
“నెచ్చెలి”మాట
ఎవరికి దూరంగా ఉండాలి?
-డా|| కె.గీత
దుష్టులకు
దూరంగా
ఉండవలె
నన్నది
నానుడి
దుష్టులనగా
ఎవరు?
కీడు
చేసేవారు
కీడు
అనగానేమి?
చెడు,
హాని,
అపకారము
వగైరా…
వగైరా…
మరి
సూటిపోటి మాటలతో
పీడించువారు?!
ఎన్ని చేసినను
సంతృప్తి
లేనివారు?!
ఎంత
అక్కున చేర్చుకున్నను
తప్పులెన్నువారు?!
ప్రేమని ద్వేషంగా
భావించు వారు?!
కేవలం తమ పనికోసం
వాడుకొనువారు?!
అన్నియు ఆస్వాదించి
కరివేపాకు వలె
వదిలివేయు వారు?!
వయసు వచ్చినను
బుద్ధిహీనులవలె
నడచుకొనువారు?!
కన్నబిడ్డలను
పామువలె
మింగువారు?!
తల్లిదండ్రులను
పశువుల కంటే
హీనముగా
బాధించువారు?!
కుటుంబమును
నేలరాసి
స్వార్థముతో
బతుకువారు?!
తాము
ఎప్పటికి
చింతించుచు
ఎదుటివారిని
బాధ్యులను
చేయువారు?!
తమ కన్నీళ్లకు
తమ కష్టాలకు
ఎదుటివారిలో
కారణములు
వెతుకుకొను వారు?!
నిండా ముంచి
మోసగించువారు-
ఎక్కడికక్కడ
తస్కరణకు
పాల్పడువారు-
……
ఇప్పుడేమంటారు?
ప్రపంచమంతా
దుష్టులనేనా?!
ముమ్మాటికీ
అవును-
సర్లెండి
మీలా అన్నిటిలో
తప్పులెంచి
చూస్తే
లిస్టు పెరుగుతుందే
కానీ
తగ్గదు
మరి ఏమి
చేయవలెను?
ఎవరికి దూరంగా
ఉండవలెను?
ఏమీ
చెయ్యక్కరలేదు
ఎవరికీ దూరంగా
ఉండక్కరలేదు
మరి????
ప్రపంచాన్ని
మార్చలేం
కానీ
మనల్ని
మనం
మార్చుకోగలం
కదా!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
జూన్, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: సంధ్యా శర్మ
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: తాగని టీ (కథ) – చిట్టత్తూరు మునిగోపాల్
ఇరువురికీ అభినందనలు!
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
