నా జీవన యానంలో- రెండవభాగం- 19

స్వస్తి – కథానేపధ్యం

-కె.వరలక్ష్మి

బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కవుల కలాలు, గళాలు ఆవేశంతో వెల్లువెత్తాయి. కథకులూ విశేషంగా స్పందించారు. నేనూ ఓ కథ రాయాలనుకున్నాను ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎవరి కళ్ళతోనో చూసినదానికి నేనెలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ కొందరు, అనుకూలంగా కొందరు పేపర్లలో రాస్తున్నారు. రాజకీయ పార్టీలు చూద్దామా అంటే ఒక పార్టీ ‘అలా మసీదును కూలగొట్టడం తప్పు’ అంటే వెంటనే మరో పార్టీ ‘అదెప్పుడో బాబర్ కాలం నాటి పాడుపడిన కట్టడం, దానికదే కూలిపోయింది’ అంటున్నారు.

పల్లెటూళ్ళలో సామాన్య జనం ఎలా స్పందిస్తున్నారో చూడాలని ప్రయత్నిస్తే ఎవరికీ ఆ సంఘటన పట్టినట్టేలేదు. అసలా సంఘటన జరిగినట్టే తెలీదు. “బాబ్రీ మసీదా, అదెక్కడుంది?” అని అడిగారు ముస్లిమ్స్. మొదట్నుంచీ మా వైపు జిల్లాల్లో రెండు మతాలవారూ ‘భాయ్ భాయ్’ అంటూ భుజాల మీద చేతులేసుకుని తిరగడం, ఒకరి పండగల్లో ఒకరు పాలు పంచుకోవడం, విందుల్లో (ఇప్పటి రాజకీయ నాయకుల ఇఫ్తార్ విందులు కాదు) పాల్గోవడం ఎక్కువ.

అలాంటి సందర్భంలో ఒక మత సంస్థ వూరూరా వూరేగింపులు తీస్తూ మా వూరికొచ్చింది. “రాములవారికి గుడికడుతున్నాం, చందాలివ్వండి’ అంటు నినాదాలిస్తూ వీధుల్లో వూరేగింపుగా రధయాత్ర సాగించింది. నేనింకా సందిగ్ధంలోనే వుండి బైటికి రాలేదు. రధానికి ముందు నడుస్తున్న నాకు చదువు చెప్పిన మా గురువుగారు తలుపు తట్టి నన్ను బైటికి పిలిచి రథంలోని రాముడికి హారతి ఇమ్మన్నారు. ఎంతో కొంత చందా తెచ్చి డిబ్బీలో వెయ్యమన్నారు. ఇదంతా జరుగుతున్నంతసేపూ అందంగా అలంకరించబడిన సీతాదేవి విగ్రహం నా వైపు చిరునవ్వులు చిందిస్తున్నట్టే అనిపించింది. ‘అడుగడుగున గుడి వుంది – అందరిలో గుడి వుంది’ అని అన్ని మతాలూ ఘోషిస్తున్నప్పుడు, మనిషిలో వెలిగే దీపమే దైవమైనప్పుడు ఏ మతానికి చెందినవైనా ఇన్నిన్ని ఆలయాలు నిర్మించడం, వాటికోసం కొట్లాడుకోవడం అవసరమా అనిపించింది. ఆ ముందురోజుల్లోనే మా వూరి గుడి ప్రహరీగోడ వానలకి పడిపోయింది. దాన్ని గురించి పట్టించుకున్నవాళ్ళే లేకపోయారు. ఓసారి నేనా దారిన వెళ్తున్నప్పుడు గోడకివతల నూతి చప్టామీద బట్టలుతుక్కుంటూ పూజారిగారి భార్య, అవతల వాళ్ళ వాకిట్లో చేపలు చేసుకుంటూ సాయిబుగారి బూబమ్మ కబుర్లు చెప్పుకోవడం చూసాను. ఇది కదా నిజమైన జనజీవనం అనిపించింది. వెంటనే నాకు కథావస్తువు దొరికింది. గుళ్ళో కార్యక్రమం మూడు నిమిషాల్లో ముగించి పూజారి పేకాటలో మునిగి తేలడం, సాయంత్రమైతే సాయెబుగారు తాగితూలడం నాకు తెలుసు, కాసిన చెట్టుకే రాళ్ళదెబ్బలు తగులుతాయనే నిజం నా జీవితమే నాకు తెలియచేస్తోందప్పటికే. అందుకే ఆ కథ ఏ రాజకీయాల జోలికి పోకుండా, తెచ్చిపెట్టుకున్న భేషజాలేమీ లేకుండా, ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వకుండా నడిచింది. ఆ రోజుల్లో ఆహ్వానంలో కథరావడమంటే గొప్పగా ఫీలయ్యేవాళ్ళం. 1996 జనవరి ఆహ్వానంలో వచ్చిన ఈ కథ విజ్ఞుల మన్ననలందుకుని, తెలుగు యూనివర్సిటీ వారి ‘కథ 96’లోను, సాహిత్య అకాడమీ వారి ‘నూరేళ్ళ మహిళావరణం లోను, ఇంకా కొన్ని కథా సంకలనాలలోను చోటు చేసుకుని హిందీ, ఇంగ్లీషుల్లోకి అనువదించబడింది.

ఈ కథలో నేను అంతర్గతంగా చెప్పాలనుకున్న కొన్ని విషయాలు చెప్పగలిగాననే అనుకుంటున్నాను. అవి కులమతాల ప్రమేయం లేకుండా అందరు స్త్రీలకూ, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి వర్తిస్తాయి.

స్వస్తి

మా ఊళ్ళో సీతమ్మ తల్లి గుడి వుంది కదా! కష్టాలెన్నొచ్చినా కిక్కురుమనకుండా సహనంతో భరాయించిన నోరూవాయీలేని సీతమ్మకి గుడేవిటని ఆశ్చర్యపోకండి. నాకు తెలుసు, గుళ్ళో దైవంగా కొలువుండాలంటే వాడు ఆజానుబాహువై, అరవింద దళాయితాక్షుడై, రాగద్వేషాలు సమపాళ్ళలో వున్నవాడై, వెనకాముందూ చూడకుండా ఎదుటివాళ్ళని మట్టుబెట్టగల సాహసోపేతుడై, కొంచెం మాయలూ మరిన్ని మంత్రాలూ, కొద్దిపాటి రాక్షసత్వం కొలతలేని శృంగారలోలత్వం లాంటి క్వాలిఫికేషన్స్ కలిగి వుండాలని నిజానికి మా ఊరిగుళ్ళో సీతమ్మ తల్లితో బాటు ఆమెగారి భర్తగారు, మరిదిగారు, నమ్మినబంటుగారు కూడా వున్నారు. వచ్చిన చిక్కల్లా ఏవిటంటే ఆ విగ్రహాలు చెక్కిన శిల్పి ఎవడో కానీ సీతమ్మ తల్లి భక్తుడో, భక్త ఫెమినిస్టో అయివుండాలి. అందుకే గుళ్ళో అడుగు పెట్టగానే చేతులు జోడించాలనిపించేలా చిరునవ్వులు చిందిస్తూ సీతమ్మనీ, పరికించి చూస్తేగానీ కనిపించని బక్కరూపాల్లో రామలక్ష్మణుల్నీ రూపొందించాడు. మరందుకే వచ్చిందో, ఆలయానికన్నీ తానే అయి నెట్టుకొస్తున్న పూజారి క్రిష్ణమాచారి భార్య సీతమ్మవల్ల ఆ పేరొచ్చిందో తెలీదు కానీ మొత్తానికది సీతమ్మ తల్లి గుడి అయ్యింది. నిజానికిదంతా అప్రస్తుత ప్రసంగం.

నేను చెప్పాలనుకున్నది రెండో సీతమ్మ కథ. సీతమ్మ కాపరానికొచ్చేసరికి గుడి తన పూర్వవైభవం కోల్పోయి వూరి చివర ఒంటరి ఒంటెలా వుండేది. ఆ గుళ్ళో అర్చకుడుగా వున్న క్రిష్ణమాచారి తోడూ నీడా లేని గాలి జీవితం గడుపుతూ వుండేవాడు.

పొద్దున్నే ఓ గిద్దెడు బియ్యం వార్చి విగ్రహాలముందు నైవేద్యంగా రెండు నీళ్ళచుక్కలో ప్రోక్షించి, దాన్ని బైటకు తెచ్చుకుని ఏ పెద్దరెడ్డిగారి పెళ్ళామో పంపించిన మజ్జిగ నీళ్ళోసుకుని ఆరగించి ఆరోజు భోజనమైందనిపించేవాడు. పళ్ళెంలో పడిన చిల్లర డబ్బుల్ని అలా పట్టుకెళ్ళి ముత్యాలమ్మ పాకలో పేకాటకు కూర్చునేవాడు. అలాంటి క్రిష్ణమాచార్ని దారిలో పెట్టాలని వూరి పెద్దలంతా కూడబలుక్కుని పక్కవూరి కోవెల పూజారి హనుమంతాచారి అయిదో కూతురు సీతమ్మనిచ్చి పెళ్ళి జరిపించారు. ఒంటిమీదున్న పసుపు చీరకాక వాళ్ళమ్మవి రెండు నేత చీరలూ, ఒక మడిబట్టా, పెళ్ళికి కొన్న ఫేన్సీ పట్టుచీరా, ఒక రాగి పంచపాత్రా, రెండు ఇత్తడి లోటాలు, పూర్వీకులనాటి రామాయణ గ్రంథమూ పాత ట్రంకు పెట్టెలో పెట్టుకుని క్రిష్ణమాచారి వెంట కాలినడకన మెట్టినింటి కొచ్చింది సీతమ్మ. గుడి ఆవరణలో పూజారి కుటుంబం కోసం కట్టబడిన పెట్టెగదీ చిన్నవసారా కొత్తగా కాపరానికొచ్చిన సీతమ్మ కంతికి రాజ భవనంలా కనిపించాయి.

లంకంత ఆవరణంతా రెక్కలు ముక్కలయ్యేట్టు శుభ్రం చేసి పూలమొక్కలూ, కూరపాదులూ నాటింది. దొరువులు కట్టి నీరు ఏర్పాటుచేసింది. నీళ్ళు తోడిపోస్తున్న ఓ సాయంత్రంవేళ దడికవతల గిన్నెలు తోముకుంటున్న నన్సారి బేగం పరిచయమైంది సీతమ్మకి. సీతమ్మకన్నా రెండునెల్లు ముందు కాపరానికొచ్చిన నన్సారి పరుపులు కుట్టే పీర్ సాయెబ్ పెళ్ళాం.

“మీరు శానా బాగున్నారమ్మాయిగారూ” అంది నన్సారి సీతమ్మని పలకరిస్తూ “ఎంత తెలుపో మీ ఒంటి రంగు”

సీత సిగ్గుపడింది. తర్వాత కనైప్పలెత్తి ఇంచుమించు తన ఈడుదే అయిన ఆమెని పరికించి చూసింది. నల్లజీడిగింజ రంగు శరీరం, తెల్లగా మెరిసిపోతున్న పళ్ళు.

“నీ పేరేఁవిటీ?” అంది సీత.

“బేగం నన్సారీ”

“బీబీనాంచారా?” సీత పలికిన తీరుకి నవ్వాపుకోలేక గిన్నెలు కడుగుతున్న బురదలోనే చతికిలబడిపోయింది నన్సారీ. నవ్వి నవ్వి తేరుకున్నాక “బలే పేరెట్టేరమ్మాయిగారూ, అలాగే పిలండి మీకు బాగుంటే” అంది, అన్నాక మళ్ళీ నవ్వింది. సీతకూడా ఆమెతో శృతికలిపి “బీబీనాంచారి పేరు బావుండలా? మా వెంకన్నబాబు రెండో పెళ్ళాం తెల్సా ఆవిడ. మొదటి పెళ్ళాం అలివేలు మంగని ఆఁవడ దూరంలో వుంచి, రెండో పెళ్ళాన్ని ముద్దుకొద్దీ గుండెలమీద పెట్టుకున్నాడాయన” అంది.

“అయితే మావోడు కూడా నన్నలాగే ఎట్టుకుంటాడు కావాల్ను” అని కిసుక్కుమంది నన్సారి.

ఆ రోజు నుంచీ నన్సారీబేగం బీబీనాంచారైంది. కొత్తవాళ్ళెవరడిగినా తనపేరు నాంచారనే చెప్పేది.

త్వరలోనే వాళ్ళిద్దరి మధ్యా గాఢమైన స్నేహం ఏర్పడింది. సీతమ్మతోట పనిలో నాంచారీ, నాంచారి కుట్టుపనిలో సీతమ్మా ఒకరికొకరు సాయపడేవారు.

గొప్ప ఇళ్ళలో పరుపులు కుట్టి సాయెబు బాగా సంపాదిస్తున్న రోజులవి. నాంచారివాళ్ళూ వుంటున్నది పూరిగుడిసే అయినా మంచిబట్టలూ, మంచి తిండి వుండేవి. నాంచారి బలంగా పుష్టిగా పొన్నచెట్టులా వుండేది. ఆమె పక్కన సన్నజాజి తీగలా బక్కగా వుండేది. ఒకరోజు నాంచారి పళ్ళెం నిండా బియ్యం పోసుకుని, రెండో చేతిలో అరటిపళ్ళ అత్తలం పుచ్చుకుని వచ్చింది.

“ఇవన్నీ ఏఁవిటి?” అని తత్తరపడింది సీతమ్మ. “నీక్కాదులెయ్యమ్మా గుళ్ళో వున్న అందాల సీతమ్మ తల్లికి. నాక్కలిగినన్నాళ్ళూ వారం వారం ఇలాగే ఇత్తాను. నువ్వెవరు కాదంటానికి?” అంది నాంచారి దబాయిస్తూ. నెలతిరిగేసరికల్లా తన భర్త ఎందుకూ పనికిమాలినవాడని సీతమ్మకి అర్ధమైపోయింది. కడుపు నిండా తిండికి సంపాదించడం కూడా నేర్వనివాడని గ్రహించింది. తనొచ్చినతర్వాత గుళ్ళో దేవుడికి దీపం పెట్టడం కూడా మానేసాడు. క్రమంగా ఆలయ నిర్వహణంతా సీతమ్మ మీద పడింది. పుట్టిందీ పెరిగిందీ అదే వాతావరణం కావడం వలన తొందరగానే అలవాటుపడింది. సూర్యుడితోపాటు మేల్కొని, రెండు బకెట్ల నీళ్ళు నెత్తిన గుమ్మరించుకుని, ఆలయమంతా కడిగి ముగ్గులు తీర్చి, అభిషేకం చేయించి, పూలుకోసి అలంకరించి, దీపం వెలిగించి, నైవేద్యం పెట్టి హారతిచ్చేది.

గుడి పరిసరాలు, గుడీ శుభ్రంగా వుండడం చూసి దారినపోయే వాళ్ళోచ్చి దండం పెట్టి కాసేపు కూచుని పోయేవాళ్ళు.

“ఇయన్నీ సరేగానీ సీతమ్మా, నువ్వు నూతికాడ కూనిరాగాలు తీస్తావుంటే ఇన్నా, నీ గొంతు శానా బాగుండాది. మీ పురాణాల్లో అరికతలో అయ్యేటో సదువుతారుగందా గుళ్ళల్లో. నువ్వూ సదువకూడదా, నలుగురూ వత్తారు” అందోసారి నాంచారి.

“ఆడదాన్ని, అలాంటివన్నీ నేను చేస్తే జనం ఏమనుకుంటారో అని భయంగా వుంది నాంచారీ” అంది సీతమ్మ.

“ఓలమ్మా, నువ్వేవన్నా, రంకుతనం సెయ్యబోతున్నావా, దొంగతనం సెయ్యబోతున్నావా? నీ మారాజు మొగుణ్ణి నమ్ముకుంటే కూటినీల్లకైనా గతుండొద్దా? ఈరోజుల్లో దేవుడైనా దెయ్యవైనా కల్లకి నదురుగా ఆనాల, లేపోతే ఏటీలేదు” అంది నాంచారి.

మంచిరోజు చూసి తెలిసిన నాలుగు పెద్దిళ్ళకీ వెళ్ళి సీతమ్మ పురానపఠనం చెయ్యబోతోందని చెప్పేసొచ్చింది నాంచారి. ఎంత బాగా చెప్పుందో చిలవలూ పలవలూ కల్పించి మరీ చెప్పింది. మొదటి రోజు నలుగురైదుగురు ముసలమ్మలు మాత్రం వచ్చారు. చిన్నప్పట్నుంచీ కంఠోపాఠం చేసిందే అయినా మొదటి పేజీ తిప్పి ప్రార్థన పద్యాలు చదువుతూంటే గొంతు వణికి చెమటలు పోసేసాయి సీతమ్మకి. క్రమంగా కథనంలో పడ్డాక ఆమెకి కాలమే తెలీలేదు. రాత్రి పదిగంటలవేళ పేకాట నుంచి తిరిగొచ్చిన క్రిష్ణమాచారి నూతి చప్టామీద కాళ్ళు కడుక్కుంటూ గొంతు పట్టేసిన వాడిలా వ్యంగ్యంగా సకిలించడంతో ఈ లోకంలోకొచ్చింది. ఆదరా బాదరా హారతి

పాడేసి, వ్యాసపీఠం ముడి చేసింది. “నాయమ్మ తల్లే ఎంత బాగా పాడతన్నావు రాములోరి కత” ముసలమ్మలంతా ఏకకంఠంతో మెచ్చుకున్నారు.

ఆచారి రాకముందే ముగించెయ్యనందుకు సిగ్గుపడింది సీతమ్మ. అన్నం వడ్డించేప్పుడు తల ఎత్తడానికి బిడియపడింది.

ఏమనుకున్నాడో ఆచారి మాట్లాడకుండా అన్నం తినేసి పడుకున్నాడు. పొద్దున్నే లేచి రాత్రి హారతి పళ్ళెంలో పడిన రూపాయి పావలా జేబులో వేసుకుని అదే పోకపోయాడు.

గుళ్ళో ముగ్గులేస్తుండగా దడి అవతల్నుంచి నాంచారి కేకపెట్టింది “రాత్రి పళ్ళెంలో ఏమాత్రం కిట్టింది సీతమ్మా”

సీతమ్మ ఒక్కసారిగా లేచి నిలబడి నాలుగువైపులా పరికించింది ఎవరైనా విన్నారేమోనని సిగ్గుతో. ఇంకాస్త నయం, దరిదాపుల్లో ఇంకెవరిళ్ళూ లేకపోవడం అనుకుంది. “చీ, ఏవిటి నాంచారీ నువ్వు మరీను కేవలం డబ్బుకోసమా ఇదంతా..” అంది.

నడుం మీద చేతులుంచుకుని నాంచారి సీతని అట్టే పరికించి చూసి “సీతమ్మ తల్లీ, నువ్వు తెలివి నేర్చుకోవాల” అనేసి లోపలికి పోయింది. ఆ మాట సీతమ్మ గుండెలో అదేపనిగా కదలాడింది.

ఆ మధ్యాహ్నం పనంతా ముగిసాక నాంచారిని బతిమలాడితే దానర్థం విప్పి చెప్పింది. “సీతమ్మా, మొగెదవలు స్థిరవెరగనోళ్ళు, ఇయ్యాల కుంచెడుంటే కుండకె సరెత్తమంటారు, మానెడుంటే మంటెట్టమంటారు. రేపు పిల్లాజెల్లా పుట్టబోతారు. ‘అమ్మ, అన్నవెట్టే’ అని మనల్నేగదా అడుగుతారు. ఆడబిడ్డలైతే ‘పరికిణీ కుట్టించు, పట్టాలు చేయించు’ అని ప్రేనాలు తోడతారు. సంపాదనంతా మొగోడి ఎదాన్నేతే ఇంక బిడ్డలకే వుంటాది? అప్పుడెలా నడుత్తాది పడవ? పన్నెండు మంది సంతానం మాయమ్మకి మేవు. మా బాబు, మాయన్నదమ్ములూ కూలీనాలీ సేసి తెచ్చిందాన్ని ఎలాగో కూడబెట్టిందో మాయమ్మ, తల్లి ఆడోళ్ళందరికీ ముక్కులుకీ సెవులకీ పిసరంతేసి బంగారం మెరిసేలా సేసింది. నూటపదహార్లు కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు సేసింది. నాకు అదే సెప్పింది. ఆడదాని జాగర్తె కుటుంబాన్ని ఆరుగాలాలు కాపాడిద్దీ అని. మా సాయెబు రాత్రికి తాగొత్తాడు కదా, తెల్లారేసరికి ఆడి జేబులు కాళీ, నేనే తీసేత్తాను. తెల్లారి ఆడిసావేదో ఆడు సావాల్సిందేగానీ నేనొక్క పైసా ఇయ్యను. రేపణ్ణుంచి గుడికి జనాలొస్తారు. తుణవో పనవో ఆసారి బాబు పేకాతకెలిపోతే రేపు నీబిడ్డల గతేంటంట?

నువ్వు నమ్ముతావో లేదో గానీ లోకం డబ్బు ఆడించినట్టల్లా ఆడతా వుంది. కాసులేనోళ్ళకి కాటికెల్నా ముక్తిలేదు.”

పురాణం వినేవాళ్ళు అయిదల్లా పదిమందై, పది ఇరవయ్యె అలా అలా గుడి నిండిపోయారు. ఆకాలం అలాంటిది. నాటకాలూ, హరికథలూ, బుర్రకథలూ ఒక్కటేవిటి కళ వెయ్యిరూపాలై విస్తరించి ఆదరణ పొందింది. సీతమ్మ పేరు వున్న వూళ్ళోనే కాక పరిసర గ్రామాలకీ పాకింది. పండగలకీ పబ్బాలకీ పిలిచి పురాణం చెప్పించుకుని విని పదో పరకో, చీరో సారో ఇచ్చి పంపించేవారు.

కాలం గడుస్తూనే వుంది.

నాంచారి నలుగురు బిడ్డల తల్లై అయిదోసారి కడుపుతో వుంది. చూసి చూసి సీతమ్మని వైర్యాగ్యం పట్టుకుది. ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, పురాణకాలక్షేపం తప్ప మరోధ్యాసే మరచిపొయింది. “సీతమ్మా, ఆసారి బాబు ముత్తేలమ్మతో” అంటూ ఓసారి నాంచారి ఏదో చెప్పబోతే చెవులు మూసుకుంది సీతమ్మ. ఆచారి ఎంతటి పురుషపుంగవుడో ఆమెకి తెలీదా! గుప్పిట విప్పడం ఇష్టంలేక ”పోనీ నాంచారీ, ఈ భూమి మీద మనిషి మనుగడే మూణాళ్ళు, నవమి పండక్కి నాటకాలు చూస్తున్నాం చూడు, అదిగో అలాగే ఈ ప్రపంచం నడుస్తోంది. నాటకం అయిపోగానే మన పద్దాలు, పాపారావూ వాళ్ళంతా రంగులు చెరిపేసుకుని మామూలు మనుషులైపోతున్నారుగా, అలాగే మనవందరమూనూ బతికున్న మూణాళ్ళూ ఈ ప్రపంచకవనే రంగస్థలం మీద నటించేసి, రంగులు చెరిపేసుకుని ఎక్కణ్ణుంచొచ్చామొ అక్కడికి పోతాం. ఈ మాత్రం దానికి ఎందుకొచ్చిన తాపత్రయాలు చెప్పు. ఆచారిగారి గురించి కదూ అంటున్నావూ, ఆయనకలా జీవించడంలో ఆనందం కనిపిస్తోంది. ఊఁ కానీయ్, అతనిదారికడైళ్ళి ఆ పాపవెందుకు మూట కట్టుకోవాలీ?”

నాంచారి బుగ్గలు నొక్కుకుంది.

“శానా బాగుంది సీతమ్మ నీ ఏదాంతం. గాలికొదిలేత్తే గంగిరెద్దు కూడా కుమ్మిపోతాది. ముక్కు తాడేసినప్పుడే ఎట్లాడమంటే అట్లాడతాది. ముంగాళ్ళ మీద వంగి సలాం జేత్తాది. మొగుణ్ణట్టా గాలికొదిలేసి, నువ్విట్టా ఏదాంతం జెప్తావుంటే బిడ్డాపాపా కలగొద్దూ? రేపు నీ బతుకు ఎళ్ళమారేదెట్టా?”

“బిడ్డలు లేనోళ్ళందరి బతుకులూ వెళ్ళమారటంలే? అలాగే నా బతుకూను. అన్నిటికీ ఆ దేవుడున్నాడులే”

“ఉంటాడుంటాడు. ఎదవ దేముడు, ఆడు మొగెదవేగదా, ఆడికి మాత్రం నాయం ఎక్కడేడిసాయిలే, అన్నట్టు నువ్వు పూజలు జేసే రాళ్ళల్లో సీతమ్మ తల్లున్నట్టుంది కదా, ఆయమ్మేవన్నా ఇనిపించుకుంటాదేమో అడుగు నీ మొర” అని నవ్వింది నాంచారి.

“దేవుళ్ళని అలా రాళ్ళూ రప్పలూ అనకే నాంచారీ, కళ్ళుపోతాయి” అని తనూ నవ్వింది సీతమ్మ. “అన్నట్టు నాంచారీ, నువ్వెపుడూ మీ గుడికెళ్ళినట్టు కనిపించవేం?”

“గుడా.. అదా, మసీదుకా? మా దేవుడికి ఆడగాలి కిట్టదు” అని కిసుక్కుమంది నాంచారి “ఆడోళ్ళెవురైనా మసీదుకెల్లటం ఎప్పుడైనా సూసినా? ఆడోల్లందరూ ఇళ్ళకాడే ప్రేరన సేసుకోవాల.”

“ఇంటి దగ్గరకూడా నువ్వెప్పుడూ ఏ ప్రార్ధనా చేసినట్టు కనిపించలేదూ.” అనుమానంగా చూస్తూ అడిగింది సీతమ్మ. నాంచారి పగలబడి నవ్వింది. ” ఆ ప్రేర్లనెలా సెయ్యాలో నాకు సేతనైతే గదా! ‘నీ కడుపే కైలాసవే’ అంటాడు మా సాయెబు”

కాలం పరుగెడుతోంది. పైసాపైసా కూడబెట్టి చాంచారి నగానట్రా కొనుక్కున్నది లేదు సరికదా, పిల్లల్లో, సాయెబు సంపాదన చాలక కటకటపడాల్సొస్తోంది. చివరికి నాంచారి కూడా నడుం వంచితేగాని కాలం గడవని రోజులొచ్చాయి. నాంచారికి చేతనైందొక్కటే, చీపుర్లు తయారు చెయ్యడం, గుడిసె వెనక గరపనేలల కట్టవల్లో ఇబ్బడి ముబ్బడిగా వున్న పూచిక దుబ్బుల్నుంచి పుల్లలు కోసుకొచ్చి చీపుర్లుగా కట్టి అమ్మడం.

ఆ రోజు వాకిట్లో పరిచిన చీపురుపుల్లల్ని దువ్వి కుచ్చుల ప్రకారం కట్టలు కడుతున్న నాంచారి మొక్కలకు పాదులు కడుతూ రామదాసు కీర్తనలో లీనమై “ఏ తీరుగనను దయజూ చెదవో..” అంటూన్న సీతమ్మని పిలిచి “ఇది విన్నావా సీతమ్మా పెద్ద పెద్ద ఇళ్ళల్లోకి కొత్తరకం పరుపులొచ్చినయ్యంట. పోమో, పామో ఏటో దానిపేరు. ఆటైతే ఇంక దూది పరుపుల్లాగా ఏటా ఏకించి, కుట్టించక్కర్లేదంట” అంది.

“ఆహా!” అంది సీతమ్మ ఏదో ధ్యాసలో.

“మా సాయెబుకింక పనుండదేమో, అదేవంక ఇదేవంక ఆ ఎదవ తాగిసస్తన్నాడు” అంది దిగులుగా నాంచారి. “ఈ బిడ్డల్నిట్టా పెంచాలో ఏవో

ఈ మాటలు చెవినపడ్డాక సీతమ్మ మాములుగా వుండలేకపోయింది. ఆమె గుండెలో ఏదో అలజడి మొదలైంది. కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగింది. పోసిన మొక్కకే నీళ్ళన్నీ తోడిపోసింది. “ఈ పూటకి దేవిడిస్తే తింటాం లేకపోతే లేదు” అన్న వేదాంతం ఎలా పనికొస్తుంది? బిడ్డల్లేకనేనా తనకింత నిర్లిప్తత అలవడింది. కట్టుకున్నవాడెక్కడ తిరిగొచ్చినా తనకి పట్టనట్టే అనిపిస్తోంది. ‘ఈలోకం ఎలాపోతే నాకెందుకు’ అనిపిస్తోందందుకేనా?

“ఏంటి సీతమ్మా మాట్లాడవ్?” నాంచారి కేకతో వులిక్కిపడి ఈలోకంలోకొచ్చింది సీతమ్మ. చానాళ్ళ తర్వాత ఆ రోజు సీతమ్మ తన ట్రంకు పెట్టి బోర్లించి చీరమడతలన్నీ విప్పి దులిపింది. మూడైదులూ, రెండురెళ్ళూ, నాలుగొకట్లూ ఎప్పుడో పెట్టి మరిచిపోయినవి. ఆచారి కంటపడక వుండిపోయినవి దొరికాయి. వాటిని గుప్పెట్లో పట్టుకుని దడి దగ్గరకెళ్ళి “నాంచారీ” పిలిచింది.

“ఏంటమ్మా” అంటూ వచ్చిన నాంచారి చెయ్యందుకుని చిల్లర ఆమె చేతిలో పోసి, గుప్పిట మూసింది. “తీసుకోకుంటే నామీద ఒట్టే” అంది.

నాంచారి కళ్ళల్లోకి నీళ్ళు చివ్వున చిమ్ముకొచ్చాయి. “దేవుడంటే నమ్మకంలేని నాకు ఒట్టుమీదెట్టా నమ్మకవుంటాదనుకున్నావే పిచ్చిదానా! ఎవుళ్ళ కాపరాల బరువు ఆళ్ళుమోసుకోవాలగానీ, మరొకళ్ళ నెత్తికెత్తడం మర్యాదకాదు, నువ్వు నొచ్చుకుంటావని పుచ్చుకుంటున్నా” అంది.

రెండు రోజులకో చీపురు కొంటున్న సీతమ్మని ఓసారి నిలదీసింది నాంచారి. “ఏం తల్లే రూపాయలెక్కువయ్యాయా? మూడేసి రూపాయల చీపురు కట్టని రెండు రోజుల్లోనే మిగేత్తన్నావా”

“గుళ్ళో నాపరాళ్ళ గచ్చుకదా నాంచారీ, చీపుర్లు ఇట్టే అరిగిపోతున్నాయి” అనేది సీతమ్మ.

కొత్తగా కుట్టుపని నేర్చుకుంటున్నానని మొదలుపెట్టి తనవీ, గుళ్ళో సీతమ్మ తల్లివీ చీరలు చింపి నాంచారి పిల్లలకి లంగాలు జాకెట్లు కుట్టి ఇచ్చేది.

కాలంతో బాటు మనుషుల్లోనూ మార్పొచ్చింది. పాతతరం వాళ్ళంతా వెళ్ళిపోయారు. పురాణ పఠనాలూ, పుణ్యకార్యాలూ అవుటాఫ్ పేషనైపోయాయి. గుడికెళ్ళడం మరీ ఆర్థడాక్స్ సిస్టమ్ అయ్యింది పల్లెల్లో. గుడికొచ్చే జనం తగ్గారు.

నాలుగు రాళ్ళోచ్చినప్పుడు వెనకేసుకోవడం ఎరగని సీతమ్మ అప్పుడు ఆనందంలో తలమునకలైపోనూలేదు, ఇప్పుడు విచారంలో మగ్గిపోవడమూలేదు. ఒంట్లోని శక్తి వుడుగుతూ వున్నా ఆలయసేవ మాత్రం ఆమె జీవితంలో ముఖ్య భాగమైపోయింది.

ఆచారి నడుం నొప్పితో మంచం పట్టాడు. అతని వైద్యంకోసం గుళ్ళో పంచపాత్రా, ఇత్తడిపళ్ళెం, రాగిశఠగోపం దీపాల కుందె ఒకటొకటి కాళ్ళోచ్చి నడిచివెళ్ళాయి.

సీతమ్మ నెరిగున్న రైతు కుటుంబాలవాళ్ళు పంపించే మానెడో అడ్డెడో గింజలోనూ రాతిమీద చితక్కొట్టిన చింతకాయ కారంతోనూ కాలం గడుస్తోంది. గుళ్ళో దీపం పెట్టేందుకు నూనెలేక సీతమం గుండె పిండినట్లవుతోంది.

అటు నాంచారి పరిస్థితీ అలాగే వుంది.

”సీతమ్మా, నువ్వు సాలా పురాణాలు సదువుకున్నావు గందా, లోకంలో ఎదిగేవోళ్ళంతా మేడలూ మిద్దెలో అలాగలాగ పైకెదిగిపోతావుంటే మన్లాంటోళ్ళం ఇంకా అట్టడుక్కి దిగిపోతన్నావెందుకు?” అనడిగిందోసారి నాంచారి.

సీతమ్మ ఆర్థికశాస్త్రం చదువుకోలేదు. అందుకే, అదంతా కర్మ సిద్ధాంతం కింద తేల్చేసింది. “అది వాళ్ళు చేసుకున్న పుణ్యం. ఇది మనం చేసుకున్న పాపం” అంటూ. కలీసారా తాగి పీరు సాయెబు చచ్చిపోయినప్పుడు పిల్లలంతా ఘోల్లుమంటుంటే నాంచారి రాయిలా కూర్చుంది. అంతా ముగిసేక సీతమ్మ అడిగింది. “నాంచారీ, ఇంతకాలం అతన్తో కలిసి కాపురం చేసావు కదా, నీకసలు ఏడుపేరాలేదా?” ఉక్రోషంగా నవ్వి నాంచారి, “సీతమ్మా, ఒక మనిషి సచ్చిపోవడమంటే ఈ బూనికి కొంత బరువొదిలినట్టే, అందునా, ఎవరికీ ఉపయోగపడని మనిసి. ఆడుతాగితాగి ఒకరోజు కుక్కసావు సచ్చేటోడే కదా, పోతే పోయేడులే” అంది.

“పాపం, సంపాదించినంత కాలం సంపాదించాడు కదా!”

“ఆ, సంపాదించాడు, నేను కాదన్ను. కానీ, పాడుపొట్టకియ్యాల తింటే రేపటికి పరగడుపే గదా! పెళ్ళికెదిగిన ఇద్దరాడబిడ్డలు కళ్ళెదురుంగా తిరగతన్నారే! రెక్కల కట్టం చేసుకునే వోడెవడైనా నాకొక్కపనే ఒచ్చు, నేనాపనైతేనే జేత్తా, లేకపోతే కడుపులోకి కాళ్ళు దూర్చుకుని బబ్బుంటానంటే ఎట్టాకుదిరుద్ది? అలాంటెదవలకి సంసారాలెందుకు? బిడ్డల్ని కనుకోడాలెందుకు. కట్టుకున్న పాపానికి ఆడది పడరాని పాట్లన్నీ పడి, తొక్కరాని దార్లన్నీ తొక్కి అణ్నీ, ఆడి బిడ్డల్ని పెంచాలా? ఆయుర్దాయం వున్నంతకాలం సవ్యంగా బతకవలిసిన బాధ్యత మనిసికి లేదూ? మొగోడు ఎదవ నాటకాలాడి ఒల్లుగుల్ల సేసుకుంటే ఆడెనకాలోళ్ళు ఏవైపోవాల.” ఎన్నడూ లేని విధంగా ఝల్లుమంది నాంచారి.

ఓదార్పుగా నాంచారి భుజం మీద చెయ్యేసి దగ్గరకు లాక్కుంది సీతమ్మ.

తెల్లవారు ఝామునుంచీ క్రిష్ణమాచారి ఆయాసంతో రొప్పుతున్నాడు. ఎక్కడైనా కాసిన్ని నూకగింజెలు దొరుకుతాయేమో, అతనికి కాస్త గంజికాచి తాపిద్దామనుకున్న సీతమ్మ ఇల్లంతా వెదికింది. ఎప్పుడూ ఎవరిని ఏదీ చేయిచాచి అడిగి ఎరగని సీతమ్మకి ఆ క్షణంలో దుఃఖం ముంచుకొచ్చింది.

“ఆ ఏడుపెందుకే పాపిష్టి లంజా! అందాన్నెలా వుపయోగించుకోవాలో తెలీని పిచ్చి ముండవు నువ్వు, ‘ఊఁ’ అంటే మళ్ళూ మాన్యాలు రాసివ్వడానికి సిద్ధంగా పెదరెడ్డి వున్నాడని నీకే నాడో చెప్పాను. చెవినపెట్టావా? మహాపుణ్యాత్మురాలి పోజుకొట్టి పురాణాలు పట్టుకుని వేళ్ళాడావు. ఇప్పుడేమైంది? బంగారంలాంటి అవకాశమూ పోయింది. ఆనాటి రూపమూ పోయింది” ఆయాసపడుతూ అరుస్తున్నాడు ఆచారి.

చేతిలో గిన్నెతో వాకిట్లో కొచ్చి నిల్చున్న సీతమ్మని చూసి నాంచారి బైటికొచ్చింది.

“ఏంటి సీతమ్మా?” అంటూ.

“నాంచారీ, రాముడికీ రోజు నైవేద్యం లేదు”

“పిల్లలకోసం కాసిన అంబలి తప్ప మరేంలేదు సీతమ్మా ఇంట్లో, దాన్ని కూడా ఆళ్ళు ఎంగిలి చేసేసారు”

“అదే ఇవ్వు” గిన్నెముందుకు చాపింది సీతమ్మ.

“అయ్యో అయ్యో” నొచ్చుకుంది నాంచారి.

”నేనెంత దేవుడూ దెయ్యం లేవనేటి దాన్నైనా మరీ అంత పాపానికి ఒడిగట్టుకోలేను సీతమ్మా”

సీతమ్మ చిరునవ్వు చెరగనీకుండా అంది “నువ్వే కరెక్ట్ నాంచారీ! దేవుడూ లేడు దయ్యమూ లేదు, ఎక్కడో పడున్న రాయిని తెచ్చి రూపం చెక్కి అదిగో అలా గాలీ వెలుతురూ లేని గదిలో కూర్చుండబెట్టి సకల సేవలూ చెయ్యడం.. అదంతా పిల్లలాడుకునే బొమ్మలాటలాంటిది. ఈ పనికిమాలిన దేవుడి కోసం ఆవేశాలకూ కావేశాలకూ పోయి అనర్ధాలను కొని తెచ్చుకోవడం ఉత్త దండగ మారి పని, ఇంక మనం అనుకునే పాపం పుణ్యం మరెక్కడో లేవు, మన మనసుల్లోనే వున్నాయి. ప్రేమతో బాటు అన్నీ అమరిన వాళ్ళ జీవితాలు స్వర్గాలూ, ఏమీలేని వాళ్ళ జీవితాలు నరకాలు. నేనిన్నాళ్ళూ నరకంలోనే బతికాను తెలుసా నీకు. నీ ఇంట్లో వున్న ఆ అంబలినే కొంత పోసివ్వు, రాయిలాంటి దేవుడికీ, నికృష్టుడైన మానవుడికీ ఎంగిలి కూడైనా ఫర్వాలేదులే. నిజానికి నీ పుణ్యపు చేతితో ఇచ్చిన అంబలి తాగే అర్హత వాడికేలేదు.”

(1996 జనవరి, ఆహ్వానం)

****

( వచ్చేనెలలో మరోకథ)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.