కనక నారాయణీయం -52

పుట్టపర్తి నాగపద్మిని

          కేరళలో తను పని చేసింది కొద్ది సంవత్సరాలే ఐనా, అక్కడి విలక్షణ సంస్కృతి  చాలా ఆకట్టుకుంది తనను! మలయాళం చాలా వరకూ సంస్కృత పదాలతో నిండి ఉంటుంది. కొద్దిగా కర్త, కర్మ, క్రియాపదాలూ, వ్యాకరణాంశాలు ఒంటబట్టించుకుంటే మెల్లి మెల్లిగా భాష అర్థమౌతుంది. అదీ కాక అ భాష వాడకంలోని ఒక తూగు చాలా నచ్చుతుంది తనకు! సాహిత్య పరంగా కూడా విలక్షణ వైఖరుల సమాహారం. మళయాళ సాహిత్యంలో చంద్రోత్సవం కావ్యంలోని మణిప్రవాళ శైలి గురించి భారతికి చక్కటి వ్యాసం వ్రాశాడు తాను. ఇక కథాకళి నృత్యరీతుల గురించి చాలా వివరణాత్మక వ్యాసం భారతిలోనే వచ్చింది. అతి చిత్రమైనదీ నృత్య శైలి. వాళ్ళ మేకప్ కే కొన్ని గంటలు తీసుకుంటారు. ఇక హావభావ ప్రదర్శన సంగతి అద్భుతం. నూనె దీపాల వెలుగులో బయలాట పద్ధతిలో కొన్ని గంటల పాటు సాగే యీ నృత్యం, భారతీయ నృత్యాల్లో తలమానికమనవచ్చు. అన్నట్టు మళయాళం నుండీ కొన్ని నాటకాలనూ తెలుగులోకీ, బూర్గులవారి  కోరిక మీద విశ్వనాథ ఏకవీరనూ మలయాళంలోకీ అనువదించటమైంది. ఇంతకూ తన కావ్య రచన సంగతేమిటి?’ ఆలోచనలు ఇటుమళ్ళే సరికి తాను మొదలు పెట్టిన రామాయణంగుర్తుకు వచ్చింది పుట్టపర్తి వారికి!

          ‘ఇటీవల మనసులో ఘర్షణ మొదలైంది. ఇంత వరకూ, పెనుగొండ లక్ష్మి మొదలు ఇప్పటి వరకూ, వ్రాసినవి చిన్న కావ్యాలే అయినా, దేని ప్రత్యేకత దానిదిగానే తెలుగు సాహిత్య సీమల్లో తన రచనలన్నీ తమ ప్రాధాన్యతను చాటుకున్నాయి. ముఖ్యంగా శివతాండవం, మేఘ దూతం – మరింత ఖ్యాతినార్జించాయి. కానీ, ఎంతో ఇష్టంగా ద్విపద వైభవాన్ని ఆవిష్కరించేందుకై  వ్రాసుకున్న పండరీ భాగవతంలోని చాలా భాగం, దానికి తోడు తనకెంతో ప్రీతిపాత్రమైన విజయనగర ప్రాభవ వైభవాలకు కావ్య వైభవం కూర్చే ప్రయత్నంగా వ్రాసుకున్న అస్త సామ్రాజ్యం, యీ రెండూ, పూర్తిగా వెలుగులోకి రాక ముందే భగవంతుని నిర్దేశమా అన్నట్టే, జలదేవతకు ప్రీతిపాత్రాలై పోయాయి.

                          ‘భక్తుల దాసుండ – భక్తుల లెంక

                           భక్తుల పడిగాపు – భక్త జీవనుడ

                           భక్తి గోత్రుండ – సద్భక్తి వంశ్యండ

                           భక్తి చాపల్యుండ – భక్తి బంధుండ

                           విదితాష్టభాషా కవిత్వ నిర్మాణ

                           మద బంధరుండ – కళా మహిత రాహస్య

                           సేవధి – నవధాన చిత్రచణుండ..’

          పరిచయానంతరం, ధ్వని, అలంకారము, ఉత్తమ శైలి, పాకము, అనవద్య ఔచితి, అర్థ విన్యాసము అప్పుడప్పుడు గుప్పు గుప్పున వెడలి, మోదము ముప్పిరిగొనగా 

          విబుధ కోటికై, పండరినాధుని గుణ పరీమళ గాధగా పండరీ భాగవతాన్ని రచిస్తున్నా నంటూ, పుండరీక గాధకు శ్రీకారం చుట్టి, పుండరీకుడు, గోరాకుంభారు, నరహరి వంటి పండరీ భక్తుల గాధలకు ద్విపద మాధురిని అద్ది, మైమరచిపోయాడు తాను. ‘ద్విపదేనా?’ అని తేల్చేస్తారు పండితులు కానీ,కేవలం రెండు పాదాల వృత్తంలో గొప్ప అర్థాన్ని అమర్చటంలోని కష్టం ఎంతటిదో వ్రాయటానికి పూనుకున్నవాళ్ళకే తెలుస్తుంది.

          తెలుగు లో గోన బుద్ధారెడ్డి, పాల్కురికి ద్విపదకు తెచ్చి పెట్టిన గౌరవం అంతాఇంతా కాదు. ద్విపద రామాయణాలే ఎక్కువగా సామాన్య జనజీవితాల్లోకి చొచ్చుకు పోయిన సంగతిని నేటి సాహిత్యకారులు విస్మరించటం వారి వారి  విజ్ఞతకు సంబంధించిన విషయం. ప్రాచీన కవుల తరువాత వచనమసలే లేకుండా గేయ ఫణితిలో సాగే ద్విపద ను ఆదరించిన వారు తెలుగులో దాదాపు లేరు.

          తనకెందుకో అనిపించింది, నేనూ  ఒక ద్విపదను వ్రాయలేనా? ‘అని! పైగా ఒక్కొక్క పండరీభక్తుని జీవితం ఒక్కో కోణంలో సామాన్య ప్రజానీకానికి సందేశాత్మకమే కదా! అందుకే యీ కథా వస్తువుకు ద్విపదే సరైన వృత్తమనిపించి మొదలు పెట్టుకున్నాడు తాను. జీవితంలో ఆటుపోట్ల ముందు కావ్య రచన సులభమన్నట్టై పోయింది తనకు!!

          ఎంతటి కవైనా వాళ్ళు కూడా యీ సమాజంలోని క్లిష్ట జీవన మార్గాల్లోనే నడవా ల్సిందే కదా! గత జన్మల్లో తెలిసి తెలియక చేసిన తప్పిదాలకు యీ జన్మే కదా అనుభవ మండపం! దానికి తోడు, ఈ దేహంలో నేటి జీవనాకర్షణల్లో అడుగులు తడబడే నైజాన్ని తప్పించుకోవటం, అసాధ్యమని పెద్దలు వాక్రుచ్చుతూనే ఉంటారు. ఇటు వంటి తప్పిదాల నుంచీ కాపాడమని ఆ అష్టాక్షరీనాధుణ్ణి వేడుకోవడమొక్కటే మార్గమని ఉపాసనా మార్గమే  బోధించింది. అందుకే కలంలో భక్తిరసాన్నే సిరాగా నింపుకుని అడుగులు వేయటం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు తాను! వ్రాసుకోవడం వరకూ బాగానే సాగింది కానీ, వ్రాత ప్రతులను చక్కగా భద్రపరచుకోవటం అన్న విషయంలో మళ్ళీ జీవితం తనను   వెక్కిరించింది.

          వరదలు! ఎటుచూసినా నీళ్ళు! ఈ ప్రాంత ప్రజలందరూ చెప్పుకోవటమే, కుందు నదిలో వరదలు తామింత వరకూ చూడనేలేదని! కట్టలు తెంచుకుని పారుతున్న వరద ల నుంచీ కట్టుబట్టలతో కనకమ్మా పిల్లలతో గడప దాటి సురక్షితంగా రాగలగటమే భాగ్య మనీ, బలుసాకు తినైనా బతుకును కొనసాగించగలమన్న తపన ఒక్కటే సత్యంగా తోచిం దప్పుడు!

          కళ్ళముందే పండరీభాగవతం, అస్తసామ్రాజ్య వ్రాతప్రతులూ, కొట్టుకుపోతున్నాయి. వీళ్ళతో ఏ నాటి అనుబంధమో కానీ, మాలేపాటి సుబ్రమణ్యం, సుబ్బన్నా, గోవింద రెడ్డీ -ఇంకా శిష్యులందరూ తననూ, కుటుంబాన్నీ ఒడ్డుకుచేర్చే ప్రయత్నం ప్రాణాలకు తెగించి చేశారు. ఇంకా నా రచనలను కాపాడండి నాయనలరా! అంటూ, వాళ్ళను కష్ట పెట్టటం అవసరమా? అని మనసు నిలదీసింది. నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళు ధారా పాతంగా కారిపోయాయి! అస్త సామ్రాజ్యం అని పేరు పెట్టటంలోనే ఆ విజయనగర గాధ భావి నిర్ణయమైపోయిందేమో మరి! అది కూడా వరద నీటిలో అదృశ్యమైపోయింది. ఆ అధ్యాయం ఆ విధంగా ముగిసి, తరువాతి జీవితంలో ఒడుదుడుకుల వల్ల, ఆర్థిక అవసరాలకన్నట్టే, అనువాదాల మీద దృష్టి కేంద్రీకరించటం జరిగింది. దేశమంతా చుట్టి వచ్చి, చివరికి కడప గడపలో రామకృష్ణా హైస్కూల్ లో ఉద్యోగ జీవితంలో స్థిరపడి నప్పటి నుంచీ, మళ్ళీ ఘర్షణ! ఇంత వరకూ ఏదైనా పెద్ద కావ్యాన్ని చేపట్టలేకపోతున్నా ననే నిరాశా నిస్పృహలు! కానీ, ఒక చల్లటివేళ, వాల్మీకి తులసీలిద్దరూ ఎదుట నిలిచి, మమ్ములను మరచిపోయావే? అని ప్రశ్నించినట్టే తోచింది. కారణమేమిటో గానీ, మొదటి నుంచీ వాల్మీకి, తులసీదాసు ఇరువురి  ప్రభావమే తన జీవితాన్నంతా అల్లుకున్నట్టుగా అనిపిస్తుంది.అష్టాక్షరీ సాధన వల్ల మేధ, నారాయణ స్మరణ వైపే అనుక్షణం లాగు తున్నా, మనసు మాత్రం, రామ నామం వైపే పరుగులు పెడుతుంది. రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చేలా కలం, మధ్యవర్తిత్వం నెరపినట్టుగా, శ్రీనివాసునికి అంకితం చేస్తూ వేంకటాచల మహాత్యం ఆధారంగా తన పాండిత్య పరిధుల పారం ముట్టే విధంగా  శ్రీనివాస ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టటమైంది.

          జీవితం మీద వైరాగ్యమేర్పడి తాను హిమాలయల వైపు ప్రయాణించటమే తన జీవితానికొక మార్గం చూపిన తరుణమేమో అనిపిస్తుంది. టికెట్టైనా లేకుండా తాను రైళ్ళలో ప్రయాణిస్తూ తులసీ రామాయణ్ చదువుతూ వెళ్తుంటే, ఆ రైల్లో ప్రయాణించే ప్రజలు తననొక స్వామీజీగా భావిస్తూ, కాళ్ళకు మ్రొక్కటం, టికెట్ కొని పెట్టి అదరిం చటం, తులసీ రామాయణం కంఠతా కాబట్టి తాను రాగయుక్తంగా చదువుతూ ఉంటే మైమరచిపోయి వినటం –  ఇవన్నీ చూస్తుంటే తులసీ మీద తనకు ఆరాధన మరింతగా పెరిగిపోయింది. అప్పుడే బహుశా రామాయణం గేయ పద్ధతిలో వ్రాయాలన్న కోరిక ఊపిరి పోసుకుని ఉంటుంది. దీనికి తోడు స్వామీ శివానందులవారు తనను సరస్వతీపుత్రగా ఆశీర్వదించి జీవితంలో ఇంకా ఎన్నో కీర్తి శిఖరాలు అందుకోవలసి ఉందంటూ వెనక్కి పంపారు. అప్పటి నుంచీ తన లేఖిని తనను నిలువనీయలేదు. గేయ పద్ధతిలో కావ్యం వ్రాయటం తనకు చాలా అచ్చొచ్చిన ప్రక్రియ. ద్విరదగతి రగడలో శివతాండవం దాదాపు ఆశువుగానే వెలసింది. కావ్య కాయం చిన్నదేమో కాస్త పెంచవలెనని ప్రయత్నించినా తరువాత సాధ్యమే కాలేదు. శివాజ్ఞ అంత వరకే అని సరిపెట్టుకోవలసి వచ్చింది.

          అటు తరువాత షట్పదీ శైలిలో వ్రాసుకున్న మేఘదూతం సామాజిక సందేశ కావ్యం. పీడిత, తాడిత వర్గాల కష్టాలతో పాటు చారిత్రికాంశాలనూ పొందుపరచి దేశభక్తి రచనగా దాన్ని వ్రాయటం, ఒక ప్రత్యేకానుభూతి. కవిగా తనకెంతో గుర్తింపు తెచ్చిన యీ రెండు రచనల తరువాత, ఇప్పుడీ రామాయణం వ్రాయాలన్న సంకల్ప లక్ష్యమే, తులసీ రామాయణం వలె, ప్రజల జీవితాల్లో భాగమైపోవటం. సాహిత్య దిగ్దంతులుగా పేరొందిన వారు వ్రాతలో ఉండగానే తాను ఒకటి రెండు చోట్ల చదవగా విని, పెదవి విరిచిన సందర్భాలింకా కొన్ని గుర్తున్నాయి. ద్విపద శైలిలో పండరీ భాగవతం వ్రాసినప్పుడూ ఇదే వెక్కిరింత. కానీ తానేనాడూ ఇటు వంటి ఆక్షేపణలకు విలువ నివ్వలేదు. కారణం,  కావ్య రచన, ఆత్మ ప్రేరేపణతో కవి లేఖిని మాధమంగా ఇల పైకి ప్రవాహితమయ్యే  అమృతధార. కవి బౌద్ధిక, మానసిక, కల్పనా స్థాయిని బట్టి తన మార్గాన్ని తానే  నిర్దేశించు కుంటుందే కానీ, ఎవరి కోసమో తన రూపాన్ని మార్చుకునే శక్తిహీన కాదు. అందుకే తానిలా మాత్రా చందస్సులో షట్పదీ వృత్తంలో ఒక శుభ ముహూర్తాన శ్రీకారం చుట్టటం జరిగింది. రామాయణ రచనకు సంబంధించినంత వరకూ, మొదట కిష్కింధ కాండలోని ప్రకృతి వర్ణన, సీతాహరణానంతర పరిణామాలు, రాముని విరహం – తన కలాన్నటే నడిపించాయి ముందుకు. శివతాండవం, మేఘ దూతం వలెనే రగడ వృత్తంలో రచనను సాగించాడు తాను ఇందులోనూ! లయాత్మకంగా, హాయిగా పాడుకునే వీలు ఇందులోనే కదా ఉన్నది. పైగా తన లక్ష్యమూ అదే!      

          పలు సభల్లోనూ, సాహిత్య అకాడమీ సమావేశాల్లోనూ కావ్య పఠన సందర్భాల్లో తన కిష్కింధాకాండను చదవటం, రాళ్ళపల్లీ , బెజవాడ, దేవులపల్లి రామానుజరావు వంటి వాళ్ళంతా తలలూపటం తనకింకా గుర్తే!

రాముని సీతా విరహాన్ని సైతం మైమరపించింది ప్రకృతి!

                    విచ్చినతామర లెచ్చిన కొలనదె

                   అద్రి గుహకు రెండడుగులనున్నది,

                   యలవోకగ నెపుడైన గుహా ద్వా

                   రమ్మున గూర్చొని జూచుటకూ!

***

                     చంపకములు, తిమిశమ్ములు, తిలక

                     మ్ములు తాలమ్ములు మొగళ్ళు, పద్మక

                     ములు నతిముక్తకములు, వకుళమ్ములు

                     తమాలములు హింతాలములూ..  

 కిష్కింధలో తార పాత్ర పై తాను ప్రత్యేక దృష్టి పెట్టి వ్రాసుకున్నాడు. శివతాండవం, మేఘ దూతం వలెనే రగడ వృత్తంలో రచనను సాగించాడు తాను ఇందులోనూ!

          లయాత్మకంగా, హాయిగా పాడుకునే వీలు ఇందులోనే కదా ఉన్నది. పైగా తన లక్ష్యమూ అదే!      

      ఆ ఉత్సాహం రెట్టింపై, జనప్రియ రామాయణ బాలకాండ వ్రాస్తున్న తరుణమిది.  

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.