యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-17

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఇంగ్లాండ్ (రోజు-4 ) – బ్రిటిష్ మ్యూజియం

మర్నాడు ఉదయం లండనులో మేం తప్పనిసరిగా చూడాలనుకున్నవి, సొంతంగా చూసి రావాలనుకున్నవి మొదటగా టూరు బుక్ చేసినప్పుడే బుక్ చేసుకున్నాం.

అందులో మొదటిది బ్రిటిష్ మ్యూజియం. దానికి గైడెడ్ టూరు బుక్ చేసుకున్నాం. మ్యూజియం సందర్శన ఉదయం పూర్తి అయిపోతుంది కాబట్టి, మధ్యాహ్నం నించి గ్రీన్ విచ్ రాయల్ అబ్జర్వేటరీకి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాం.

అంతే కాకుండా ఆ రోజంతా పబ్లిక్ ట్రాన్సుపోర్టులో తిరగాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరికీ లెక్కలు, సైన్సు, ఖగోళ శాస్త్రాల పట్ల ఉన్న ఆసక్తి వల్ల కారణంగా ఎక్కడికెళ్లినా తప్పనిసరిగా మా లిస్టులో సైన్సు మ్యూజియంలు, అబ్జర్వేటరీలు ఉండితీరతాయి. అయితే అన్నిటిలోకెల్లా ఈ అబ్జర్వేటరీ అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రపంచకాలమానాన్ని నిర్ణయించే గ్రీన్ విచ్ రేఖాంశం ఈ అబ్జర్వేటరీ గుండా పోతుంది.

ఇక మొదటిదైన బ్రిటిష్ మ్యూజియం దగ్గిర మా టూరు గైడుని తొమ్మిదిన్నరకి మేం కలుసుకోవాల్సి ఉంది. కాబట్టి హోటలు నించి ఏడున్నరకల్లా బయలుదేరి అయిదునిమిషాల్లో విక్టోరియా స్టేషనుకి చేరుకున్నాం. రైలుస్టేషనుని ఆనుకుని సిటీ బస్సు స్టేషన్లు, అండర్ గ్రౌండ్ ట్యూబు రైలు స్టేషన్లు మొ.నవి అన్నీ అక్కడక్కడే ఉన్నాయి.

లండనుకే ప్రత్యేకమైన డబుల్ డెక్కర్ ఎర్రబస్సులోకి ఆ రోజు మొదటిసారి ఎక్కేం. అది ఆదివారం పొద్దుట కావడం వల్లనేమో అస్సలు రద్దీగా లేదు. వెస్ట్ మినిష్టర్, పికాడెల్లీ సర్కసు ప్రాంతాల మీదుగా సాగింది మా బస్సు ప్రయాణం. బస్సులో మాతో బాటూ ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అన్ని సీట్లూ ఖాళీ కావడంతో డబుల్ డెక్కర్ పై అంతస్తులోకి ఎక్కి అద్దాల ముందు సీట్లలో కూర్చుని ఆనందించాం.
నాకు మా చిన్నతనంలో హైదరాబాదు వెళ్లిన మొదటిసారి ఇలా డబుల్ డెక్కర్ బస్సు ఎక్కడం జ్ఞాపకం వచ్చింది. అదొక వింతైన అనుభవం.

పబ్లిక్ ట్రాన్స్పోర్టులో ప్రయాణం చెయ్యడం బాగానే ఉంది కానీ, ఏవీ దగ్గర దగ్గర్లో ఉండని చోట బాగా నడవాల్సి వస్తుంది. మేమిద్దరం ఎక్సర్ సైజు పేరుతో ప్రతిరోజూ రెండు, మూడు మైళ్ళు సునాయాసంగా నడుస్తాం కాబట్టి అలసట తెలియలేదు. ఇక సిరికి కార్టు ఉండడంతో నడక మరీ కష్టం కాలేదు.

తొమ్మిది గంటలకల్లా బ్ల్యూమ్స్ బరీలో ఉన్న బ్రిటిష్ మ్యూజియంకు రెండు, మూడు కూడళ్లకవతల బస్సు దిగి, నడక మొదలెట్టేం. మ్యూజియం పది గంటలకి తెరుస్తారు కాబట్టి బోల్డు సమయం ఉన్నందు వల్ల స్థిమితంగా నడిచేం.

మ్యూజియంకు చేరేసరికి ఇంకా గంట సమయం ఉంది, కానీ బయట బాగా చల్లగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గిఫ్ట్ షాపుల్లోకి వెళ్లి ఏవో సావనీర్లు వంటివి కొన్నాం. స్థానిక ప్రసిద్ధ ఇంగ్లీష్ టీ డబ్బాలు, కీ చెయిన్లు అంటూ ఏవేవో కొన్నాం.

తిరిగి బయటికి తొమ్మిదిన్నర ప్రాంతంలో వచ్చేటప్పటికి మ్యూజియం గేటు ముందు పెద్ద లైను తయారైంది. నిజానికి మా టూరు వాళ్ళు ఆన్ లైనులో ఇచ్చిన వివరాల ప్రకారం మేం గేటు బయట ఉన్న రెండు ఎర్ర ఫోను బూత్ ల మధ్య నిలబడి ఉండాలి. కానీ అక్కడంతా జనాలు లైన్లో ఉండడం వల్ల మేం కూడా లైనులో చివర నిలబడ్డాం.

సత్యని, సిరిని లైనులో వదిలి, నేను ఎందుకైనా మంచిదని ఫోను బూత్ ల దగ్గిర నిలబడ్డాను. అంతలో మా గైడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి లైనులో నిలబడక్కరలేదంటూ వెంటబెట్టుకుని లోపలికి తీసుకువెళ్ళేడు.

అతను బ్రిటిష్ మ్యూజియంలో ప్రధానంగా ఉన్న రోసెట్టా స్టోన్, సౌత్ అమెరికన్ డ్రాగన్, ఇండియన్ గాడ్స్ అంటూ కొన్ని పేర్లు చెప్పి అందులో మాకు ఏవి ఇష్టమైతే అక్కడికి ముందుగా తీసుకువెళ్తానని చెప్పాడు. నేను మా టూరు ఒంటిగంట వరకూ కావడంతో ప్రసిద్ధమైనవేవో చూపించమని అతన్నే అడిగాను.

ముందుగా రోమను శిల్ప కళా ప్రాంతాన్ని దర్శించాం. అక్కణ్ణించి “రోసెట్టా స్టోన్” నకలు, అసలు అంటూ రెండూ చూపించాడు. అది బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అత్యంత ముఖ్యమైన, ప్రపంచ ప్రసిద్ధమైన వాటిలో ఒకటి. ఇంతకీ అది పెద్ద పలకలో నించి విరిగిపోయిన చిన్న భాగం. అయితే దాని మీద ఉన్న మూడు రకాల లిపులు అత్యంత ఆసక్తిదాయకమైనవి.

అవి క్రీ.పూ 204-181 మధ్య పరిపాలించిన టాలమీ మహారాజు వేయించిన శిలాశాసనం తాలూకు రాతలు. ముఖ్యంగా ఆ పలకరాతి మీద ఒకే విషయం మూడు రకాల లిపుల్లో రాయబడింది. మొదటి లిపి అప్పటి ఆచార్యుల లిపిలోనూ, రెండోది సామ్రాజ్యపు అధికారిక లిపిలోనూ, మూడోది సామాన్య ప్రజానీకపు లిపిలోనూ రాయబడింది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా లభించిన ప్రాచీన లిపుల్లో చదవడానికి అతి క్లిష్టమైన చిత్రలిపిని అర్థం చేసుకోవడానికి ఈ రాయే ప్రధానంగా ఉపయోగపడడంతో ఇది భాషా పరిశోధకులకు అత్యంత కీలకమైన ఆధారం అయ్యింది.

ఈ రాయి నైలునదీ తీరంలోని రోసెట్టా ప్రాంతంలో 1799లో నెపోలియన్ సైన్యానికి తవ్వకాల్లో దొరికిందట. నెపోలియన్ ఓటమి అనంతరం 1801 నాటి అలెగ్జాండ్రియా ఒప్పందం ప్రకారం అనేక ఇతర విలువైన వస్తువులతో బాటూ ఈ రాయి కూడా బ్రిటిషు వారి సొంతమైంది. ప్రపంచవ్యాప్తంగా నకళ్లు తయారుచెయ్యబడి ఎన్నో మ్యూజియంలలో ఈ రాయి జాగ్రత్త చెయ్యబడి ఉందంటే దీని విలువని అర్థం చేసుకోవచ్చు.

ఆ తర్వాత మా గైడు దక్షిణ అమెరికాకి చెందిన డ్రాగన్, ఇండియన్ దేవతల విగ్రహాలు, ఈజిప్టుకి చెందిన విగ్రహాలు, ఆభరణాలు, యూరపులోని నాణాలు, పెద్ద రంగులు మారే గాజు కప్పులు, ఈస్టర్ ద్వీపం నించి తెచ్చిన ప్రసిద్ధ రాతి విగ్రహం, రోమను సంస్కృతికి చెందిన శిల్పాలు మొ.న విశేషాలేవేవో వివరించి చెప్పి, ఆ సెక్షన్లన్నీ తిప్పి చూపించాడు.

చివరగా మా అంతట మమ్మల్నే తిరగమని చెప్పి ఈజిప్టు మమ్మీల సెక్షను దగ్గిర వదిలేసి మధ్యాహ్నం పన్నెండుకల్లా మా దగ్గిర సెలవు తీసుకుని వెళ్ళిపోయేడు. ఇక మాకు కూడా అక్కడ పెద్దగా చూసేవేమీ కనిపించలేదు.

నిజానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బ్రిటిషు మ్యూజియమ్ మమ్మల్ని బాగా నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. సాలార్జంగ్ మ్యూజియమ్ మొదలుకొని, వాషింగ్టన్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ వరకూ అనేకానేక పెద్ద పెద్ద మ్యూజియమ్ లు చూసిన తర్వాత ఈ మ్యూజియమ్ అంత గొప్పగా అనిపించలేదో, లేదా అక్కడ ఉన్న దేశదేశాల విశేషాలన్నీ ఆయా దేశాల నించి కొల్లగొట్టినవేననే బాధాత్మక అనుభూతి వల్లనో కానీ ఈ బ్రిటిషు మ్యూజియమ్ అంత గొప్పగా ఏమీ లేదనిపించింది. ఇక ఇండియాకు చెందిన సెక్షనులో అయితే బొత్తిగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏవీ లేవు.

మధ్యాహ్న భోజన సమయానికల్లా ఇక బ్రిటీషు మ్యూజియం నించి బయటకు వచ్చేసి, కాస్త ఏమైనా తిందామని చూడగా సరిగ్గా మ్యూజియంకి ఎదురుగా ఉన్న సందులోనే నూడుల్స్ అమ్మే చిన్న ఫుడ్ స్టాల్ కనిపించింది. లోపల చిన్నగా రెండు టేబుల్స్ ఉన్నాయి. కొందరు ఫుడ్ తెచ్చుకుని బయట వేసున్న కుర్చీల్లో కూచుని తింటున్నారు. మా సిరి నూడుల్స్ చూసిందంటే ఎగిరి గంతేస్తుంది. ఇక అక్కణ్ణించి రానని మొండికేసింది.

గుమ్మంలోనే పొయ్యి, పెద్ద పెనంలో చకాచకా నూడుల్స్ వండుతున్న ఇండియన్ యువకుడు సిరిని చూడగానే ముచ్చట పడుతూ ఫ్రిజ్ లోనించి జ్యూస్ ఒకటి తీసి ఇచ్చి “డబ్బులు వద్దు” అంటూ ఆహ్వానించాడు. నేను, సిరి అక్కడే తిందామని నూడుల్స్ ఆర్డర్ చేశాం.

సత్య ఎదురుగా ఉన్న మిడిల్ ఈస్ట్ దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ కూచున్న కాసేపట్లో అతనితో కబుర్లలో పడ్డాం. ఇంతకీ అతను సింహళ దేశస్థుడట. కొరియన్ భాష కూడా బాగానే మాట్లాడుతున్నాడు. అతన్ని నేను “కొరియన్ ఎలా తెలుసు నీకు?” అని అడిగాను. “ఇంతకు ముందు కొరియాలో పనిచేసాను. అక్కణ్ణించి ఇక్కడికి వచ్చాక కూడా కొరియన్ రెస్టారెంట్లలోనే పనిచేస్తున్నాను. నాకు కూడా ఈ వయసు పాప ఉంది మా దేశంలో. మీ అమ్మాయిని చూస్తే నాకు నా కూతురు గుర్తుకొస్తోంది” అన్నాడు అతను. కుటుంబాన్ని ఎక్కడో వదిలేసి, ఇలా విదేశాల్లో పనిచేసే వారు ఎందరో. భోజనం చేసాక, అతను వద్దంటున్నా, బిల్ తో సమానంగా డబ్బులు టిప్ గా అతని చేతిలో పెట్టి “మీ అమ్మాయి కోసం” అని చెప్పి బయటికొచ్చాను.

https://www.facebook.com/geetamadhavikala/posts/

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.