ఆర్గానిక్ కోడలు

(నెచ్చెలి-2026 కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

– ఎమ్.సుగుణరావు

రైతుబజార్‌ నుంచి భర్త తెచ్చిన కూరలు సర్దుతూ `

‘‘ఏమిటీ కూరగాయలన్నీ ముదిరిపోయినవి తెచ్చారు? ముఖ్యంగా బెండకాయలు… బెండకాయ ముదిరినా…’’ చెప్పడం ఆపింది.
ఆ మాటలకు టి.వి. చూస్తున్న సుబ్బారావు ముసి ముసి నవ్వులు నవ్వాడు.
వారి కొడుకు దీక్షిత్‌ `
‘‘అవును అర్థమైంది… అమ్మ వేసిన పంచ్‌ నామీదే కదా! ఒక విషయం గుర్తు పెట్టుకోండి… ముదిరిన బెండకాయ విత్తనాలే మళ్ళీ బెండపాదు సాగుకు ఉపయోగపడతాయి’’ అన్నాడు కోపంగా.

‘‘ఒరేయ్‌! ఉన్నమాటంటే ఉలుకెందుకు? ముప్ఫై ఏళ్ళు దాటాయి. నెత్తిమీద అరెకరం పోయింది. నువ్వే ఆరు ఎకరాలు ఎదురు కట్నమిచ్చే పరిస్థితి ఎదురుకాబోతోంది.’’ అన్నాడు సుబ్బారావు.

‘‘ఇంతకీ మనవాడికి ఏ పిల్లా ఎందుకు నచ్చటం లేదు?’’ అన్నాడు దీక్షిత్‌ మావయ్య గోవిందరావు.

‘‘వాడు ఆర్గానిక్‌ అబ్బాయట! అలా అనుకుంటున్నాడు. తనకి ఆర్గానిక్‌ అమ్మాయే కావాలని… అలా ఏ సంబంధం వచ్చినా నచ్చటం లేదు.’’ అన్నాడు.

‘‘ఇంతకీ ఆర్గానిక్‌గా ఉండడమంటే ఏమిటి?’’ అన్నాడు గోవిందరావు.

‘‘అది వాడినే అడుగు’’ అన్నాడు సుబ్బారావు, కొడుకువైపు చూసి.

ఆ మాటలకు విసురుగా ఆ గదిలోంచి కదిలి, తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు దీక్షిత్‌.

‘‘ఏమిటి బావా? ఇవ్వాళ పెళ్ళి చూపులకు వెళ్ళబోతున్నాం కదా! తాడో పేడో తేల్చేద్దాం!’’

‘‘తాడో పేడో ఏమిటన్నయ్యా? ఏమిటా అశుభ శబ్దం? శుభమా అంటూ పెళ్ళి చూపులకు వెళ్తుంటే…’’ అంది మంగతాయారు.

‘‘సరే… నువ్వు అదే పనిమీద వచ్చావు కదా. ఇంతకీ వాళ్ళకు చెప్పావా, మనబ్బాయి కండిషన్లు?’’ అన్నాడు సుబ్బారావు.

‘‘సింపుల్‌గా ఒక వాక్యంలో చెప్పేశాను. అమ్మాయి ఆర్గానిక్‌గా ఉండాలి అన్నాను. మనవాడి ఫొటోలు, జాతకాలు వాళ్ళకు నచ్చేశాయి. మనవాడు సన్నగా, పొడుగ్గా మెరుపుతీగలా ఉంటాడు కదా. మీ ఇద్దరికీ వాడు పుట్టాడంటే, నాకు ఆశ్చర్యమనిపిస్తుంది! మీరిద్దరు నిండు దంపతులు. చూసేవాళ్లకు నిండుగా కనిపిస్తారు. మనవాడేమో ఒంటి పేగులా ఉంటాడు. చిన్నప్పుడు బాగానే బొద్దుగా ఉండేవాడు కదా బావా?’’ అన్నాడు గోవిందరావు.

‘‘వాడి ఇంజనీరింగ్‌ చదువు పూర్తయ్యి, ఉద్యోగంలోకి వెళ్ళేవరకూ మనకు వంశపారపర్యంగా వచ్చే ఊబ శరీరమే వాడికీ ఉండేది. అయితే ఆర్గానిక్‌ వంటలు, ఇంకా రకరకాల ప్రయోగాలు చేసి, ఇలా ఎండిపోయాడు.’’ అన్నాడు సుబ్బారావు దిగులుగా.

‘‘అన్నట్టు… ఆ అమ్మాయి చాలా బాగుంది. కాని కాస్త బొద్దుగా ఉంది. అయినా మనవాడికి నచ్చడమే విడ్డూరం.’’ అన్నాడు గోవిందరావు.

‘‘ఆ అమ్మాయి ఆర్గానిక్‌ అని చెప్పారు కదా. అందుకే ఆ అమ్మాయి నచ్చింది వాడికి. సరే టైమవుతోంది. మనం పెళ్ళి చూపులకు బయల్దేరాలి. మనవాడ్ని పిలవండి అలిగి లోపల కూర్చుంటే ఎలా!’’ అన్నాడు గోవిందరావు.

‘‘లేదులే… లోపల తయారవుతున్నాడు. ఇక బయల్దేరదాం…’’ అన్నాడు సుబ్బారావు భార్యతో.

అప్పటికే తయారై డ్రాయింగ్‌ రూమ్‌లోకి వచ్చింది మంగతాయారు. దీక్షిత్‌ కూడా జీన్‌ ఫ్యాంటు, టీ షర్టుతో తన గదిలోంచి బయటకొచ్చాడు. ఇంటి వయటకు వచ్చి, కారు స్టార్ట్‌ చేశాడు. అంతా ఎక్కిన తర్వాత కారు బయల్దేరింది. అరగంటలో పెళ్ళికూతురింటికి చేరుకున్నారు.

‘‘పెళ్ళికూతురు పేరు ‘ఏకతా’’’ అన్నాడు మెల్లగా గోవిందరావు.

‘‘ఆకతాయా…’’ అంది మంగతాయారు నవ్వుతూ.

‘‘ష్‌… అరవకు.’’ అంటూ పెళ్ళికూతురు ఇంట్లోకి నడిచాడు సుబ్బారావు.

ఏకతా అమ్మానాన్నా ఎదురొచ్చారు. ‘‘కూర్చోండి… ’’ అన్నాడు ఏకతా తండ్రి.

అంతా కూర్చున్నారు. పావుగంట తర్వాత తెల్లగా, కొంచెం బొద్దుగా, దీక్షిత్‌ భుజాల వరకు ఉన్న అమ్మాయి ప్లేటునిండా మిఠాయిలుతో వచ్చింది.

‘‘తీసుకోండి…’’ అంది ఏకతా తల్లి.

దీక్షిత్‌ తప్ప మిగతావాళ్ళంతా ఆ ప్లేట్లమీద దాడి చేశారు. దీక్షిత్‌ మాత్రం ఏమీ తినకుండా అలాగే ఉండిపోయాడు.

‘‘అబ్బాయిగారు ఏమీ తినరా?’’ అంది ఏకతా తల్లి.

‘‘లేదు… వాడు ఏకపూట భోక్త. అంటే… రోజులో ఒకసారే తింటాడు. అదైనా ఆర్గానిక్‌ ఆహారం…’’ అంది మంగతాయారు.

‘‘మా అమ్మాయీ అంతే!’’ అంది ఏకతా తల్లి.

‘‘అంతేగా… అంతేగా…’’ అంటూ ఏకతా తండ్రి వంత పాడాడు.

‘ఒక పూట తిన్నా మరీ ఇంత బొద్దుగా ఎలా ఉందో?’ అనుకున్నాడు దీక్షిత్‌, ఏకతాను ఓరకంటతో చూసి.

‘కొంచెం లావున్నా.. స్టన్నింగ్‌ బ్యూటీ.’ అనుకున్నాడు దీక్షిత్‌.

వెంటనే ఏకతా తండ్రి ` ‘‘మా అమ్మాయీ ఒకపూటే తింటుంది. కానీ సంతోషంగా ఉంటుంది. సంతోషం సగం బలం అన్నారు కదా’’ అన్నాడు. ఆ మాటలకు అందరూ నవ్వారు.

‘‘ఇది జోక్‌ కాదు, నిజమే బాబూ! తను నవ్వుతూ, అందర్నీ నవ్విస్తుంది’’ అంది ఏకతా తల్లి, కూతురి వంక మురిపెంగా చూసి.

‘‘అమ్మాయి, అబ్బాయి ఏమైనా మాట్లాడుకుంటారేమో! లోపల గదిలోకి పంపించండి’’ అన్నాడు గోవిందరావు.

‘ఈ అమ్మాయి తనలాగా ఆర్గానిక్‌ అభిరుచి ఉన్నదోకాదో తెలుసుకోవాలి… అదొకటి తేలిపోతే, ఇక మూడుముళ్ళూ వేసేయ్యడమే…’  అనుకుంటూ లోపల గదిలోకి వెళ్తున్న ఏకతాను అనుసరించాడు.

ఆ బెడ్‌రూమ్‌లో మంచం, పక్కనే చిన్న బల్ల, దానిమీద ఏవో ప్యాకట్లు కనిపించాయి. ‘‘ఏంటవి?’’ అన్నాడు.

‘‘మన మెగాస్టార్‌ వీటితో చేసిన ఆహారమే తింటారటండీ… అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత బాగా డాన్స్‌ చేస్తున్నారు’’ అంది ఏకతా.

‘‘ఓహో… చిరుధాన్యాలా…’’ అన్నాడు ఆమె వేసిన పంచ్‌కు నవ్వుతూ.

‘‘వాటి పేర్లేంటో తెలుసా?’’ అన్నాడు మళ్ళీ.

‘‘అవి సామలు. మూడుపూట్లా తింటే, మన దేహానికి కవచం తొడుక్కున్నట్లే’’ అంది తలెత్తి అతనివంక పరిశీలనగా చూసి.

‘‘ఎవరు చెప్పారు?’’ అన్నాడు దీక్షిత్‌.

‘‘త్యాగరాజు స్వామి చెప్పారు. అలాగే విష్ణు సహస్ర నామంలో కూడా చెప్పారండీ’’ అంది సీరియస్‌గా మొహం పెట్టి.

‘‘నిజంగా అలా రాసుందా?’’ అన్నాడు ఆశ్చర్యంగా.

‘‘అవునండీ… ‘సామ’జవరగమనా… అనే కీర్తనలో ఉంది కదా. విష్ణు సహస్ర నామంలో కూడా రాశారండీ… ‘త్రిసామాసామ గస్సామేతి కవచం’ అని ఉంది. అంటే మూడుసార్లు సామలు తింటే దేహం ఇనుప కవచంలా అయిపోతుందంట.’’

‘‘అహహహ్హా… ఇవన్నీ నిజం కాకపోయినా’’ అంటూ నవ్వాడు.

‘‘నువ్వు చెప్పడం బాగుంది. మీ నాన్నగారు చెప్పినప్పుడే అర్థమైపోయింది, నువ్వు జోకులేస్తావని. నవ్వు నాలుగు విధాలా మేలే!’’ అన్నాడు దీక్షిత్‌.

‘‘కాదండీ…’’ అంది ఏకతా సీరియస్‌గా.

‘‘మరి..?’’ అన్నాడు.

‘‘నవ్వు నాలుగు విధాలా ఫిమేలు.’’

ఆ మాటలకు పెద్ద పెట్టున నవ్వాడు దీక్షిత్‌ మళ్ళీ.

‘‘మనకు శుభం కార్డు పడేలా ఉంది. లోపలనుంచి నవ్వులు వినిపిస్తున్నాయి’’ అన్నాడు గోవిందరావు మెల్లగా. ఆ మాటల్లోనే ఆ ఇద్దరూ లోపల నుంచి బయటకొచ్చేశారు.

‘‘కాయా? పండా?’’ అన్నాడు సుబ్బారావు ఉండబట్టలేక.

ఆ ఇద్దరూ తమ బొటనవేలు పైకెత్తి ` ‘‘ఫ్రూట్‌ సలాడ్‌. కాని ఆర్గానిక్‌ ఫ్రూట్‌ సలాడ్‌’’ అంది ఏకతా నవ్వుతూ.

రెండు నెలల తర్వాత ఏకతా, దీక్షితుల పెళ్ళి జరిగిపోయింది.

ఆ తర్వాత ఏకతా కాపురానికి వచ్చేసింది. ఆమె వచ్చిన వారం రోజు తర్వాత ఓ ఉదయంపూట మంగతాయారు చెప్పింది `
‘‘ఈవాళనుంచి ఇంట్లో వంట భారం నీదే తల్లీ!’’ అంది.

‘‘అలాగే అత్తయ్యగారూ…’’ అంది ఏకతా.

ఆ తర్వాత ‘‘ఏం కూర వండమంటారు అత్తాయా?’’ అంది.

‘‘పాలకూర పప్పు చేయమ్మా!’’ అంది మంగతాయారు.

‘‘పాలు, పప్పు ఉడికిన తర్వాతా? ముందే వేయాలా?’’ అంది ఏకతా.

ఆ మాటలకు తన గదిలో వర్క్‌ ఫ్రం హోంలో ఉన్న దీక్షిత్‌ బయటకొచ్చి `
‘‘అమ్మా అర్థమయ్యింది కదా… మీ కొత్తకోడలి వంట సంగతి. నేనైతే సేఫ్‌. నా వంటలు నేనే వండుకుంటాను. నా ఆర్గానిక్‌ ఫుడ్‌ మీకెవ్వరికీ నచ్చదు కదా! వెనకటికి ఇలాంటి కోడలే, అత్తగారు ‘పాలు సిమ్‌లో పెట్టమంటే, ఫస్ట్‌ సిమ్మా? సెకండ్‌ సిమ్మా? అందట’’ అన్నాడు పెద్ద పెట్టున నవ్వుతూ. అతని నవ్వుతో శృతి కలిపారు మంగతాయారూ, సుబ్బారావు `

‘‘ఇదేమిటిరా… నువ్వెప్పుడు నేర్చావు పంచ్‌లు వెయ్యడం. ఇదే సావాస గుణం అంటే’’ అంది మంగతాయారు నవ్వుతూ కోడలి వంక చూసి.

‘‘సరే నే వెళతా… ఇంకా డ్యూటీలోనే ఉన్నాను.’’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

‘‘అత్తమ్మా! ఆయన వంటలు ఆయన వండుకోవడమేంటి?’’ అంది ఆశ్చర్యంగా చూసి ఏకతా.

‘‘వాడి రూటే సెపరేటమ్మా! అందుకే కదా ఇంతవరకూ పెళ్ళి కాలేదు. మీ ఇంట్లో సామలు, ఊదలు, రాగులు… లాంటి మిల్లెట్లు చూసే నువ్వు కూడా ఆర్గానిక్‌ అమ్మాయివనుకుని పెళ్ళికి ఒప్పుకున్నాడు. అఫ్‌కోర్స్‌ నువ్వు కూడా నచ్చావనుకో’’ అంది మంగతాయారు.

‘‘అవునులెండి. ఒక విషయం చెబుతాను, మీరేమీ అనుకోరుగా? మా పెళ్ళి కుదిర్చిన పెళ్ళిళ్ళ పేరయ్యగారు చెప్పిన ప్రణాళిక ప్రకారం… మీ అబ్బాయికి నేను ఆర్గానిక్‌ అమ్మాయిగా బిల్డప్పిచ్చాను. ఆ విషయం మీకూ తెలుసుకదా.’’ అంది.

‘‘అవునమ్మా! తెలుసు. ఆ విషయాలన్నీ మన మధ్యనే ఉండాలి. మావాడిని ఆ ఆర్గానిక్‌ ప్రపంచంలోంచి ఎలా బయటపడేస్తావో? నీదే భారం…’’ అంది మంగతాయారు.

‘‘సర్లెండి. ఆయన్ని చూస్తున్నాను కదా. వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఇరవై నాలుగు గంటలూ లాప్‌టాప్‌తోనే గడుపుతున్నారు. దాంట్లోంచి బయటకొచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌… ఇవే లోకం! కనీసం బయటకు వాకింగ్‌ కూడా వెళ్ళటం లేదు.’’ అంది ఏకతా.

తన గదిలోంచి పరుగెట్టుకుంటూ వచ్చాడు దీక్షిత్‌.
‘‘తల్లీ! ఇండోర్‌ గేమ్స్‌, ఔట్‌ డోర్‌ గేమ్స్‌ ఆడలేకే ఈ ఆర్గానిక్‌ ఫుడ్‌లోకి దిగాను. అంచేత నా వంట, తంట ఏదో నేను పడతానంట.’’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఆరోజు సాయంత్రం దీక్షిత్‌తో కూర్చుంది ఏకతా.
‘‘మీకు ఈ ఆర్గానిక్‌ ఫుడ్‌ మీద ఇంత నాలెడ్జ్‌ ఎలా వచ్చింది? మీరో విజ్ఞాన గని. చాలా విషయాలు తెలుసు మీకు. వంటగదిలోకి మీరు కొన్న ఆర్గానిక్‌ ప్యాకెట్లు చూస్తేనే అర్థమైపోయింది.’’

‘‘అవును నాకింత నాలెడ్జ్‌ రావడానికి కారణం, ఒక యూనివర్సిటీలో చేరడమే. అక్కడి నుంచే చాలా సమాచారం వస్తుంది.’’ అన్నాడు దీక్షిత్‌.

‘‘ఏమిటా యూనివర్సిటీ?’’ అంది ఏకతా.

గబగబా తన సెల్‌ఫోన్‌లోని కొన్ని సమూహాలను చూపించాడు. ‘‘ఇది ఆర్గానిక్‌ గ్రూపు. ఇది నేచరోపతి గ్రూపు. చూశావా ఈ సమాచారం… ఎంతో ఉపయుక్తం! చూడు ఆ పెద్దాయన ఏం చెబుతున్నాడో…’’ అన్నాడు దీక్షిత్‌.

‘ఆకులు, అలమలు తిని ఆ జీవాలన్నీ కొండలు ఎక్కుతాయి. ఆ జీవాల్ని తిన్న మీరు ఆస్పత్రిలో బెడ్‌ ఎక్కుతున్నారు.’

‘‘ఎంత గొప్పగా చెప్పాడు కదా!’’ అన్నాడు దీక్షిత్‌ ఉత్సాహంగా.

ఆ తర్వాత ఇంకో వీడియో చూపించి `
‘అడవిలో జంతువులకు బి.పి.లు షుగర్‌లు ఉంటాయా? అవి ఏ కళ్ళజోళ్ళూ పెట్టుకోవు. మెడనొప్పని కాలర్లు తగిలించుకోవు. ఎందుకంటే, అవి ప్రకృతిసిద్ధమైన ఆహారం తింటాయి.’

‘‘అయితే వాటిలాగే మనం కూడా పచ్చి మాంసం తియేయాలంటారా?’’ అంది ఏకతా.

‘‘అలా అని కాదు. ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఆహారం తినాలి’’ అన్నాడు దీక్షిత్‌. తర్వాత రోజు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర, అత్తామామలకు వడ్డిస్తూ `
‘‘ముద్దపప్పులో ఆవకాయ నంజుకోండి అత్తయ్యా! వేడి వేడి నెయ్యి కాచి ఉంచాను, వేసుకోండి. పక్క వాయిద్యాల్లాగా చల్ల మిరపకాయలు కూడా ఉన్నాయి మావయ్యగారూ…’’ అంది ఏకతా.
మంగతాయారు, సుబ్బారావు… లొట్టలేసుకుంటూ తింటున్నారు. అదే సమయంలో ఏకతా వండిన మిల్లెట్‌ ఉప్మా తింటున్నాడు దీక్షిత్‌.

‘‘పాలకూర పప్పులో పాలు ఎప్పుడు వేయమంటారు అని అడిగావ్‌. ఆ మాటలకు భయపడ్డాను కాని, అది జోక్‌ అని అర్థమైంది. నీ వంటలు సూపర్‌ అమ్మా…’’ అంది మంగతాయారు. తర్వాతిరోజు అదే టైములో అత్తామామలకు వడ్డిస్తూ ` ‘‘గోంగూర పచ్చడి చేశాను. దాంట్లోకి ఉల్లిపాయలు నంజుకోండి. ఆ ముక్కల పులుసులోకి అప్పుడాలు వేయించాను’’ అంది.

ఆ మాటలకు దీక్షిత్‌ కోప్పడుతూ `
‘‘నువ్వంత వర్ణించక్కర్లేదు. ఆ కాంబినేషన్లు ఎప్పుడూ బాగుంటాయి.’’ అన్నాడు చిరాకు పడుతూ.

ఆ మాటలకు మంగతాయారూ, సుబ్బారావు ‘‘ఏంటిరా అంత ఉడుక్కుంటావ్‌? నువ్వూ తినొచ్చు కదా. జిహ్వను ఎందుకు చంపుకుంటావ్‌?’’ అన్నారు నవ్వుతూనే. వారం రోజుల తర్వాత భోజనం వేళకు డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చిన దీక్షిత్‌ వెంటనే అన్నాడు `‘‘నాకూ మీరు తినేదే పెట్టండి. ఆవకాయ వడ్డించి, నంజుకోవడానికి వెన్నపూస వెయ్యి. ఆ పనసపట్టు కూరతోపాటు, ఆ వేయించిన పిండి ఒడియాలు వడ్డించు…’’

ఆ మాటలు విని కొడుకు వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఆ దంపతులు. ఆరోజు సాయంత్రం ఏకతాను రహస్యంగా పిలిచి అడిగింది మంగతాయారు. ‘‘మావాడేంటి ఆర్గానిక్‌ ఆహారానికి స్వస్తి చెప్పేశాడు?’’ అంది.

‘‘ముల్లును ముల్లుతోనే కోయాలి అత్తమ్మా! ఆయన ఈ ఆర్గానిక్‌ ఆహారపు అలవాట్లల్లోకి మారిపోవడానికి కారణం… ఆయన చేరిన యూనివర్సిటీ’’ అంది.

‘‘యూనివర్సిటీయా?’’ అంది మంగతాయారు.

‘‘అదే అత్తమ్మా! వాట్సాప్‌ యూనివర్సిటీ. నేను కూడా ఆయని కొన్ని సమ్మోహాల్లోకి చేర్చాను. శుభ్రంగా నచ్చినవి, వేళకు తింటూ ఉదయం, సాయంత్రం వ్యాయామం, నడక లాంటివి చేస్తూ, ఆరోగ్యంగా ఉంటున్న వాళ్ళ గ్రూపు ` నిండు నూరేళ్ళు అనే దాంట్లోకి చేర్చాను. ఈ ఆర్గానిక్‌ ఫుడ్‌ లేని రోజుల్లో కూడా, నచ్చినవి తిని, ఆరోగ్యంగా బతికిన పెద్దవాళ్ళని గురించిన కథలు ఈయనకు వాట్సాప్‌ ద్వారా వినిపించాను. మనం చిన్నప్పటినుంచి ఏం తింటున్నామో, అదే తింటే చాలు. కొత్త ప్రయోగాలు చేయక్కర్లేదంటూ ప్రముఖ డాక్టర్లు చెప్పిన విషయాలు కూడా ఈయనకు చేరవేశాను.’’

‘‘ఓహో అదా సంగతి..’’ అంది మంగతాయారు.

‘‘ఇంకో విషయం కూడా ఆయనకు చేర్చాను. వాట్సాప్‌లోనూ, ఫేస్‌బుక్‌ లోనూ ఎవరు సలహా వచ్చినా గుడ్డిగా నమ్ముతారు. అంచేత సెల్‌ఫోన్‌ ఎక్కువ వాడకం వల్ల వచ్చే ప్రమాదాలు గురించిన వీడియోలూ దండిగా పంపాను. చరవాణి ఉపయోగిస్తే చెవుడు వస్తుందని, అదేపనిగా చూస్తే కళ్ళు పోతాయని. చరవాణితోనే ఇరవై నాలుగు గంటలు ఉంటే, కేన్సర్‌ వచ్చే ప్రమాదముందనీ… ఆ సమాచారాన్నంతా గుప్పించాను, ఎత్తిపోతల పథకం ద్వారా! మొత్తానికి భయపడి సెల్‌ఫోన్‌ తీసుకోవడమే మానేశాడు. అలా ఆయన వాట్సాప్‌ యూనివర్సిటీ సమాచారానికి గండి పడింది. ఆ విధంగా తనకుతానే జ్ఞానోదయం పొందాడు.’’ అంది ఏకతా.

‘‘సూపర్‌ తల్లీ! నువ్వు ఏకతావే గాని, నీ పేరు ఆకతాయిగా మార్చాలి.’’ అంటూ కోడల్ని హత్తుకుంది మంగతాయారు

*****

Leave a Reply

Your email address will not be published.