ఆమె ఇపుడొక శిల్పి 

-పోర్షియా దేవి

ఆమెని  కొంచెం అర్ధం చేసుకోండి 
ఎప్పటికీ ఒకేలా ఉండడానికి 
ఆమేమీ పనిముట్టు కాదు 
మారకుండా ఉండడానికి 
ఆమేమీ తాంజావూరు చిత్రపటం కాదు 
 
తరతరాల భావజాల మార్పులను 
ఇంకించుకున్న మోటబావి తాను 
అంతరాల సంధి కాలాలను మోస్తున్న 
ముంగిట ముగ్గు కదా తాను
 
అవును ఆమె ఇప్పుడు మారుతుంది 
ఎందుకంటే కొత్త నీరు వచ్చి పాతనీరు పోయినట్టు 
కాలప్రవాహంలో తాను కూడా ప్రవహిస్తుంది
 
ఎంతకాలమింకా ఇతరుల కోరికలకు అనుగుణంగా 
తనను తాను మలచుకుంటుంది 
ఇకనైనా తనకే సొంతమైన 
తన ఊహలకు రూపమిచ్చుకోవాలి కదా
జనవాక్యం తనవాక్యంలా పలికిన 
ఆ చిలకపలుకులనిక ఆపేసి 
తన గొంతు తానే శృతి చేసుకోవాలి కదా
 
ఇంటిపేరు దగ్గరనుంచి వెచ్చాల వరకు నా అనే భావన నుంచి 
మన అనే భావం కలిగించే దాకా  ఆమె మారుతునే వుంటుంది
చుట్టూ గుండ్రంగా గీసుకుని  తనను బయటనే నిలిపిన వారి ముందే 
తనచుట్టూ తానే ఇంకో గీతగీసుకుని సగర్వంగా నిలుచుంటుంది
 
నిజానికి ఆమెకిపుడు స్వేచ్ఛ అంటే ఏంటో అర్ధమవుతుంది 
అందుకే తన పరిధిప్పుడు విశాలమయింది 
యుగాలుగా ఎవరెవరో ఉలితో చెక్కుతున్న 
ఆ ఆకృతిపుడు  తనకేమాత్రం నచ్చడం లేదు 
అందుకే  ఇపుడామె తనను తాను చెక్కుకునే శిల్పి
 

*****

Please follow and like us:

One thought on “ఆమె ఇపుడొక శిల్పి (కవిత)”

  1. kavita chala bagundi. avunu thananu thanu chekkukune shilpi… ippudu….
    Congratulations madam…

Leave a Reply

Your email address will not be published.