రుద్రమదేవి-7 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

          ముత్యాలు ఆకంచం వైపూ , అత్త వైపూ చూస్తుండగా “నీ అమ్మింట్లోలా వేడి వేడి అన్నం దొరకదిక్కడ. రోజూ ఇదే తినాలి, చెప్పిన పనల్లా చేయాలి. వాడి గదిలోకెల్లి  పడుకోక , ఈ వంట గదిలో చాపేసుకు పడుకో. నాకు తెలీకుండా వాడితో మాట్లాడావో !జాగ్రత్త ” అంటూ చూపుడు వేలెత్తి  ఊపుతూ చెప్తున్న అత్తగారిమాటలు అర్ధంకాక తెల్ల ముఖం వేసింది ముత్యాలు.  

          ఆడపడుచు చెంచులక్ష్మి ,పిల్లలు నలుగురితో కలిసి ఇంట్లోనే ఉంటుంది, ఒక్కపనీ ముట్టదు. ఆమె పిల్లలు చిన్నసైజు బకాసులు. రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటారు, గోల చేస్తూనే ఉంటారు, ఇల్లంతా మురికి చేస్తూనే ఉంటారు. మళ్ళా మళ్ళా ఎన్నోమార్లు  ఇల్లు తుడు స్తూనే ఉండాల్సి వస్తున్నది ముత్యాలుకు. వాళ్ళందరి బట్టలూ తనే ఉతకటం. అంట్ల గిన్నెలు తోమటం , గోదారి నుంచీ కనీసం నాల్గు బిందెల నీరు మోయటం, అంతా అలవాటు లేని కొత్త కొత్త , పెద్ద పెద్ద  పనులు, ఉత్త కడుపుతో మధ్యాహ్నం మూడు వరకూ ఉండి , అప్పుడు రాత్రి మిగిలిన ఎండిన మెతుకులు ఉత్తి చారు నీళ్లతో చాలీచాలకండా తినటం, రాత్రికి పాసి పోయి కంపు కొడుతున్న మెతుకులు కడుక్కుని తిన సాగింది ముత్యాలు.

          క్రింద వంటరిగా ఆ కొత్త ప్రాంతంలో నేలపై పడుకోడం రాత్రిపూట  ఎలుకలూ, బొద్దెంకల వంటివి ఆ వంట గదిలో తిరగటం భయం భయంగా నిద్రేలేక రాత్రంతా మేలుకుని ఉంటూ, తిండి సరిగా లేక నీరసించి పోసాగింది ముత్యాలు. వంటి రంగు మారి పోయింది, జుట్టురాల సాగింది, అసలే సన్నగా ఉండే ముత్యాలు సగమై పోయింది. భుజంపై నీటి బిందె మోయటం వలన భుజం పుండు పడి రక్తం రాసాగింది. తనతో మాట్లాడేవారు కాని, తనక్షేమం విచారించే వారుకానీ ఎవ్వరూ లేరు. భర్త లక్ష్మీనరసు  తినటానికికూడా  తల్లి అనుఙ్ఞతోనే నోరు తెరచే, నోరుండీ  తెరవ లేని మనిషని త్వరలోనే ముత్యాలు గుర్తించింది. 

          మామగారు ఇంటి వ్యవహారాలేవీ పట్టించుకోడు. తన పొలం పనులేమో తనేమో. ఒక రోజున వర్షంలో తడిసి జలుబు భారంతో ఇంట్లోనే ఉన్న మామ బాపయ్య , కోడలు ముత్యాలు ఇల్లు మూడు నాల్గు మార్లు చిమ్మటం, గిన్నెలు ఒక్కర్తే తోమటం , గోదారినీరు ఒక్కర్తే  పెద్దఇత్తడి బిందెతో తేవటం ,పిల్ల నీరసంగా ఉండటం గమనించి ” ఏమ్మా! ముత్యాలూ ! ఒంట్లో బావుండటం లేదా! సుస్తీ ఏమైనా చేసిందా? అలా ఉన్నావేమ్మా!” అని అడగటంతో లోలోపలి దుఃఖం ఒక్కసారిగా పొంగి పొరలి వెక్కివెక్కి ఏడ్వసాగింది. బాపయ్య లోపలికి కేకేసి”ఏమే! భానూ ! అమ్మాయి చేత ఇంటి పనంతా చేయిస్తున్నావా? ఆదయ్యమేం చేస్తున్నది? తిని కూర్చోపోతే కాస్త సాయం చేయొచ్చుగా అమ్మాయికి ?” అని అడిగాడు.   

          వెంటనే భానుమతమ్మ బయటికి వచ్చి ” ఏమే! నీకెంత ధైర్యం!మామగారితో మాట్లాడతావా? నిన్నేదో బాధ పెడుతున్నట్లు చెప్పుకుంటావా? ఆరునెల్లైతే ఇంత వరకూ కట్నం డబ్బివ్వలేదు మీనాయన ,కన్నాడు  తగుదునమ్మాని ముంగిదాన్ని నిన్ను కట్టబెట్టాడు .” అంటూ ముత్యాలు తలపై చేతిలో ఉన్న ఇత్తడి తట్టతో మోదింది. 

          క్రింద పడబోయిన కోడల్నిపట్టుకుని “ఏమే!నీదోష్ట్యం కూలా!నీక్రూరత్వం పెరిగి పోతున్నది ?పసి పిల్లనిలాగేనా చూట్టం? ఆమెనాకు చెప్పటమేంటే !నేనే అడిగాను పిల్ల ఇలా తగ్గి పోతుందేమాని? అమ్మా నీ వెళ్ళు  లోపలకు. నీవేకదా పంట డబ్బుచేతి కొచ్చాక కట్నం డబ్బివ్వమని చెప్పి పెళ్ళి చేయమని కోరావు? ఇప్పుడిలా మాట్లాడ తావేంటే !” ఆశ్చర్యంగా అన్నాడు బాపయ్య.   

          ” నీకెందుకయ్యా ఇవంతా? నీ పొలం పనులు నీవు చూసుకో ! ఇంటి విషయాల్లో తల దూర్చకు. ఇంటి ఆడ పడుచు పనులు చేయటమేంటి? మతుండే మాట్లాడుతున్నావుటయ్యా! “

          ” మరి అది అత్తింట ఏంచేసి ఇక్కడికి వచ్చి ఉంటున్నదే! అదీ వెళ్ళి అత్తింట అన్నిపనులూ చేసుకోక ఇక్కడుందేం?  తల్లిగా దాని కాపురం చక్కబెట్టక దాన్ని మేపుతూ తలకెత్తి ఇక్కడ పెట్టుకున్నావ్ ? దాని భవిష్యత్తేంటో ఎప్పుడైనాలోచించావా?” కోపంగా మట్లాడుతున్న బాపయ్యను చూస్తూ  ” ఇదిగోచూడూ  ఇంటి విషయాల్లో తలదూర్చితే ఈ మోకుతో ఉరేసుకు చస్తాను ,జాగ్రత్త.” అంటూ పిల్లలకు ఉయ్యాల  ఊగను వసారాలో కట్టిన మోకు మెడకు చుట్టుకోబోయింది, చస్తానని బెదిరిస్తూ.. 

          ” నీ అసాధ్యంకూలా !పాపిష్టిదానా!కూతురు లాంటి కోడల్ని బాధించకే అంటే నేరమైందా ! అది ఇంటి విషయాల్లో కలుగజేసుకోడమా? కూతుర్నికన్నావ్ ఎందుకూ ! పిల్లలున్న గొడ్రాలువే నువ్వు..” అంటూ కండువా భుజానేసుకుని, చెప్పులేసుకుని  బయటికెళ్ళి పోయాడు బాపయ్య.

          అతడలా వెళ్లగానే ” ఏమే ముత్తెం ? నీకెంత ధైర్యం! మీ మామతో చెప్తావా? ” అంటూ పొడవైన జడ పట్టుకుని మెడ చుట్టూ చుట్టి గిరగిరా తిప్పింది” భానుమతమ్మ. బాధతో గిలగిలలాడుతూ మెడ చుట్టూ జడ బిగవడంతో ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయింది ముత్యాలు.

          ఆమెభర్త లక్ష్మీనరసు -” అమ్మా! పాపం దాన్నలా కొట్టకే అసలే  ఊపిరి తిరగని పనులతో రోగిష్టిదాన్లా ఐపోయింది, పొద్దుటి నుండీ ఎమీపెట్టలేదు దానికి ,ఇంత పని చేస్తుంటే ఎందుకే దాన్నలా కొడతావ్?” అని చాలా కాలానికి నోరు మెదిపి ,దగ్గరికొచ్చి భార్యను పైకి లేపాడు .

          ” ఏరా! ఇది నీకూ మీనాయనకూ మందుగాని పెట్టిందా ! ఇద్దరూ దాన్ని వెనకేసు కొస్తున్నారు ? ఏమే వీళ్ళకేమైనా పెట్టావా?”  అంటు దగ్గర కొచ్చి నెత్తిన చేతులో ఉన్న కొయ్య గరిటెతో తలపై కొట్ట సాగింది. మళ్ళీ ముత్యాలు భరించలేని బాధతో కేకలుపెట్టి క్రింద  పడింది.

          ఇంతలో పోస్ట్ అనేకేక వినిపించి ” ఒరే దాన్ని దొడ్లోకి లాక్కెళ్ళు ఎవరో వస్తున్నారు ” అంటూ సావిడి తలుపు వారగా వేసి బయటి కెళ్ళింది భానుమతమ్మ.

          లక్ష్మీ నరసు ముత్యాల్ని లేపి పట్టుకుని దొడ్లో బావివద్ద ఉన్న బాదం చెట్టు నీడకు తీసుకెళ్ళి , కాసిని నీళ్ళు తాగించి అక్కడ ఉన్నమట్టి అరుగుపై పడుకో బెట్టాడు.

          ” పాపం! ముత్యాలూ ! మా అమ్మ రాకాసి.  అందుకే ఎవ్వరూ నాకు పిల్లనివ్వక పోతే మీనాయనగారు ఎవ్వర్నీ విచారించకుండా నాకునిన్నిచ్చి చేశాడు.మా అక్క అత్తింటి కెళ్ళదు ,ఆయనే యాడాదికో మారు వచ్చికొన్నాళ్ళుండి వెళుతుంటాడు. దీని రాకాసితనం వాళ్ళత్త భరించలేక దీన్ని తరిమేసింది. ఆకోపం  నీమీద చూపు తున్నది మా అమ్మ, మీ నాయన వస్తే నీవెళ్ళి పో మీ అమ్మింటికి , లేకపోతే మాయమ్మ నిన్ను బతకనివ్వదు ముత్యాలూ!” అంటూ కళ్ళనీళ్ళు పెట్టు కుంటున్న భర్త ను చూసి జాలిగా నవ్వుకుంది ముత్యాలు.  

          ” ఒరే ఎక్కడున్నావురా ! రాయిటు. ఈ కారుడు ముక్క చదివి పోరా! నీపెళ్ళా మేం చావదులే! ” అంటూ కేకేస్తున్న తల్లిమాటలకు లోపలికి పరుగెత్తాడు  లక్ష్మీనరసు.

          తల్లి అందించిన కార్డు ముందు లోపల చదువుకుని  , ఆతర్వాత పైకి చదివాడు ” అమ్మా! ముత్యాలు తండ్రిగారు ,కట్నం పైకం తీసుకుని ఒకపక్షం రోజుల్లో వస్తున్నాట్ట . కొన్నిదినాలు దాన్నివాళ్ళ తండ్రి గారితో పంపవే కాస్త ఒళ్ళునయం చేసుకుని వస్తుంది ” అన్నాడు ధైర్యం చేసి , ముత్యాలు పడే బాధ నోరులేని లక్ష్మీనరసుకు సైతం నోరిచ్చింది.                                                                     

          ” అయ్యో! అతగా డొస్తున్నాడా! దీన్ని ఇట్టా చూస్తే మనపై కోపమొచ్చి ఎప్పటికీ ఇహ ఇక్కడికి మళ్ళా పంపడు ,ఇంటెడు చాకిరీ ఇహ నా పైన పడుతుంది. ఎట్టాగైనా అతగాడ్నిఆపాల , ” అంటూ చక చక ఆలోచించి ” ఒరే నరసూ ! మీమామ రాకుండా ఆపాల్రా! కారుడ్డు తీసుకురాపో , ఉత్తరం ముక్కరాయి , మీ నాయనే వెళ్ళి కట్నం డబ్బు తీసుకోను వస్తాడనీ ఆయన్నిరావద్దనీ, ‘ మీకంత శ్రమివ్వటం  నాకిష్టం లేదు , అందువల్ల మేమే వచ్చి ఆపైకం తీసుకుంటామనీ ‘ రాసి పడేయ్ ! నా విషయం తెల్సుగా! చెప్పినట్లు చేయకపోతే నీకూ మెతుకులుండవ్ నీ పెళ్ళంలాగానే ” అంటూ గుడ్లురిమిచూసింది లక్ష్మీ నరసు వైపు.   

          అలా పెరట్లో పడిఉన్న ముత్యాలును చూసినవారే లేరు, మధ్యాహ్నం భానుమతమ్మ నిద్ర పోతున్న  సమయంలో లక్ష్మీనరసు ఒక గ్లాసుడు పాలు తీసు కెళ్ళిఇచ్చి , దుప్పటికప్పి వచ్చాడు. మరునాటికి కాస్త తేరుకున్న ముత్యాలు ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి , ముగ్గేసి ,గిన్నెలు తోమి, బోర్లించింది. భారతమ్మ తన కూతురు పిల్లల కోసం పాలలో ,బెల్లం కలిపి పెద్ద కంచు గ్లాసుల నిండా పోసి ఇచ్చింది, ఆ నలుగురూ సగంతాగి, మిగిలినవి తెచ్చి ముత్యాలుకిచ్చి ” ఇదో అత్తా! ఈపాలు తీసుకెళ్ళి తొట్లో పొయ్యి, మా అమ్మమ్మ చూస్తే మమ్మల్నితిడుతుంది, పాలన్నీ తాగమని ” అంటూ ఆ నాలుగు గ్లాసుల పాలూ ఇచ్చారు. ఆకలితో ఉన్న ముత్యాలు ఆ పాలగ్లాసులు తీసుకుని దొడ్లో బాదం చెట్టు చాటుకెళ్ళి అన్నిగ్లాసుల్లో పాలూ తాను గబగబా తాగేసి , అవి కడిగి తెచ్చి ఇంట్లో బోర్లించింది. ఆపాలతో ముత్యాలుకు ఎక్కడలేని బలం వచ్చినటైంది. అత్తింటికి వచ్చాక ఎన్నడూ ఉదయాన్నే ఇలాపాలు తాగిందే లేదు.

          పైగా నిన్న వంటికి తగిలిన దెబ్బలకు ఒళ్ళు అలసిపోయి రాత్రంతా జ్వరంతో పడుండటాన ఆ పాలు శక్తినిచ్చి ప్రాణంలే చొచ్చినట్లైంది..  ‘ఇంట్లో ఎంగిలిచేయి తగిలితేనే దాన్ని పారేసే తాను , ఏనాడూ ఎంగిలి పదార్ధాలు  తినని తాను ఇలా నలుగురి ఎంగిలి పాలు తాగటం, ఇలాంటి అత్త ఉన్న ఇంట్లో పడటం తన పూర్వ జన్మ ఖర్మ ఫలంకాక మరేంటి?  అలా ఎంగిలైందని పుట్టింట  పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని తాను పారేసిన పాపమే తనకు అన్నంమెతుకులు లేకుండా ఆకలికి అల్లాడేలా చేస్తున్నదేమోనని’ లోలోపల కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ముత్యాలు.  

          “ఏమే ఎక్కడ చచ్చావ్ ? గోదారికెళ్ళి నీళ్ళు తెచ్చేదేమైన ఉందా ఈపూట?  మొగుడు నీకు వత్తాసు పలుకుతున్నాడని పనిఎగ్గొడదామనుకుంటున్నావేమో! ఆ పప్పులేం ఉడకవు నా దగ్గర. పో బిందెత్తుకుని ” అంటూ బిందెను ముత్యాలు భుజంపై ఎత్తి కొట్టింది. అసలే గాయమై రక్తంగడ్డ కట్టి ఉన్న భుజంపై ఒక్కసారిగా పెద్ద బుట్టంత ఇత్తడి బిందెతో దెబ్బ పడటంతో రక్తం చిమ్మింది” అమ్మా!” అని పెద్దగా అరిచింది ముత్యాలు బాధ భరించలేక .

          ” ఏందమ్మా! మళ్ళాకొట్టావా దాన్ని? అసలే రాత్రంతా జ్వరంతో ఆచెట్టుక్రింద అరుగుపై చలికి వణుకుతూ పడుంది .ఐనా పొద్దుటే లేచి పనులు చేస్తూనే ఉందిగా , ఎందుకే ఊరికే దాన్నిలా కొడతావ్?” అంటూ పెరట్లోకొచ్చిన కొడుకువైపు చిత్రంగా చూస్తూ ” ఏరా ముంగీ! నీకూ నోరొస్తోందే! పదినెల్లక్రితంపెళ్ళైన పెళ్ళామంటే అంత ప్రేమ ముంచుకొస్తోందేం? కని పద్దెనిమిదేళ్ళు పెంచిన తల్లిమీద ఏ అభిమానమూ లేదుట్రా నీకు? అందుకే అన్నారు, ‘తల్లి అల్లం -పెళ్ళాం బెల్లం’  అని.” అంటూ కొడుకుపై హుంకరించింది భానుమతమ్మ. 

          ” నీ నోటికి ఝడిసే నాయనగారు ఇంట్లోనే  ఉండటం తగ్గించేశారు. ఇరుగు పొరుగుకు నిన్ను చూడనే భయ పడుతుంటారు. నీకేమి అపకారం చేసిందే నీకోడలు అంతలా రాచిరంపాన పెడుతున్నావ్ ? దానిమీద నీకు జాలే లేదా? దాన్నివాళ్ళ అమ్మింటికి పంపించేయి.” ప్రతిరోజూ అంతా చూస్తున్న లక్ష్మీనరసు భరించలేక తల్లి అంటే ఉండే భయాన్ని వదిలేసి  మాట్లాడసాగాడు.      

*****

(ఇంకా ఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.