“చప్పట్లు”

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

– సింగరాజు రమాదేవి

వాన పడి వెలిసి రోడ్డంతా బురదగా, చిత్తడిగా ఉంది.రొప్పుకుంటూ.. నన్ను నేను తిట్టుకుంటూ, వీలైనంత వడివడిగా నడుస్తున్నాను. రైలు అప్పటికే ప్లాట్ ఫార్మ్ మీదకి వచ్చి ఆగి ఉంది. మేము స్టేషను వెనక వైపు నించి వస్తాం. రైలు ఆఖరి డబ్బా నాకు ఇంకా అల్లంత దూరాన ఉంది. ఏ క్షణానైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది రైలు. ఉద్యోగ రీత్యా రోజూ, నేను అదే రైల్లో ప్రయాణం చేస్తాను.మా ఆఫీస్ నుండి స్టేషన్ కి అడ్డ దారిలో వస్తే పది నిమిషాల నడక. ఆ దారిలో వస్తే ప్రతి రోజూ మా రైలు వచ్చే రెండో ప్లాట్ ఫార్మ్ మీదకి సరాసరి వచ్చెయ్యచ్చు. అందుకే అటే అలవాటయ్యింది.

ఇంకా రైలు చేరుకోవటానికి పదిహేను అడుగుల దూరం ఉంది. ఇక లాభం లేదని చీర కుచ్చిళ్ళు కాస్త ఎత్తి పట్టుకుని, నడకని పరుగుగా మార్చి వేగం పెంచాను. మొత్తానికి రైలు బయలుదేరే ఆఖరి క్షణం లో ఆఖరి పెట్టె లోకి ఎక్కేశాను. 

వగరుస్తూ కిటికీ పక్కన సింగిల్ సీట్లో కూలబడ్డాను.రైలు వేగం పుంజుకుంది.పద్మజ నాతో పాటు ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అరగంట ముందు నుంచే హెచ్చరిస్తూ.. “పద.. ఇక నీ ఫైళ్ళ కట్టలు సర్దేయి! సిస్టం ఆఫ్ చెయి!.. నడు! ఇంకా పది నిమిషాలే!” అంటూ సెల్ ఫోన్లోని ఏప్ లో ఎప్పటికప్పుడు ట్రెయిన్ ని ట్రాక్ చేస్తూ నన్ను తరిమి…టైమ్ కి బయలుదేరతీసేది. ఇవాళ తను రాలేదు. నేను టైమ్ చూసుకోకుండా పనిలో మునిగిపోయాను. తీరా ఆఖరి నిమిషంలో ఈ పరుగులు! 

పావుగంట వరకు దడ తగ్గలేదు. అప్పటికి తేరుకుని తలెత్తి చూశాను. కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది.పక్కన పొడుగు సీట్లో అటు మూల మాత్రం ఒక అతను కూర్చుని ఉన్నాడు. మామూలుగా కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు. ఇదేంటి అనుకుంటూ చూశాను. సీట్లన్నీ దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. కరంట్ కూడా లేదు. అదీ సంగతి!  ఒక్కొక్కసారి రిపెయిర్ చెయ్యాల్సిన పెట్టెలని ఇలా రైలు చివర్లో తగిలించి పంపుతారు. అలాంటి పెట్టెలా ఉంది ఇది. 

ఛ! ఆలస్యంతో అనేక నష్టాలు! ముందే వచ్చి ఉంటే, చూసుకుని.. ఇంకా ముందుకు వెళ్ళి మంచి కంపార్ట్ మెంట్లో ఎక్కేదాన్ని! హూ! ఏం చేస్తాం! అసలు ట్రెయిన్ మిస్ అవ్వకుండా అందింది. ఇది పోయిందంటే.. మళ్ళీ రెండు గంటల వరకు ఇంకో బండి లేదు.

  పోనీలే, కిటికీ పక్కన కాబట్టి గాలి ధారాళంగానే వస్తోంది. చీకటి పడటానికి కనీసం ఇంకో గంట టైమ్ ఉంది. ఈ లోపు నా ప్రయాణం అయిపోతుంది. ప్రశాంతంగా పుస్తకం చదువుకుందామని బేగ్ లోనుండి పుస్తకం తీసి అందులో మునిగిపోయాను.

పుస్తకంలో పడ్డానంటే నాకు అసలు వేరే లోకం తెలీదు. ఇలాగే ఒకసారి నవలలో మునిగిపోయి స్టేషన్ వచ్చింది చూసుకోలేదు. అప్పుడూ పద్మజే.. తను దిగిపోయి ప్లేట్ ఫార్మ్ మీద నిల్చుని,  కిటికీ లో నుంచి “ఓ అమ్మా! ఏ ఊరు వెళ్ళాలి?” అని  పెదాల మధ్య నవ్వు బిగించి అడుగుతుంటే, అప్పుడు చూసుకుని కంగారుగా లేచి దిగాను. అది గుర్తొచ్చి నవ్వుకుంటూ తల పైకెత్తాను. 

ఎదురు సీట్లోకి చూసి ఉలిక్కిపడ్డాను! అటు మూల కూర్చున్నతను,  ఎప్పుడు వచ్చాడో నా ఎదురుగా ఉన్న సింగిల్ సీట్లోకి వచ్చి కూర్చుని నన్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. నా పుస్తకం ధ్యాసలో ఉండి నేను అసలు గమనించలేదు!

అప్రయత్నంగా కాస్త సర్దుకుని కూర్చుని మళ్ళీ పుస్తకం వైపు దృష్టి పెట్టాను. కానీ దాని మీద ధ్యాస ఎగిరిపోయింది. ఎందుకో కాస్త ఇబ్బంది..పెట్టె అంతా ఖాళీగా ఉండగా.. నా ఎదురుగానే వచ్చి కూర్చున్నాడు ఎందుకో! పైగా ఆ చూపు అసలు నచ్చలేదు. రోజు అలవాటైన ప్రయాణమే! ప్లాట్ ఫార్మ్ మీదా, రైల్లో ఎందరో ఎదురుపడుతూ ఉంటారు. చూపులుతో.. తినేసే వాళ్ళు.. రద్దీ లో తాకాలని చూసే వాళ్ళు..వెకిలి వెధవలు.. కొత్తేం కాదు! కొందర్ని చూపులతో… కొందరిని మాటలతో కట్టడి చెయ్యటం ఎప్పుడో అలవాటయ్యింది.  కానీ, అప్పుడు జనాల మధ్య ఉంటాం కాబట్టి, అదొక ధైర్యం! కానీ ఈ రోజు ఇలా వంటరిగా! ఛ! 

అయినా.. ఏదో ఊహించుకోవటం ఎందుకు.. బింకంగా కూర్చున్నాను. పుస్తకం మూసేసి ఒక సారి అతని ముఖంలోకి సూటిగా ఏ భావము లేకుండా చూసి, ముఖం తిప్పేసుకుని బయటకి చూస్తూ కూర్చున్నాను. వాడు ఏమైనా కదిలినా, దగ్గరకి వచ్చే ప్రయత్నం చేసినా.. ఎదుర్కునేందుకు నా శరీరంలో ప్రతి కండరం బిగుసుకుని సిద్ధంగా ఉంది. 

వాడు కదల్లేదు కానీ తాపీగా కూర్చుని నా వంకే చూస్తూ కూర్చున్నాడు. నేనే అతిగా ఊహిస్తున్నానా.. మామూలుగా “ఏం బాబూ..ఎక్కడికి వెళ్ళాలి?”  లాంటి ప్రశ్నలతో సంభాషణ ప్రారంభిస్తే…ప్రతి క్షణం పెరుగుతున్న ఈ టెన్షన్ తగ్గుతుందేమో!  ఒక సారి తల తిప్పి చూశాను. గడ్డం సవరించుకుంటూ అదోలా నవ్వాడు. ఉహూ! వీడు తేడాగానే ఉన్నాడు. మాట కలపటం ఏమంత మంచి ఆలోచనలా అనిపించలేదు. అందుకే వీలైనంత పదును చూపులతో ఒక క్షణం చూసి, మళ్ళీ కిటికీ వైపు ముఖం తిప్పేసుకున్నాను. 

ఎంత బింకంగా ఉందామనుకున్నా నేనున్న పరిస్థితికి వెన్నులో సన్నగా వణుకు మొదలైంది. ట్రైన్ ఇంకో అరగంట వరకు ఎక్కడా ఆగదు.  గబా గబా లేచి పక్క పెట్టె లోకి పోదామంటే .. ఊహూ.. ఈ డబ్బా విడిగా ఉన్నట్టుంది. ఎదురుగా పొడవుగా సీట్ల మధ్య దారి ఖాళీగా.. ఆ చివర దారి మూసేసి కనపడుతోంది.అంటే వీడితో పాటు ఇక్కడ బంధించినట్టే!

దేవుడా.. నా గొంతు తడారిపోతోంది! వేరే సీట్లోకి వెళ్ళి కూర్చుంటే.. లేచి చెయిన్ లాగితే..అవేవి జరిగేలా లేవు. నేను కదిలితే మీద పడదామన్నట్టు సిద్ధంగా ఉన్నాయి ఆ చూపులు.  వలలో చిక్కుకున్న లేడి లాంటి నా నిస్సహాయత వాడికి బాగా అర్ధం అయినట్టుంది. 

ఒళ్ళో ఉన్న బేగ్ ని గట్టిగా బిగించి పట్టుకున్నా. ఇతర వస్తువుల తో పాటు నా లంచ్ బాక్స్ కూడా ఉంటుంది అందులో.. లాగి దానితో ఒక్కటి ఇస్తే ముఖం మీద బానే తగులుతుంది.కానీ ఆ పైన పారిపోవటానికే ఛాన్స్ లేదు! ఆటలో మొదటి పావు ఎవరు కదుపుతారు అన్నట్టుంది మా పరిస్థితి!

వాడు తాపీగా ఒళ్ళు విరుచుకుని కాళ్ళు మరింత ముందుకు చాపాడు. దాదాపు నా పాదాల దగ్గిర దాకా వచ్చాయి. నేను బిగిసుకు పోయి కూర్చుని ఉన్నాను. కాళ్ళు వెడంగా పెట్టి ఊపుతూ, చెయ్యి మెల్లిగా కదపసాగాడు. కళ్ళు నా ముఖం మీంచి తిప్పకుండా ఒక చేత్తో గడ్డం నిమురుకుంటూ ,ఇంకో చెయ్యి ఒళ్ళో పెట్టుకుని మెల్లగా కదులుతున్నాడు. కంటి కొసల నుండి చూస్తున్నా, వాడి కదలికలు అర్ధం అయి భయము, జుగుప్స ఒకేసారి కుదిపేసాయి. అయ్యో! ఏంటీ ఇవాళ నా ఖర్మ ఇలా కాలింది.. ట్రైన్ ఒక్క నిమిషం ఆగినా బాగుండును. దిగి పారిపోవచ్చు. స్టేషన్ రావటానికి ఇంకా చాలా సేపే ఉన్నట్టుంది. 

పేంటు జిప్పు మీద వాడి చెయ్యి కదులుతూనే ఉంది.  గట్టిగా అరవనా .. ఫోన్ తీసి ఎమర్జెన్సీ కి కాల్ చేస్తే.. వాడు ఫోన్ లాక్కుని బయట పడేస్తాడేమో…పోనీ లేచి టాయిలెట్ లోకి పరిగెత్తి తలుపు వేసుకుంటే..ఊహూ..కుదిరేట్టు లేదు! వాడు మరీ దగ్గరగా ఉన్నాడు! 

పేపర్లలో చదివిన రకరకాల వార్తలు గుర్తుకొస్తున్నాయి. ట్రెయిన్ లో అత్యాచారాలు, పెనుగులాడితే కదిలే రైల్లో నుండి పట్టాల మీదకి తోసేయ్యటం..ఇలాంటివన్నీ.. క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. చెమట తో ఒళ్ళంతా తడిసి వీపు మీద ధార కడుతోంది.

కను కొసల నుండి చూశా.. వాడి చేతులు మెల్లగా పేంటు జిప్పు తెరుస్తున్నాయి.. భయం, కోపం, అవమానం, నిస్సహాయత అన్నీ కలగలసి నా మెదడు మొద్దు బారిపోతోంది!

అంతలో ఎదురుగా కనపడింది రోష్ని!

ఖాళీగా ఉన్న ఆ కంపార్ట్ మెంట్ లో  అటు మూల పై బెర్త్ మీద ఎక్కడో పడుకుని నిద్ర లేచి అప్పుడే దిగినట్టుంది. మెల్లగా సీట్ల మధ్య నడుకుంటూ, టాయిలెట్ కి అనుకుంటా వస్తోంది.. ఎదురుగా భయంతో బిగుసుకు పోయిన నన్ను.. నా ఎదురు సీట్లో వాడిని చూసిన ఆమెకు లిప్తకాలంలో సంగతి అర్ధమైపోయింది.

నా ముఖంలో మారిన భావానికి,  అలికిడికి… చేస్తున్న పని ఆపి తల వెనక్కి తిప్పాడు వాడు. అమాంతంగా వాడి నెత్తి మీద చెయ్యేసి.. దగ్గరగా లాక్కుని..”ఏంటి బంగారం.. ఏదో చూపిస్తునట్టు ఉన్నావు.. ఏదీ.. నాకు చూపించు”  వాడి చెయ్యి పట్టి లాగుతూ గట్టిగా అడిగింది రోష్ని. అనుకోని ఆ సంఘటనకి వాడు బిత్తరపోయి… ఏయ్! వదులు … ఏంటి.. హడావిడిగా చేతులు అడ్డం పెట్టుకుని లేవబోయాడు.

“అరే! సిగ్గా… ఇప్పటి వరకు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు బంగారం!”.. వాడి ఎదురుగా నిల్చుని ఒక కాలు ఎత్తి మడిచి సీటు పైన పెట్టి.. వాడి భుజాలు నొక్కి పట్టి… “ఆగు! ఇప్పటి దాకా పెద్ద మగోడి లాగా మగతనం అంతా చూపించావు కదా!.. తియ్యి .. నేను చూస్తా .. తియ్యి!…” రెట్టిస్తోంది ఆమె.

వాడు లేవటానికి ప్రయత్నిస్తూ “ఏయ్.. వద్దు.. జరుగు.. లే నన్ను పోనీ..” పీల గొంతుతో అంటున్నాడు.

నాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది! 

“దొంగ భాడ్కోవ్! ఆడోళ్ళు ఒంటరిగా దొరికితే, ఇక పెద్ద మొగోళ్ళు అయితార్రా… నీ సిగ్గు లేని బతుకు.. నడు.. సావు..” రోష్ని బొంగురు గొంతులోంచి యధేచ్చగా బూతులు! ఇంకెప్పుడైనా అయితే ఆ బూతులకి ముఖం చిట్లించుకుని చెవులు మూసుకునే దాన్ని. కానీ ఇప్పుడు అవి నా చెవులకి ఇంపుగా వినపడుతున్నాయి.  

నాకు అప్పటి దాకా ఉన్న టెన్షన్ అంతా పోయి ఒక్క సారి శరీరం అంతా తేలిక అయి గట్టిగా నిట్టూర్చాను!

ఇప్పుడు వాడు బతిమిలాడుతున్నాడు.. “ఏయ్! ఊకో.. వదిలేయ్.. వద్దు.. నన్ను ముట్టుకోకు.. వదిలేయి.. నేను వెళ్ళిపోతా!”.. మొత్తానికి పెనుగులాడి తప్పించుకుని జారిపోతున్న పాంటుని ఒక చేత్తో పట్టుకుని అటు చివరికి పరిగెత్తి పోయాడు వాడు. 

“రేయ్! మల్లి ఇటు దిక్కు వచ్చినవ్ అనుకో.. నీ సంగతి చెప్తా!” వేలు చూపించి గట్టిగా అరుస్తూ బెదిరించి ఇటు తిరిగింది రోష్నీ! 

ఒక్క సారిగా రిలాక్స్ అయి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ నీరసంగా చిరునవ్వు నవ్వాను. 

బదులుగా నవ్వుతూ, “భయపడ్డవా అక్కా! దొంగ లంజ కొడుకులక్కా వీళ్ళు! ఆడది కనపడితే చాలు ..థూ ఎన్ని లంగ వేషాలైనా ఏస్తారు. చేతులు ఊపుకుంటూ.. వయ్యారంగా కొంగు దులిపి మళ్ళీ బొడ్లో దోపుకుని.. ఇక భయం లేదులే అక్కా ! నిమ్మలంగా కూర్చో” చెప్పింది రోష్ని. 

రోజూ చప్పట్లు కొట్టుకుంటూ, ట్రెయిన్ లో ప్రతి సీట్ దగ్గిరికి వచ్చే ఆమెని ముఖం చిట్లించి తిప్పుకోవటమే తప్ప ఎప్పుడూ పరీక్షగా చూడలేదు. ముగ్గురు , నలుగురు గుంపుగా వస్తూ.. ఏయ్ రోష్నీ..రావే.. తొందరగా పదవే అంటూ అప్పుడప్పుడూ పిల్చుకోవటం విని, “అబ్బా..రోష్నీ నా! ..వీళ్ళు కూడా బాగా షోకైన పేర్లు పెట్టుకుంటున్నారు” అని నవ్వుకున్నాం! అందుకే ఆమె బాగా గుర్తుండి పోయింది. 

ఇవాళ ఆమె చీర, వయ్యారి నడక, జడలో వేలాడుతున్న పెద్ద మల్లెపూల దండ , బొంగురు మగ గొంతు ఇవన్నీ అందంగా కనపడుతున్నాయి. ఆమె నా పాలిట దేవతలా అనిపిస్తోంది.

  కళ్ళలో నీళ్ళు ఊరుతుండగా, చాలా థాంక్స్ చెల్లీ! ఇవాళ నువ్వు రాకపోతేనా.. ఏమయ్యేదో?  చాలా థాంక్స్! మనస్ఫూర్తిగా అన్నాను.

అయ్యో! దానిదేముంది అక్కా… సిగ్గుగా నవ్వింది రోష్నీ! 

****

Please follow and like us:

28 thoughts on ““చప్పట్లు”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

  1. ఇది మూస కథలకు భిన్నంగా, ఒక విభిన్న కథాంశం. ఆసక్తి కలిగించే కథారంభము, ఆలోచింపచేసే ముగింపు ఈ కథ కలిగి ఉంది. రచయిత్రి శ్రీమతి సింగరాజు రమాదేవి గారికి అభినందనలు. మున్ముందు మరిన్ని వినూత్న కథలు మీ కలం నుండి వెలువడుతాయి అని ఆశిస్తున్నాను.

  2. మీ కథ చప్పట్లు అంటే ఏమోననుకున్నాను. ఒక సింబాలిక్ గా శీర్షికను ఎంచుకోవడం, గణిక (ట్రాన్స్ జండర్)లలో మానవత్వమున్నవారుంటారని చెప్పడము నాకు నచ్చింది. మీరు కథను చెప్పే సంవిధానము బాగా పోషిస్తారు. మీరు నిశ్శబ్ద కృషీవలులు. అభినందనలు. – టి.శ్రీరంగస్వామి

    1. ధన్య వాదాలు సర్.. ఎన్నో ఏళ్లుగా సాహితీ సేవ చేస్తున్న మీ వంటి పెద్దల ప్రశంసలు పొందటం ఆనందం గా ఉంది.

  3. చాలా బాగుంది. చప్పట్లు ఆయుధం.

  4. కథని ప్రారంభం నుండి చివరి వరకూ టెంపో తగ్గకుండా పాఠకులు మమేకం అయ్యేలా కథనం చేసారు.ఇటువంటి అనుభవం బస్సుల్లో,ట్రైన్ల లో ఉద్యోగ వ్యాపారాలకోసం ప్రయాణించే మహిళలు ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే సంఘటనే.ఐతే చక్కని కొసమెరుపు తో ముగించడం కథకి పరిపూర్ణత వచ్చింది.ట్రాన్స్ జెండర్ లో మీద సామాన్యంగా ఉండే అపోహలను, అభిప్రాయాలను తొలగించుకోవాల్సిన అవసరాన్ని ప్రతిపాదించడం బాగుంది.మనఃపూర్వక అభినందనలు రమాదేవీ

    1. చాలా థాంక్స్ సుభద్ర గారు.. నా అభిమాన రచయిత అయిన మీ నుండి అభినందనలు అందుకోవటం ఆనందం గా ఉంది..

  5. చాలా బాగుంది రమ గారు ఈ కథ… చాలా ఉత్కంఠ గా సాగింది. కథనం… ఒక దశలో కథలో నాయకి పాత్ర లో కి పాఠకులు టెన్షన్ కి గురి అయ్యేలా నడిచింది. ముఖ్యంగా నాయకి కి అన్ని దారులు మూసి వేయబడి, చివరికి రోజు చూసే ఆ రోష్ని పాత్ర రాక తో కథ కు ఊహించని మలుపు ఇచ్చారు. చప్పట్లు.. ఈ కథ కు సరిగ్గా కుదిరిన టైటిల్. ట్రాన్స్‌జెండర్స్ మీద విశ్లేషణ బాగా తెలిపారు. రచయిత్రి కి థన్యవాదాలు.

    1. థాంక్యూ రజనిగారు.. చక్కగా విశ్లేషించారు.. ధన్యవాదాలు

  6. బాగుంది మేడం కథ. ట్రాన్స్ జెండర్స్ లో చాలా మంచి వారు ఉంటారనీ , ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న రోష్నీ పాత్రతో చెప్పారు.

    1. థాంక్యూ సునంద గారు. మీ స్పందన కి ధన్యవాదాలు

    2. థాంక్యూ సునంద గారు. మీ స్పందనకి ధన్యవాదాలు

  7. కథాంశం ఆలోచింపచేసేట్లుగా ఉంది. కథనం కూడా చాలా బాగుంది. సాధారణంగా ట్రాన్స్ జెండర్స్ మీద కలిగే అభిప్రాయలని ఎవరికి వారు పరిశీలన చేసుకునేట్లు చెప్పారు. కథ చదివేశాక రకరకాల భావాలుకలిగాయి. అమ్మయ్య అనిపిస్తూ బాగా అయిందిలే అని నిట్టూరుస్తాము. రచయిత్రికి అభినందనలు.

    1. థాంక్స్ భానుమతి గారు.. మీ వంటి సీనియర్ రచయిత్రి నుండి అభినందనలు అందుకోవటం ఆనందం గా ఉంది..

    2. థాంక్స్ భానుమతి గారు.. మీ వంటి సీనియర్ రచయిత్రి నుండి అభినందనలు అందుకోవటం ఆనందం గా ఉంది..

  8. కథనం చాలా బాగుంది.మూడ్ బాగా ఉత్కంఠ భరితంగా సాగింది.చప్పట్లను ఎంతో చక్కగా అనుసంధించారు.జేజేలు. సగటు మనిషి ఎంత మారాలి? ఎన్ని పాత పొరలను ఛేదించాల్సి ఉందో కదా! అభినందనలు.ఈ విలువైన విషయం convey చేసారు.

    1. థాంక్యూ శైలజ గారు..మీ స్పందనకు ధన్యవాదాలు

    2. థాంక్యూ శైలజ గారు..మీ స్పందనకు ధన్యవాదాలు

    1. థాంక్యూ కృపాకర్ గారు.. మీ స్పందనకు ధన్యవాదాలు

  9. నీ కథ చాల బాగుంది రమ. ఆలోచింపచేసేట్టుగా, సందేశాత్మకంగా, పేరుకు తగ్గట్టు చప్పట్లు కొట్టించే కథ
    రాసినందుకు అభినందనలు, ధన్యవాదాలు. 💐👌👍

    1. థాంక్యూ విద్య గారు. మీ స్పందనకి ధన్యవాదాలు

  10. నీ కథ చాల బాగ ఉంది రమ.ఆలోచింపచేసేట్టుగా,సందేశాత్మకంగా ఉంది. ఎవరినీ చిన్నచూపు చూడకూడదని,అందరికీ ప్రతిఒక్కరి అవసరంఉంటుందని,. తెల్పిన తీరు బాగుంది.హృదయపూర్వక అభినందనలతో.

  11. చక్కని అనుభవం లాంటి నేపధ్యం తో మంచి కథను అందించారు. అనుకోకుండా ఎదు రయ్యే సంఘటనలు
    భయంకర దృశ్యాలు గుర్తు కు వస్తే గుండె ఝల్లు మంటున్ది. చప్పట్ల వారి జీవితాలను మనం అసహ్యం గా చూస్తాం. కాని సమయం వస్తే ఎవరు ఎలా వుపయోగపడతారో చెపృలేము.మంచి కథను అందించిన రచయిత్రికి కృతజ్ఞతలు/శుభాకాంక్షలు

    1. థాంక్యూ ప్రసాద్ గారు.. లైంగికత విషయం లో సమాజం స్త్రీ పురుషుల కు భిన్న ప్రమాణాలు ఏర్పరిచింది.. ఇక తమ లైంగికత కారణంగా సమాజపు అంచులకు నెట్టివేయబడ్డ్డ వారు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు.. అయితే కొన్ని సందర్భాలలో అదే వారి ఆయుధం అవుతుంది

    2. థాంక్యూ ప్రసాద్ గారు.. లైంగికత విషయం లో స్త్రీ పురుషుల కు భిన్న ప్రమాణాలు ఏర్పరిచింది మన సమాజం.. ఇక ట్రాన్స్ జెండర్ ల విషయానికి వస్తే తమ లైంగికత కారణంగా సమాజపు అంచులకు నెట్టి వేయబడ్డ వారు.. కానీ కొన్ని సందర్భాలలో అదే వారి ఆయుధం అవుతుంది..

Leave a Reply

Your email address will not be published.