దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

ఉధృతంగా గాలి. నదిలో నల్లని అలలు ఉవ్వెత్తున ఎగిరి పడుతున్నాయి. నది అంతా అల్లకల్లోలంగా వుంది. నావకున్న నాలుగు తెరచాపలు గాలితో నిండుగా వున్నాయి. నావ అటూ ఇటూ ఊగుతూనే ఉన్నది. అయినా నావికుల నేర్పుతో నావను నిలబెట్టి వేగంగా నడుపుతున్నారు.

లోపల లెఫ్టినెంట్ తేరుకుని నిలబడబోతూ ప్రక్కనే వున్న వ్రజేశ్వర్ ముఖాన్ని పిడికిలితో కొట్టబోయాడు. వ్రజేశ్వర్ ఒడుపుగా లెఫ్టినెంట్ చెయ్యి పట్టుకుని ప్రక్కకు దించాడు. ఈ లోపల హరివల్లభ రాయ్ తోసుకు వచ్చి వ్రజేశ్వర్తో…

“ఏం చేస్తున్నావ్? ఏం చేస్తున్నావ్? ఇంగ్లీషు దొర మీద చెయ్యెందుకు ఎత్తుతున్నావు?” అంటూ మందలించబోయాడు.

“చెయ్యెత్తిందింది నేనా, వాడా?” గట్టిగానే అడిగాడు వ్రజేశ్వర్.

హరివల్లభ రాయ్ లెఫ్టినెంటు వైపు తిరిగి “హుజూర్, వాడు చిన్న పిల్లాడు. ఇంకా బుద్ధి పెరగలేదు. ఎమీ అనుకోవద్దు. క్షమించండి, క్షమించండి” అంటూ ప్రాధేయపడ్డాడు.

“ఆ రాస్కెల్నే క్షమించమని అడగమనండి. అప్పుడు చూద్దాము” అన్నాడు లెఫ్టినెంట్.

“వ్రజ, ఆయన చెప్పినట్టు చెయ్యి. నమస్కారం పెట్టి, తల వంచి, క్షమించమని అడుగు.”

వ్రజేస్వర్ లెఫ్టినెంట్ వైపు తిరిగి “నేను హిందువుని, తండ్రి ఆజ్ఞను పాటించుతాను. నన్ను క్షమించమని ప్రాధేయ పడుతున్నాను” అంటూ తల వంచి నమస్కరించాడు. లెఫ్టినెంట్ క్షమించాడు. పైగా వ్రజేశ్వర్ కుడి చెయ్యిపట్టుకుని “shakehand” ఇవ్వబోయాడు. ఈ “shakehand” పద్దతి వ్రజేశ్వర్ ఎప్పుడూ వినలేదు, చూడలేదు, తెలువదు. ఇదేదో చెయ్యి పట్టుకుని లాగి మళ్లీ దెబ్బ కొట్టే లోపాయకారి వ్యవహరం అనుకుని, చెయ్యి లాక్కుని, వీడికి దూరంగా వుండటం మంచిదని బయటకి వెళ్లి కూర్చుండిపోయాడు.

వాన ఆగింది. కానీ గాలి ఇంకా ఉధృతంగానే వున్నది. నావలోని మనుష్యులు కొంచెం తేరుకున్నారు. బయట మనుష్యులని కనిపెట్టి వుండడానికి రంగరాజు బయటకు వచ్చాడు. నావ వూపుకు నిలబడి వుండడంకన్నా కూర్చిని వుండటం మెరుగని వీపు గోడకి చేర్చి కూర్చున్నాడు.

దివ దేవి దగ్గరకు వెళ్లింది. నిశి మాత్రం ఇంకా అక్కడే ఆసీనురాలయ్యి వుంది. అన్నిటికీ కృష్ణ పరమాత్ముడే వున్నాడు అనుకుంటూ నిశి దేనికి భయపడే మనిషి కాదు.

లెఫ్టినెంటు కూడా ఎదురుగా వున్న కుర్చీ పై కూలబడి అలోచిస్తున్నాడు. ‘ఏ ఆడదాన్ని బంధించటానికైతే వచ్చానో, ఆ ఆడదానికే బందీ అయిపోయాను. ప్చ్. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్తాను? వెళ్లకపోవటమే మంచిదేమో!”

హరివల్లభ రాయ్ క్రింద నేలపై కూర్చున్నాడు. నిశి అతనితో “పడుకుని నిద్రపో” అన్నది.

“ఇలాంటి రాత్రి వేళ ఎలా నిద్రపడుతుంది?” అన్నాడు హరివల్లభ రాయ్.

“అయితే అసలు ఎప్పటికైనా నిద్రపోగలుగుతారో లేదో!” వాపోయింది నిశి.

“అదేంటి?”

“నిద్రపోవటానికి ఇంకో రాత్రి వుంటేగదా!”

“ఎందుకు, ఎలా?”

“దేవి చౌధురాణిని పట్టించాటానికి వచ్చారు కదా!”

“నే..నే..నే…మే….ను.”

“దేవిని పట్టుకుంటే ఏమయ్యేదో తెలుసు కదా!”

“మే…మే…మే…”

“ఉరి తీసేవాళ్లు.”

“ఆ…ఆ.ఆ…”

“దేవి నీకేమి అనిష్ఠ చేసిందని ఇంత నీచానికి పాల్పడ్డావు? పైగా, నిన్ను ఆపదలో ఆదుకుంది. ఏభైవేల రూపాయలు ఇచ్చింది. బదులుగా నువ్వు దేవిని బంధించటానికి కుట్ర చేసావు. ఉపకారనికి అపకారం చేసావు. ఇప్పుడు చెప్పు నీలాంటి నీచుడికి ఏ శిక్ష విధించాలో.”

హరివల్లభ రాయ్ ఏమీ మాట్లాడకుండా వుండిపోయాడు.

నిశి కొనసాగిస్తూ “అందుకే ఈవేళ రాత్రికి నిద్రపో. మళ్లీ నిద్రపోవటానికి రాత్రే వుండదు కదా!” అన్నది.

హరివల్లభ రాయ్ పూర్తిగా నీరుకారిపోయాడు. మాట్లాడదామన్నా నోరు పెగుల్చుకోలేకపోయాడు. “దగ్గరలో ఒక పెద్ద శ్మశానం వుంది. అక్కడ పిశాచాలు తిరుగుతుంటాయి. మా బందీలని అక్కడకే తీసుకువెళ్తాము. లెఫ్టినెంటుని అక్కడే ఉరి తియ్యమని దేవి ఆజ్ఞ. నీకు ఏ శిక్ష విధించాలని చెప్పిందనుకుంటున్నావు?”

హరివల్లభ రాయ్ బిగ్గరగా ఏడుపు అందుకున్నాడు. గుక్క పట్టి ఏడుస్తూ “నన్ను వధిలెయ్యండి…ఉరి తియ్యబాకండి…నాకు ఏమన్నా అయితే మా ఇంటావిడ ఏడుస్తుంది” అంటూ గోల గోల చేసాడు.

“ఇక్కడ నిన్ను రక్షించే పాపాత్ములు ఎవరూ లేరు. రేపు నీకు శూలం క్రింద నుండి గుచ్చి, శూలాన్ని పైకెత్తి నిలబెడతారు.”

హరివల్లభ రాయ్ ఇంకా బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. ఉధృతంగా వున్న గాలి ఊళలకి హరివల్లభ రాయ్ ఏడుపు అంతగా బయటకి వినబడలేదు. అక్కడే వున్న లెఫ్టినెంట్ మాత్రం “ఉరేయ్ గుంట నక్కా, అందరం ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే. ఇలా ఏడుస్తూ రోజూ చస్తావా? నోర్ముయ్” అన్నాడు.

అయినా హరివల్లభ రాయ్ బొబ్బలు పెడుతూ ఏడవసాగాడు. అలా ఏడుస్తునే “మాతా, నన్ను రక్షించేవాళ్లు ఎవరూ లేరా?” అంటూ వాపోయాడు.

“నీలాంటి నీచుడ్ని ఎవరు రక్షిస్తారు. మా రాణి దయామయి. అయినా నిన్ను రక్షించమని నేను మాత్రం చెప్పను” అన్నది నిశి.

“లక్ష రూపాయాలిస్తాను. రక్షించమని చెప్పు.”

“మళ్లీ అదే మాటా? ఏభై వేల కోసమే కృతఘ్నుడవయ్యావు. ఇప్పుడు లక్ష ఇస్తానంటావా?”

“నేను మీకు బానిసనవుతా. నీచాతి నీచుడైనా ఎదో ఒక పనికి పనికివస్తాడు కదా. ఏ పని చెబితే అది చేస్తా.”

నిశి ఆలోచించుతున్నట్టు కొన్ని క్షణాలు ఆగి, “ఒక పని చెయ్యవచ్చు. అయినా ఎందుకులే, నేను నీతో ఏ పనీ పెట్టుకోను” అన్నది.

“నీ కాళ్లు పట్టుకుంటాను” అంటూ హరివల్లభ రాయ్ నిశి కాళ్లు పట్టుకున్నాడు. నిశి కాళ్లు విదిలించుకుని “నన్ను తాకమాకు. నా దగ్గరకు కూడా రామాకు. నువ్వు కృతఘ్నుడివి, దగాకోరువి, మోసగాడివి. నీ మాటలను నమ్మటమెలా?”

“నువ్వు ఏ ఒట్టు వెయ్యమంటే అది వేస్తాను.”

“వ్రజేశ్వర్ తల మీద చెయ్యి పెట్టి ఒట్టు వేస్తావా?”

హరివల్లభ రాయ్ ప్రాణ భయంతో వున్నాడు. వెంటనే చేతులు జోడించి “వ్రజేశ్వర్ మీద ఒట్టు, మీరు ఏది చెబితే అది చేస్తాను.”

“జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు మా గుప్పిటలో వున్నావు. నేను కులీన బ్రాహ్మణ స్త్రీని. నాకు ఒక చెల్లెలు వున్నది. ఇంత వరకు సరైన వరుడు దొరకలేదు. ఇంత వరకు మా చెల్లెలకి పెళ్లి కాలేదనే మనేద ఒకటి వున్నది.”

“ఎంత వయసు వుంటుంది?”

“ముప్పై సంవత్సరాలు.”

“కులీనులలో ఇది మామూలు విషయమేగా!” అంటూ తేల్చేసాడు హరివల్లభ రాయ్.

“మా చెల్లలకి వివాహం అవనందున మా తండ్రిగారు భ్రష్టుడయ్యారు. ఆయనని ఉద్దరించాలంటే చెల్లెలకి పెళ్లి చెయ్యాలి. నీకు సరేనంటే వెళ్లి మా చెల్లెలితో మాట్లాడతాను.”

హరివల్లభ రాయ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలోనే తన గృహిణి గుర్తుకువచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్తే భార్య తనను ఇంట్లోకి కూడా రానివ్వదు. అయినా ప్రాణభయంతో వున్నాడు. “ఇదేమంత పెద్ద విషయం! కులీనులకి కులీనులు సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? నేనా ముసలివాడిని, ఈ వయసులో నాకు పెళ్లి ఏమిటి!? మా అబ్బాయి వ్రజేశ్వర్ చేసుకుంటాడు. కుదురుతుందా?” అని అడిగాడు.

“మీ అబ్బాయి ఈ వివాహానికి ఒప్పుకుంటాడనేమిటి?”

“నా ఆజ్ఞను పాటించి తీరుతాడు.”

“అయితే రేపు ఉదయమే వ్రజేశ్వర్ని ఆజ్ఞాపించు. అప్పుడు నీకు పల్లకి కట్టించి, ఇద్దరు బంటులను తోడు ఇచ్చి మీ ఇంటికి పంపుతాము. ఇంటికి రాబోయే కొత్త కోడలికి హారతి పట్టి సంప్రదాయంగా స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేయించు. నీ కొడుకు మా చెల్లెలని ఇక్కడ పెళ్లి చేసుకున్న తరువాత దంపతులనిద్దరినీ కలిపి పంపుతాము.”

హరివల్లభ రాయ్కు అప్పటిదాకా శూలంపై కూర్చోబోతున్నటు వుంది. ఈ మాటలు వినగానే స్వర్గం కనబడింది. “అయ్యో, అంతకన్నానా, వెంటనే వెళ్లి రాణిగారితో నాకు ఈ విషయంలో ఏమాత్రం సమస్య లేదు అని చెప్పు. మాతా, నేను వేడుకొంటున్నాను, వెంటనే చెప్పండి” అంటూ ప్రాధేయపడ్డాడు. నిశి చిరునవ్వుతో “లోపలికి వెళ్తున్నా” అన్నది.

ఇదంతా చూస్తున్న లెఫ్టినెంట్ ఆ ఆడమనిషితో ఏం సంభాషణ జరిగింది అని అడిగాడు. “ఆ, ఏం లేదు” అన్నాడు హరివల్లభ రాయ్.

“మరి ఇప్పటిదాకా ఏడ్చింది ఎందుకు?”

“నేనెక్కడ ఏడ్చాను? అంతా నవ్వుతూ మాట్లాడుతుంటే” అంటూ ఒక వెకిలి నవ్వు ఒలకబోసాడు.

లెఫ్టినెంట్ వెగటుగా “నువ్వొట్టి అబద్దాలకోరువు” అన్నాడు.

లోపలికి వస్తున్న నిశిని చూసి దేవి,”మా మావగారితో గొప్ప సంభాషణ నడిపించినట్టున్నావు, ఏమిటి కథ?” అన్నది.

“నీ ఇల్లు చక్క దిద్దుతున్నాను.”

“నిశి, నీ దేహం, మనసు, ఆత్మ, సర్వస్వమూ శ్రీకృష్ణార్పితం అన్నావు. ఈ పరాచికాలు మాత్రం మానలేదు, ఇంకా నీతోనే వుంచుకున్నావు” అన్నది దేవి

“ఉత్తమ లక్షణాలన్నీ కృష్ణార్పర్ణం, కానివి నాతోనే!” బదులిచ్చింది నిశి.

“నువ్వు నరకానికి పోదువు గాని” చిరుకోపంతో అన్నది దేవి.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.