కుసుమనిరీక్షణం

– శింగరాజు శ్రీనివాసరావు

          ఎన్నిసార్లు వహ్నిత చెప్పి చూసినా నిరీక్ష మనసు మారడం లేదు. ఆ పేదపిల్ల, అనాకారి కుసుమతో సన్నిహితంగా తిరగవద్దు అంటే వినడం లేదు. నాలుగు ఇళ్ళలో పనిచేసే పనిమనిషి రాములమ్మ కూతురు కుసుమ. ఆ పిల్ల తండ్రి తాగుబోతు. రాములమ్మను రోజూ ఏదో ఒక వంక పెట్టి కొడుతుంటాడట. పనిమనిషి కూతురని కుసుమంటే ఒక రకమైన చిన్నచూపు వహ్నితకు.

          కుసుమది తన కూతురిది ఒకటే తరగతి. ఇద్దరూ కలసి ఈ సంవత్సరం ఒకే స్కూలులో ఆరవ తరగతిలో చేరారు. ఎలా కుదిరిందో తెలియదు కానీ, కుసుమతో మంచి స్నేహం కుదిరింది నిరీక్షకు. పసితనానికి ఈ తారతమ్యాలు తెలియక పోవడమే కారణం దానికి. వాళ్ళిద్దరూ ఒకే క్లాసులో ఉండడానికి ఇష్టపడని వహ్నిత, నిరీక్షను ప్రైవేటు స్కూలులో చేర్పించమన్నది. కానీ, దానికి వహ్నిత భర్త విశ్వనాథం ఒప్పుకోలేదు. దానికి కారణం విశ్వనాథం కూడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావడం. తను ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో పనిచేస్తూ తన కూతురిని ప్రైవేటు పాఠశాలలో చదివించడ మంటే తన సంస్థను తను అవమానించడమేనని అతని అభిప్రాయం. అదీగాక తన స్నేహితులు కొందరు నిరీక్ష చదివే పాఠశాలలో అధ్యాపకులు కూడ. ఆ
ధైర్యంతోనే ఆ పాఠశాలకు పంపాడు నిరీక్షను. అక్కడే కుదిరింది కుసుమతో స్నేహం
నిరీక్షకు. వాళ్ళ క్లాసులో టీచర్లకు కూడ కుసుమ అంటే చాలా ఇష్టం. దానికి కారణం
లేకపోలేదు. కుసుమ పేదింటి పిల్లయినా చదువులో బాగా రాణిస్తుంది. ఎప్పుడూ మొదటి
రెండు ర్యాంకులలోనే ఉంటుంది. అందుకే నిరీక్షకు కూడ కుసుమ అంటే ఇష్టం. తనకు తెలియని లెక్కలను గానీ, సైన్సులో వచ్చే సందేహాలను గానీ కుసుమను అడిగి తెలుసు కుంటుంది.

          వాళ్ళిద్దరి మధ్య స్నేహం విడదీయలేనంతగా పెనవేసుకు పోయింది. అది వహ్నిత కు ఇష్టం లేదు. అన్ని కోణాలలోను గొప్పతనం కలిగిన తన కూతురు కుసుమతో కలసి తిరగడం ససేమిరా ఇష్టం లేదు. కానీ విశ్వనాథం అందుకు భిన్నం. సరస్వతీ దేవి కనికరం ఉన్న ఎవరైనా చాలా అదృష్టవంతులని, ఏనాటికైనా గొప్పవారు అవుతారని అతని వాదన. అందుకే కుసుమ, నిరీక్షల స్నేహానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. భర్త నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో మిన్నకుండి పోయింది వహ్నిత.

***

          ‘చూశారా.. చూశారా.. ఇది ఈ రోజు మనకు చెప్పకుండా ఎంత పని చేసిందో. ముందు చెప్తే ఒప్పుకోనని, చేసి వచ్చాక చెప్తున్నదట. ఎంత తెలివి మీరిపోయిందో చూడండి మీ కూతురు’ విశ్వనాథం రాగానే నిరీక్షను లాక్కుని వచ్చి అతని ముందు నిలబెట్టి అరించింది వహ్నిత.

          ఏడుస్తూ వణికిపోతున్నది నిరీక్ష. ఏమయిందో అర్థంకాలేదు విశ్వనాథానికి. నిరీక్షను ఆమె నుంచి విడిపించి తన దగ్గరకు తీసుకుని ‘వహ్ని..నువ్వు వెళ్ళి నాకు కాఫీ పట్టుకురా. తాగుతూ తీరికగా మాట్లాడుకుందాం’ అన్నాడు తాపీగా.

          “ఇదుగో ఈ గారాబమే దాన్ని ఇలా తయారు చేసింది. మీ అండ చూసుకుని నన్నొక పూచిక పుల్లలా చూస్తున్నది ఇది. ఎంత ధైర్యం లేకపోతే మనకు చెప్పకుండా ఇంత పని చేస్తుందా” చిందులు తొక్కసాగింది వహ్నిత.

          “వహ్నీ.. నా మాట విని వెళ్ళు. దాని తప్పుంటే నేను సమర్ధిస్తానా. ముందు విషయాన్ని పూర్తిగా తెలుసుకుని తరువాత దండిద్దాం” అని మెల్లగా మాట్లాడుతున్న భర్త మీద విసుక్కుంటూనే లోపలికి వెళ్ళింది వహ్నిత.

          భార్య లోపలికి వెళ్ళగానే కూతురిని దగ్గర తీసుకుని కన్నీళ్ళు తుడిచి భయం లేదని భుజం తట్టాడు.

          “అసలేమయింది అమ్మలూ. అమ్మకు కోపం వచ్చేంత తప్పు చేశావా” అనునయం గా అడిగాడు.

          “నేను చేసింది తప్పని నాకు తెలియదు నాన్నా. అసలు నాకది తప్పనిపించ లేదు” తండ్రి పక్కన కూర్చుంది కళ్ళు తుడుచుకుంటూ.

          “అసలు ఏం జరిగిందమ్మా”

          “నావి పాత బట్టలు కొన్ని వుంటే వాటిని తీసుకెళ్ళి కుసుమకు ఇచ్చాను నాన్నా. పాపం దాని బట్టలన్నీ చిరిగిపోయి అతుకులు వేసుకుంటున్నది. అందుకే తీసుకెళ్ళి ఇచ్చాను. అమ్మకు చెప్పకుండా ఇచ్చి వచ్చి తరువాత చెప్పాను. అమ్మకు కుసుమ మీద కోపం కదా. ఎక్కడ వద్దని ఆపుతుందేమోనని చెప్పలేదు. వచ్చిన తరువాత మీకు, అమ్మకు చెబుదామనుకున్నాను. కానీ ఇది తప్పని నాకు అనిపించలేదు. పాపం కుసుమ కూడ నా లాంటి ఆడపిల్లే కదా నాన్నా. పిల్లలందరూ దాని వైపు చిత్రంగా చూస్తున్నారు. నాకు అది అర్థంకానివన్నీ విసుక్కోకుండా చెబుతున్నది. వాళ్ళమ్మ పనిమనిషయితే మనం దాన్ని చిన్నచూపు చూడాలా. నాతో ఎంతో స్నేహంగా ఉండే అది అలా చిరిగిన బట్టలు వేసుకు తిరగడం బాధగా అనిపిస్తున్నది. చెప్పకుండా చేయడం తప్పే. కానీ దానికి నేను వేసుకోని బట్టలు ఇవ్వడం కూడ తప్పేనా నాన్నా” గుడ్లల్లో నీళ్ళు కుక్కుకుని అమాయకంగా అడుగుతున్న కూతురిని చూస్తే జాలితో పాటు, భార్య ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తున్నందుకు భార్యమీద కోపం కూడ వచ్చింది విశ్వనాథానికి.

          “పోనీలేమ్మా ఇస్తే ఇచ్చావులే గానీ, అమ్మకు ఒకమాట చెప్తే బాగుండేది కదా. పోనీ
నాతో చెప్పివున్నా నేను అమ్మను ఒప్పించి ఉండేవాడిని కదా. మంచి పనైనా, చెడ్డపనైనా
తల్లిదండ్రులతో చెప్పి చెయ్యాలమ్మా. అమ్మకు మాత్రం కుసుమ మీద కోపం ఎందు కుంటుంది. నేను అమ్మకు చెప్తాగా. కానీ ఇంకెప్పుడూ చెప్పకుండా ఏ పనీ చెయ్యకు”
అని కూతురును బుజ్జగించి వెళ్ళి హోంవర్కు చేసుకోమని చెప్పి పంపాడు విశ్వనాథం.

          కాఫీ తెచ్చేసరికి నిరీక్ష లేకపోవడం చూసి “ఎక్కడికి పంపారు దాన్ని” అడిగింది కాఫీ గ్లాసు భర్త చేతికిస్తూ.

          “అది చదువుకుంటానని వెళ్ళింది కానీ, ఇప్పుడా విషయాన్ని పక్కనబెట్టి రాత్రి వంట సంగతి చూడు. అది నిద్రపోయాక మాట్లాడుకుందాం. సరేనా. నేను స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇప్పుడు వీరంగం పెట్టకుండా ప్రశాంతంగా ఉండు. దానికి చెప్పాల్సింది చెప్పాలే” అని వహ్నిత ఆవేశం మీద నీళ్ళు చల్లాడు. చేసేది లేక ‘ఛీ’ అని రుసరుసలాడుతూ వెళ్ళింది వహ్నిత.

***

          సరిగ్గా పరీక్షలు ఇంక నెలరోజులు ఉన్నాయనగా టైఫాయిడ్ జ్వరం తగిలింది నిరీక్షకు. ఒక వారం రోజుల పాటు మంచం మీద నుంచి లేవలేదు. ఈ వారం రోజులు ప్రతిరోజూ విశ్వనాథం స్కూలుకు వచ్చి నిరీక్ష ఆరోగ్యం గురించి అడుగుతూనే ఉన్నది కుసుమ.

          ఒకరోజు హనుమంతుని గుడికి వెళ్ళి సింధూరం తెచ్చి ఇచ్చి నిరీక్షకు పెట్టమని, అది నుదుటను పెడితే జ్వరం వెంటనే తగ్గతుందని పూజారి చెప్పాడని కూడ చెప్పింది.

          ఆ పనేదో కుసుమను ఇంటికి తీసుకెళ్ళి తనచేతనే చేయించాలనిపించింది. కానీ వహ్నిత నోటికి భయపడి ఆ ప్రయత్నం మానుకున్నాడు. జ్వరం తగ్గినా నీరసం తగ్గలేదు నిరీక్షకు. ఒక పదిహేను రోజుల పాటు పుస్తకం చదవకూడదని, కావాలంటే పాఠం ఎవరైనా చదివితే వినవచ్చని చెప్పాడు డాక్టర్.  పదవ తరగతి పరీక్షలు జరుగుతుండడంతో పాఠశాలకు సెలవులు కూడ ఇచ్చారు. విశ్వనాథానికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. తనకు సెలవులు లేవు. వహ్నితను చదివి వినిపించమంటే, చదివేదాని కంటే నిరీక్షను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఇక మిగిలింది ఒక్కటే మార్గం. అదే కుసుమ చేత చదివించి వినిపించడం. దానికి వహ్నిత ఒప్పుకుంటుందో, లేదో. కుసుమ యితే దాని క్లాసే గనుక అర్థమయ్యేలా చదువుతుంది. పైగా తెలివి కలది. నిరీక్షకు కూడ అదంటే ప్రాణం. అది ఎదురుగా ఉంటే త్వరగా కోలుకుంటుంది కూడ. ఎలాగైనా వహ్నితను ఒప్పించి కుసుమను ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు విశ్వనాథం.

***

          రాత్రి మూడు గంటల పాటు తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు కుసుమ ఇంటికి రావడానికి అంగీకరించింది వహ్నిత. అదికూడ కుసుమ పంచ దాటి లోపలికి రా కూడదనే కండిషన్ తో. అన్నిటికీ తలవూపాడు విశ్వనాథం. తన దగ్గర చదువుకునే కుసుమ పిన్ని కొడుకుతో విషయం చెప్పి పంపాడు. పిలవడమే ఆలస్యం అన్నట్లుగా వెంటనే వచ్చింది కుసుమ.

          ‘కుసుమా..ఇంక పదిరోజులే కదమ్మా పరీక్షలకు సమయం ఉంది. నిరీక్ష కూడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఇప్పుడే పుస్తకం చదివితే కళ్ళు దెబ్బతింటాయేమోనని చెప్పాడు డాక్టర్. కాబట్టి, ఒక వారం రోజులు నువ్వు మా ఇంటికి వచ్చి దానికి నీ సబ్జెక్టు లన్నీపెద్దగా చదివి వినిపించు. నువ్వు చదువుకున్నట్టూ ఉంటుంది, దానికి చెప్పినట్టూ
ఉంటుంది. మధ్యాహ్నం అన్నం మా ఇంట్లోనే తిందువుగాని. సరేనా’ వచ్చిన కుసుమను
అడిగాడు విశ్వనాథం.

          ‘అట్టాగే సార్. నిరీక్షకు చదివి వినిపిస్తాను. అంతకంటే నాకేం కావాల సార్. నా దోస్తుకు నేను సాయపడితే నాకదే చాలు. అన్నం బాక్సు నేనే తెచ్చుకుంటాలే సార్’ సంతోషంగా చెప్పింది కుసుమ.

          ‘ఏం వద్దు. నిరీక్షతో పాటు తిందువుగాని. రేపటి నుంచి వస్తావా మరి’

          ‘అలాగే సారు’ అని విశ్వనాథం పాదాలకు నమస్కరించి వెళ్ళింది కుసుమ.
సంతోషమేసింది విశ్వనాథానికి. డబ్బుకు పేదదేగానీ సంస్కారానికి కాదు ఈ పిల్ల
అనుకున్నాడు.

***

          ‘అమ్మా నాకు సంవత్సరాంత పరీక్షలలో క్లాసు ఫస్టు వచ్చిందమ్మా . కుసుమకేమో
సెకండ్’ స్కూలు నుంచి వస్తూనే చెప్పింది నిరీక్ష.

          ‘అవునా.. కంగ్రాట్స్. కుసుమ రాలేదా’ అడిగింది వహ్నిత.

          ‘వస్తున్నదమ్మా. నాన్న మా ఇద్దరినీ స్కూటరు మీద తీసుకువచ్చాడు. నేనే ముందుగా నీకు చెప్పాలని పరుగెత్తుకుంటూ లోపలకు వచ్చాను’ అని నిరీక్ష చెబుతుండ గానే వచ్చారు కుసుమ, విశ్వనాథం. కుసుమ తను మోసుకొచ్చిన సంచిని వహ్నితకు ఇచ్చింది.

          ‘చూడు వహ్ని ఇది నేను తీసుకొస్తానన్నా వినకుండా నా చేతిలో సంచి లాక్కుని తనే మోసుకు వచ్చింది’ అన్నాడు విశ్వనాథం అక్కడే కుర్చీలో కూర్చుంటూ.

          ‘అమ్మా..నాన్న నాకు ఇష్టమని బటర్ స్కాచ్ పేస్ట్రీలు తెచ్చారు. నాకొకటి, కుసుమకు ఒకటి ఇవ్వు. తింటాము’ అని వహ్నిత చెయ్యి పట్టుకు లాగింది నిరీక్ష.

          ‘సరే..ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కుని రండి’ అని సంచిలోని బాక్సును తీసింది వహ్నిత.

          ‘అమ్మా..నేను ఇంటికి వెళతాను. మా అమ్మ నా కోసం చూస్తుంటది. ఆలస్యమయితే మళ్ళీ స్కూలు కాడికి వెళుతుంది’ పర్మిషన్ కోసం అడిగింది కుసుమ.

          ‘తిని వెళ్ళవే’

          ‘లేదమ్మా. అక్కడ అమ్మ నా కోసం చూస్తుంటది. మా తమ్ముడు కూడ స్కూలు నుంచి వచ్చుంటాడు. వస్తానమ్మా..వస్తాను సారు’ అని చెప్పి బయలుదేరబోయింది కుసుమ.

          ‘కుసుమ ప్లీజ్ తినవే. మీ తమ్ముడికి కూడ ఇస్తాను. తీసుకెళుదువు గానీ. నువ్వు తినేస్తే ఇద్దరం కలిసి కొద్దిసేపు జాస్మిన్ దగ్గరకు వెళ్ళి ఒక అరగంట ఆడుకుని వద్దాము. తరువాత వెళుదువు గానీ. ఇంకా చీకటి పడలేదుగా. మీ అమ్మ అడిగితే మా ఇంటికి వచ్చావని చెప్పు. ఏమీ అనదులే’ అని నిరీక్ష అడగగానే కాదనలేక పుస్తకాల సంచి అక్కడే పెట్టి బయటవున్న పంపు దగ్గర చేతులు కడుక్కుని పెస్ట్రీ తిని ఆడుకోను వెళ్ళారు నిరీక్ష, కుసుమ.

          ‘ఏమో అనుకున్నా గానీ పేదపిల్లయినా పెద్ద మనసున్న పిల్లండీ కుసుమ. మొదట్లో నాకు నచ్చలేదు గానీ, దాని వినయంతో, సంస్కారంతో నా మనసు గెలుచుకుంది. తండ్రి తాగుబోతయి తనను గురించి పట్టించుకోక పోయినా, ఎంత శ్రద్ధగా చదువు కుంటుందో చూడండి. అయినా ఈ పిల్లలేమిటో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తారు. కులం, మతం.. పేద, గొప్ప అనే తేడాలు లేకుండా ఇట్టే కలిసిపోతారు’ అంటున్న భార్యను చూసి

          ‘చూడు వహ్నీ.. అందుకే వాళ్ళను పసివాళ్ళు అన్నారు. వారు కుసుమాలంతటి లేత హృదయులు. వారు నిరీక్షించేది అరమరికలు లేని స్నేహం కోసమే కానీ, కుల మతాల బేరీజులు వేసుకుని కాదు. వాళ్ళ మనసులలో దేవుడు కొలువై ఉంటాడు వహ్నీ. అందుకే వారికి పేద, గొప్ప తారతమ్యాలు కనబడవు. ఆ కుసుమాల నిరీక్షణ అంతా తీయని స్నేహం కోసమే. వాటిని కలుషితం చేసేది మనమే.

          మన హోదాకు తగ్గ స్నేహాలు చేయాలని, మన కులం వాళ్ళతోనే కలిసి తిరగాలని, మనమే వాళ్ళ మనసులలో విషాన్ని నూరిపోస్తాం. అంతే కాదు కలిసి చదువుకుంటే ఎక్కడ మన పిల్లల కంటే ఎదుటి వారి పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారనీ, మన పిల్లల తెలివితేటలన్నీ పక్కవాళ్ళు ఎత్తుకు పోతారని కుటిలమైన ఆలోచనలు చేసేది మనమే. పంచుకుంటే పెరిగేదే జ్ఞానం వహ్నీ.

          ఇప్పటికైనా నీకు  అర్థమయిందా..మొన్నటి వరకు మొదటి పదిమందిలో ఉండే
నీ కూతురు ఇప్పుడు మొదటి ర్యాంకులోకి వచ్చింది. కారణం కుసుమతో కలిసి చదువు కోవడమే. నీ కూతురు పరీక్ష రాయగలదో, లేదో అనే దశ నుంచి క్లాసు ఫస్టు వచ్చే స్థితికి రావడానికి కారణం ఆ పేదింటి కుసుమే కదూ. మనసును విశాలం చేసుకో వహ్నితా.. పేదరికం అనేది మనిషికే కానీ మనసుకు కాదు. మనసున్న మనుషులలో దేవుడు కొలువై ఉంటాడుట. భగవంతునికి కులమతాల పట్టింపులు లేవు వహ్నీ. ఇదంతా మానవ స్వార్థ రాజకీయం. నువ్వు ఇకనైనా కుసుమను వేరుగా చూడడం మానెయ్’ తను  చెప్పాలను కున్నది చెప్పాడు విశ్వనాథం.

          తన ఆలోచనలోని తప్పును తెలుసుకున్న వహ్నిత మౌనం వహించింది కొద్దిసేపు.

          ‘ఏం వహ్నీ నీకు నచ్చని విధంగా మాట్లాడానా’

          ‘లేదండీ.. నా తప్పు తెలిసింది. ఏవండీ ఒక చిన్న కోరిక. ఏమీ అనుకోరుగా’

          ‘చెప్పు’

          ‘మనకున్నది ఒక్క పిల్ల. ఎలాగూ దాన్ని మీరు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారు.
కాబట్టి చదువుకు పెద్ద ఖర్చేమీ కాదు. అందుకని కుసుమను కూడ మన బిడ్డలానే చూడ మన్నారు కనుక నిరీక్షతో పాటు దాని ఖర్చుకూడ మనమే భరించి దాన్ని కూడ బాగా చదివిద్దామండీ. పనిమనిషి కూతురు మరో పనిమనిషి కాకుండా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మీకు అభ్యంతరం లేదుగా’ భర్త కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వహ్నిత.

          ఈ కుసుమ, నిరీక్షల స్నేహాన్ని విడదీయకూడదనే తన ఆలోచనలకు అనుకోని ఊతం భార్య నుంచి లభించినందుకు ఆనందపడుతూ ‘నీ ఇష్టం’ అన్నాడు క్లుప్తంగా విశ్వనాథం.

*****

Please follow and like us:

7 thoughts on “కుసుమనిరీక్షణం”

  1. పేదరికం మనిషికే కానీ మనస్సుకు కాదు
    ఎంత దాగిన దాచాని నిజాన్ని చెప్పారు
    ధన్యవాదములు

  2. ‘కుసుమనిరీక్షణం ‘ చాలా బావుంది స్వచ్ఛమైన పసిహృదయల ప్రేమను ఆవి‍ష్కరించిన విధానం బావుంది శింగ రాజు శ్రీనివాసరావు గారు మీరు మంచి కథను అందించారు ధ్యాంకుసార్ 👍

    1. ధన్యవాదములు మేడమ్

  3. కథకు తగిన టైటిల్ పెట్టారు చాలా బాగుందండి.

Leave a Reply

Your email address will not be published.