ఎవరతను?

-అరుణ గోగులమంద

తెలిసిన ముఖంలానే ఉన్నా
అతెనెవరో ఎంతకీ గుర్తురాదు.
కాలేజీ గేటుబయట గోడకు బండిపెట్టుకుని 
కళ్ళలో ఎదురుచూపులు పాతుకొని ..
నాకోసం వెతికిన..ఆనాటి అతనేనా.
“ఈ ఏడాది ఎలా ఐనా మనపెళ్ళైపోవాలి
నిన్ను పోగొట్టుకోలేను ప్రమీలా”
అని నా చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చిన..
 అతనేనా?
 
యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్.
పెళ్ళై రెండునెలలు.
పీజీ మొదటిఏడాది..
చదువు పూర్తికాని అగమ్య గోచర స్థితి
నిస్సహాయత మోస్తున్న పాదాలు.
మాట్లాడ్డానికేం లేదు..
మెల్లగా బండెక్కి..
అతని వెనకే కూర్చున్నా
డ్రైవ్ చేస్తున్న అతనెవరో గుర్తురాదు.
కనీసం.. పరిచయమున్న జ్ఞాపకమైనా..రాదు.
 
గదిలోంచి రానీయడు అతను
గది బయట తోడేల్లా ఆమె
సిగ్గులేని జన్మ,ఎంతసేపూ గదిలోనే 
“వాడికేం మగాడు,దీనికుండక్కర్లా..చీ..!”
పొరుగింటామెతో మెటికెలిరుస్తూ.
 
దొరక్క దొరక్క దొరికిన ఆడ దేహంతో 
అడక్కుండానే ఆడుకునే అతడు.
సాటి స్త్రీని సాటి మనిషిగా గుర్తించలేని ఈమె.
చుట్టూతా అలముకున్న నిర్వేదంలో నిస్తేజంగా..
నేను.
 
డాక్టరమ్మ దగ్గరికి పరీక్షకెళ్ళినపుడు..
 తనుకూడా వస్తాడేమోననే వెర్రి ఆశ గేటు బయటే ఆరిపోయేది. 
“మీ ఆడోళ్ళ విషయాలు నాకేం తెలుస్తాయ్..నేనెందుకు..నువ్వెళ్ళు”
అంటూ
జేబులో చేతులేసుకుని ఎటో చూస్తూ నిలుచుంటుంటే, 
“ఇతను..ఎవరబ్బా”
 అని ఎంత ఆలోచించినా, నాకు గుర్తు రాలేదు.
 
ఎనిమిదోనెలలో నిండుచూలాలిపై 
ఓపలేనికోరిక
వెల్లకిలా పడున్న ప్రాణమున్న గర్భిణీ శవం.
లైసెన్సుబిళ్ళ సాక్షిగా మొగుడు చేసిన అత్యాచారం.
గదినిండ అలముకున్న ఆమె కాబోయే తల్లిప్రాణం.
రేపటి బిడ్డకోసం సిద్ధమౌతున్న పాలిండ్లలోనూ 
కామోద్దీపన కావించుకోగల పోతపోసుకున్న మగాడితనం.
పొత్తికడుపులోకి జారిన బిడ్డతల బరువుగా తగిలినా కూడా గుర్తించలేని 
అతని కాళ్ళసందుల్లోని పురుష స్వామ్యం. 
 
పైనుంచిలేచి అవతలికి వెళ్ళిపోతున్న ఆ అకారమెవరిదో నాకు తెలీదు.
ముగ్గురు బిడ్డల తల్లినైనా..
ఆ వచ్చేపోయే మగాడి శరీరం నాకేమౌతుందో  
 నాకీనాటికీ అర్ధం కాలేదు.

*****

Please follow and like us:

One thought on “ఎవరతను? (కవిత)”

Leave a Reply

Your email address will not be published.