రుద్రమదేవి-11 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

          ” అమ్మా! రుద్రా ! చెప్పమ్మా! నీ అభిప్రాయం ” అని తాతగారడిగాక ,తండ్రీ ,తల్లీ చెప్పమన్నట్లు చూశాక రుద్ర నోరు విప్పి ” తాతగారూ! నా సమాజ సేవకూ, ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే , మీరు మిగతా విషయాలన్నీ వెళ్ళిచూసి, మాట్లాడి మీకు అంగీకారమైతే నాకూ సమ్మతమే ” అంది .

          ముగ్గురూ మురిపెంగా రుద్రమను చూసి ” మా తల్లి బంగారం , అందుకే భగవంతుడు శ్రమ పెట్టకుండానే మంచి సంబంధాన్ని ఇంటికే పంపాడు , నీ సమాజ సేవకూ, నీ మంచి తనానికీ భగవంతుడు మెచ్చి ఇచ్చిన వరం కాక మరేంటి రుద్రా!  ” అని మురుసి పోయారు.

          ” అమ్మా! మీరు తాతగారూ, నాయనగారూ నేర్పినవేగా అన్నీనీ ! నన్నుపొగడట మంటే మిమ్మల్ని మీరు పొగుడుకోడం, అని మరువకండి ” అంది చిరునవ్వుతో. 

          ” నిజమే సుమా ! మా రుద్రకు ఏది ఎలా ఆపాలో బాగా  తెల్సు. పదండి మరి, ఆ పెద్దమనిషిని అలా వంటరిగా కూర్చోబెట్టి వచ్చాం ” అనిపెద్దలు ముగ్గురూ చావిట్లోకి వెళ్ళాక, సుబ్బుసుందరి గభాల్న వచ్చి రుద్రను వాటేసుకుని …”రుద్రమ్మ పెళ్ళికూతు రాయెనే , మా మనసుల సంతసం నిండిపోయెనే ” అంటూ చుట్టూ తిప్పసాగింది. రుద్ర ” మా సుబ్బుసుందరి మాటేమిటోయ్ లక్ష్మీ నరసూ  !” అంటూ సుబ్బు బుగ్గలు నొక్కింది. సుబ్బు సిగ్గుతో ముడుచుకు పోయింది అత్తపత్తిలా. ఇంతలో వరాలు గబగబా వచ్చింది లోపల చాలా మంది ఉండటంతో వెనక్కు తగ్గింది.

          అదిచూసి, “ రారా వరాలూ! లోపలికిరా  ” అంటూ పెరిందేవి పిలవగానే గబగబా తల వంచుకుని లోపలికి వచ్చింది. చావిడి దాటి లోపలికి రాగానే అక్కడ రుద్రతో పాటుగా సుబ్బు సుందరీ ఉండటం ఇద్దరి ముఖాల్లో ఏదో కొత్తదనం కనిపించడం చూసి ఆశ్చర్యంగా చూసింది వరాలు.

          సుబ్బు” మన రుద్ర పెళ్ళికూతురవుతున్నదే వరం!” అంది. రుద్ర “మీ ఇద్దర్నీ పెళ్ళికూతుర్లను చేయందే నేనెక్కడ పెళ్ళికూతుర్నవుతాను. చూడూ ! వరాలూ! ఎక్కడో ఉన్న తెలీని వారికంటే మన రాఘవ చూడనూ బావుంటాడు ఇప్పుడు బాగా పని నేర్చుకుని ప్రమోషన్  లో ఉన్నాడు, పైగా డిగ్రీ పూర్తిచేశాడు, చాలాబుధ్ధి మంతుడై  పోయాడు. వాళ్ళ అక్క మాటకు ఇప్పుడు భయపడడు. వేరే ఇల్లు తీసుకుని ఉంటున్నాడు దూరంగా. ఇప్పుడు అతడు పాత మనిషికాదు సుమా! మీ ఇద్దరికి పెళ్ళి ఎందుకు చేసేయకూడదూ! అనిపిస్తున్నది వరాలూ !  ఆలోచించు. పెద్దల ఆశీర్వాదంతో మన ముగ్గురి పెళ్ళిళ్ళూ ఒకే మారు ఐపోతాయి” అంది రుద్ర.

          వరాలు బుగ్గ క్రింద చెయ్యిపెట్టి ఆలోచిస్తున్నట్లు నటించగా,”రుద్రా ! నీవు ఊర్లో లేనందున నీకు తెలీదు కానీ, వరాలు చేనేత వస్త్రాలయంలో ఉద్యోగంలో చేరాక వాళ్ళిద్దరూ చూపులు కలుపు కుంటూనే ఉన్నారోయ్! నీ అనుమతి కోసమే అతడూ ఎదురు చూస్తున్నాడల్లే ఉంది. అసలు వరాలు వచ్చింది అందుకేనేమోనోయ్ ! ఔనా వరాలూ!” అంది సుబ్బు.

          ముఖమంతా  కద్దగడ్డ చేసుకుని మధురంగా నవ్వింది వరాలు.

          “అర్ధమైంది లేవోయ్! పదండి అమ్మకు నాయనగారికీ, తాతయ్యగారికీనీ అన్నీ చెప్పేద్దాం.” అంటూ ఇద్దర్నీ రెక్కలు పుచ్చుకుని  చావిట్లోకి తీసు కొచ్చింది రుద్ర.

          ఆపాటికి పెళ్ళి సంబంధం కోసం వచ్చిన పెద్దమనిషి మాట్లడి వెళ్ళిపోడం కూడా ఐంది. తాతగారు ” రుద్ర ! మాబంగారూ! నీ అనుమతైందిగా అందుకే మేం వచ్చి మాట్లాడతాం, అని ఆ పెద్దమనిషికి చెప్పి పంపాం. మాటలన్నీఅయ్యాక అక్కడే ముహూర్తం పెట్టుకు రామా నీపెళ్ళికి?” అంటుండగా,

          ” తాతగారూ ! మీ మనవరాళ్ళు ఒక్కరా? ముగ్గురా? చెప్పండి, ఒక్కరి పెళ్ళి ఎలా చేస్తారు? ముగ్గురికీ ఒకే ముహూర్తానికి చేసేయ్యండి, ఇక్కడే మన చీరాల్లోని ఆర్య వైశ్య కళ్యాణ మంటపంలో. మన వాడవాడకూ మంచి భోజనాలు పెడదాం అంది. మాత్రం మనం మరువ రాదు ” అంది రుద్ర. తాత హనుమంతప్ప మహదానంద పడిపోగా, తండ్రి భానుచంద్ర , రుద్రతల్లి పెరిందేవి సంతోషం సాగరాలు దాటింది. అలా ముగ్గురు స్నేహితుల పెళ్ళిళ్ళూ ఓకే ముహూర్తానికి ఒకే మంటపంలో చీరాల్లో ఆర్య వైశ్య కళ్యాణ మంటపంలో రుద్ర అనుకున్నట్లే జరిగాయి.

          “రుద్రమదేవి మా ఇంటి కోడలై , నలుగురూ కొడుకులే ఐన మాకు కూతుర్లా మమ్మల్ని చూసుకుని కూతుర్లు లేని లోటు మాకు తీర్చుతుందని మా నమ్మకం. అందుకే మీ కుటుంబం గురించీ తెల్సుకుని సంబంధం కలుపుకోను ఆరాట పడ్డాం. మా రుద్రమ దేవి మా బంగారం ”  అంటూ మురిసి పోయింది రుద్రను నుదుటిపై ముద్దు పెట్టు కుంటూ  రుద్ర అత్తగారు.

          “మీ బంగారం కాదు వదినగారూ ! మన బంగారం.”అంది రుద్రతల్లి పెరిందేవి అందరి నవ్వులతో అక్కడ నవ్వుల పంట పండింది. 

*****

(సమాప్తం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.