ్గుతున్నారేమో అనిపించింది.పొట్టకూడా తగ్గింది.ఆయనకు హెర్నియా వుంది.అప్పుడప్పుడు నొప్పి వస్తోంది అంటున్నారు.డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటే ఒప్పుకోవటం లేదు.ఒక రోజు మధ్యాహ్నం నుంచి యూరిన్ కావటం లేదు అన్నారు.ఎండలు కదా మంచినీళ్ళు తక్కువ తాగారేమోనని మంచినీళ్ళు, తర్వాత బార్లీ,మజ్జిగా ఇస్తూనే వున్నాను.కానీ లాభం లేకపోయింది.
రాత్రి వరకూ చూసాము.డా.సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేసి అడిగాను.ఎండలవలన డీ హైడ్రెషన్ అయివుంటుంది.ద్రవపదార్థాలు ప్రతీ అరగంటకీ ఇవ్వమన్నారు.అప్పటికీ కాకపోతే లాబ్ టెక్నీషియన్ ను పంపుతాను అన్నారు.మాటిమాటికీ వాష్ రూమ్ కి వెళ్ళి ప్రయత్నిస్తూనే వున్నారు.
రాత్రికి ఎప్పటిలాగే భోజనం చేసారు.కానీ ఇబ్బంది పడుతూనే వున్నారు.హాస్పటల్ కి వెళ్దామంటే ఒప్పుకోవటం లేదు. రాత్రి పది దాటిన తర్వాత వీర్రాజుగారు పడుతోన్న బాధ చూడలేక డా.సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేసాను.ఆయన కేథడ్రాల్ పెట్టటానికి లాబ్ టెక్నీషియన్ ను పంపించారు.కాని సాధ్యం కాలేదని డాక్టర్ గారికి ఫోన్ చేసాడు.డాక్టర్ గారు యశోదాకి తీసుకుని వెళ్ళమని చెప్పటమే కాకుండా యశోదాలోని డాక్టర్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడారు.ఓలా కారు బుక్ చేసుకుని పల్లవీ, నేనూ వీర్రాజుగారిని తీసుకుని యశోదా హాస్పిటల్ కు వెళ్ళాము.వెళ్ళేటప్పుడు కారులో ఆయన భయం వేసిందేమో నా చేతిని పట్టుకున్నారు.వీర్రాజుగారికి హాస్పిటల్ అంటే మొదటి నుంచి భయమే.
యశోదా హాస్పిటల్ కి వెళ్ళేసరికి పన్నెండు గంటలు దాటింది.అయినా సూర్యప్రకాష్ గారు ఫోన్ చేయటం వలన కావచ్చు వెంటనే హాస్పిటల్ లో చేర్చుకుని డాక్టర్ వచ్చి చూసి ట్రీట్ మెంట్ చేయటం మొదలు పెట్టేడు.నాకు నాలుగు రోజుల క్రితం పడినప్పటి నొప్పి తగ్గలేదు .కూర్చోవటం కష్టంగా వున్నా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ తిరుగుతున్నాను.
డా. సూర్యప్రకాష్ గారు ఆరోజు వారి తండ్రి గారి తిథి అయినా కూడా హాస్పిటల్ కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఉదయానికి రూమ్ కి పంపించి వివిధ పరీక్షలు చేయాలని అన్నారు.పల్లవి ఇంటికి వంట చేసి నాకు బాక్సు తీసుకు రావటానికి వెళ్ళింది.అప్పుడు ఎకో టెస్ట్,అంజియోగ్రామ్ చేసి రూమ్ కు తీసుకువచ్చారు.యూరిన్ సమస్య తీరటంతో వీర్రాజుగారు అన్ని టెస్టులకు బాగానే సానుకూలం గానే వున్నారు. సాయంత్రం ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో కలిసి నన్ను ,పల్లవినీ పిలిపించి కౌన్సిలింగ్ అని చెప్పి మాట్లాడటం మొదలెట్టారు.హెర్నియాలో బాగా ఇన్ఫెక్షన్ ఉందనీ దానికి ఆపరేషన్ చేయాలన్నారు. దానికన్నా ముందు ఆయనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయనీ అందుకని ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్స్ వేయాలనీ సర్జరీ చేసినప్పుడు బ్లడ్ థిన్నర్ కొన్నాళ్ళు వాడాల్సి వుంటుందనీ,అందుకని అది ఆపిన తర్వాతే హెర్నియా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పటమే కాకుండా మమ్మల్ని హార్ట్ ఆపరేషన్ కి కన్విన్స్ చేయటానికి ప్రయత్నించారు.అది మాకు అర్థం కాలేదు.హెర్నియా ఇన్ఫెక్షన్ వల్లే యూరిన్ సమస్య వచ్చిందంటున్నారు.ముందు అది క్లియర్ చేయకుండా హార్ట్ ఆపరేషన్ చేయాలనీ దానికి మూడులక్షల పైనే అవుతుందనీ ఇప్పుడు వెంటనే ఒకటిన్నర లక్ష కట్టమన్నారు. హెర్నియాకైతే ఒకటిన్నర లక్ష అవుతుంది, బహుశా సాధ్యమైనంత రోజులనుండి డబ్బు పిండటమే కార్పొరేట్ హాస్పిటల్స్ లక్ష్యం.అబ్బూరి ఛాయాదేవి గారి అయిదు నక్షత్రాల కథ గుర్తువచ్చింది.
మాకు కంగారుగా అయిపోయింది.ఆలోచించి చెప్తామన్నాము.డా.సూర్యప్రకాష్ గారి సలహా మేరకు మేము అసలు సమస్య హెర్నియా కదా ఆ ఆపరేషన్ ముందు చేసి కొంచెం ఆరోగ్యం కుదుట పడ్డాక హార్ట్ ఆపరేషన్ చేయమని అన్నాము. అంతే కాకుండా అంతకుముందు యశోదాలో పని చేసిన కార్డయాలజిష్టు డా.సూర్యప్రకాష్ గారికి ఫ్రెండ్ ,ఆయన చేత యశోదా డాక్టర్లతో మాట్లాడించారు.దాంతో మర్నాడు హెర్నియా ఆపరేషన్ చేస్తామన్నారు.ముందు డబ్బు కట్టించుకున్నారు. వెంటనే కళ్యాణ్ కీ,భారవీ వాళ్ళకీ ఫోన్ చేసి చెప్పాను.కళ్యాణ్,అనురాగ్ ఆ రాత్రికే బయలుదేరి బస్ పట్టుకుని ఉదయమే హైదరాబాద్ కు వచ్చేసారు.వాళ్ళని చూసాక నాకు ధైర్యం వచ్చింది.ఆపరేషన్ సమయానికి కవితావాళ్ళూ,భారవీ,శ్రీదేవీ వాళ్ళూ అంతా వచ్చారు.ఆపరేషన్ పూర్తై బయటకు తీసుకువచ్చేవరకూ నాకు గుండె దడదడలాడుతూనేవుంది.కానీ బాగానే బయటకు వచ్చేసరికి వూపిరి పీల్చుకున్నాను.తిన్నగా ఐసీయూలోకి తీసుకువెళ్ళారు.
ఐసీయూలో వుండటం వలన మమ్మల్ని ఉండనీయలేదు.ఐనా రాత్రి ఏమైనా అవసరం వుంటుందేమోనని కళ్యాణ్,భారవీ ఒక్కోరోజు వున్నారు.ప్రతీరోజూ ఉదయం తొమ్మిదింటికల్లా హాస్పిటల్ నుండి యాభై వేలు కట్టమని ఫోను.అది కట్టడానికి వెళ్తేనే హాస్పిటల్ లోపలకి అనుమతి ఇస్తున్నారు.లేకపోతే రోడ్డు మీదే నిరీక్షణ.డబ్బు కట్టిన తర్వాత కూడా విజిటర్స్ సమయంలో వాళ్ళని బతిమాలుకుంటేనే ఒకరిని ఐసీయులోనికి అనుమతి ఇస్తున్నారు.కళ్యాణ్, అనురాగ్ వచ్చారని చెప్పేసరికి ఆయనకి ధైర్యం వచ్చింది.వీర్రాజుగారు బాగానే కోలుకుంటున్నారు.అయినా హార్ట్ ఆపరేషన్ చేయటానికంటూ ఐసీయులోనే వుంచారు.
ప్రతీరోజూ కౌన్సిలింగ్ అని మమ్మల్ని పిలిచి హార్ట్ ఆపరేషన్ కి కన్విన్స్ చేయటం మాత్రం మానలేదు.మేమూ,కళ్యాణ్ కూడా ఈ హాస్పిటల్ లో ఏమిటిలా జలగల్లా పట్టుకుని వీళ్ళే చంపేసేలా వున్నారని విసుక్కున్నాము.నాలుగురోజులు అయ్యాక కళ్యాణ్ వెళ్ళిపోయాడు.
డా.సూర్యప్రకాష్ గారు ” ఎట్టి పరిస్థితుల్లోనూ హార్ట్ ఆపరేషన్ కు ఒప్పుకోకండి.డా.ముఖేష్ కూడా ఈ వయసులో వీర్రాజుగారి గుండె మరో ఆపరేషన్ కి తట్టుకోలేదు.మొండిగా చేయాలనుకుంటే ఆపరేషన్ బెడ్ మీదే ఏమైనా జరగొచ్చు అన్నాడు.ముందు డిస్చార్జ్ చేయించుదాం”అన్నారు.
వారం రోజులకి ఐసీయు పక్కనే వున్న రూమ్ కి షిఫ్ట్ చేసారు.రూమ్ కి వచ్చాక నేను అక్కడే వున్నాను.రూముకు వచ్చాక నా ఫొటో తీయు ఎలా వున్నానో నాకు తెలుస్తుంది అన్నారు.సరేనని ఫోన్ తో ఫోటోతీసి చూపిస్తే బనియన్ తో,చిరుగడ్డంతో చలంలా వున్నాను కదా అంటూ నవ్వారు.ఇంతవరకూ డబ్బు ఎంత కట్టారు అని పదేపదే అడిగారు. కానీ చెప్పలేదు.నడిపించటం అవీచేసాక డిస్చార్జ్ చేసారు.భారవీ,అనురాగ్ సాయం వుండటం వల్ల ఇంటికి జాగ్రత్తగా తీసుకువచ్చారు.హాస్పటల్ కి ఎంతయింది అని అడిగుతున్నామాట మార్చి చెప్పాను.
ఇంటికి వచ్చాక బాల్య మిత్రుడు, ప్రకాశరావు,పొనుగోటి కృష్ణారెడ్డి,నాళేశ్వరం శంకరం మొదలైన వాళ్ళు వచ్చి కలిసారు.సత్యనారాయణ కూడా వస్తానంటే వీర్రాజుగారే ఇంత దూరం రాలేవు,ఫోన్ లో మాట్లాడుతూ వుందాములే అని అన్నారు.పొనుగోటి కృష్ణారెడ్డితో అన్వర్ గురించీ,అతను రాసిన రేఖాయాత్ర పుస్తకం గురించి,అతని బొమ్మల గుర్తించి చాలా ప్రశంసాపూర్వకంగా చాలాసేపు మాట్లాడారు.
పదిరోజుల పైగా ఐసీయూలో వుండటం వలన భోజనం సరీగా లేక బాగా నీరసించిపోయారు.వాష్ రూంకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడుతూనే వున్నారు.
ఆయనకు సహాయకుడుగా ఎవరినైనా పెట్టుకోవాలంటే ముగ్గురం ఆడవాళ్ళమే.అందులోనూ ఆషీ వయసులో వున్న పిల్ల.అనవసరంగా ఎవరో ముక్కూ మొహం తెలియని వాడిని పెట్టుకొని సమస్యల్లో చిక్కుకు పోతామేమో అనిపించింది.పోష్టు ఆపరేషన్ కేర్ కోసం కొన్ని వుంటాయని కొందరు సలహా ఇచ్చారు కానీ అవి కూడా హాస్పిటల్ లాగే వుంటాయి కదా . వీర్రాజుగారు మరింత కుంగిపోతారు.ఒక వారం పది రోజులు జాగ్రత్తగా వుండి మందులూ,భోజనం వంటికి పడితే మళ్ళీ బలం వస్తుంది.ఎటొచ్చీ ఆయన ధైర్యంగా వుండాలి.అనుకున్నాము.
*****

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
