నీవే తల్లివి… తండ్రివి

-చిట్టత్తూరు మునిగోపాల్

          “అవునా, మీకు పెళ్లయిందా… అప్పుడే.” ఆశ్చర్యపోయాడు రామన్.

          ” అంతేనా… ఇద్దరు పిల్లలు కూడా. పాపేమో నైన్త్, బాబేమో సెవెంత్.” సుజాత.

          నోరు తెరిచేశాడు రామన్. చివరికి నిరాశగా… “అలా కనిపించరే” అన్నాడు.

          “అవునా, మా ఫ్రెండ్సు కూడా అదే చెబుతారు” మురిసిపోయింది.

          “మీ హస్బెండ్ ఏమి చేస్తారు ?” అడిగింది.. అంతదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న మధుమిత.

          “ఏదో కంపెనీలో నైట్ వాచ్మేన్ గా పని చేస్తాడు. ఆ మధ్య యాక్సిడెంటు అయి అతడి కాలికి చిన్న దెబ్బ తగిలింది. నేనే కట్టు కట్టి ట్రీట్మెంటు ఇచ్చాను. అది గ్యాంగ్రైనుగా మారింది.  నడవలేని స్థితికి వచ్చాడు.”

          “అయ్యో ఎంత కష్టమొచ్చింది. ఇప్పుడేమి చేస్తున్నారు. ఒక్క జీతంతో ఇల్లు ఎలా గడుస్తోంది.” జాలి చూపబోయాడు రామన్.

          “ఇల్లు, భార్య, పిల్లలను అతడు ఎప్పుడు పట్టించుకున్నాడని. వాడిని దూరంగా పెట్టి చాలాకాలం అయింది. ఆ తర్వాతే యాక్సిడెంటు జరిగింది. ఎంతైనా భర్త కదా. పైగా నర్సును. ఉండబట్టలేక నేనే ట్రీట్మెంటు ఇచ్చాను. అప్పుడప్పుడూ వెళ్ళి చూసి వస్తున్నాను. మమ్మల్ని పట్టించుకోని తనమీద ఇంతకు మించి జాలి పడితే వీలుపడదు నాకు. నేనూ పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి కదా.” నిర్లిప్తంగా చెప్పి పేషెంట్లకు సంబంధించిన రికార్డులో తల దూర్చేసింది సుజాత. అందాకా ద్వంద్వార్థపు మాటలతో చెలరేగి పోయిన రామన్ నోరు మూత పడిపోయింది. ఇద్దరు పిల్లలతో అలాగా బతి కేస్తున్న ఆమె ధీరత్వానికి, తమను పట్టించుకోని మొగుడిని కాదనుకున్న తెగువకు భయపడిపోయాడు కాబోలు. నర్సు సుజాతది చిత్తూరు పక్కన పల్లె అట. మిగిలిన నర్సులు, అటెండర్లు, ఆయాలు అందరు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు. బతుకుతెరువు కోసం వచ్చి ఇక్కడ చాలీ చాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నవారే. వివిధ భాషలు కలగలిసిన వింతైన మరో శంకర భాషలో సాగింది వారి సంభాషణంతా.

          బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రి అది. అక్కడ వైద్యం చాలా ఖరీదు. ఐసీయూలో అయితే మరీనూ. కోవిడ్ పాలబడి, కుప్పంలోని పీయీఎస్ లో లాభం లేదన్నాక, నా సతీమణి ఝాన్సీ ఇక్కడకు తీసుకొచ్చి చేర్చింది. నా నోటిని, ముక్కును కలుపుతూ ఆక్సిజన్ మాస్క్ పెట్టి అది ఊడి రాకుండా వెనుక మెడకు పట్టీ గట్టిగా బిగించారు. నడుము నుంచి కాస్త పైకెత్తిన బెడ్ మీద శ్వాస అతి కష్టమ్మీద తీసుకుంటున్నాను. ఆక్సిజన్ మాస్క్ వల్ల తల కాస్తైనా అటుయిటూ తిప్పేందుకు లేదు. పైన ఫాల్స్ సీలింగుకు నలుచదరపు లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నేను కదులుతున్న సవ్వడి వినిపించింది కాబోలు… “ఏమంకుల్ ఏమి కావాలి. నిద్ర పట్టడం లేదా ?  మీకు బాగైపోతుంది. ధైర్యంగా ఉందండి. మూడు నాలుగు రోజుల్లో ఇంటికి వెళ్ళి పోవచ్చు.” చూస్తున్న రికార్డు పక్కన పెట్టి లేచివచ్చి అనునయంగా చెప్పింది సుజాత. ఆమె వంక అబ్బురంగా చూశాను. “ఏమీ లేదు” అన్నట్లుగా ఖాళీగా ఉన్న ఎడమ అరచేతిని కదిలించాను. పక్కనే ఉన్న స్టాండుకు తగిలించిన చిన్నపాటి బాటిల్ నుంచి 15 వేల రూపాయలు ఖరీదు చేసే ఇంజక్షన్ కుడి చేతికి గుచ్చిన కెనాల్ ద్వారా నరాల్లోకి ఎక్కుతోంది మరి. రోజుకొకటి చొప్పున పదిహేను రోజులు పోవాలట ఆ ఇంజక్షన్, లోపలికి. రక్తంలో కలవాలట. ఇంకోవైపు జరుగుతూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటిగా… ఎక్స్ రేలు, స్కానింగ్ లు.

          నాచూపుల్లో దీనత్వం కనిపించిందేమో… ఊరడింపుగా నా భుజం తట్టి వెళ్ళి యథా స్థానంలో కూర్చుంది సుజాత. ఒక్క సుజాతే కాదు… నర్సులు, వార్డుబాయ్ లు, ఆయాలు ఎంత నెమ్మదిగా ఉంటారో. వారు కురిపించే మెత్తటి చిరునవ్వులే… మందుల కంటే ఎక్కువగా రోగులను ఆరోగ్యవంతులను చేసి ఇంటికి సాదరంగా సాగనంపుతాయి. కష్టాల కొలిమిలో కాలుతూనే, రోగుల పట్ల అంతటి మానవత్వం, దయ, కారుణ్యం చూపడం ఎలా వీలవుతుందో. చిరునవ్వులు పంచే ఓర్పు ఎవరిస్తున్నారో.

          నిజానికి కాసులతో గలగలలాడే కార్పొరేట్ ఆస్పత్రిలో అట్టడుగున ఉన్న గడ్డిపూలు నర్సులు. వారిలో చాలా మంది వ్యక్తిగత జీవితాలు అల్లకల్లోలం. అయినా తట్టుకుని నిలబడుతున్నారు. తమను ఆశ్రయిస్తున్న రోగుల జీవితాలు నిలబెడుతున్నారు. స్త్రీత్వంలోనే ఆ ధీరత్వం సహజాతమేమో.

          ప్రాణాలు నిలబెట్టడం కష్టమని చేతులెత్తేశారు వైద్యులు. “బెంగళూరు వెళ్ళడం మంచిది. అక్కడికి వెళ్లినా ఏమవుతుందో చెప్పలేము.” అని చెప్పేశారు. ఆమె అమ్మానాన్నా, మా అమ్మ, అక్కాబావా ఉన్నా నిర్ణయాన్ని ఆమెదేనని చెప్పి పక్కకు తప్పుకున్నారు. ఆమెకు కూడా కోవిడ్ పాజిటివ్. కాకపోతే నేను చావుబతుకుల్లో ఉంటే… ఊపిరి తిరగనివ్వని దగ్గు, ఒళ్ళు కాలిపోతున్న జ్వరం, లేవనివ్వని నీరసం. అప్పటికి ఐదారు రోజులుగా తిండి లేదు. ఎదుటివాళ్లు చెప్పే ధైర్య వచనాల్లోనే అధైర్యం ముందు కొచ్చి భయపెడుతోంది.

          ఏమి చేసిందో, ఎవరిని ఏమని బతిమాలుకుందో… మరో గంటకల్లా అంబులెన్సులో మేము. తోడుగా పల్మనాలజిస్టుతోపాటు, మరో టెక్నీషియన్. నేను సరే, కృత్రిమ శ్వాశ సాయంతో కాస్త బాగానే ఉన్నాను. సుజాత మెడ వేలాడేస్తోంది. బాధిస్తున్న కోవిడ్ లక్షణాలతో ముందుకు వొంగి ఎగ శ్వాశ దిగ శ్వాశలతో ఆమె వల్ల కావడం లేదు. పైగా బెంగళూరు చేరేలోపు నేనేమైపోతానో అన్న ఆందోళన ఒకవైపు.

          మాగన్నుగా నిద్రపట్టి కళ్ళు తెరిచేసరికి ఈ ఐసీయూలో ఉన్నాను.

          “ఏమండీ, ఎందుకేడుస్తున్నారు. మీకేమీ కాదు. చిన్న ఇన్ఫెక్షన్ తప్ప మరే సమస్యా లేదట. డాక్టర్లు చెప్పారు.” ఉబికి వస్తున్న కన్నీళ్లను నాకు కనిపించకుండా కళ్ల వెనుకే బలవంతంగా అణచేస్తూ సుజాత నా ఎదురుగా నిలబడి ఉంది.

          “ఈ కన్నీళ్లు నాకేమవుతుందోనన్న భయంతో కాదే పిచ్చీ. నా సేవలో నువ్వేమైపోతావో నన్న దిగులుతో…” ఆక్సిజన్ మాస్క్ వల్ల మాట గొంతు దాటి బయటకు రాలేదు. “నాకు భయం లేదు” అని మాత్రం బలహీనంగా చెప్పి, వెళ్లమన్నట్లుగా చెయ్యి ఊపాను.

          జీవితం చేజారిపోతున్నప్పుడే తెలుస్తుంది ఎవరి విలువ ఏమిటో. పదీ పదిహేను రోజుల ముందటి సంగతి. కాలిమీద కాలు వేసుకుని వరండాలో కూచుని తాపీగా పేపరు చదువుతున్నాను.

          “ఏమండీ, ఒక మాట అడగనా?” టీ కప్పు చేతికిస్తూ అడిగింది సుజాత.”

          “ఏమిటో చెప్పు…” తీసుకుంటూ అన్నాను చిరాగ్గా.

          “మీరు కోప్పడనంటేనే చెబుతా.”

          “చెప్పమన్నానా…” చిరాకు పెరిగింది నా గొంతులో.

          “బెంగళూరులో కార్పొరేట్ ఆస్పత్రి అట. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదో ఆఫర్ చేస్తున్నదట. మనం కూడా తీసుకుందామా. కోవిడ్ పాండమిక్ స్టేజ్ కు చేరింది. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఆ ఇన్సూరెన్స్ మనం కూడా తీసుకుందామా?” చెప్పింది జంకుతూ.

          “నేను చచ్చాననుకున్నావా? ఇన్సూరెన్స్ అంటున్నావ్. అంత మాత్రం ధైర్యం లేకపోతే ఎలా? పిల్లలు ముక్కు చీదితే ఏడుస్తావ్. నీకు కాలోచెయ్యో కాస్త నొప్పి వేస్తే గగ్గోలు పెట్టేస్తావ్. నువ్వు, నేను ఇప్పుడప్పుడే చావం లే. నీ భయంతో చచ్చిపోతున్నాను.” విదిలించి పారేశాను.

          ఆలోచనల్లోంచి బయటకు వచ్చి తల నెమ్మదిగా తిప్పి చూశాను. నిస్త్రాణగా కూచుని ఉంది నా బెడ్ పక్కనే ఉన్న దివాన్ లాంటి కాట్ మీద. రాత్రిపగలూ నిద్ర లేదు కదా నా సేవలో.

          ఎందుకో అమ్మ గుర్తుకు వచ్చింది.

          “సుజాతా…” పిలిచాను.”

          “ఆ… ఏమి కావాలండీ…” ఉలిక్కిపడినట్లుగా లేచి దగ్గరకు వచ్చింది.

          “అమ్మకు వీడియో కాల్ చేయవా. మాట్లాడలేక పోయినా ఒక్కసారి చూస్తాను. నా విషయంలో ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది. నేను కనబడితే అదో ఓదార్పు.” చెప్పాను.

          “అమ్మా… అమ్మ బయటేక్కడో ఉన్నారట. ఇంతకు ముందే టీ కోసం క్యాంటీన్ కు వెళ్ళినపుడు మా అమ్మ చెప్పింది. వాళ్ళింట్లోనే కదా, అత్తయ్య, పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత ఫోన్ చేయిస్తానని చెప్పింది.

          ఆమె నుంచి ఈ సమాధానాన్ని ఊహించాను నేను. వీడియోకాల్ ద్వారా అమ్మతో మాట్లాడించమని కోరడం ఇది మూడోసారి. ప్రతిసారీ ఈ సమాధానమే వస్తోంది. అత్తగారుగా అమ్మపైన ఉన్న కసిని సుజాత ఈ రకంగా తీర్చుకుంటోందా?

          “నీకు కనికరం ఏమైనా ఉందా? నీకు, అమ్మకు మధ్య సవాలక్ష ఉండొచ్చు. నిజంగానే ఆమె నిన్ను రాచిరంపాన పెట్టి ఉండొచ్చు. ఆ కసిని ఇప్పుడిలా తీర్చుకోడం భావ్యమేనా?” అరిచేయాలన్న ఆవేశం ముంచుకొచ్చింది. గుండెకు అటాచ్ చేసిన  మానిటర్లో హార్ట్ బీట్ అమాంతం పెరిగి, పల్స్ ఒక్కసారిగా పడిపోయింది.

          “డాక్టర్…” సుజాత పెట్టిన పెనుకేకకు, పరుగులు తీసుకుంటూ వచ్చేశారు డాక్టర్లు. నన్ను చుట్టుముట్టి పోతున్న ప్రాణాలను పట్టుకొచ్చి పోశారు తిరిగి శరీరంలో.

          “మీకో విషయం చెబుతా, టెన్షన్ పడకండి…” ఐసీయూ గండం గడిచి స్పెషల్ వార్డుకొచ్చి పడ్డాక, రెండు రోజులు మౌనంగా ఉండి, నాలుగో రోజున అంది సుజాత.

          “ఏమిటి?”

          “అమ్మ, అదే అత్తయ్య కూడా ఈ వార్డు ఎదురుగానే జనరల్ వార్డులో అడ్మిట్ అయ్యూన్నారు. కోవిడ్ పాజిటివ్ ఆమెకు కూడా. డయాబెటిక్ కావడమే కాదు, హైబీపీ పేషెంట్ కదా… కోలుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు డాక్టర్లు. మీరు కంగారు పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారనే ఇంతకాలం చెప్పలేదు… క్షమించండి.” ఒకపక్క చెబుతూనే ఇంకా నా శరీరాన్ని వేదని మానిటర్ ను చూస్తూ చెప్పింది ఒక్కో పదమే నెమ్మదిగా.

          ఏమ్మాట్లాడేది? ఏమని స్పందించేది? ఈమె గురించా… తాను ఇంతకాలం ఏదేదో అనుకుంది?

          “నేను అత్తయ్య దగరికి వెళ్ళొస్తాను. ఆమె తిన్నారో లేదో. తినకపోతే చాలా కష్టం. జాగ్రత్తగా ఉండండి. బెడ్ దిగకండి. ఇప్పుడే వచ్చేస్తా.” తాను చెప్పిన విషయం విన్నా నా ప్రాణానికేమీ ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక చెప్పి, బయలుదేరింది. పావుగంట తర్వాత.

          “పిల్లలకు జిర్రున చీదినా కన్నీళ్లు పెట్టుకునే అబల. చిన్నపాటి కష్టానికే తట్టుకో లేని దీనురాలు. సమస్యలు వచ్చి పడినప్పుడు, పరిష్కారం కోసం ఏ నిర్ణయం తీసుకోలేని నిస్సహాయురాలు, నేను తోడు లేకుంటే ఈ పిచ్చిది ఎలా బతుకుతుంది.” ఆమె నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే భావన నాది. ఎందుకు కొరగాని గడ్డి పువ్వుతో పోల్చి ఆమెను ఎన్నిసార్లు ఈసడించుకున్నానో.

          ఇప్పుడు నా ప్రాణదాతే కాదు… నా తల్లి ప్రాణదాత కూడా సుజాతే.

          హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఆమె ఇచ్చిన సలహా విననందుకు పన్నెండు లక్షలు విలువ చేసే సైటు రెక్కలొచ్చి ఎగిరిపోయింది. అయితేనేం… నా భార్య విలువేమిటో నా సహధర్మచారిణి ధైర్యం, విలువ ఎంతటివో నాకు తెలిసి వచ్చింది.

          హఠాత్తుగా వచ్చిపడే పెనుగాలుల తాకిడికి భారీ వృక్షాలు నేల కూలుతాయి కానీ… ఏమి తెలియనట్లు నేలకంటుకుని అమాయకంగా కనిపించే గడ్డిపూలు తట్టుకుని నిటారుగా నిలబడుతాయన్న సత్యాన్ని ఇంతకాలం మరిచిపోయాను.

*****

ఇది కథ కాదు… నా స్వానుభవం…

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.