అమ్మా ఊపిరి పీల్చుకో

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– నండూరి సుందరీ నాగమణి

అదిరిపడింది ఆలాపన. అయోమయంగా తల్లి ముఖంలోకి చూస్తూ, “అమ్మా! నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఈ వయసులో ఇదేమి ఆలోచన?” అసహనంగా అన్నది.  

“నేనింకా ఒక పదేళ్ళు బ్రతుకుతాననుకుంటే, ఆ బ్రతికిన కొద్దికాలమూ ప్రశాంతంగా బ్రతకాలి కదా  పాపా…” నిర్లిప్తంగా అన్నది సంధ్య.

“ఇప్పుడు నీకు ఏం తక్కువైందమ్మా?” కోపంగా అంది ఆలాపన. 

“మనశ్శాంతి! నాకు ‘నేను’గా జీవించాలని ఉంది… ఎవరికో భార్యలా లేదా తల్లిలా కాదు. సంధ్యలా… కేవలం సంధ్యలాగానే. మిగిలిన కొద్ది కాలమూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బ్రతకాలని ఉంది… ఎవరితోనూ చిన్న మాటైనా పడకుండా, హాయిగా ఊపిరి పీల్చాలని ఉంది…”

“చాలా సిల్లీగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ స్వేచ్ఛకి ఏం తక్కువైందని? చక్కగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యావు. ఇంటి పట్టున ఉండి నాన్నతో హాయిగా గడుపు… అసలు నాన్నకి ఏం తక్కువ? ఆయనకి కొంచెం కోపమెక్కువన్న మాటే కానీ నిన్ను బాగానే  చూసుకుంటాడు కదా… ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి అమ్మా, భార్యాభర్తల మధ్య… అవన్నీ పట్టించుకుని, ఇలా వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకుంటారా? ఈ వయసులో ఒంటరిగా ఆయన్ని ఎలా వదిలిపెడతావు? అసలు ఇప్పుడు విడాకులేమిటి అమ్మా?” తన స్వరాన్ని సాధ్యమైనంత అనునయంగా మార్చి చెప్పింది ఆలాపన. కానీ ఆమెకు భరించలేని దుఃఖం వచ్చేస్తోంది. 

“పాపా, నేను రిటైర్ అయి రెండు నెలలు అయింది… ఇంతకు ముందు కూడా మీ నాన్నతో ఉన్నా, ఎన్నో బాధలు పడినా, మాటలు అనిపించుకున్నా, ఆఫీసు అనేది నాకొక ఔషధంగా ఉండేది… ఇంటి నుంచి బయటకు రాగానే నా మనసులో ఉన్న బాధ, దుఃఖం ఇంటి గడప దగ్గరే వదిలిపెట్టి ఆఫీసుకు వెళ్ళిపోయేదాన్ని. అక్కడ నా పని, సర్వీస్, అధికారులతో మెప్పులు, తిట్లూ, కొలీగ్స్ తో కబుర్లూ, ముచ్చటలూ అవన్నీ వేరే ప్రపంచం… 

ఆఫీసు అయిపోయి ఇంటికి రావాలంటే ఎంత గుబులు పడేదాన్నో… నువ్వూ తమ్ముడూ నా కోసం  ఎదురు చూస్తారని, మీకోసం మాత్రమే  బలవంతంగా ఇంటికి వచ్చేదాన్ని. రాగానే ఆ దుఃఖపు మేఘం తిరిగి నన్ను చుట్టుముట్టేది… ఒక అభద్రతాభావం నిలువునా అగాధంలోకి నెట్టేసేది… తెల్లవారేదాకా గంటలను లెక్కపెట్టుకుంటూ గడిపి, ఉదయమయ్యాక ఎంతో రొటీన్ గా మీకన్నీ అమర్చిపెట్టి, బయటికి వచ్చి బస్ ఎక్కేదాకా ఎంతో  దీనంగా గడిపేదాన్ని… అలాంటిది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే… ఆ మనిషి తోనే… సేవలు చేస్తూ, కావలసింది క్షణాల్లో అమరుస్తూ, అయినా తిట్లు తింటూ, సాధింపులు భరిస్తూ… ఏ మాత్రం ప్రేమన్నది లేకుండా… ఐ రిపీట్… ప్రేమన్నది… ఊహూ ప్రేమ కూడా  కాదు, కనీసం స్నేహభావం కూడా లేకుండా కాపురం చేస్తున్నాను. నాకెందుకీ జీవితం? నేను నాకోసం బ్రతకకూడదా?”

దీర్ఘంగా నిట్టూర్చింది ఆలాపన.

“అసలు ఏం కావాలి అమ్మా నీకు? అందరు భార్యలూ ఇలాగే ఆలోచిస్తున్నారా? నీ జీవితం ఇక ఆల్మోస్ట్ అయిపోయింది… మిగిలింది దేవుడిచ్చిన బోనస్ మాత్రమే. ఇంకా ఏం చేద్దామని? ఈ వయసులో ఆయన్ని ఒంటరిగా వదిలేద్దామని అనుకుంటున్నావంటే, నువ్వు ఎంత కఠినంగా, అమానుషంగా ఆలోచిస్తున్నావో అర్థం అవుతోంది. నువ్వు చాలా స్వార్థపరురాలివమ్మా… నిజంగా… కనీసం నా గురించి కూడా నువ్వు ఆలోచించటం లేదు. ఇప్పుడు విడాకులు తీసుకుంటే మా అత్తగారింట్లో నా పరువు పోదా అమ్మా? వాళ్ళనే మాటలు నేను పడగలనా?”

“పడకు… నీవు చేయని తప్పుకు ఒకరితో మాటలు పడవలసిన అవసరం నీకేమిటే? నా దగ్గరకు వచ్చేసి ఈ అమ్మకు తోడుగా ఉండు…”

“అసలు నువు తల్లివేనా? సంగీత్ తో నా పెళ్ళి కోసం నాన్నతో పోట్లాడి మరీ పెళ్ళి జరిపించిన నా అమ్మవేనా?” విస్మయంగా అంది ఆలాపన. 

“ఊ… అది గుర్తుంది కదా… నీ పెళ్ళి కోసం నేనెంత స్ట్రగుల్ పడ్డానో తెలుసు కదా… నువ్వు ప్రేమించావు. నీ ప్రేమను అర్థం చేసుకుని, దాన్ని  నేను గెలిపించాను. కానీ అలా గెలిపించటానికి నేనెంత నరకమనుభవించానో, మీ నాన్నతో ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? ఆయన నిన్ను దూషించిన దానికన్నా వెయ్యిరెట్లు నన్ను దూషించాడు. పిల్లకిలాంటి బుద్ధులు కలగటానికి కారణం ‘నేనే’ అన్నాడు. నా లక్షణాలు అన్నీ ‘పిల్లకి’ వచ్చాయని ఆరోపించాడు. నీకు సంగీత్ తో పెళ్ళి చేస్తే, తనని వదిలిపెట్టి నన్నూ నీతో వెళ్లిపొమ్మని అన్నాడు తెలుసా? ఇవన్నీ నేను నీకు చెప్పలేదు. ఏ కూతురికీ తన తండ్రి ఒక దుర్మార్గుడిగా గుర్తుండిపోకూడదని, ఆ ప్రేమను నీకు దూరం చేయకూడదని  నేను తాపత్రయ పడ్డాను. 

నీ పెళ్ళి తరువాత పరిస్థితులన్నీ చక్కబడటం, మళ్ళీ నీకూ మీ నాన్నకు మధ్య సామరస్యం, ప్రేమ కలగటం అదొక అదృష్టం… అందువలన నీ మనసు కుదుటపడింది, కానీ ఎన్నో ఏళ్లుగా మా మధ్యన ఏర్పడిన దూరం నీ పెళ్లితో మరింత ఎక్కువైందన్న విషయం నీకు తెలుసా? ఆయన నీతో బాగానే ఉన్నా, నాతో మాటలు మానేసాడు. ఎవరితో చెప్పుకోను? అసలు నా కథంతా వింటావా చెబుతాను. ఒక కూతురిగా కాదు, ఒక స్నేహితురాలిగా విను… ప్లీజ్…”

తన పెళ్ళి కోసం తల్లి పడిన తాపత్రయం, తండ్రితో జరిపిన పోరాటం గుర్తు వచ్చి ఆలాపన కళ్ళు చెమర్చాయి. అప్రయత్నంగా తల్లి దగ్గరగా జరిగి, ఒక్కసారిగా ఆమెను హత్తుకుని వదిలింది.

“చెప్పమ్మా, వింటాను… నీ గుండె బరువు తీర్చుకో…” అన్నది ఆర్ద్రంగా… ఈసారి ఆమె గొంతులో కోపం లేదు.

***

“పెళ్ళయి అత్తవారింటికి వచ్చానో లేదో, ఏదో తెలియని ప్రపంచంలోకి వచ్చినట్టు అయింది. ఇక్కడ నా భర్తతో పాటుగా పెళ్లి కాని ఆడపడుచూ, ఇద్దరు మరుదులూ ఉండేవారు. ఒకరితో మరొకరు మాట్లాడుకోవటం కానీ, ఆప్యాయంగా ఉండటం కానీ ఏదీ లేదు. నేను మాట్లాడించినా ఫలితం ఉండేది కాదు. 

పోనీ మగపిల్లలు కదా, మొహమాటపడుతున్నారులెమ్మని ఆడపడుచు లక్ష్మితో స్నేహంగా ఉందామని చూసాను. ఆమె బిగుసుకు పోయి తన చట్రంలో తాను ఉండేది. మామగారు లేరు,  ఇక మా అత్తగారు అసలు మాట్లాడేవారు కాదు. మౌనంగా ధ్యానంలో కూర్చున్నట్టు ఉండేది. ముఖంలోకి చూస్తూ మాట్లాడటం వీళ్ళకు అలవాటు లేదు. ఇక ‘ఐ కాంటాక్ట్’ అన్నది ఎప్పటికీ సాధ్యం కాదు. 

ఇక మీ నాన్నగారు – అసలు సరదాగా ఉండటం రాదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉండటం… నేను ఏవైనా సరదా కబుర్లు చెప్పినా రియాక్ట్ అవకపోవటం… ఇక మా మధ్య కెమిస్ట్రీ గురించి చెప్పాలంటే, చీకటి నడుమ సంసారం ఏదో గడిచిపోయేది. ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు, తన స్నేహితుల దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు మాత్రం సరదాగానే ఉండేవారు. ఇంటికి రాగానే ముఖానికి గాంభీర్యపు ముసుగు మళ్ళీ మామూలే. ఎందుకంత గంభీరంగా ఉండాలో అర్థమయ్యేది కాదు. అనకూడదు కానీ, మరణం సంభవించిన ఇంటిలోలాగా ఎప్పుడూ ఒక తెలియని విషాదం అలముకొని ఉండేది. 

నువ్వు, తమ్ముడు పుట్టిన తరువాత కూడా ఆయన ఏమీ మారలేదు. నాతో ఎలా ఉంటారో, మీతోనూ అలాగే. 

మిమ్మల్ని నేనే దగ్గర చేర్చుకుని, అన్నం తినిపించి, కథలు చెబుతూ జోకొట్టేదాన్ని. సెలవురోజులలో మీచేత ఆటలు ఆడించేదాన్ని. ఇంత యాంత్రికంగా గడిపే ఆ మనిషితో జీవితాంతం ఎలా కాపురం చేయాలో నాకర్థమయ్యేది కాదు. 

కొన్ని విషయాల్లో ఈయన చాలా మంచి వాడే… నేను ఆఫీసు నుంచి వచ్చేలోగా స్కూలు నుంచి వచ్చిన మీకు బట్టలు మార్చి, ముఖాలు కడిగించి, వేడిగా వంటచేసి తినిపించేవాడు. దగ్గరుండి చదివించేవాడు, హోమ్ వర్కులు చేయించేవాడు. నాతో మాత్రం అలా ఒక దూరాన్ని మెయిన్ టైన్  చేసేవాడు. నేనెంత స్నేహంగా ఉందామన్నా అంతే. ఇంట్రావర్ట్ కావటం వలన మూడ్ ఆఫ్ అయితే అంతే. బెల్లంకొట్టిన రాయిలా మారిపోయేవాడు. కారణం ఏమిటో తెలియదు, అడిగితే చెప్పడు. ఒక నాలుగైదు రోజులపాటు మౌనంగా ఉండిపోయేవాడు, ఏదైనా అడిగితే సమాధానం ఉండేది కాదు… నరకం చూసే దాన్ని…

నా వర్క్ ప్లేస్ లో నాకెన్నో సమస్యలు ఉండేవి. వాటిని షేర్ చేసుకుందామంటే పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా ఉండబట్టలేక నేను చెప్పినా, ‘నీవు సరిగ్గా ఉంటే సమస్యలు ఎందుకొస్తాయి?’ అంటూ నన్నే తప్పు పట్టేవాడు. ఏ రకంగానూ నాకు  తోడుగా, మద్ధతుగా ఉండేవాడు కాదు. ఏం చేయాలి? పెళ్లితో ఒక చక్కని స్నేహితుడు, ప్రేమికుడు దొరుకుతాడని అనుకున్నాను కానీ, ఇలా మానసికంగా ఒంటరిగానే మిగిలిపోతానని ఎప్పుడూ అనుకోలేదు…

మీరు కొంచెం పెద్దయ్యాక, కొత్త ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యాము. అప్పటికే అత్తయ్యకు  పెళ్లయి వెళ్లిపోవటం, బాబాయిలకీ పెళ్లిళ్లయి, కొత్త (తోటి) కోడళ్ళు ఇంటికి రావటం జరిగాయి. నాన్నమ్మను మనతో రమ్మంటే అక్కడే ఉంటానని, రానని చెప్పింది. మన కొత్తింట్లోకి రాగానే కొంతకాలం బాగానే సాగింది. ఆ తరువాత నాకు షాద్ నగర్ కి బదిలీ అయింది. ఉదయం ఏడున్నరకల్లా కాచిగూడా స్టేషన్ చేరుకుని, తుంగభద్ర ఎక్స్ప్రెస్ పట్టుకోవాలి. నాన్నగారే తన స్కూటర్ మీద రోజూ నన్ను స్టేషన్ కి డ్రాప్ చేసేవారు. మీరింకా చిన్నపిల్లలు కనుక, నేను ప్రతీరోజూ షటిల్ చేయాల్సివచ్చేది. అయితే అప్పుడప్పుడు మీ నాన్నగారి మూడాఫ్ అయినప్పుడల్లా, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే అప్పుడాయన నన్ను స్టేషన్ కి దింపేవారు కాదు. సహాయనిరాకరణోద్యమం అన్నమాట! సమయానికి ఆటో దొరకక ఎంతో ఇబ్బంది పడేదాన్ని. చివరికి ట్రైన్ మిస్ అయ్యి, మళ్ళీ బస్ పట్టుకుని ఆలస్యంగా వెళ్ళి, బాసులను క్షమాపణ వేడుకోవలసివచ్చేది. ఆ తర్వాత మూడేళ్ళకి నాకు మళ్ళీ హైదరాబాద్ కి బదిలీ అయింది.

మీరు పెద్దయి ఉద్యోగాల్లో జాయినయ్యాక, నీ సహోద్యోగి సంగీత్ కపూర్ నీకు మంచి స్నేహితుడనీ, నీకు ప్రపోజ్ చేసాడనీ నీవు చెప్పినప్పుడు నాకు సంతోషమే కలిగింది. స్నేహం ఆధారంగా ఏర్పడిన మీ బంధంలో ఎప్పుడూ అపశ్రుతులు ఉండవని నా మనసుకనిపించింది. నాలాగా నిస్సారమైన, మైత్రి లేని జీవితం నీకు  ఉండకూడదని  ఆరాటపడ్డాను. కులాంతరమైనా, భాషాంతరమైనా, రాష్ట్రాంతరమైనా మనసులు కలిసిన చోట, మనోహరమైన  మనుగడకు అంతరాయం కానేరదు. అందుకనే నా అంతట నేనే సంగీత్ వాళ్ళ అమ్మా, నాన్నల దగ్గరకు వచ్చి, పెళ్ళిమాటలు మాట్లాడాను. విశాల దృక్పథం కలిగినవారు కనుక వారు కూడా వెంటనే మీ ప్రేమను ఆమోదించటం, పెళ్ళికి ఒప్పుకోవటం  జరిగింది. 

సమస్య ఎక్కడ వస్తుందో నాకు తెలుసు. మీ నాన్న ఇలాంటి ప్రేమ వివాహాలను ప్రోత్సహించరు. తన కూతురికి సమస్యలు వస్తాయని ఆయన భయం, బెంగ… అది నేనర్థం చేసుకోగలను. ఆయనకి నీ ప్రేమ విషయం చెప్పి, కన్విన్స్ చేయాలని తాపత్రయ పడ్డాను. కానీ నేను ఊహించినట్టే ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో కూడా ఆయనకి నా మీదున్న అకారణ కోపం ఉవ్వెత్తున లేచింది. పిల్లలను, అందులో ఆడపిల్లను సరిగ్గా పెంచటం రాని మొద్దును అని దూషించారు. భాష, సంస్కృతి వేరైన ఈ వివాహ బంధంలో తన కూతురు అసలు సుఖపడదని, మూడు నెలల్లోనే  కాపురం వదులుకొని వచ్చేస్తుందనీ, ఈ సంబంధం కేన్సిల్ చేయమనీ నన్ను కొట్టినంతపని చేసారు. నావన్నీ విపరీతబుద్ధులనీ, ఈ మగపిల్లలతో స్నేహాలు, ప్రేమలూ నేనే నీకు నేర్పానని ఆరోపించారు. నేను నచ్చజెప్పటానికి ప్రయత్నించాను. ఒప్పుకోలేదు. నీతో కూడా మాటలు మానేసారు గుర్తుంది కదా… విధిలేక నువ్వు రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటే  నీ పెళ్ళికి నేను, తమ్ముడు మాత్రమే హాజరయ్యాము. 

పెళ్ళయిన రెండు నెలల తరువాత సంగీత్ తో కలిసి, నీవు వచ్చినప్పుడు మాత్రం తన బింకం వదిలి నీతో మళ్ళీ మాట్లాడారు ఆయన. అల్లుడితో కూడా ఎంతో ఆప్యాయంగా ఉన్నారు. ఆ తరువాత ఏం జరగనట్టే, ఎప్పటిలాగానే నీతో ఉన్నారు.  కానీ నాతో మాత్రం కాదు… నీ పెళ్లికి  నేను ఆమోదం తెలపటం అన్నది, ఆయన దృష్టిలో క్షమించరాని నేరం. నీకు నీ అత్తమామలతో, భర్తతో ఎలాంటి సమస్య లేకపోయినా సరే… నువ్వు ఎంతో సంతోషంగా కాపురం చేసుకుంటున్నా సరే… ఆ రోజు ఆయనకు నామీద కలిగిన ‘కోపం’ ఎప్పటికీ పోకుండా, దాన్నలాగే మెయిన్ టెయిన్ చేస్తున్నాడు.

రిటైర్ అయిపోతున్నానంటే ఒక రకంగా దిగులు, ఒక రకంగా సంతోషం కలిగాయి. మాతృసంస్థలోంచి వచ్చేస్తున్నందుకు గుబులు, విశ్రాంత జీవితాన్ని పొందుతూ, మిస్సయిన కొన్ని సాహిత్యగ్రంథాలను చదువుతూ, చరమదశలో ఇక ఆధ్యాత్మికతను అలవరచుకొని, కొన్ని సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని, వీలుంటే మీ నాన్నగారిని కూడా అందులోకి తీసుకువెళితే కాస్తైనా తోచుబాటు అయి, ఆయన సమయం సద్వినియోగం అవుతుందని భావించాను.

ఆ విషయం చెప్పగానే నాపైన విరుచుకు పడ్డారు. డబ్బు విలువ తెలియనిదానినని, సేవాకార్యక్రమాలకు, ఛారిటీకి డబ్బు ధారపోయటానికి తనకసలు ఆసక్తి లేదనీ, నేను కూడా అలాంటి పనులు చేయనక్కరలేదనీ గట్టిగా చెప్పేసారు. ఇన్నాళ్లూ సమయం సరిపోక కొన్ని పనులు చేయలేదు. ఇప్పుడు ఎంత సమయమున్నా, వాటికి నాకు  ఆయన ‘అనుమతి’ లేదు, దొరకదు. స్త్రీకి తన జీవితాంతమూ ఏ పనికైనా ఎవరిదో ఒకరిది అనుమతి కావలసిందేనా? తనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండవా? తమ్ముడు ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. వాడి భవిష్యత్తు కోసం మనమేమీ భయపడవలసిన పనిలేదు. క్యాంపస్ సెలెక్షన్స్ లో తప్పక జాబ్ సంపాదిస్తాడు వాడు. అందుకోసమని డబ్బు పక్కకుపెట్టి,  రూపాయి రూపాయి పొదుపు చేసేసే పరిస్థితి ఏమీ కాదు మనది. 

సరే, నెమ్మదిగా చెబుదాములే అని, ఆయనతో ఎంతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించాను. నేను చదివే పుస్తకాలు ఆయనతో చదివింపజేయాలని చూసాను. ఎన్నెన్నో మంచిపాటలు వినిపించాలని ప్రయత్నించాను. ఊహూ, ఆసక్తి లేదు… పైగా  అదంతా టైమ్ వేస్ట్ పని అన్నారు. ఖాళీగా ఉండే బదులు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తే ఇంకాసిని డబ్బులు సంపాదించుకోవచ్చు కదాని నాకు సలహా ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం రిటైర్ అయ్యి, ఇంట్లో టీవీ చూసుకుంటూ, యూ ట్యూబ్ లో వీడియోలు చూసుకుంటూ  కాలక్షేపం చేస్తున్నారు మీ నాన్న… నాకేమో, మళ్ళీ ఏదైనా  జాబ్ లో చేరమని సలహా… నువ్వన్నట్టే ఇది నాకు దేవుడిచ్చిన బోనస్ టైమ్… దీనిని పుస్తకాలు చదువుకోవటానికి, నాకు నచ్చిన కార్యక్రమాలు చేయటానికి వినియోగించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అదే చెప్పినా ఆయనకు నచ్చలేదు. ప్రతీ రోజూ సాధిస్తున్నారు. ఆ సాధింపులో మళ్ళీ నీ పెళ్ళి, అది నేను జరిపించటం వస్తాయి. నేను బ్రతికున్నంత కాలం వస్తాయి.  నానా దెప్పిపొడుపు  మాటలూ అంటారు. చాలా సార్లు చిన్నిగాడు కూడా చెప్పాడు, ‘ఇంకెన్నాళ్ళు సాధిస్తావు అమ్మని, అక్క బాగుంది కదా’ని… ఆయన ధోరణి మారదు.

రెండురోజుల క్రితం నా  పాత కొలీగ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితులతో వెళ్ళాను. మామూలుగానే మీ నాన్నగారిని నాతో రమ్మంటే రానని అన్నారు. పెళ్ళయి ఇన్నేళ్లయినా నేను సింగిల్  లేడీనే… ఆ రాత్రి ముహూర్తమయేసరికే పన్నెండు దాటిపోవటంతో అక్కడే ఏర్పాటు చేసిన గదులలో అందరితో పాటుగా విశ్రాంతి తీసుకుని, మర్నాడు లేచి టిఫిన్స్ అయ్యాక ఇంటికి వచ్చాను. ఆ రోజు మీ నాన్న చేసిన రాద్ధాంతం ఇంతా అంతా కాదు. తనతో ముందు చెప్పలేదన్నాడు. నిజానికి ముహూర్తం అయ్యాక వెనక్కిరావాలనే వెహికిల్స్ బుక్ చేసుకున్నాము కానీ, ఒక జీప్ బ్రేక్ డౌన్ అవటంతో అందరమూ అక్కడ ఉండిపోవలసి వచ్చింది. ఎంత వివరించినా ఈయన వినిపించుకోలేదు. ముందు చెప్పలేదు అంటూ పెద్ద గొడవ… వయసు పెరిగే కొద్దీ ఈయన బుర్ర పాడైపోతోందిరా… నేనేం చేయను చెప్పు? ఎన్నాళ్లని భరించను? ఇక నా వల్ల కాదు పాపా. ఒకే కప్పు కింద, పోనీ పరిచితులలా అయినా ఉందామంటే కుదరటం లేదు. ఈ ఇల్లు ఆయనది. ఇక్కడ నేనిక ఉండను. చట్టరీత్యా విడిపోవాలని నిర్ణయించుకున్నాను. విడిపోవటానికి వయసేమిటమ్మా? ఎవరికి, ఎప్పుడు, ఏది అవసరమైతే అది చేయాలి, చేయగలగాలి. ఈ విడాకులు కూడా అంతే… అర్థం చేసుకో బంగారు తల్లీ…

చిన్నిగాడు తానెక్కడ ఉండాలంటే అక్కడ ఉంటాడు. నా టెర్మినల్ బెనెఫిట్స్ లోంచి నీకో రెండు, వాడికో రెండు లక్షలు ఇస్తున్నాను. మిగిలినది అంతా నా పేరునే ఉంటుంది. నామినీగా తమ్ముడి పేరు వ్రాసాను. నాకు నెలకు ముప్పైరెండు వేలు పెన్షన్ వస్తుంది. నేను నారాయణగూడాలో ఒక టూ బెడ్ రూమ్ ఇల్లు చూసుకున్నాను. ఒక వంటమనిషిని, పనిమనిషిని మాట్లాడుకుంటాను. మా స్నేహితులు నడిపించే ‘మా ఆసరా’ సంస్థ యొక్క కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాను. కారు నాదే కాబట్టి నాతో  తీసుకువెళతాను. ఓపిక ఉన్నన్నాళ్లు నేనే డ్రైవ్ చేస్తాను.  తరువాత కావాలంటే డ్రైవరుని పెట్టుకుంటాను. నా ఒంటరి జీవితాన్ని ఏకాంతవాసంగా మలచుకుంటాను. చెప్పు పాపా, దీనిని నన్ను స్వాగతించవద్దని అంటావా? నన్ను జీవించవద్దు అనే హక్కు ఎవరికైనా ఉందా, చెప్పరా?” 

అప్పటికే తల్లి ఒడిలో ముఖం దాచుకున్న ఆలాపన కంటి నీటి వాగులతో సంధ్య చీర తడిసిపోయింది. 

“అమ్మా, ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, ప్రేమరాహిత్యంతో నీవు ఎంతగా కుమిలిపోయావో, ఎంత పళ్లబిగువున నీ  జీవితాన్ని గడిపావో నాకు బాగా తెలిసింది. జీవించటం నీ హక్కు అమ్మా… ఎవ్వరూ కాదని అనలేరు… నీ ఇష్టం అమ్మా… నీకెలా ఇష్టమైతే అలాగే చెయ్యి…” కళ్ళు తుడుచుకుంటూ రుద్ధమైన గొంతుతో చెప్పింది ఆలాపన.

“అక్కా, పద… మనం అమ్మతో ఓ సారి లాయర్ దగ్గరకు వెళదాము…” అంతా వింటున్న చిన్ని అన్నాడు తల్లి భుజం మీద చేయి వేస్తూ…

మెరిసే కళ్ళతో తన పిల్లల వైపు ఆనందంగా చూసుకుంది సంధ్య.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.