చిత్రం-29

-గణేశ్వరరావు 

మేరీ జిన్స్ మల్టీమీడియా ఆర్టిస్ట్( ఒహియో) యాభయ్యవ పడిలో అకాలమరణం చెందారు. కార్టూనిస్ట్ గా అంతర్జాతీయ బహుమతులు అందుకున్నారు. ఆమె తన విశ్వాసాలకు అనుగుణంగా నిబద్ధత తో కార్టూన్ లు గీసేవారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నేర్పడానికి ప్రయతించేవారు. వాదాలకు అతీతంగా స్పందించిన మానవతావాది
కార్టూన్ అంటే నవ్వించేది అని మనలో కొందరు అనుకుంటారు. ఒక వ్యంగ్య చిత్రంగా దాని లక్ష్యం రాళ్లు రువ్వడం, అయితే అవి దేని గురించి అయినా అవ్వొచ్చు – ఇరాక్ / సిరియా యుద్ధం ..రాజకీయ నాయకుల ‘తుగ్లక్’ పనులు! అప్పడాలకర్రతో మహాకాళిలా నిల్చున్న మహిళ , గిన్నెలముందు నేలమీద కూర్చున్నబట్టతల మగాడు ని చూపిస్తూ గీసిన బాపూ కార్టూన్ లు నవ్వించేవే! కార్టూన్లలో కలకాలం జ్ఞాపకం ఉండేవి – సామాజిక స్పృహతో గీసిన సందేశాత్మక వ్యంగ్య చిత్రాలు.మేరీ గీసిన కార్టూన్ లు ఆలోచనలు రేకెత్తిస్తాయి, సమాజంలో జరుగుతూన్న అత్యాచారాలను ఎత్తిచూపిస్తాయి, వ్యక్తులకూ, ప్రాంతాలకు పరిమితo కాకుండా సార్వజనీనత కలిగి ఉంటాయి. పోటీల్లో పురస్కారాలను అందుకున్న మూడింటిని పోస్ట్ చేశాను.
 
చిత్రం వేయిపదాల విలువైనది, వీటికి విశ్లేషణ అక్కరలేదు, మేరీ సముచితంగా వాటికి పెట్టిన పేర్లే చాలు.
 
1. పంజరంలో మనిషి (చేతిలోని సెల్ బటన్లు నొక్కుతూ నేటి యువత తమ లోకంలో బందీలు అవుతున్నారు, స్వేచ్ఛగా తిరిగే పక్షి ‘సెల్’లోని బందీ కేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.)
 
 
2. ‘సెల్ఫీ’: దీని గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. మేరీ దీన్ని గీసింది అమెరికన్ల కోసమే!డబ్బు విచ్చలవిడిగా దేశం ఖర్చుపెడుతోంది – యుద్ధాలకోసం.. అంతరిక్షపరిశోధనల కోసం..రోత కలిగించే ధనవంతుల ఆఫ్ షోర్ అకౌంట్లను నింపి మరింత ‘దరిద్రగొట్టు’ చేయడం కోసం ..అమెరికాలోని నలభై కుటుంబాల దగ్గరున్న ధనం ప్రపంచ జనాభాలో సగం మంది దగ్గరకూడా లేదు, ప్రపంచం అంతా దారిద్ర్యం తాండవిస్తోంది, మరి ఈ ధనికులు ధృతరాష్ట్రుడుగా ఎందుకు ఉండిపోతున్నారు, కర్ణుడిలా ఎందుకు కళ్ళు తెరవడంలేదు? చిప్పచేతితో పట్టుకుని దీనంగా చూస్తున్నవాడితో సెల్ఫీలు/డాక్యూమెంటరీలు తీసుకుంటే సరిపోతుందా?
 
 
3. ‘గర్భస్రావం’ తాళంచెవి ఆమె దగ్గరే ఉండాలి, స్త్రీలప్రాధమిక హక్కు ఇది. పుట్టబోయేది అమ్మాయి అని తెలిసి భార్యను బలవంతగా గర్భస్రావానికి గురిచేసే పురుషపుంగవులకి ఇది గుణపాఠం!
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.