నా జీవన యానంలో- రెండవభాగం- 38

-కె.వరలక్ష్మి

          వంటలు, భోజనాల తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కి కరోల్ బాగ్ మార్కెట్ కి వెళ్ళాం. వాళ్ళిద్దరూ బట్టలూ, బేగ్స్, షూస్ లాంటివి కొన్నారు. ఆ రాత్రి క్వాలిస్ లో బయలుదేరేం, రాజేంద్ర కూడా మాతోనే ఉన్నాడు ఢిల్లీ నుంచి మా తిరుగు ప్రయాణం వరకూ. ఉదయం 5కి హరిద్వార్ చేరుకున్నాం. భరించలేని చలి, అక్కడి ఉదృతమైన నీళ్ళ వరవడిలో అందరూ నదీస్నానం చేసారు. గొలుసులు పట్టుకుని, ఆ జన సందోహంలో నీటి ప్రవాహం లోకి దిగాలంటే భయం వేసింది నాకు.

          నది ఒడ్డున దేవుళ్ళ, దేవతల విగ్రహాలు పెట్టుకుని వ్యాపారస్తుల్లా కూర్చున్నారు పూజారులు. అక్కడి చలికి చొక్కాలు, స్వెట్టర్లు వేసుకుని, తల పైన టోపీలు పెట్టుకున్న వాళ్ళని చూస్తే, దక్షిణ ప్రాంతపు ఆలయాల పద్ధతులకలవాటైపోయి ఎందుకో భక్తిభావం లాంటిదేదీ కలగలేదు. అక్కడి కాలి మార్గంలో ఎగువకి నడుస్తూ ఇంగువ, కరక్కాయలు లాంటివి రోడ్డు పక్కన అమ్ముతుంటే కొన్నారు మావాళ్ళు. ఒక వైపు కొండ మీద మానసా దేవి ఆలయానికి, మరో వైపు కొండ మీది చండీ, అంజనీదేవిల ఆలయాలకి రోప్ వేలో వెళ్ళేం. ఆ ప్రయాణం ఎంతో బావుంది. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి ఋషీకేశ్ వెళ్ళేం. అక్కడి రామ్ ఝూలా, లక్ష్మణ్ఝూలా  వంతెనలు, చుట్టూ ఎత్తైన పర్వతాలు, పచ్చని పకృతి, వంతెనల కిందుగా ప్రవహిస్తున్న గంగానది- అస్తమయ సూర్య కాంతిలో అద్భుతమైన సౌందర్యం కళ్ళను కట్టి పడేసింది. లోతైన గంగనీళ్ళు భయపెట్టాయి. మొత్తానికి లక్ష్మణ్ఝూలా దగ్గర రాతి మీద కూర్చుని మగ్గుతో అతి చల్లని నీరు తలమీంచి పోసుకుని అయ్యిందనిపించాను. తిరుగు ప్రయాణమై రాత్రి 11కి ఢిల్లీ చేరుకున్నాం.

          మర్నాడు మార్చి 19న ఉదయం 9 కి వేన్ మాట్లాడుకుని ఢిల్లీ లోకల్ దర్శన్ కి బయలుదేరాం. రాష్ట్రపతి భవన్, గేట్ వే చూసి అక్షర్ ధామ్  – స్వామి నారాయణ్ టెంపుల్ కి వెళ్ళేం. ఆ టెంపుల్ ని అయిదేళ్ళు నిర్మించి 2005 నవంబర్ లో ఓపెన్ చేసారట. అద్భుతమైన శిల్పశైలిలో విరాజిల్లుతున్న గొప్పకట్టడం. గొప్ప అనుభూతి దాన్ని చూడడం.

          తర్వాత రాజ్ ఘాట్ కి వచ్చి గాంధీజీ సమాధి చూసి, అక్కడి తోటలో కూర్చుని వెంటతెచ్చుకున్న పదార్థాలతో భోజనాలు కానిచ్చాం. తర్వాత ఎర్రకోట (బైటి నుంచి), కుతుబ్ మినార్, కాళీ ఆలయంతో బాటు ఆ పరిసరాల్లోని ఆలయాలు, లోటస్ టెంపుల్, ఆంజనేయ – శివ హ్యూజ్ ప్రతిమలు, దారివెంట కన్పించిన పాత-కొత్తకట్టడాలు చూసి 6PM కి విడిదికి చేరుకున్నాం.

          మర్నాడు ఉదయాన్నే క్వాలిస్ లో తాజ్ మహల్ చూడ్డానికి బయలుదేరేం. దారిలో మధుర, ఫతేపూర్ సిక్రీ  చూసాం. ఫతేపూర్ సిక్రీ పరిసరాల్లో బంగాళాదుంపల పొలాల్లో మండుటెండలో దుంపలు తవ్వుతున్న ఆడవాళ్ళను చూసేం. చెప్పులు బైట విడిచిపెట్టాల్సి రావడంతో  సిక్రీలో పరచిన నాప రాళ్ళ మీద నడక కాళ్ళు మాడిపోతూ, గొంతులు ఎండిపోతూ నీడలోకి పరుగులు పెట్టించింది. ఆగ్రాలో రాజేంద్ర ఫ్రెండ్ ఎయిర్ ఫోర్స్ ఎకాడమీ అంతా తిప్పి చూపించాడు. ఆగ్రా రోడ్డు మీద గుర్రపు టాంగాల్లో తిరిగాం. తర్వాత తాజ్ మహల్ పరిసరాల్లో ఫొటోలు దిగాం. మోహన్ ఉండగా ఆ ప్రయాణం సాధ్య పడలేదు. అన్నీ మరచి ఫీల్ కాగలిగితే తాజ్ మహల్ సందర్శనం గొప్ప అనుభూతి నిస్తుంది. తిరిగివస్తూ బృందావనం వెళ్ళాం. 9 PM దాటిపోవడంతో ఆలయాలు అన్నీ మూసివేసారు. నాట్యాలు  చేస్తున్న విదేశీయుల్ని చూస్తూ కొంతసేపు గడిపి తిరుగు ప్రయాణమయ్యాం. ఇంటికి చేరేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది. మర్నాడు 21న 9AM కి వేన్ లో ఢిల్లీ జన్ పద్ మార్కెట్, జంతర్ మంతర్, పాలికాబజార్ వగైరాలు చూసాం. 6 pm కి ఫ్లాట్ కి తిరిగొచ్చి గబగబా సర్దుకుని 7PMకి తిరిగి వేన్ ఎక్కేం. 8కి మా ఫ్లైట్, దారిలో సిగ్నల్ లైట్స్  ఎక్కడికక్కడ ఆపేస్తుంటే  7.45కి ఎయిర్ పోర్ట్  చేరుకుని అమ్మయ్య అనుకుంటూ ఉండగా ఫ్లైట్ గంట ఆలస్యం అని తెల్సింది.

          మొత్తానికి 9.15కి ఎయిర్ డెక్కన్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాదు చేరుకున్నాం. తన జోక్స్ తో నవ్విస్తూ రాజేంద్ర ఆ ప్రయాణంలో మాకు అలసట లేకుండా చేసాడు. రాణి, విజయ వంటపని చూసుకుంటూ ఆకలికి మాడకుండా కాపాడేరు.

          ఆ ప్రయాణం నుంచి తిరిగొచ్చి నేనింకా హైదరాబాద్ లో ఉండగానే కె.సదాశివ రావు గారు ఫోన్ చేసారు. అబ్బూరి ఛాయాదేవి గారికి సాహిత్య అకాడమీకి అవార్డు వచ్చిన సందర్భంగా తమ ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని, తప్పక రమ్మని. అలా ఏప్రియల్ 29న అమీర్ పేట ధరమ్ కరమ్ రోడ్డులోని వైశాలి అపార్టెమెంట్స్  గార్డెన్లో  కలుసుకున్నాం. మా  గీత, నేను, డి.కామేశ్వరి, మృణాళిని, సుజాతారెడ్డి, సుజాతా పట్వారీ, కె. సత్యవతి, బి. నరసింగరావు, బాలాంత్రపు రజనీ కాంతరావు గారు, బి. వి. పట్టాభిరాం, వాసరెడ్డి నవీన్, ఖదీర్ బాబు ఇంకో ముగ్గురెవరో నాకు పరిచయం లేని వాళ్ళు అటెండయ్యాం. పెంట్ హౌస్ ని చక్కగా తీర్చిదిద్దుకుని, కుండీల్లో మంచి గార్డెన్ పెంచుకున్న తీరు నాకెంతో నచ్చింది. బి.వి.పట్టాభిరాం చేసిన చిన్న చిన్న మేజిక్ బిట్స్ పిల్లల విషయంలో పేరెంట్స్ బాధ్యత గురించి ఇచ్చిన స్పీచ్, రజని గారి 60 ఏళ్ళ క్రిందటి పాటలు బావున్నాయి. కామేశ్వరి గారు తాను పుట్టిన ఊరు కాకినాడ అని, సముద్రపు టొడ్డున  కల్తీలు ఎక్కువగా జరుగుతాయి, తమ వంశంలో ఎక్కడో కల్తీ జరిగిన మూలాన్నే తనంత తెల్లగా ఉండి ఉంటానని చెప్పి అందర్నీ నవ్వించేరు. ఛాయాదేవి గారు తన గురించి తాను మాట్లాడుతూ తను జ్వరం వచ్చి చిక్కిపోతే వాళ్ళాయన “సతీ డొక్కు భాయ్” అని పిలిచేవారట అని నవ్వించేరు. కొన్ని తన కథల నేపధ్యాలు చెప్పేరు. ‘తన మార్గం’ లోని చిన్న కథ ఒకటి మృణాళిని చదివి వినిపించింది.  నేను తిని చెయ్యి కడుక్కోబోతే ఓసారి నరసింగరావు గారు, ఓసారి నవీన్ చేతి మీద నీళ్ళు పోసేరు. నరసింగరావు గారు నా కథలు చాలా బావుంటాయని మెచ్చుకున్నారు. తన కారులో మా అబ్బాయి ఇంటి దగ్గర దించారు. అలా ఆ సాయంకాలం హేపీగా గడిచింది. మోహన్ కాలం చేసాక ఆ  ఇంట్లో ఒంటరిగా ఉండలేననే భయం పట్టుకుంది నన్ను. కానీ మా అబ్బాయి ఇంట్లో అసలు ఉండలేక పోతున్నాను. ఆ మాటలు… ప్రవర్తన… చివరికి తేల్చారు. నేను ఆ ఇంట్లో ఉండటం మా కోడలికి ఇష్టం లేదు కనుక ఓ అద్దె ఇల్లు చూస్తారట. మా అబ్బాయి చిన్న కూతురు చంటిపిల్ల. దాని మీద, వచ్చిరాని మాటల మీద అమితమైన ఇష్టం నాకు. వేరే ఇంట్లో ఒక్కదాన్ని హైదరాబాదులో ఉండే బదులు ఊరికి వెళ్ళిపోయి నా ఇంట్లో తెలిసిన వాళ్ళందరి మధ్య ఉండటం మంచిది కదా!

          “నువ్వు మంచిగా బతుకుతూ ఎవరికీ హాని తలపెట్టకుండా ఉంటే నీకు శత్రువులు ఉండరని అనుకోవద్దు. నీ తప్పు ఏమీ లేకపోతే నీకు కష్టాలు రావని భ్రమించవద్దు. నువ్వు ఏ తప్పు చేయకపోతే శిక్ష పడదని భావించవద్దు. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా వచ్చే కష్టాల్లో సగం పైగా అతడు తప్పేమీ లేకుండా వచ్చేవే!”

అనుకోకుండా రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి వచ్చాడు నన్ను చూడడానికి. అతని కథలలాగే ఆయన ఆర్ద్రంగా, స్పష్టంగా ఉన్నాడు. అతనికి ఎందుకలా చెప్పాలని అనిపించిందో కానీ “కొడుకులతో కానీ, కూతుళ్ళతో కానీ కలిసి ఉన్నప్పుడు మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలని, వాళ్ళ మొహాల వేపు చూసినా ఏదో ఒక అపార్థం వస్తుందని, ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని” ఒక ఆత్మీయమైన మాట చెప్పి వెళ్ళేడు.

కొడుకు ఇల్లు మన ఇల్లు కాదని, ఎవరికైనా వస్తే కాఫీ కూడా ఇవ్వలేమని నాకు అప్పుడే తెలిసింది. ఇక ఊరెళ్ళి పోదాం అనుకుంటూ ఉండగా చిన్ని పాపాయి వంపిన నీళ్ళ మీద చూసుకోకుండా అడుగేసి జారిపడ్డాను. కాలి మడమకి, తలకి వెనకా బాగా గాయం తగిలింది. తల దిమ్మెక్కిపోయి ఇంచుమించు గంట వరకు లేవలేకపోయేను. ఎక్స్ రే లో కాలి బొటనవేలు దగ్గర చిన్న ఫ్రాక్చర్ అని తెలిసింది. బ్యాండేజ్ వేసేసారు. మూడు వారాలు అన్నది మూడు నెలలు పట్టింది మామూలుగా నడవడానికి.

మే పదిన సి. సుజాత ఈటీవీ సఖి నుంచి మాతృ దినోత్సవం కోసం వాళ్ళ టీం తో వచ్చి నన్ను, గీతను ఇంటర్వ్యూ చేసింది. మే 14న టీవీలో వచ్చింది.

మా కోడలు వాళ్ళమ్మ “ఇంటికి వెళ్ళిపోయి కట్టు విప్పించుకోవడానికి మళ్ళీ రావచ్చుగా” అనడం మొదలు పెట్టింది. “వ్యక్తులు మన మీద కుమ్మరించే ప్రేమ, మోసాలను బట్టి మన ఆనంద విషాదాల్ని  నిర్ణయించే శక్తిని వాళ్ళకి ఇచ్చేస్తే  మనం అంతా రోజు చస్తూ బతుకుతూ ఉంటాం. తోడు కొంత నిబ్బరాన్ని ఇస్తుంది కానీ పూర్తిగా కాదు. ఏదైనా మనలోంచే రావాలి. ఏ ఎమోషన్స్ అయినా అంచనాలు తలకిందలైనప్పుడు గాయాలు అవుతాయి” అంటుంది కుప్పిలి పద్మ తన సాల భంజికలో. ఆ రోజు మా చిన్ని పాప “నాన్నమ్మా! కూ బండి ఎక్కి ఆచ్చిపో” అంది. “ఎవరు చెప్పేరమ్మా?”  అన్నాను. “అమ్మ తెప్పి” అన్నది.  నా గొంతులో దుఃఖం వెల్లువై పొంగింది.

కాసేపటికి ఆంధ్రజ్యోతి నుంచి వసంత లక్ష్మి ఫోన్ చేసి నా ‘ఆనకట్ట’ కథకి మొదటి బహుమతి ATA  అమెరికా తెలుగు అసోసి యేషన్ ప్రకటించిందని చెప్పింది. నా మనసులో ఆనందం వెల్లువెత్తింది. సుఖదుఃఖాల జీవితం కదా అనిపించింది. వెంటనే ఊరికి టికెట్ తెప్పించుకున్నాను.

          చంద్ర షష్టిపూర్తి ఇన్విటేషన్ వచ్చినా హైదరాబాద్ వెళ్ళబుద్ధి కాలేదు. ఆయన నెంబర్ సంపాదించి ఫోన్ చేశాను. “సభ బాగా జరిగింది. సభలోని వాళ్ళంతా గతపు తలపుల్ని గుర్తు చేస్తుంటే ప్రాణం మీద తీపి పెరిగిపోయి ఇంకా బతకాలనిపిస్తోంది. గున్యా జ్వరం వచ్చి తగ్గి అసలు నడవలేక పోతున్నాను. అన్నీ మరిచిపోయి మళ్ళీ అమ్మ కడుపులో లాగా ఆదమరిచి నిద్ర పోవాలని ఉంది” అన్నాడు. మాట్లాడడానికి ఆయాసపడుతున్నాడు. ఫోన్ పెట్టేశాక నాకు దుఃఖం వచ్చింది. చుట్టూ మనుషులు ఉన్నా ఆర్టిస్టుల్ని ఆవరించేది ఒంటరితనమే.

2006 జనవరి ‘మనభూమి’ మంత్లీలో ‘ప్రత్యామ్నాయాలు’  కథ

2006 ఏప్రిల్ చినుకు మాసపత్రికలో ‘క్రేన్’ మొదటి బహుమతి పొందిన ‘ప్రత్యామ్నాయం’ కథ

28.06.2006 నవ్య వీక్లీలో ‘ బాకీ’ కథ

2006 ఆట (ATA) సంచికలో అక్టోబర్ అరుణతారలోను ఆట మొదటి బహుమతి పొందిన ‘ఆనకట్ట’  కథ

17.12.2006 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘వరదగోదారి పైన’ కవిత వచ్చాయి.

          ఆ సెప్టెంబర్ లో తెలకపల్లి రవి – ప్రజాశక్తి తరపున విశాల సాహితీ సభలు ఓ రోజంతా జరిగాయి. అద్దేపల్లి, తల్లావర్జుల, దాట్ల దేవదానం రాజు, శిఖామణి, జాతశ్రీ, డి.సుజాతా దేవి, యాళ్ల అచ్యుతరామయ్య, ప్రసాద్, చలం G.S వచ్చారు. రాజమండ్రి T.నగర్ లోని కోళ్ల వీర స్వామయ్య కళ్యాణ మండపంలో జరిగాయి. నేనూ మాట్లాడేను కవిత్వం మీద.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.