గొంగళి పురుగులు

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

– పద్మజ కుందుర్తి

          నా హాస్పటల్ పనులు త్వరగా ముగించి టౌన్ హాలుకు హడావిడిగా వచ్చేసాను. అప్పటికే సమయం సాయంత్రం నాలుగు గంటలు అయిపోయింది. ఆ రోజు ‘మహిళా దినోత్సవం’ కూడ కావటంతో గవర్నమెంట్ మహిళా ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్ లో భాగంగా నా ఉపన్యాసం కూడా ఉంది. 

          మహిళలు ఇంటా బయటా పని వత్తిడిని తట్టుకుని, ఆఫీస్ పనిమీద ధ్యాస ఎలా పెట్టాలి?  అన్నది నేను ఎంచుకున్న అంశం. ఉదయం నించీ వాళ్లకు రకరకాల సెషన్స్ జరుగుతున్నాయి. 

          అక్కడ అందరూ హడావుడిగా కనిపించారు. అందరిలోనూ ఒక ఎర్రని చుడిదార్ వేసుకున్న ఒకావిడ, నా దృష్టిని ఆకర్షించింది. ఎవరో ఆఫీసర్ లాగ ఉంది అందరికీ ఆదేశాలు ఇస్తూ ఆ హాలంతా తానై తిరుగుతోంది. 

          ఇంకో పదినిముషాల్లో నా మీటింగ్ మొదలవుతోంది. అందుకు ఏర్పాట్లు చకచకా చేయిస్తోంది. ఆవిడని ఎక్కడో చూసాను కానీ ఎక్కడో గుర్తుకు రావడం లేదు. 

          కాసేపటికి తానే నాదగ్గరకు వచ్చి, “నమస్తే మేడం” అంటూ పలకరించి మంచినీళ్లు, కాఫీ తెప్పించింది. ఆవిడ అటు వెళ్ళగానే కాఫీ తెచ్చిన యువతిని అడిగాను. “ఆవిడ ఎవరూ?” అని. 

          “ఆవిడ మా జాయింట్ కలెక్టరు గారండీ” హుషారుగా చెప్పింది ఆ అమ్మాయి. అవునా! ఎక్కడో చూసానే అనుకుంటూ ఆలోచించాను. ఇంతలో స్టేజ్ మీదకి ఆహ్వానం రావడంతో ఆలోచనలు పక్కకు పెట్టి, స్టేజ్ పైకి వెళ్లి  మాట్లాడటంలో మునిగిపోయాను. 

          ఆ సెషన్ చాలా బాగా జరిగింది. ఎంతో ఉపయోగకరమైన విషయాలు తెలుసు కున్నామని అందరూ అభినందించారు. ఆవిడ కూడ “థాంక్యూ  సోమచ్ డాక్టర్” అంటూ కరచాలనం చేస్తుంటే హఠాత్తుగా గుర్తొచ్చింది. ఆవిడ నా పేషేంట్! 

          ఆవిడ చుడిదార్ లో ఉండటం వల్లా, అంత  ఉత్సాహంగా ఉండటం వల్లా నేనే గుర్తించలేక పోయాను! నెల రోజులుగా నాకు కొరుకుడు పడని  కేస్ ఇది. ఆవిడ ఈ రోజు ఇలా కనిపించటం చాలా సర్పైజింగ్ గా ఉంది నాకు. 

          కరచాలనం చేసిన చేతిని వదల్లేదు నేను. “కుమారిగారూ మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. హాస్పటల్లో నేను ఎంతగా ప్రయత్నించినా మీరేమీ మాట్లాడలేదు. మీరు ఇంత  ఆరోగ్యంగా ఉండి కూడా నా దగ్గరకు ఎందుకు వచ్చారు? ఈ రోజు మీరు నోరు విప్పాల్సిందే!” అన్నాను ఎంతో ఎగ్జైటింగ్ గా. 

          ఆవిడ కూడ నవ్వేసి, “ఒక్క అరగంట అవుతుంది మేడం. ఇది ముగించి మీతో మాట్లాడతాను కాసేపు వెయిట్ చెయ్యగలరా?” అంది “తప్పకుండా” అని బయట ఉన్న కుర్చీలలో కూర్చుని తన కోసం వెయిట్ చెయ్యసాగాను. తాను హాస్పటల్ కి మొదటి సారి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఉందో  గుర్తుకి వస్తోంది నాకు. 

          ఆ రోజు  హాస్పటల్ కి రావడం కాస్త ఆలస్యమైంది కారుదిగి చక చకా కన్సల్టేషన్ రూంకేసి నడుస్తున్నాను. చాలా మందే వెయిట్ చేస్తున్నట్లున్నారు. కొందరు నేనే  డాక్టర్ అని  తెలిసిన వాళ్ళు లేచి విష్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు ఈవిడేనా డాక్టర్! అన్నట్లు చూస్తున్నారు. నా రూంలో కూర్చుని నర్స్ కి కాల్ చేశాను. ఆమె వెంటనే ఒక్కొక్కరినీ లోపలకు పంపిస్తోంది. 

          ఒకప్పుడు ఇండియాలో సైక్రియాటిష్టులకి పెద్దగా పనుండేది కాదు. ఇప్పుడు మా ఆసుపత్రులు కూడా రోగులతో కళకళ లాడుతున్నాయి. అప్పట్లో స్క్రిజోఫీనియా, హిస్టీరియా లాంటి వ్యాధులు ముదిరిపోయి ఇంట్లో వాళ్ళకు అలవి కాని పరిస్థితుల్లో డాక్టర్ల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న మానసిక సమస్యలు, ఉద్యోగపు వత్తిళ్ళు తట్టుకోలేని వాళ్ళు మమ్మల్ని వెంటనే కలుస్తున్నారు. 

          ఇంక ఫామిలీ కౌన్సిలింగులు సరేసరి రోజుకు రెండుమూడన్నా వస్తున్నాయి. ఈ కాలపు స్ట్రెస్  అంతా విద్యార్ధులదీ, వారిమీద గంపలకొద్దీ ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులదీనూ. కాలేజీల్లో రాంకుల వత్తిడీ, మార్కుల వత్తిడీ తట్టుకోలేక ఏకంగా చదువు మీదే ఏవగింపు కలిగి చదవేస్తే ఉన్నమతి పోయిన పిల్లల్ని వెంటబెట్టుకొని ఏడుస్తూ మా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు ఎందరో. 

          ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళ పని వత్తిడికి, తద్వారా వచ్చే డిప్రెషన్ కి  కాపరాలే కూలి పోతున్నాయి. ఉద్యోగం, ఆదాయ వ్యయాల గొడవలతో పోట్లాటలు పెద్దవై విడాకులకు వచ్చిన  కౌన్సిలింగులు కొన్ని. మొత్తానికీ మా డాక్టర్లపని మూడుపువ్వులూ ఆరు కాయలుగానే  ఉంది. 

          కాకపోతే మా పని ఎంతో కష్టమైంది. ఒక పట్టాన పేషెంట్లు అర్ధంకారు. ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడో అందనంత దూరాల్లో ఉండే తారామండలాలనీ కనుక్కోవడం, కృష్ణ బిలాల రహస్యాలు తెలుసుకోవడం ఖగోళ పరిశోధకులకు సులువేమో కానీ. ఈ విశ్వమంతటినీ నింపుకున్న మనిషి మెదడులో ఉన్న ఆలోచనలనూ, కృష్ణబిలాల కంటే రహస్యమైన వారి మనసులో మాటనీ, మానసిక స్థితినీ తెలుసుకోవడం అంటే శ్రమతో కూడుకున్న పనే. ఒక్క పావుగంటో పదినిముషాల మాటలతో సరిపోదు. అందుకే వారిని మళ్ళీ మళ్ళీ సెషన్లకు రమ్మని చెబుతాం. ఈ మానసిక చికిత్స అనేది కొంచెం శ్రమా, సమయమూ తీసుకుంటుంది. అటు డాక్టర్లకూ, ఇటు పేషెంట్లకూ వారిని వెంటబెట్టుకు వచ్చే వారి బంధువులకూ కూడా కాసింత  ఓర్పు ఉండాలి తప్పదు. 

          కొన్నికేసుల్లో చాలా సెషన్లు కూచుంటే గానీ  వారి మనసులో విషయం ఏమిటో వారికి దేనివల్ల రోగలక్షణాలు వచ్చాయో చెప్పలేం. అసలైన ట్రిగ్గర్ పాయింట్ ఏదో తెలిస్తే ఇక చికిత్స చేయడం సులువు అవుతుంది మాకు. 

          అప్పటికి అయిదారు కేసులు చూసాను. దాదాపు మూడు గంటల సమయం పట్టింది. విసుగ్గా అనిపించి కాసిని కాఫీ తాగి తరువాతి పేషెంట్ కోసం బెల్ కొట్టాను. 

          భార్యా భర్తా అనుకుంటా కాస్త పెద్దవాళ్ళే! నెమ్మదిగా భుజాల చుట్టూ చెయ్యివేసి నడిపిస్తున్నాడతను. ఆవిడ అలా తీసుకురావడం ఇష్టం లేనట్టుగా ఇబ్బందిగా మొహం పెట్టి సున్నితంగా అతని చేతిని విదిలించే ప్రయత్నం చేస్తోంది. కానీ అతను కాసింత గట్టిగానే పట్టుకుని తెస్తున్నాడామెను. ఇద్దరూ విష్ చేసారు. నేనూ విష్ చేస్తూ కూర్చోమన్నట్లుగా సైగ చేసాను. 

          ఆవిడ ఒద్దికగా తలొంచుకుని కూర్చుంది. అక్కడక్కడా జుట్టు బాగానే నెరిసింది. యాబైకి పైన అరవైలకు దగ్గర్లోని మనిషిలాగా కనిపిస్తోంది. అతనూ దాదాపు పూర్తిగా నెరిసిపోయి బట్టతలైన జుట్టుతో  ఉన్న నాలుగు పీచులకూ రంగేసి ఆ జుట్టుతోనే  కుడి నుంచి ఎడమకు తలంతా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ మాటి మాటికీ జుట్టు సవరించు కుంటున్నాడు. చారల టీషర్టు ప్యాంటు లోకి టక్ చేసి బాగా వయసు దాచే విఫల ప్రయత్నం చేస్తున్నాడు. 

          ప్రశాంతంగా చూస్తూ “చెప్పండి ఏమిటి సమస్య?” అన్నాను. అతను ఆవిడవైపు చూసాడు. ఆవిడ వంచిన తల ఎత్తలేదు. “మీఇద్దరిలో ఎవరికి సమస్య? ఫర్లేదు చెప్పండి. చెపితేనే కదా తెలిసేది” అన్నాను. అతడు ఆవిడకేసి చూపిస్తూ తనకేనండీ ఇబ్బంది అన్నాడు. ఆవిడ అప్పటికి కూడా వంచినతల ఎత్తలేదు. 

          మళ్ళీ అడిగాను అనునయిస్తూ “చెప్పండమ్మా ఏమిటి మీ అనారోగ్యం? మీరు చెప్పాలి అన్నాను. ఆవిడ  బొమ్మలా అలాగే ఉంది. అతను చొరవ తీసుకుని “పురుగులు! గొంగళి పురుగులు!” అన్నాడు. 

          “వాట్?” అన్నాను. అవునండీ గొంగళి పురుగులే! వళ్ళంతా పాకుతున్నాయని బాధపడుతోంది. ఎప్పుడూ శరీరం మీద ఎక్కడో ఒకచోట గొంగళి పురుగు పాకిందని విదుల్చుకుంటూనే ఉంటుంది!

          అక్కడేమీ లేదని చెప్పినా వినిపించుకోదు. ప్రతి నిముషం ఆ బాధ చూడలేక పోతున్నాను అందుకే మీదగ్గరికి వచ్చాం” అన్నాడు. 

          ఆమె అప్పటికి కూడా  వంచిన  తల ఎత్తలేదు. హఠాత్తుగా పైకి లేచి భుజాలని చేత్తో విదిలిచ్చుకుంది. మొహం అసహ్యంగా పెట్టుకుని “ఛీ ..ఛీ” అనుకుంటూ దులుపు కుంటూనే ఉంది. అతను కూడా గబుక్కున లేచి “ఎమీ లేదు, ఏమీ లేదు నువ్వు కంగారు పడకు” అంటూ ఆమెను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను సాయం చేసేకొద్దీ ఆమె మరింతగా ముడుచుకు పోతోంది. 

          నేను కొంచెం గట్టిగానే “ఆపండి” అని అరిచాను. కొంచెం షాక్ తిన్నట్లుగా ఇద్దరూ ఆగిపోయారు. అది కూడా ఒక టెక్నిక్. మనమాట వినకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళున్నప్పుడు ఇలా గట్టిగా అరిస్తే ఆగిపోతారు. అతన్ని చూస్తూ “మీరు కాసేపు బయటకు వెళ్ళండి” అన్నాను. అతను కొంచెం ఇబ్బందిగా ఫీలవుతూ “అది కాదు మేడం”  అని ఏదో  చెప్పబోయాడు. 

          కానీ నేను కొంచెం సీరియస్ గా చూసే సరికి మరేమీ మాట్లాడకుండా తలవంచుకుని నిలబడ్డాడు. “బైట  కూర్చుని కొద్దిసేపు వెయిట్  చెయ్యండి” అని చెప్పి పంపించాను. 

          ఆమెను చూస్తూ “ఇప్పుడు చెప్పండి ఏమిటి మీ సమస్య? ఎప్పటి నుంచీ ఇలా అనిపిస్తోంది?” అడిగాను. ఆమె నుంచి సమాధానం లేదు. వంచినతల ఎత్తకుండా కూర్చొని ఉంది. 

          “మీ సహకారం లేకపోతే నేనేమీ చేయలేను. మిమ్మల్ని ఈ సమస్య నుంచి బైటపడేయాలంటే మీరే సహకరించాలి” అన్నాను. 

          ఆవిడ విరక్తిగా ఒక నవ్వునవ్వి నా వైపు నమ్మకంలేనట్టుగా చూసి మళ్ళీ తలవంచు కుంది. ఈ రోజు ఆ సరికి అసలే చాలా మంది పేషంట్లను చూసి ఉన్నానేమో విపరీతమైన విసుగు వచ్చేసింది. “చూడండి మీ బాధ ఏమిటో చెపితే మందివ్వగలను అంతేకానీ మీ మనసులో ఏముందో నేను చెప్పలేను. అది ఏమిటో  మీరే చెప్పాలి” అన్నాను. 

          ఆవిడ దించిన తల ఎత్తలేదు. ఎంత ప్రయత్నించినా ఆవిడ నుండి ఏమీ రాబట్టలేక పోయాను. రెండు రోజుల తర్వాత రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చి పంపించాను.

          అలా ఆ దంపతులిద్దరూ ఇంకో రెండుసార్లు వచ్చేరు. కానీ ఆవిడ చేత పెదవి విప్పించి మాట్లాడించటం నా వల్ల కాలేదు. 

          ఇలాంటి మొండి పేషేంట్లు అప్పుడప్పుడూ తగులుతూనే ఉంటారు నాకు. ఇంకో రెండుసార్లు వస్తే ఆవిడ చేత మాట్లాడించగలను. కానీ పేషేంట్ల ఓర్పుకన్న పక్కన వచ్చేవాళ్లకు ఇంకాస్త ఓర్పు కావాలి. 

          చాలా మంది ఇలా రాగానే మాములు వ్యాధిలాగా అలా గుణం కనిపించాలని కోరుకుంటారు. రెండు మూడు వారాలు రాగానే ఇక్కడ సరిగా లేదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళదాం అనుకుంటారు. మా ప్రయత్నమేదో మేమూ చేస్తాం. కానీ, వాళ్లకు అర్ధం కాదు. 

          ఈసారి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను. ఆమె మాట్లాడటం ఇష్టం లేనట్లు కిటికీలో నుండి బైటకు చూస్తూ కూచుంది. చాలా మాటల తరువాత తన పేరు కుమారి అని, గవర్నమెంట్ ఎంప్లాయిని అని చెప్పింది. 

          తరచి తరచి ప్రశ్నించినా సమాధానం చెప్పకపోగా “నా బాధ మీకు అర్ధం కాదులే మేడం”  అంది. ఆ మాత్రం నోరు విప్పినందుకు సంతోషించి కొంచెం టెన్షన్ రిలీజ్ అయ్యే మందులేవో రాసిచ్చి మరుసటి వారం రమ్మన్నాను. 

          చిన్న చిరునవ్వు నవ్వి థాంక్యూ చెప్పి వెళ్ళి పోయింది. నాకు ఈ కేస్ సాల్వ్ చేసి ఆరోగ్యవంతురాలిని చెయ్యగలననే నమ్మకం కుదిరింది. ఆ తరువాత ఇప్పటి వరకూ మళ్ళీ రాలేదు వాళ్ళు. దాదాపు ఆరు నెలలు దాటిపోయింది. 

          ఆవిడని ఇప్పుడు చూస్తే నమ్మశక్యంగా లేదు నాకు. నేనిచ్చిన మందుల వల్ల అంతలోనే ఇంత  మార్పు రాదు. తన గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం నన్నిలా ఇంతసేపు కూర్చోబెట్టింది!

          “సారీ మేడం! మిమ్మల్ని వెయిట్ చేయించాను” అంటూ వచ్చింది ఆవిడ. “కుమారి గారూ ఏమిటి డబుల్ రోల్! అసలు మీరేనా అని ఆశ్చర్యంగా ఉంది! మీ వివరాలు తెలుసు కోవాలని ఉత్సాహంగా ఉంది” అన్నాను. 

          “ఏముంది డాక్టర్ నేనూ ఒక మామూలు గృహిణినే” అన్నది. 

          “లేదండీ ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు. ఈ  ఆహార్యం మీ వయసును దాచటమే కాదు, మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది” అన్నాను. 

          కొద్దిగా నిట్టూర్చి.. “నిజమే డాక్టర్ ఇంత కాలం బ్రతికి ఉన్నానంటే కారణం నా ఉద్యోగమే. ఒక రకంగా ఇంటికి వెళ్లాలంటే బాధ.. ఈ ఉద్యోగమే నన్ను రక్షిస్తోంది. ఇదే లేకపోతె ఏమైపోదునో? బాధ కలిగించే విషయం ఏమిటంటే వచ్చే నెలలోనే నా రిటైర్మెంట్. ఆ తరువాత ఎలా బ్రతకాలో.. ఇప్పటి నుంచే పెద్ద దిగులు నాకు” అంది ఎంతో బాధగా. 

          “అయితే ఇంట్లోనే మీ మనసుకు బాధ కలిగే విషయం ఉంది. ఆ  గొంగళి పురుగులను గురించి చెప్పండి. మీకు ఎటువంటప్పుడు ఆ గొంగళి పురుగులు మీద పడినట్లు అనిపిస్తుంది?” అడిగాను. 

          ఆవిడ ఒక్కసారి చీదరగా మొహం పెట్టి గబగబా వంటి మీద ఎదో పడినట్లు విదిలించుకో సాగింది. 

          నేను గబుక్కున ఆమె భుజాలు పట్టుకుని “కుమారి గారూ” అని పిలుస్తూ ఈ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేసాను. 

          తను కాస్త తేరుకుని, నెమ్మదిగా కూర్చుని చిన్న నిట్టూర్పుతో ఇలా చెప్పసాగింది. 

          “నాకు చిన్నప్పటి నుంచి గొంగళి పురుగులంటే చాలా అసహ్యం. నా చిన్నప్పుడు మా యింట్లో ఒక చిక్కుడు పాదు  ఉండేది. వాటికి ఒక్కోసారి బోలెడు గొంగళి పురుగులు పట్టేవి. పొరపాటున ఆ పందిరి క్రిందకు వెళితే నల్లగా బొచ్చుతో మీద పడుతుండేవి. అలా మీదపడ్డప్పుడు వళ్ళంతా ఒక రకమైన దురద కలిగేది. చాలా అసహ్యంగా  జలదరింపుగా ఉండేది. 

          మా అమ్మతో పోట్లాడి ఆ చెట్టు పీకేసేదాకా గొడవ చేసేదాన్ని. కానీ, ఆ అసహ్యం నా జీవితంలోకి కూడా ప్రవేశిస్తుందని పెళ్లయ్యేదాకా తెలియలేదు. 

          కాలేజీ చదువు అయిపోతూనే ఎమ్మార్వో ఆఫీసులో క్లర్కుగా ఉద్యోగం వచ్చింది. మా నాన్న ఎంతో సంతోషించాడు. 

          ఆయన మేనత్త చెప్పిందని ఈ సంబంధం ఖాయం చేసాడు. అబ్బాయి ఫారెస్టు డిపార్ట్మెంట్ లో క్లర్క్. అనీ ఆరునెలల్లో పర్మినెంట్ అవుతుందని చెప్పారు. 

          పెళ్లయ్యాక తెలిసింది అది టెంపరరీ ఉద్యోగమేననీ, పెళ్లిగురించి అబద్ధం చెప్పారని. పెళ్లయ్యాక చెయ్యగలిగింది ఏమిలేదు. అప్పటికి పాపాయి కడుపున పడింది. 

          మా మామగారు చేసింది గవర్నమెంటు ఉద్యోగం కాదు అందువల్ల పెన్షన్ లాంటిదేమీ లేదు. కొంత క్యాష్ మాత్రం ఉంది. 

          ఆ తరువాత ఈయన బిజినెస్ అంటూ ఉన్న ఆ కాస్త డబ్బూ ఖర్చు పెట్టేసారు. రెండో పాప పుట్టేసరికి నా సంపాదన మాత్రమే మా కుటుంబానికి ఆధారం అయ్యింది. 

          ముగ్గురు ఆడ పిల్లల మధ్య ఈయన ఒక్కడే కొడుకు. పైగా తండ్రికి ఆధారమైన ఆ కాస్త డబ్బు కూడా తను వాడుకున్నాడు కనుక వాళ్ళకీ మరో ఆధారం లేదు. అందువల్ల వాళ్లు మా దగ్గరే ఉండిపోయారు. 

          నేను ఉదయమే ఇంట్లో పనంతా చేసుకుని ఆఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈయన పొద్దునే నాతోపాటు తయారై ఊరంతా బలాదూర్ తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు. 

          పిల్లలు, ఇల్లు సవరించుకోవడం చాల భారమైపోయేది. అత్తగారు  సాయం చెయ్యక పోగా ఎప్పుడూ విసుక్కుంటూ తనకు ఇంకా ఏవో సేవలు, మర్యాదలు జరగట్లేదని యాష్ట పడేది. 

          మామగారు అన్నీ సరిచేసి భోజనం టేబులు మీద పెట్టి అప్పటికే లేటయిందని హడావుడిగా ఆఫీసుకు  వెళ్లటానికి చెప్పులు వేసుకునే  సమయానికి “అమ్మాయ్ కొంచెం కాఫీ ఇచ్చి వెళ్ళమ్మా” అనేవాడు. 

          ఆఫీసులో ఆలస్యానికి ముక్క చివాట్లు తిని సంజాయిషీ ఇచ్చుకుని మిగిలిన వాళ్ళ హేళనకు గురికావలసి వచ్చేది. ఎప్పుడన్నా తీరిక లేక తల్లీ కొడుకులకి ఏదన్నా పని చెబితే పెద్ద రాద్ధాంతం జరిగిపోయేది. 

          వంట మనిషిని పెడితే అత్తగారు ఒప్పుకునేది కాదు. ఒక వేళ పెట్టినా వారం కంటే ఉండేవారు కాదు. అయ్యగారు తేడాగా ప్రవర్తిస్తుంటారని నా దగ్గర చెప్పి మానేసే వాళ్లు.  పని మనిషి కూడా నేను ఇంట్లో ఉన్నప్పుడే పనిచేసేది. 

          వాళ్లిద్దరూ కాలం చేసాక పిల్లలు కాలేజీ చదువులకు వచ్చాక నా పరిస్థితి మరీ  దారుణం అయిపోయింది.  ఉద్యోగంలో హోదా పెరిగేకొద్దీ బాధ్యతలు పెరిగాయి. ఇంట్లో మాత్రం నా శ్రమకు పనికి అవహేళనలే ఎదుర్కొన్నాను. 

          పక్కింటావిడ కూర బాగాచేసిందనో, నాకు పనులు చేయటం రాదనో వంకలు. నేను ఇల్లొదిలేసి బయట తిరుగుతున్నానని మాటలు. తను స్నేహితులతో తిరగటం కోసం నా ఆఫీసుకారు పంపించమని గొడవ. కుదరదు అన్నందుకు సొంతకారు కావాలని పంతం. మళ్ళీ అందుకోసం నా డబ్బులే కావాలి. 

          ఇంక పిల్లలకు కూడా నేను తల్లిని కాను. డబ్బు సంపాయించే యంత్రాన్ని మాత్రమే. నాకు ప్రేమ లేదనీ తాను మాత్రమే పిల్లకు ప్రేమ పంచుతానని  చెబుతూ వాళ్లకు ఇష్టమైనవన్నీ నా డబ్బులతోనే కొనిపెడుతూ నన్ను అవహేళన చేస్తూ  జోకులు వేస్తూ గడిపేవాడు. 

          పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేసాం. దానికి కారణం నా సంపాదనే. చుట్టాల్లో అందరికీ తానేదో రియలెస్టేటు వ్యాపారం చేసి చాల సంపాదిస్తున్నానని చెబుతాడు. అసలు సంసారమంతా తానే ఈదుతున్నానని చెబుతాడు. 

          నా మనసుతో కానీ, నా ఆరోగ్యం తో కానీ అతనికి సంబంధం లేదు. అతనికి నేనొక డబ్బు సంపాదిస్తూ సుఖాన్ని కూడా అందించే యంత్రాన్ని. అతని జీవితమంతా హాయిగా గడిచి పోయింది. కుటుంబ భారం అంతా నా భుజస్కంధాల పైనే మోసాను. కనీసం మాట వరసకు అయినా ఆ మాట అనడు. సరికదా ఎప్పుడన్నా ఆఫీసు పని ఎక్కువై తల నొప్పితో పడుకుంటే నీకు ఆఫీసరువని, సంపాదిస్తున్నానని పొగరు. నాకు నీతో సుఖం లేదు అంటాడు. 

          ఈ మధ్య ఈ ధోరణి శృతి మించి ఇంకొక ఆవిడ తనంటే ఇష్టపడుతోందని తనను పెళ్లి చేసుకుంటాను అంటోందని ఒకటే వాగుడు. ఇదంతా అబద్ధమని తెలుసు. ఈ వయస్సులో పిల్లల ముందు పరువు పోతుందని మాట్లాడలేను. తన అప్రయోజకత్వాన్ని ఇంకా కప్పిపుచ్చుకుని నన్ను బాధించాలన్నది అతని ఆలోచన. 

          అతను అలా మాట్లాడినప్పుడల్లా మాయింట్లోని చిక్కుడు పాదులోని  గొంగళిపురుగు మీద పడ్డప్పుడు కలిగినంత అసహ్యం జలదరింత కలుగుతుంది నాకు. అత్తగారితో మొదలుకొని ఆఫీసులో సహోద్యోగుల, బాసుల మాటలు అన్నీ గొంగళి పురుగులు మీద పడ్డంత అసహ్యం కలిగించినా నోరు మూసుకుని భరించాల్సిన పరిస్థితి నాలాంటి సగటు ఆడవాళ్లది! ప్రత్యేకంగా మరి ఇన్ని గొంగళి పురుగులు నా మీద పడి పాకుతుంటే ఇన్ని అసహ్యాలను తట్టుకోలేక పోతున్నాను డాక్టర్ గారు” అన్నది కళ్ళలో నీరు తిరుగుతుండగా. 

          ఓదార్పుగా ఆమె చెయ్యి పట్టుకున్నాను. ఆడదానికి ఆర్ధిక స్వాతంత్య్రం కోసం ఉద్యోగం మంచిదే కానీ, అదెంత వరకూ స్త్రీకి లాభం కలిగిస్తుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. దాని కోసం ఎన్నెన్ని వ్యధలు తట్టు కోవాలో ఉద్యోగం చేసే ఆడవాళ్లకే తెలుసు. 

          “కుమారి గారు వచ్చేవారం తప్పకుండా క్లినిక్ కి రండి. శ్రీవారితో సహా. ఇంత ఆఫీసునీ, స్టాఫ్ నీ సమర్ధవంతంగా నడిపించిన ఆఫీసర్ మీరు. మీ కుటుంబాన్ని కాస్త మనసు పెడితే సులభంగా సరిదిద్దు కోగలరు” అన్నాను. 

          మరుసటి వారం భార్యాభర్తలిద్దరూ వచ్చారు. కొద్దిసేపు మాట్లాడి ఆవిడకు కొన్ని మందులు రాసిచ్చి ఆదివారం ఇద్దరినీ కౌన్సిలింగ్ క్లాసుకు రమ్మన్నాను. ఇద్దరూ ఒప్పుకుని బయటకు వెళ్లారు. 

          అతను మాత్రం  హడావుడిగా వెనక్కు తిరిగి వచ్చి “డాక్టర్ గారు మీరేమి అనుకొనంటే మీకు ఒక చిన్న మాట చెప్పాలి” అన్నాడు. “చెప్పండి ఫర్లేదు” అన్నాను. “మా ఆవిడకు ఈ మధ్య పిచ్చి ఎక్కువైనందువల్లో ఏమో ఆ కోరిక పెరిగి పోయిందండి. అందువల్ల ఆ సామర్ధ్యం నాలో పెరగటానికి నాకు మందులేమైనా రాసివ్వండి ప్లీజ్” అన్నాడు!

          పెద్ద గొంగళి పురుగేదో అసహ్యంగా నల్లగా ఒళ్ళు జలదరించేలా ఠప్పున నా మీద పడిన ఫీలింగ్! 

          తట్టుకోలేక ఒక్కసారి అసహ్యంగా విదిలించుకున్నాను. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.