నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 1

-డాక్టర్ కొండపల్లి నీహారిణి

నా చిన్నతనంలో మా ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. మా అమ్మ బాపు, అన్నయ్యలు, అక్కయ్య తమ్ముడు నాయనమ్మ, బాపమ్మ… మాది పెద్ద కుటుంబం. అప్పుడప్పుడు వచ్చి పోయే మా మేనత్తలు, మా మేనమామలు, మా చిన్నమ్మ , వీళ్ళందరి పిల్లలు ! వీళ్లే కాదు ఇతర బంధువులు , స్నేహితులు, బాపు అనుచరులు, గ్రామస్తులు ఎందరో వచ్చి పోయేవాళ్ళు. ఇదే కాదు జీతగాళ్లు ఇంట్లో పనులు చేసే పనివాళ్ళు, మమ్మల్ని నమ్మి, మాపై ఆధారపడి మా వెంటే ఉండే ఎందరో ఎందరో…. అందరితో మా ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది.

మేం బాగా ఆటలు ఆడుకునేవాళ్ళం. పాటలు పాడే వాళ్ళం. బుర్ర కథ లు, ఏకపాత్రాభినయాలు, నాటికలు..ఓ మాకు రానివేవి? సమస్త కళలూ మా చుట్టే! ఆటలు? మాకు అడ్డేమిటి? చోర్ పోలీస్, చార్ పత్తర్ , చదరంగం, పత్తాలు అంటే ప్లేయింగ్ కార్డ్స్ సమస్త క్రీడలూ మా చుట్టే! మా ఇంటి గురించి చెప్పాలంటే, కులాలు, మతాలు, మంచితనం, మానవత్వం మా ఇంటి ‘గుంజలు’ , ‘ఇంటిపైకప్పు’ లు అని చెప్పాలి. గుంజలంటే అంటే పిల్లర్స్, స్థంభాలు !

మా ఇల్లు పెద్దది. చతుశ్శాల భవంతి. గూన పెంకలతో ఉండేది. దీనినానుకొని వెనుక ఒక బంగళా మరో ఆకర్షణ. వంటిల్లు, మధ్యర్ర అనే భోజనాల గది, రెండు హాల్స్, ఓ పడకగది ఉండేది. గూన పెంకల ఇల్లు తాతయ్య తండ్రి కట్టించారట. బంగళాను మా అమ్మ , నాన్న గార్లు కట్టించారు. పాత ఇంటి కి తూర్పు న పెద్దర్వాజ, పడమటన చిన్న దర్వాజ ఉండేవి. ఈ రెండు ఇళ్లు కలిపేది పడమటి మనసాల దర్వాజనే . దీని దగ్గర ఉండే ఓపెన్ ప్లేస్ మా ఆటలకు అడ్డా! ఎన్నో విజ్ఞాన శాస్త్ర విషయాలను నేర్చుకున్న ఓపెన్ ఎయిర్ ప్లేస్, పూలచెట్లకు కూడా చిరునామా. ఎండాకాలం మా పడకలు అక్కడే. ఆకాశంలో చుక్కలు లెక్కించడం, ఏవేవో చక్కని కథలు అల్లి చెప్పుకోవడం అవన్నీ… మధురానుభూతులు. అక్కడనే బంగ్లా ఎక్కేందుకు మెట్లు ఉండేవి. మెట్ల క్రింద పచ్చని మల్లె చెట్టు మెట్ల పైకెక్కి తెల్లని పూలతో తీగ చూడటానికి అందంగా ఉండేది.

మా తమ్ముడు చెందు, నేను ఆటపాటలలో ఒకే జట్టు. చెందు పూర్తి పేరు రామచందర్ రావు . మా తాతయ్య పేరే ! తాతయ్య చనిపోయాక పుట్టాడని వారి పేరు నే పెట్టుకున్నదట మా అమ్మ. మన పూర్వీకులను గౌరవించడమన్నట్టు! మా అక్కయ్య ఇంద్రాణి, అన్నయ్య విజయరామారావు. డాక్టరన్నయ్య పేరు శ్యామ్ సుందర్ రావు. పెద్దన్నయ్య కిషన్ రావు. అందరి పేర్లూ దేవుళ్ల పేర్లు. అదేంటో నా ఒక్క పేరే నీహారిణి! చంద్రుడు, ఇంద్రుడు, రాముడు, శ్యాముడు, కృష్ణుడు ఇలా వాళ్ల పేర్లల్లో దేవుళ్ళు ఉన్నారు. నా పేరులో ఏ దేవుడు ఏ దేవతా లేరు. ఈ విషయంపై నన్ను ఆటపట్టించేవాళ్ళు నా తోబుట్టువులు. అందుకేనేమో మా అమ్మ నన్ను ” దేవుడూ” అని పిలిచేది !! అందుకే నేను పేరు లోనే పెన్నిధి ఉందా అంటే అవును పేరులోనూ పెన్నిధి ఉంటుంది అని వాదించేది. అది కాస్త ఇలా ‘పెన్’ ‘నిధి’ అవుతుంది అని అప్పుడు నాకు తెలియదు!!

అట్లా నన్ను “దేవుడూ” అని పిలుచుకున్నది మా అమ్మ పెండ్యాల కౌసల్యాదేవి. మా బాపు పెండ్యాల రాఘవరావు. మేం నాన్న ను బాపు అనంటాం. మాది చిన్నపెండ్యాల గ్రామం. మా ఊరు చాలా చైతన్యవంతమైన ఊరు. ఆధునిక యుగ చారిత్రక పురుషులను కన్న ఊరు. నేను నా “ఎనిమిదో అడుగు “కవితా సంపుటం” లో ‘మా ఊరు చిన్న పెండ్యాల’ మీద ఒక కవిత రాస్తూ, “విరులనూ వీరులనూ/ సరిసమానంగా కన్న/ విశిష్ట తరువు/ మా ఊరు చిన్న పెండ్యాల” అని వ్రాసాను. ఇది అక్షర సత్యం. ఎందుకు అక్షర సత్యమో, ఏంటో మునుముందు సందర్భాల్లో రాస్తాను. చిన్న పెండ్యాల అప్పుడు వరంగల్ జిల్లా, ప్రస్తుత కాలంలో జనగాం జిల్లా. వరంగల్ పోరుగడ్డ బిడ్డనని గర్వంగా వేదికలపై చెప్పాను కూడా!

దీనికి కారణం లేకపోలేదు. మా బాపు ప్రజా నాయకుడు. 1952 ఎన్నికల్లో రెండు MLA సీట్లు, ఒక MP సీట్ లను గెలిచారు. అద్వితీయంగా విజయం సాధించిన ఈ మూడు సీట్లలో రెండు ఎం.ఎల్.ఎ. స్థానాలకూ రిజైన్ చేసి ఎం. పి. పదవినలంకరించారు. M.P. గా ఐదేళ్ళు ఢిల్లీలో నెహ్రూ గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న నాయకులలో ఒక నాయకుడు మా బాపు. అలా వరంగల్ జిల్లా మొట్టమొదటి ఎం.పి. కూతురుగానే కాదు. తెలంగాణ రైతాంగ పోరాటాల, సాయుధ పోరాటాల వీరుని , స్వాతంత్య్ర సమరయోధుని సంతానంగా మేం చరిత్రలో స్థానం ఉన్న వాళ్ళం.

*****

( ఇంకా వుంది )

Leave a Reply

Your email address will not be published.