మొదటి పాఠం

-విజయ మంచెం

          ఇదే రోడ్డు మీద ఇప్పటికి ఒక  పది సార్లు తిరిగి వుంటాను. అపర్ణ ఎక్కడ బస్ దిగాలో సరిగ్గా చెప్పలేదు. ఖచ్చితంగా పొద్దున్న ఎక్కిన చోటు అయితే ఇది కాదు. ఖర్మ! అయినా నాకు బుద్ది వుండాలి. సరిగ్గా తెలుసుకోవాలి కదా! దేశం కాని దేశం. అమ్మ వద్దు, ఇక్కడే చదువుకో అంటే విన్నానా?

          అపుడే రాత్రి 8 అయింది. యూనివర్సిటీ మొదటి రోజు. ఏదో ఉద్దరిద్దామని వచ్చి ఇక్కడ తప్పిపోయాను. విపరీతమైన చలి. భగవంతుడా! ఎక్కడికి తీసుకొచ్చి పడేసావయ్యా నన్ను. ఇక్కడ రోడ్డు మీద నడిచే మనుషులు వుండరా? ఇన్ని కారులు!  ఫ్లై ఓవర్లు!! ఎవర్ని అడగాలి? అడ్రెస్ తెలుసు, కానీ ఎలా వెళ్ళాలి? ఫోన్ లేదు. సిమ్ కార్డ్ వేయించి వుంచుతా అంది అపర్ణ. చేతిలో డబ్బులు లేవు. డే బస్ పాస్ తప్ప!

          అటు ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను. కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఆకలి వేస్తుంది, ఏడుపు వస్తుంది.

          అయినా  వీడెవడు? నన్నే చూస్తున్నాడు అప్పటినుండి! నల్ల జాతీయుడులా వున్నాడు. వాళ్ళతో జాగర్త అని ఒక ఫ్రెండ్ చెప్పింది. నన్ను కిడ్నాప్ అయితే చెయ్యడు కదా! మళ్లీ ఇటు రాకూడదు. వడి వడిగా నడవడం మొదలెట్టాను. నా వెనకాలే వస్తున్నాడు. ఇంత బతుకు బతికి ఈ దేశంలో ఇలా కిడ్నాప్ అవ్వాలని రాసి పెట్టి వుందేమో! వాడు స్పీడు పెంచుతున్నాడు.  నేను చిన్నగా పరుగు మొదలెట్టాను.

          “హలో సిస్టర్!”

          నీకు దణ్ణం పెడతాను నన్ను వదిలెయ్యరా బాబు!

          “కేన్ ఐ హెల్ప్ యూ?”

          కావాలంటే అడిగేదాన్ని కదా! వద్దు వెళ్ళిపో!

          కాళ్ళల్లో వొణుకు. హెల్ప్ అని గట్టిగా అరుద్దామంటే మాట రావట్లేదు. ఒకవేళ అరిచినా ఎవ్వరికీ వినిపించదు. ఒక్క పిట్ట కూడా లేదు చుట్టుపక్కల!

          వాడు ఒక్క పరుగున నా ముందుకు వచ్చాడు. ఇంక తప్పించుకునే దారి లేదు.  ఏడవడం మొదలెట్టాను.

           “ప్లీజ్  లెట్  మీ గో!”

          “ఏడవద్దు ప్లీజ్! నిన్నేమీ చెయ్యను, అప్పటి నుండి ఇక్కడే తిరుగుతున్నావు. యూ సీమ్ టుబి లాస్ట్! ఎవరికైనా ఫోన్ చేయాలా? పోలీస్ కి ఫోన్ చేయనా? వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు నిన్ను మీ ఇంటికి”.

          పోలీస్ అని వాడు అంటే  కొంచెం భయం తగ్గింది.

          “వద్దు, ప్లీజ్ గెట్  మి ఎ  టాక్సీ, ఐ విల్ గో”.

          వాడు ఫోన్ కలపడం, టాక్సీ  రావడం వెంటనే జరిగాయి.

          బ్లాక్ క్యాబ్! పర్లేదు నమ్మొచ్చు. ఎక్కి అతనికి థాంక్స్ చెప్పాను. 5 నిమిషాల్లో ఇంట్లో ఉన్నాను.

          అపర్ణ కంగారు పడినట్టుంది పాపం. టాక్సీ కి తను  పే చేసేసింది.

          అయినా  అలా ఎలా అపార్థం చేసుకున్నాను నేను అతన్ని?

          మనిషి రంగు, రూపం, జాతిని బట్టి ఎలాంటివాడో జడ్జ్  చేయకూడదు అని,  ఆరోజు, ఆ దేశం లో నేను నేర్చుకున్న మొదటి పాఠం అది.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.