అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ

(నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

– అవధానం అమృతవల్లి

ఆమె ఇప్పుడు  అప్పుడు  పొరలు పొరలుగా
విడిపోతూనే ఉంది
బంధాలు భాధ్యతల చట్రంలో చెరుకు గడలా నలిగి పోతూనే ఉంది
తీపిని పంచుతూ ఎందుకూ పనికిరాని పిప్పిలా మిగిలిపోతూనే ఉంది

ఇంటా బయట గౌరవాన్ని నిలబెట్టుకోటానికి
నిరంతరం గానుగెద్దులా తిరుగుతూనే ఉంది
నిద్ర పొద్దులను తరిమేసి నిశితో స్నేహము చేస్తోంది..
అలిసిపోతున్న శరీరానికి పట్టుదల తైలాన్ని
పూసి ముందడుగు వేస్తోంది..

ఇరవైనాలుగు గంటల్లో తన కోసం ఓ గంటను నిలుపుకోలేకుంది..
మరో గంట ఉంటే బావుణ్ణు అని నిట్టూర్పు సెగల్ని కప్పుకుంటోంది.

లోలోపలి తన శక్తిని తైలంగా చేసి ఇంటి దీపమై నిరంతరం వెలుగుతూనే ఉంది..
ఒక్కో అవయవం చెదలు పట్టినట్లు డొల్లగా
మారుతున్నా గుర్తించలేకుంది..
మమకారాల బందీఖానాలో బంగారు చిలుకలా చిక్కుకుపోయింది

తన ప్రతిభ ఎన్ని రంగాల్లో విస్తరించినా
ఇంకా తను కేవలం అవసరంగానే మిగిలిపోతోంది..
మనిషి ఉనికికి తాను చేసుకున్న ఒడంబడికకు
రక్తపు నదిలా ప్రవహిస్తూనే ఉంది..

ఎన్ని లోగిళ్ళలో చిరునవ్వుల మల్లెలా విరిసిందో
ఎన్ని గుండెల కాన్వాసు పై హరివిల్లు సంతకాల్ని చేసిందో..
మానవతా ఛత్రమై పుడమిని కాస్తూ
నిర్లక్ష్యాల నీడలు తరుముకొస్తున్నా తమాయించుకుంటోంది.

కన్నీళ్ల సంద్రాల్ని చెలియలి కట్టదాటనివ్వక
ఆశల తెరచాపలెత్తి ..
సంయమన తీరాల్లో విజయ బావుటాల్ని ఎగరేస్తూనే ఉంది.
ఆకాశపు హద్దుల్ని చెరిపేస్తూ నింగి తారకతో పోటీ పడుతోంది..

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.