నారి సారించిన నవల-45

కె. రామలక్ష్మి – 4 (భాగం – 2)

                      -కాత్యాయనీ విద్మహే

          సామాజిక సమస్యలను సంబోధిస్తూ నవల వ్రాయటానికి ప్రారంభించి, ఏ సమస్య అక్కడికక్కడే పరిష్కరించటానికి అలవి కానంతగా అల్లుకుపోయాయని గుర్తించి సమూలమైన మార్పును గురించి జైళ్ల వ్యవస్థ దగ్గర, స్త్రీల అక్రమరవాణా సమస్య దగ్గర ఆలోచించగలిగిన   శంకర్ ప్రభుత్వ వ్యవస్థల మీద అంతో ఇంతో విమర్శనాత్మకంగా ఉండగలిగిన శంకర్ నక్సలైట్ సమస్య దగ్గరకు , గిరిజన సమస్య దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించటం రామలక్ష్మి అవగాహనా పరిమితి వల్లనే అనుకోవచ్చు. గిరిజనుల జీవితం బాగుపడతాం అంటే వాళ్లలో ఒక అమ్మాయి మైదాన ప్రాంత చదువుకొన్న యువకుడిని పెళ్లి చేసుకొని వెళ్ళటమే అన్నంతగా వ్యక్తి స్థాయికి కుదించి చెప్పటంలోనూ అదే కనబడుతుంది.

          1985 లో వచ్చిన ‘ధర్మ సూత్రం’ నవల స్త్రీల స్వతంత్ర ప్రతిపత్తికి, స్వయం నిర్ణయాధికారానికి సంబంధించినది. ఈ నవలలో కథ చదువుకొని ఉద్యోగం చేస్తున్న  యువతి కమల వరుడి సంస్కారం నచ్చలేదని, కట్నం పెళ్లి చేసుకోనని చెప్పి తల్లితో గొడవపడి ఇంకోవూళ్ళో ఉద్యోగం చూసుకొంటాను అని ఇల్లు విడిచి వెళ్ళటం దగ్గర మొదలవుతుంది. మిత్రురాలు కళ్యాణి సహాయంతో ఉద్యోగం వెతుక్కొనటానికి వెళ్లిన కమలను     తనను తీసుకొని వెళ్ళటానికి  కళ్యాణితో పాటు  స్టేషన్  కు  వచ్చిన ఆమె   మిత్రుడు మూర్తి  ఆకర్షిస్తాడు. భార్యా పిల్లలు ఉన్నవాడని భార్య అహంకారం వల్ల సంసార జీవితం దుర్భరంగా ఉన్నా పిల్లలపట్ల బాధ్యతతో సహనం వహిస్తూ నవ్వుతూ నవ్విస్తూ జీవితంపట్ల గౌరవంతో బ్రతికే అతని పట్ల ఆమెకు ప్రేమ సానుభూతీ కలుగుతాయి. కమల వ్యక్తిత్వం, సంస్కారం అతనిని ఆమె ఆరాధకుడిగా చేస్తాయి. సంసారం పట్ల బాధ్యతగా ఉంటూనే ఆమెతో గౌరవకరమైన సహజీవనం అపేక్షిస్తాడు. అది ఆమెకు కూడా అంగీకారమే అవుతుంది. అయితే అతని కూతురు ఈ విషయం తెలిసి కల్లోలానికి గురి కావటం చూసిన కమల తన నిర్ణయంలో ధర్మం లేదని నిర్ధారణకు వచ్చి అతనిని వదిలి వేరే వూరికి ఉద్యోగం కోసం  వెళ్లిపోవటంతో ఈ నవల ముగుస్తుంది.   

          1985 అంతర్జాతీయ మహిళా దశాబ్ది ముగింపు సంవత్సరం. అంతర్జాతీయ మహిళాదశాబ్ధి స్త్రీపురుష వివక్షను గురించిన ఎరుకను కలిగించింది. ధిక్కార చైతన్యాన్ని ఇచ్చింది. స్త్రీలకు అవమానకరంగా, అభద్రతాయుతంగా ఉన్న వ్యవస్థలనుండి తమను తాము విముక్తం చేసుకొనే  కార్యాచరణకు నైతిక మద్దతు సమకూడింది. ఈ నేపథ్యంలో చూడాలి కమల కథను. నాలుగేళ్లుగా ఉద్యోగం చేస్తున్న కమలకు  తండ్రి మరణించిన ఏడాది లోపల పెళ్లిచేయాలన్న సంప్రదాయ విశ్వాసంతో  కన్యాదాన ఫలం ఆయనకు దక్కాలని తాపత్రయ పడుతూ   తల్లి , బంధువులు కలిసి  కమలకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వాళ్ళు మెచ్చిన వరుడి కట్నపు ఆశ, ఉద్యోగం చేస్తున్న తన స్నేహాల గురించి అనుమానాలు, ఉద్యోగం మాన్పించి ఇంటిపనికి, తల్లి సేవలకు , పిల్లలను చూసుకొనటానికి పరిమితం చేయాలనుకొనే దృష్టి ఆమెకు నచ్చలేదు. ఉద్యోగం మానను అని ఖచ్చితంగా చెప్తుంది. అంది రావాల్సిన తమ్ముడి కోసం, చిన్న చెల్లెలి  కోసం ఒంటరి తల్లికి సహాయంగా ఉండటం కోసం ఉద్యోగం చేస్తానని చెప్పింది. అమ్మకి అవసరం లేకపోయినా ఉద్యోగంలో తనకు తృప్తి వుంది కనుక  మానే  ప్రసక్తి లేదంటుంది. ఆధునిక మహిళ ఆత్మగౌరవంతో తనను తాను నిలబెట్టుకునే పద్ధతి ఎలా ఉంటుందో చూపింది రచయిత్రి ఇక్కడ. 

          పెళ్లి చూపులకు వచ్చిన వరుడు పిల్ల నచ్చిందంటే పెళ్ళయిపోతుంది. ఆడపిల్లల ఇష్టాయిష్టాలు పరిగణన లోకి రావు. ఈ గతానుగతికత్వాన్ని కూడా కమల తిరస్కరించింది. పెళ్లి కొడుకు ఆఫీసుకు వచ్చి పెళ్ళికి షరతులు పెడితే ఈ షరతులూ నచ్చలేదు, మీరూ నచ్చలేదు కరిగి కూలే మట్టి గుర్రపు వ్యక్తిత్వాన్ని భరించను అని అతనికి స్పష్టంగా చెప్పింది.ఇష్టం లేనివాడికి తనను కట్టబెట్టే హక్కు కన్న తల్లే  అయినా ఆమెకూ లేదు  అని తల్లికి కూడా చెప్పింది. ‘నన్ను  మనిషిగా గౌరవించేవాడిని తప్ప నేను పెళ్లి చేసుకోను. అని ధాటీగా చెప్పగలిగింది. పెళ్లి వద్దని ఇల్లువదిలివచ్చిన కమలను సాహసమే చేశారు అని మూర్తి అన్నప్పుడు “ నేను ఛస్తే పెళ్లిచేసుకోను. బానిసలా బ్రతకను. భార్యాభర్తల సమానత్వం చూడని పెళ్లి ఎందుకు? నాకు అక్కరలేదు. తిండి కోసం, బట్ట కోసం, నిలువ నీడ కోసమే పెళ్లి అనుకుంటే – అవి నేనే సంపాదించుకోగలను” అన్న మాటలలో కసి సామాజిక దురన్యాయాల పట్ల కలిగిన ఆగ్రహ ఫలితమే.అలాంటి కమల మూర్తి మాట తీరుకు, ప్రవర్తనా రీతికి, వ్యక్తిత్వానికి ఆకర్షితురాలై అతను వివాహితుడు, పిల్లల తండ్రి అని తెలిసినా పెళ్లితో సంబంధం లేకుండా పరస్పర ఇష్టంతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకొనటానికి గానీ సహజీవనం చేయాటానికి కానీ జంకక పోవటం తన శరీరం మీద,  జీవితం మీద తనకు సంపూర్ణ అధికారం ఉన్నదన్న స్పృహ మెండుగా ఉండటం వల్లనే.

          మూర్తిని తాను ప్రేమిస్తున్నానని తెలుసుకోగలిగిన  కమల  పెళ్లయిన వాడితో ప్రేమ ఏమిటనికానీ , అది అనైతికం అవుతుందేమో అనికానీ ఒక క్షణం కూడా తడబడలేదు. అతనికి భార్యా బిడ్డలు ఉన్నా వాళ్ళను అతను వదలలేడు అని తెలిసినా ‘అవన్నీ నాకు అనవసరం. నాక్కావలసింది అతని సహచర్యం, సాన్నిహిత్యం, జీవితం పంచుకొనటం కానీ మళ్ళీ పెళ్ళాం కావటం కాదు.’ అనుకోగలిగిందంటే పెళ్ళాం అనిపించుకొనటంలో సామాజిక భద్రత ఉందేమో కానీ స్వేఛ్ఛా, సమానత్వం లేవన్న అవగాహన వల్లనే కావాలి. ఆ క్రమంలోనే ఆమె మూర్తి తో బహిరంగంగా హాయిగా  జీవితం పంచుకోవాలని నిర్ణయించుకొన్నది. ప్రేమను చంపేసే పెళ్లివద్దు అని తిరస్కరించగలిగింది. కానీ జీవితంలో తోడును కోరుకొన్నది. బంధాలు వద్దు ప్రేమకావాలి అని ఆశించింది. 

          అయితే అది ‘కూడని ప్రేమ’  అన్న శంక  ఎక్కడో మనసు మారుమూలాలలో ఉన్న ట్లుంది. అయితే ప్రేమలో కూడనిదంటూ ఏమీ లేదు అని మూర్తి ఆమెను సమాధానపరిచాడు.  కానీ అతని కూతురు పాపాయి తమ సంబంధాన్ని కనిపెట్టి నిలదీసినప్పుడు, తండ్రి తమకు  దూరమవుతాడే మోనని కన్నీరైనప్పుడు కమల అపరాధ భావనకు లోనైయింది. కనుకనే ధర్మం  తప్పటంలో  సుఖం లేదన్ననిర్ధారణకు వచ్చింది. పెళ్లితో సంబంధం లేని ప్రేమ బంధాన్ని మూర్తి తో పెనవేసుకున్న కమల అతని ప్రేమను, అతను ఇస్తానన్న భద్రతను, చట్టపరమైన రక్షణను, జీవితకాలపు సాహచర్య అవకాశాన్ని వదులుకొని అతను అతని కుటుంబానికి అత్యవసరం అనుకొని  అతని జీవితం నుండి నిష్క్రమించటమే తన ధర్మం అనుకొన్నది. తమ ఇద్దరి సంబంధం పొరపాటు కాకపోవచ్చుకానీ తొందరపాటు అని మాత్రం అనుకొంటుంది. కమల ఆకాంక్షల లో న్యాయం ఉండవచ్చుకానీ, ఈ రకంగా పెళ్లి, కుటుంబం అనే వ్యవస్థలకు అతీతంగా స్వేచ్ఛాయుత లైంగిక సంబంధాలు ఏర్పరచుకొనటం ధర్మం కాదన్నఅభిప్రాయం రచయిత్రిది. తల్లి తోడబుట్టినవాళ్లు తనపట్ల కాస్త ఓర్పువహించి ఉంటే ఆదరాభిమానాల కోసం, ప్రేమకోసం ఇలా భిక్షువుని అయివుండేదాన్ని కాదు అని కూడా కమల అనుకొన్నట్లుగా చెప్పటం ద్వారా రామలక్ష్మి కుటుంబంలో ప్రేమరాహిత్యం స్త్రీలు కుటుంబానికి అవతల ప్రేమ కోసం ధర్మం తప్పేట్లు చేస్తుందని కూడా సూచించినట్లయింది. 

          ఆ తరువాతి కాలంలో ఓల్గా వంటి స్త్రీవాదులు కమల వంటి స్త్రీల ఆకాంక్షలలోని న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ నవలలు వ్రాయటం గమనించవచ్చు. 

          ఈ దశకంలో రామలక్ష్మి వ్రాసిన ‘శిలా పుష్పం’ నవల చివరిది. 1986 జనవరి లో మద్రాస్ నుండి క్రియేటివ్ పబ్లిషర్ వారి ప్రచురణగా వచ్చింది. కాలేజీ చదువుల రోజుల్లో  ఒకడిని ప్రేమించి, నమ్మకంతో శరీరాన్ని కూడా అర్పించి మోసపోయిన రేవతి ఇంట్లో తండ్రి, సవతితల్లి ఆగ్రహానికి గురైంది. సవతితల్లి తమ్ముడితో పెళ్ళికి వాళ్ళు తీసుకొన్న నిర్ణయం తనను మరింత దుర్భరమైన నరకంలోకి తోసేస్తుందని ఇల్లువిడిచి వెళ్ళిపోయి దుర్గాబాయి కంటపడి ఆంధ్రమహాసభకు చేరిన రేవతి జీవిత యానం ఈ నవలకు వస్తువు. రేవతి  కొడుకును కని పెంచి పెద్దచేస్తూ తాను సామాజిక సేవారంగంలో పనిచేస్తూ సాగిపోవటానికి ఆలంబనగా నిలిచిన దుర్గాబాయి కల్పిత పాత్ర కాదు. చారిత్రక వ్యక్తి. దుర్గాబాయ్ దేశముఖ్. 

          దుర్గాబాయి 1909 జులై 15 న రాజమండ్రిలో పుట్టి కాకినాడలో పెరిగి పదకొండు పన్నెండేళ్ల వయసులోనే జాతీయోద్యమ రాజకీయాలలోకి ప్రవేశించి మద్రాస్ లో ఉప్పు సత్యాగ్రహం నడిపి జైలు జీవితం గడిపి ఆ తరువాత చదువుకొని మద్రాస్ లో లాయరుగా పనిచేస్తూ స్త్రీల కోసం 1938  లోనే ఆంధ్రమహిళాసభ ఏర్పరచి అభివృద్ధి చేయటమే కాక 1958 నాటికి దానిని హైదరాబాద్ కు విస్తరింపచేసిన ఘాన చరిత్ర ఆమెది. అదే సమయంలో రాజకీయరంగంలో కూడా క్రియాశీల పాత్రవహించింది. కాన్సిట్యూషనల్ అసెంబ్లీకి ఎన్నిక కావటం నుండి ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా సాంఘిక సంక్షేమానికి నిధులు కేటాయించవలసిన అవసరాన్ని పదేపదే చెప్పింది కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థ ఏర్పడటానికి ప్రేరణ అయింది. దుర్గాబాయ్ అంటే మహిళాజన సంక్షేమానికి జీవితం అంకితం చేసిందన్నది లోక ప్రసిద్ధం. 1981 మే 9 న ఆమె మరణించింది. ఆ దుర్గాబాయ్ ఈ నవలేతివృత్తాన్ని నిలబెట్టిన నిట్టరాడు అయింది. కె. రామలక్ష్మికి దుర్గాబాయ్ పట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఆమెను కేంద్రంగా చేసి నవల ఇతివృత్తాన్ని అభివృద్ధిచేయటానికి ప్రేరేపించాయి. 

          రామలక్ష్మి చదువు మద్రాసు లోనే కనుక దుర్గాబాయి ని గురించి వింటూనే ఉంది. 1952 నాటికి బిఎ పూర్తిచేసి సంఘసేవా  కార్యక్రమంలో  ఆసక్తి తో ఆంధ్రమహిళా సభకు వెళ్తుండేది. ఆ  క్రమంలో  దుర్గాబాయితో సాన్నిహిత్యం పెరిగింది. 1942 లో ఆంధ్రమహిళా సభ పక్షాన ప్రారంభమైన ‘ఆంధ్రమహిళ’ మాసపత్రికకు 1959 జనవరి నుండి సంయుక్త సంపాదకురాలిగాను,( అప్పుడు సంపాదకురాలు కె. లక్ష్మీ రఘునాథ్ ) సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు సంపాదకురాలుగాను  కూడా పనిచేసింది రామలక్ష్మి. ఆ క్రమంలోనే దుర్గాబాయ్ దేశముఖ్ జీవిత చరిత్ర వ్రాసింది. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు అకాడమీ సంయుక్త ప్రచురణగా 1987 డిసెంబర్ లో అది ప్రచురించబడింది. అందుకు దాదాపు రెండేళ్లు  ముందు నుండే ఆమె ఈ జీవితచరిత్ర రచన పనిలో ఉన్నదేమో మరి..  ఆమె ను పాత్రగా చేసి  కాల్పనిక సాహిత్యంలో జీవితకాలంలో చక్క దిద్దిన ఎందరో  వంచితలు అభాగినులు అయిన స్త్రీల కు ప్రతినిధిగా, ఒక ఆదర్శ నమూనాగా  రేవతిని చూపిస్తూ శిలాపుష్పం నవల వ్రాసింది.

          రేవతి ప్రేమ పేరున మోసపోయి ఆ విషయం చెప్పి తండ్రి చేతిలో చావుదెబ్బలు తిని, సవతి తల్లి తమ్ముడితో ఆయన నిర్ణయించిన పెళ్లి నుండి తప్పించుకొనటానికి ఇల్లుదాటి బయటకు వచ్చిన రేవతి బస్సెక్కి ఎక్కడికని టికెట్ అడగను అని లోలోపలే ప్రశ్నవేసుకొని ‘లజ్’ కు ఇయ్యమన్నది. ఆంధ్రమహిళా సభ ప్రారంభమైంది లజ్ చర్చి రోడ్డు లోనే. రేవతికి ఆ క్షణాన దుర్గాబాయ్ మనసులో మెదిలి ఉంటుందను కోవచ్చు. ఆ బస్సు అక్కడికి పోదని అంటే తరువాతి బస్ స్టాండ్ లో  దిగిపోయిన రేవతికి  దుర్గాబాయ్  ఎదురుపడి జీవితంలో దెబ్బ తిన్న ఆడపిల్ల అని గ్రహించి  ఆమెను సభకు పంపించటం నవలకు ప్రారంభం. దుర్గాబాయ్ తో సంభాషణ లో రేవతి గర్భ స్రావానికి ఇష్టపడక,  బిడ్డను కని  పెంచటానికి తండ్రి చనిపోయాడని బిడ్డకు  చెప్పటానికి నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది. దుర్గాబాయ్ హైద్రాబాదులో మహిళా సభను చూసుకొనటానికి మకాం మార్చటం ప్రస్తావన కూడా ఈ నవలలో ఉంది. రేవతి పురుడు పోసుకోకముందే ఇది జరిగింది. హైదరాబాద్ లో ఆంధ్రమహిళాసభ ఏర్పడింది 1958 లో  కనుక అక్కడ తాను లేకుండా పనులు జరిగేట్లు లేవు అని  దుర్గాబాయ్ అక్కడికి మకాం మార్చటం 1960 ప్రారంభంలో అయిఉండవచ్చు. కనుక ఈ నవలలో కథాకాలం 1960 వదశకం లో తొలిభాగం అయివుంటుంది. 1953 నుండి 1962 వరకు దుర్గాబాయ్ దేశముఖ్ కేంద్ర సంక్షేమ సంస్థకు అధ్యక్షురాలు. ఆ నేపధ్యం నుండి  కేంద్రప్రభుత్వం మురికి పేటల  మెరుగుకై  కేటాయించిన నిధుల వినియోగ బాధ్యత అప్పగించటానికి ఆమె రేవతిని మద్రాసు నుండి హైదరాబాద్ పిలిపించుకొన్నట్లు కథా కల్పన చేసింది రామలక్ష్మి. ఆరునెలల కొడుకు సూర్యంతో రేవతి హైదరాబాద్ రావటం నవలలో మరొక మలుపు. పదేళ్ల తరువాత కొనసాగే కథ లో తన  పని పద్ధతి తో ఆమె  మురికివాడల మనుషులకు   దగ్గరై కనిపిస్తుంది. స్త్రీలకు కుటుంబనియంత్రణ గురించిన జ్ఞాన చైతన్యాలు ఇచ్చి  పౌష్టిక ఆహరం అంద చేయటంలో ఎంత  శ్రద్ధ పెట్టిందో అక్కడ మగవాళ్ల  తాగుడు వ్యసనం వల్ల ఆడవాళ్లకు కుటుంబంలో ఎదురవుతున్న హింస నుండి విముక్తి సంఘటిత పోరాటం వల్లనే సాధ్యమవుతుందని చెప్పి స్త్రీలను సమీకరించటంలో అంత చొరవ చూపింది. జనానికి నిత్యావసరాలు సమకూడుతున్నాయో లేదో పట్టింపులేని సారాదుకాణాలు మాత్రం అందుబాటులో ఉంచటం గురించి ఆందోళన పడింది. స్థానిక ఎం ఎల్ ఏ దగ్గరకు , ఆబ్కారీ మంత్రి దగ్గరకు, ఆ రెండు చోట్లా వ్యతిరేకత ఎదురైనా ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్లి కల్లు దుకాణం ఎత్తేసే పర్యంతం మురికివాడ స్త్రీలను నడిపించింది. 

          స్త్రీలు రాజకీయాలలోకి ఎక్కువగా రావాలన్న దుర్గాబాయ్ ఆకాంక్షను కూడా ఈ నవలేతి వృత్తంలో భాగంచేసింది రచయిత్రి.ఆడదాన్ని శరీరంలా , ఓటుగా చూడటానికి అలవాటుపడ్డ సమాజాన్ని మార్చటానికి అదే మార్గం అని దుర్గాబాయ్ అభిప్రాయం. 1952 ఎన్నికలలో దుర్గాబాయి అభ్యర్థిత్వాన్ని బలపరచిన కాంగ్రెస్ పార్టీ లోనే ఒక ఆడదానిగా ఆమె గెలుపు తమ అవకాశాలకు,  అధికారానికి అవరోధం అవుతుందనుకొన్న వర్గం ప్రచారం  కారణంగా ఆమె రెండువందల ఓట్ల తేడాతో ఓడిపోయింది. బహుశా ఆ అనుభవం నుండే ఆమె రాజకీయాలలో స్త్రీల భాగస్వామ్యం పెరగాలని, తాను ఆగిన చోటు నుండి స్త్రీలు మరింత పురోగమించాలని అనుకోని ఉంటుంది. రేవతిని రాజకీయాలలోకి వెళ్ళమని ఆమె ప్రోత్సహించినట్లు కథను కల్పించటంలో రామలక్ష్మి కి ఈ చారిత్రక స్పృహ ఉంది అనుకోవచ్చు. 

          ఆ మేరకు రేవతి ఎన్నికలలో నిలబడి ప్రచారంలోకి దిగిన తరువాత ఎదురైన   నాటకీయ పరిణామాలు నవలెతివృత్తంలో భాగం అయ్యాయి.  వాటిలో ముఖ్యమైనది రేవతిని ఒకప్పుడు ప్రేమపేరుతో వంచించిన గంగరాజు రేవతి ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే పక్షాన రంగంలోకి దిగి ఆమెను నియంత్రించటానికి,  ప్రజలలో ఆమె పట్ల నమ్మకం సడలటానికి ఆమె లైంగిక నీతి గురించిన దుష్ప్రచారాలకు దిగటం. రేవతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించటానికి పెట్టిన మీటింగుల్లో జనంలో చేరి ఎవరో ఒకరు పెళ్లి కాకుండా కొడుకును కన్న ఆడదానిగా ఆమె గురించి అరచి గోలచేయటం ఒక పద్ధతి ప్రకారం  జరిగింది. ఇది భారతదేశానికి స్వతంత్రం రావటానికి కాస్త ముందు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికలలో విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గా పోటీ చేసిన కొమర్రాజు అచ్చమాంబ పై కాంగ్రెస్ ఆమె ఒక వివాహితుడిని కాంటాక్ట్ పద్ధతిలో చేసుకొన్న పెళ్లిని నెపంగా పెట్టుకొని శీలం లేని స్త్రీని ఎన్నుకోవద్దు అంటూ చేసిన ప్రచారాన్ని గుర్తుకు తెస్తుంది.  

          తన జీవిత రహస్యాన్ని కొడుకుకు చెప్తానని బెదిరించి లొంగదీసుకొనటానికి వచ్చిన గంగరాజును రేవతి చంపెయ్యటం, లాయర్ అయిన కొడుకు సూర్యం తన తోటి లాయర్, తాను జీవన సహచరిగా ఎంచుకొన్న రాణి సాక్ష్యాలను సేకరించడంలో  చూపిన చొరవ,  సీనియర్ లాయర్,  రాణి తండ్రి అయిన శరత్ వాదన నవలలో చివరి అంకం.  మగవాడి దౌష్ట్యానికి గురైనా పరిస్థితు లను, పరిణామాలను ఎదుర్కొనటానికి ధైర్యంగా సిద్ధపడి తనదైన జీవితాదర్శాలతో గౌరవకరంగా జీవిస్తున్న స్త్రీ రేవతి అని ఆమె మార్గానికి అడ్డువచ్చి దౌర్జన్యంతో లొంగదీసుకోనలనుకొన్న  వాడిని ఆమె హత్య చేయటం మానరక్షణ , అభిమాన రక్షణ లో భాగమేనని దుర్గాబాయి ద్వారా కోర్టులో సాక్ష్యం చెప్పించిన రామలక్ష్మి లైంగిక ద్వంద్వ విలువలపై ప్రశ్నను ఎక్కుపెట్టటమే కాక  స్త్రీల జీవితం మీద స్త్రీల అధికారాన్ని స్థాపించినట్లయింది.   

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.