ధరిత్రీ నీ సహనానికి జోహార్లు

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– కొమ్ముల వెంకట సూర్యనారాయణ

కాకినాడ లో ఉంటున్న  ప్రసాద్ కి  అమెరికా లో ఉంటున్నవాళ్ళ అమ్మాయి నుంచి ఫోన్.”అమ్మ హాస్పిటల్ లో అడ్మిట్ అయిందట, అమ్మ చెప్పదు కదా తనకి ఎన్ని బాధలున్నా,క్యాజుయల్ గా అమ్మకు ఫోన్ చేస్తే ఎవరివో ఫోన్ లో  “ఈసారీ తప్పదమ్మా ఆపరేషన్” అనే మాటలు వినిపించాయి,నిలదీసి అడిగితే చిన్నగా ఒంట్లో బాలేదు హాస్పిటల్ లో అడ్మిన్ అయ్యాను,పెద్ద విషయమేం కాదుకదా మరల అందరినీ హాడావిడి చేయడం ఎందుకు అని చెప్పలేదు అంది,అందుకే చెపుతున్నాఒకసారి వెళ్ళండి” అంది. 

ప్రసాద్ భార్య ధరిత్రి  అలా తరుచుగా అనారోగ్యం పాలవటం , తనంత తానుగా హాస్పిటల్ లో అడ్మిట్ అవటం ఎప్పుడూ  జరిగేదే,ఇలా ఎప్పుడూ జరిగేదే కదా అని,అంతేకాకుండా ఆఫీస్ లో ఆడిట్  ఉండటంతో అప్పటికప్పుడు వెళ్లలేక  ఇదుగో ఇపుడు వీలు చేసుకుని కారులో బయలుదేరాడు ప్రసాద్.

***

సూర్య కి అతని మిత్రుడి నుండి ఫోన్ , “ధరిత్రి గారికి ఒంట్లో బాగుండలేదు,విజయవాడలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు,అదీ నాకు ఒంట్లో బాగుండక ఆ హాస్పిటల్ కి వెళితే కనిపించారు కాబట్టి తెలిసింది. తెలుసుకదా ఆవిడ మనస్తత్వం తన బాధలు గురించి వాళ్ళ కుటుంబసభ్యులకే చెప్పరు, కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సాయం చేయటానికి ముందుంటారు.అందుకే వీలైతే ఒకసారి చూడటానికి వెళ్ళు”అనడంతో అప్పటికప్పుడు బయలుదేరాడు సూర్య. కరోనా గురించి బస్సులు తిరగకపోవటంతో ఏ వెహికల్ దొరికితే దానిని పట్టుకుని ఏలూరు బైపాస్ వరకూ చేరుకున్నాడు. వస్తున్న ప్రతి వెహికిల్ ని లిఫ్ట్ అడుగుతున్నాడు విజయవాడకి, అలా ప్రసాద్ కారు ని ఆపాడు సూర్య. చూడటానికి హుందాగా ఒక మంచి పొజిషన్ లో ఉన్న ఎంప్లాయిగా అనిపించి పక్కకి కారు ఆపి “ఎక్కడి వరకు వెళ్ళాలి?” అడిగాడు ప్రసాద్ విండో గ్లాసెస్ దించి

“విజయవాడ లోని హాస్పిటల్ కి వెళ్ళాలండి” అనేసరికి,సరే రండి అని కార్ డోర్ ఓపెన్ చేసాడు.  ఏదో మాట్లాడాలి కదా అని “ఎవరున్నారండి హాస్పిటల్ లో “ అడిగాడు ప్రసాద్

“ధరిత్రి గారని, నాకు బాగా తెలుసున్నావిడండి” అన్నాడు సూర్య

“ఓహో, ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తపరస్తూ, తెలుసున్నావిడ అంటున్నారు అయితే బంధువులు కాదన్నమాట, స్నేహితురాలాండి, ఎంత స్నేహితురాలైతే మాత్రం ఇటువంటి పరిస్థితులలో కష్టం కదాండి వెళ్ళడం”అన్నాడు ప్రసాద్.

“ధరిత్రి గారు అని సంబోధించానని,ఆమె నాకు స్నేహితురాలు అనుకుంటున్నారు కదూ, ఆమె గురించి చెబుతా అది విన్న తర్వాత ఆమె నాకు ఏమవుతుందో మీరే చెబుదురుగానీ” అని మొదలుపెట్టాడు సూర్య.

***

“పన్నెండు సంవత్సరాలుగా లెక్చరర్ గా ఒకే చోట పనిచేసిన నాకు అకస్మాత్తుగా,అనుకోనివిధంగా తూర్పుగోదావరిజిల్లానుండి కృష్ణాజిల్లాకు బదిలీ కావటంతో అక్కడ జాయిన్ కావలసివచ్చింది. అంతా కొత్త, అటువంటి సమయంలో చేరిన రోజే ,అదే  సంస్థలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న ధరిత్రి గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆ రోజు భోజనాలను వారి ఇంటివద్దనుంచి వచ్చేలా పురమాయించారండి”. 

“ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరి ఉంటారు, మధ్యలో ఏం తిన్నారో ఏమో, ఏమీ మొహమాట పడకండి, మీ అమ్మగారు వడ్డిస్తే ఏమన్నా మొహమాట పడతారా అలాగే అనుకోండి” అంటూ దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు..అలా ఆమెలో అమ్మతనాన్ని చూసాను. చాలా సాదా సీదా గా మెడలో ఒక సన్నపాటి బంగారుగొలుసుతో ఉన్నప్పటికి మొహంలో ఒక విధమైన కళ ఉట్టిపడుతోంది. నా కంటే వయస్సులో చిన్నావిడే “

“రండి, మా ఇంట్లోనే ఉందురుగానీ, నేను,మా ఆయనే ఉంటాం.లంకంత కొంప.ఇద్దరు ఆడపిల్లలు,ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి అత్తవారిళ్ళకు పంపేసాం,అప్పుడే అమ్మమ్మను కూడా అయిపోయా, అలాగని పెద్దక్క అని పిలిచేరుగానీ, మా పిల్లలకు చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు చేసేసామండి”అని సెలయేటి ప్రహాహం లా గలగలా మాట్లాడారు.

“వద్దులేండి,తాత్కాలికంగా చిన్నగది అద్దెకు తీసుకుని అందులో సర్దుకుంటా” అని సున్నితంగా ఆమె అభ్యర్ధనను తిరస్కరించానండి.

“ఏమండోయ్! లంకంత కొంపే గాని మా కొంప లంక కాదు,మా ఆయన రావణుడు కాదు,నేను మండోదరికాదు,మా ఆడపడుచు శూర్పణఖ కాదు లెండి”అంటూ చిలిపి మరదలి అవతారం ఎత్తారు.

 “ఆ! నేను మాత్రం శ్రీరాముణ్ణి లేండి” అన్నా, నవ్వుతూ.చెప్పుకుంటూ పోతున్నాడు సూర్య, ఆసక్తిగా వింటున్నాడు ప్రసాద్.

***

తర్వాత ఒక్కొక్కటిగా ధరిత్రి గారి  గురించిన విషయాలు తెలిసిన కొద్దీ ఆమె పై గౌరవభావం అధికమైందండి. ఆమె గొప్ప ధనవంతుల యింట్లో ఏకైక అమ్మాయి గా పుట్టి గారాల పట్టిగా పెరిగిందట. మేరీస్ స్టెల్లా కాలేజ్ లో డిగ్రీ చదివేటపుడు ఇంటిదగ్గరినుండి కాలేజ్ కి ప్రత్యేక బస్సులో, కూడా వారి అమ్మమ్మ ఫాలో అయి కాలేజ్ లో దింపి వెళ్ళేవారంట. కాలేజ్ లో స్నేహితురాళ్ళ గ్రూప్ కి ధరిత్రే లీడర్ అంటండి. వాళ్ళ అమ్మమ్మని అలా వెళ్ళనిచ్చి ధరిత్రి నాయకత్వంలో గ్రూప్ అంతా సినిమాలకు చెక్కేసే వారంట.అక్కడ మగవాళ్ళతో సమానంగా ఈలలు వేసేవాళ్ళమని  ఒకసారి మాటల సందర్భంలో చెప్పారు.అటువంటి అల్లరిపిల్ల, అదీకాక మూడు తరాలకు ఏకైక అమ్మాయి అయిన ఆమెను తొమ్మిది మంది సంతానం గల ఇంటికి పెద్ద కోడలిగా పంపించారంటండి.అబ్బాయి మంచి బుద్దిమంతుడు,బ్యాంక్ ఎంప్లాయి అని వివాహం చేసారంట.అంబాసిడర్ కారులో ఇరవై మంది ఎక్కొచ్చు అని తొలిసారిగా అత్తవారి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత తెలిసివచ్చిందని జోవియల్ గా అన్నారు ఒకసారి. అత్తవారింట్లో పరిస్థితులకి   ధరిత్రి గారు  సర్దుబాటు కావడానికి అష్టకష్టాలుపడిందంటండి. ఎందుకంటే తను పుట్టింట్లో కాలు నేల మీద పెట్టకుండా పట్టపురాణిగా పెరిగిన వాతావరణం నుంచి  అత్తవారింటికి వెళ్ళేసరికి అత్తగారి ఇంట్లో కిటికీలకు పాత చీరలను కర్టెన్ లుగా పెట్టుకునే  పరిస్థితి. ఇరవై ఏళ్ళుగా టీ అంటే దగ్గరకి రానివ్వనిది అత్తవారింట్లో టీ యే సర్వస్వం అయింది. ఏ రోజుకారోజు మధ్యాహ్నం బోజనం లోకి కూరలు వెతుక్కునే పరిస్థితి,అయినప్పటికి ఎక్కడా అధైర్యం చెందకుండా చదివిన డిగ్రీతో ప్రైవేట్ కాన్వెంట్ లో టీచర్ గా చేరి  భర్త    సంపాదనకు తన సంపాదన జోడించి అత్తమామలకే కాకుండా, మరిదులకు,ఆడపడుచులకు ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నారని తెలిసిందండి.అదుగో అప్పుడు ఆమెలో వదిన అనురాగం కనిపించిందండి. అయినప్పటికి ఆర్ధికపరిస్థితులు ఇంకా చక్కబడకపోయేసరికి ఖాళి సమయంలో  ఇంట్లోనే చీరల అమ్మకాన్ని ప్రారంభించి,అంచెలంచెలుగా ఎదిగి తన తెలివి తేటలతో ఫైనాన్స్ బిజినెస్ ఒక పక్క ప్రారంభించి మరొక పక్క ప్రైవేట్ గా పి.జి.,బి.యిడి.,ఎం.యిడి చేసి ఏకంగా ఒక కార్పోరేట్ స్కూల్ ని ప్రారంభించే స్థాయి కి ఎదిగారండి.ఈ లోపు స్కూల్ అసిస్టెంట్ పోష్ట్ ని సాధించుకున్నారు. పి.జి.,ఎం.యిడి.,ఉండటంతో డిప్యుటేషన్ పై మా సంస్థలో చేరారు. 

“సూర్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు అన్నయ్య లేని లోటు కనిపించడం లేదు” అన్నారు ఒకసారి. చాలా ఆనందమేసిందండి. అదుగో అలా ఆమెలో నా చెల్లిని చూసుకోగలిగాను .  ఎంత ఎదిగినప్పటికి నిరాడంబరంగానే ఉంటూ ఎంతో ఒదిగి ఒదిగి ఉండేవారు. అంతే కాదు ఏ విషయమైనా ఆమె ఒంటరిగా పోరాడతారు ఎవరి సహాయాన్ని ఆశించరండి.ఆత్మాభిమానం మెండుగా ఉండే వ్యక్తి అండి .అలా  ఎందుకంటున్నానంటే పెళ్ళైన తర్వాత ఇన్ని కష్టాలు తన జీవితంలో ఎదురైనా తనే ఒంటరిగా ఆ బాధ్యతలను నెత్తిమీద వేసుకున్నారు తప్పితే, ఒకే ఒక ఫోన్ తన పుట్టింటికి చేస్తే క్షణాల్లో ఆమె ఆర్ధిక పరిస్థితులు చక్కబడే అవకాశమున్నా, మెట్టినింటి గుట్టుని విప్పలేదు. ధరిత్రి గారు ఆమె భర్త గారి గురించి ఒక సందర్భంలో చెపుతూ “ఆయనకు ఫిట్స్ లా వస్తున్నాయని, తన అత్తగారు 9నెలలు కడుపులో పెట్టుకుని మోసింది గానీ తను జీవితాంతం కడుపులో పెట్టుకుని చంటి పిల్లాడిలా చూసుకుంటున్నానని    చెప్పారండి. అలా ధరిత్రి గురించి చెప్పుకు పోతున్నాడు సూర్య.

“మీరేమీ మాట్లాడటం లేదు, ఏదైనా చెప్పండి” మధ్యలో అడిగాడు సూర్య,  ప్రసాద్ ని

“లేదు,లేదూ చాలా ఆసక్తి కరంగా ఉంది ,కంటిన్యూ చేయండి” అన్నాడు ప్రసాద్.

***

ఆ మధ్యన సంస్థలో  జరిగిన ఓ సంఘటనకు ఆమె చూపిన తెగువ చూసి మేమంతా ఆశ్చర్యపోయామండి. అదేంటంటే మా సంస్థలో చదివే అమ్మాయి ని ప్రేమ పేరుతో ఓ అబ్బాయి మోసగించే సరికి ఆ అమ్మాయి తన  ఇంటివద్ద ఆత్మహత్యకి ప్రయత్నించిందని  తెలిసి, మేమెవరం వాళ్ళింటికి వెళ్ళడానికి  సాహసించ లేకపోయినా ఆమె సాహసించి వాళ్ళింటికి వెళ్ళి ఓ పక్క ధైర్యాన్ని చెపుతూనే మరో పక్క చెడామడా దులిపేస్తూ “ మోసం చేసాడు,మోసం చేస్తే చచ్చిపోవటమేనా పరిష్కారం, చచ్చిపోతే నీ సమస్య పరిష్కారమైపోతుందా, చచ్చి ఏం సాధిస్తావు, మీ అమ్మానాన్నలకు శోకాన్ని మిగల్చడమేకానీ ,బతికుంటే మోసం చేసిన వాడిని శిక్షించటమో,బుద్ది చెప్పటమో చేయవచ్చు “ అంటూ ఘాటుగా మాట్లాడి  ఆ అమ్మాయి చేసిన పనికి ఓ పక్కన సిగ్గుపడేలా చేస్తూ మరోపక్క జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ పిరికిదానిలా జీవితం నుండి పారిపోకూడదు అని చెప్పిన తీరు చూస్తే ఆమెలో ఆ పిల్లలకు ఒక అక్కే కనిపించిందండి నాకు . అంతేకాదండి, మా కొలీగ్ ఒకరికి పిల్లలు కలగకపోయేసరికి ట్రీట్ మెంట్ కోసం పద్నాలుగు లక్షలు ఏ విధమైన ప్రామిసరీ నోట్ వంటివి ఏమీ తీసుకోకుండా అప్పు ఇస్తే, ఆయన ఖరీదైన  ట్రీట్ మెంట్ చేయించుకున్నారు ఫలితంగా  ఆయనకు ఈ మధ్యనే ఆడపిల్ల కలిగిందండి,ఆమె ఋణం  ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఇప్పటికీ ఆయన చెపుతానే ఉంటారండి.

అలాగే ఒకసారి కాలేజీలో ఉండగా , మా ఇంటి దగ్గరనుంచి ఫోన్, అర్జంటుగా ఇంటికి రమ్మని మా ఇల్లాలి నుండి అమ్మకు ఒంట్లో బాగుండలేదని. ఆ మారుమూల ఊరునుంచి బస్సులు పట్టుకుని మా ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి దాటేస్తుంది అయినా తప్పదుకదా. సెలవుపెట్టి బయలుదేరుతుంటే, రోజు మధ్యలో అకస్మాత్తుగా బయలుదేరడం చూసి ధరిత్రి గారు  విషయం తెలుసుకుని ఆ రోజుకి తను ఆటోలో వెళ్తానని, ఆమె కారులో  నన్ను వెళ్ళమని అప్పటికప్పుడు డ్రైవర్ కి చెప్పి బలవంతాన పంపించారండి. కారులో వెళ్తూ కారు డ్రైవర్ చెప్పిన విషయం విన్న తరువాత ఆమె వ్యక్తిత్వం హిమోన్నతం అనిపించిందండి.

“మేడమ్ గారి దగ్గర చేరకముందే, మా చిన్నబాబు పుట్టుకతో హార్ట్ లో హోల్  ఉందని ఆపరేషన్ చేయించడానికి లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి విధి ఎలా రాసిఉంటే అలా అవుతుందని విడిచిపెట్టేసానండి.మరి ఎలా తెలుసుకున్నారో ముందు వాడికి ఆపరేషన్ చేయించు, వాడి ఆపరేషన్ కయ్యే ఖర్చు నేను చూస్తానని చెప్పి దగ్గరుండి చేయించారండి,ఆ తల్లి చలవ వల్ల మా పిల్లోడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు”అని డ్రైవర్ చెప్పిన మాటలు  విన్నతరువాత ఆమెలో ఆత్మీయ యజమాని కనిపించిందండి. ఇవేవీ ఆమె చెప్పినవి కాదు, ఆమె నుంచి లబ్ది పొందిన వాళ్ళు చెప్పినవేనండి.

సొంతింటికి దూరమయ్యాననే తప్పించి నేను పనిచేసిన చోట  అన్ని విషయాలలో ఆనందంగానే ఉండేదండి.అమ్మ ఆరోగ్యం గురించే బెంగగా ఉండేది.ఇది తెలుసుకుని, ధరిత్రి గారికి పై స్థాయిలో మంచి పలుకుబడి ఉండటంతో,ఆమె ప్రయత్నం చేసి అతి తక్కువ కాలంలోనే  తిరిగి నన్ను జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేయించగలిగారు. అప్పుడూ కూడా ఒక మాటన్నారు”మిమ్మల్ని ఇక్కడనుంచి పంపించటానికి ఏమాత్రం ఇష్టం లేదు,కానీ మీ  అమ్మ గారికి ఒంట్లో బాగుండదంటున్నారు కదా,అందుకే పంపిస్తున్నాం’అన్నారు. అలా నేను తిరిగి మా జిల్లాకు చేరుకున్నాన్నండి. తరువాత అపుడపుడు ఆమె నా క్షేమ సమాచారాలు ,ఆమె క్షేమ సమాచారాలు నేనూ తెలుసుకునే వాణ్ణి.ఇదుగో మరల ఇపుడు నా స్నేహితుని ఫోన్ తో ఇలా బయలు దేరవలసి వచ్చిందండి.విన్నారు కదూ,ఇపుడు చెప్పండి ఆమె నాకేమవుతారో?” విరామమిచ్చి ప్రసాద్ కేసి చూసాడు సూర్య. ఆశ్చర్యంగా ప్రసాద్  కంటినుండి కన్నీళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

“అదేంటీ,మీ కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి,ఒక పక్కకు కారుని ఆపుచేయండి” అన్నాడు సూర్య.అప్పుడు నోరు విప్పాడు ప్రసాద్, “మీరు చెపుతున్న ధరిత్రి ఎవరోకాదండి నా భార్యే,నా పేరు ప్రసాద్,బ్యాంక్ లో పనిచేసే నాకు ఈ మధ్యనే కాకినాడకు  ట్రాన్స్ ఫర్ అయ్యింది. నా భార్య హాస్పిటల్ లో అడ్మిన్ అయినట్లు మా అమ్మాయి ఫోన్ చేస్తే తెలిసింది.ఆడిటింగ్ తో వెళ్ళలేక ఈ రోజు బయలుదేరుతున్నాను.నా భార్య వ్యక్తిత్వం ఏంటో ఇప్పుడు పూర్తిగా  అర్ధమైంది.ఇంత మంది మనసుల చూరగొన్న ఆమె జీవితం నిజంగా ధన్యమే.స్వతంత్రంగా వ్యవహరిస్తుందనే అనుకున్నా కానీ స్వాభిమానంతో ప్రవర్తిస్తుందని అర్ధం చేసుకోలేకపోయాను. నా అహంకారం తో  ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం గల ఆమెను ఎంత నిర్లక్షం చేసానో ఇప్పటికి అర్ధమైంది. ఇకనైనా మేలుకుంటా,నేనూ  హాస్పిటల్ కి అనే బయలుదేరాను.ఆ భగవంతుడే పంపించాడామో మీ ద్వారా నా భార్య వ్యక్తిత్వం తెలుసుకునేలా   చేసి నా కన్నులు తెరిపించేలా చేశారు.ఇపుడు చెపుతున్నా మీరన్నట్టు ఆమె మీరన్నట్లే అమ్మ,అక్క,అత్త,చెల్లి,వదిన,మరదలు,స్నేహితురాలు నండి. నాకు అర్ధాంగే కాదు ,నా కన్నులు తెరిపించిన దేవత,అంతే కాదు అర్ధాంగి అనే మాటకు అసలైన నిర్వచనంగా నిలిచిందండి. ఇప్పుడు నా ఇన్ హిబిషన్స్ అన్నీ తొలగిపోయాయండి.”అని మన:స్ఫూర్తిగా తన మనసులో మాటను బయటపెట్టాడు” ప్రసాద్. 

“నిజంగా మీరు అదృష్టవంతులు,ఎందుకంటే కొంచెం ఇంచుమించు ధరిత్రి గారి స్వభావమే పుణికిపుచ్చుకున్నట్లుగా ఉండేది నా భార్య. దురదృష్టం ఏమిటంటే ఆమె మంచి మనస్తత్వం ఆమె చనిపోయిన తరువాతే తెలిసొచ్చింది.కానీ మీరు చాలా అదృష్ట వంతులు,అటువంటి ఇల్లాలిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే అవకాశం మీకు ఇవ్వడానికే కాబోలు  యాదృచ్చికంగా మీరూ,నేనూ ఇలా కలుసుకొనేలా చేసాడు ఆ భగవంతుడు”అన్నాడు సూర్య.

 ఆతృతగా ఇద్దరూ హాస్పిటల్ కి చేరారు.

***

హాస్పిటల్ రూమ్ లో  బెడ్ పై నీర్సంగా పడుకుని ఉన్న ధరిత్రి ని చూసేసరికి ఇద్దరికి అప్రయత్నంగా వస్తున్న కన్నీటిని ఆపుకోవడం కష్టమే అయింది .సరే, లేపటం ఎందుకని అలాగే కూర్చుని ఉన్నారు ఇద్దరూ. ఈ లోపు డాక్టర్ గారు వచ్చారు రౌండ్స్ కని. 

“ఇపుడు ఎలా ఉందండీ ఆమె ఆరోగ్యం” అడిగాడు సూర్య, మనసంతా బాధతో నిండిపోయి నోట మాట రాకుండా ఉండిపోయాడు ప్రసాద్ .

“నిలకడగానే ఉంది,మీకు తెలుసో తెలియదో ఇప్పటివరకు ఆమెకు పదమూడు సర్జరీలయ్యాయి. చాలాకాలంగా ఆమెకు లింఫ్ నోడ్స్ కు సంబంధించిన లింఫడెనోపతి అనే వ్యాధి ఉంది.ఇది కేన్సర్ కి దారి తీసే అవకాశముంటుంది.ఇప్పటివరకు  ఆమె చూపిన ఆత్మస్థైర్యానికి జడిసి మృత్యువే పలాయనం చిత్తగించింది .డాక్టర్లమైన మాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అలా అంత బాధను మనసులో పెట్టుకుని అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారా అని,ఒక విధంగా అలా ఉండబట్టే అంత ధీటుగా ఆ జబ్బుని ఎదుర్కోగలుగుతున్నారు కూడా”. సూర్య, ప్రసాద్ ల దు:ఖానికి అంతే లేకుండా పోయింది. పైకి ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఎంతసేపూ ఇతరులను నవ్విస్తూ కనిపించే ధరిత్రి గారి లో ఇంత విషాదం దాగిఉందని తెలిసేసరికి అసంకల్పితంగా కనుకొనకులనుంచి ధారగా వస్తున్న కన్నీళ్ళను ఆపుకోవటం కష్టతరమే అయ్యింది వారికి. ఇటువంటి మహోన్నత వ్యక్తిత్వం కల ఆమెకు నిండునూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని మనసులోనే భగవంతుని ప్రార్ధించారు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు.

***

“ఎలా ఉందమ్మా ఇప్పుడు” తలగడకి చేరబడి మెల్లగా కళ్ళు విప్పి చూసిన ధరిత్రి గారిని అడిగాడు సూర్య.అతని వెనుక సిగ్గుతో కుంచించుకుపోతూ నిలబడి ఉన్నాడు ప్రసాద్.ఇప్పుడు అతనిలో ఒక విధమైన పశ్చాత్తాపం మనసును దహించివేస్తుంది.

“ఆశ్చర్యంగా ఉందే,ఎప్పుడూ హాస్పిటల్ కి మొహం చూపెట్టని  మా ఆయన, నన్ను ఎంతో అభిమానించే మా అన్నయ్య వచ్చేసారు కదా,, ఇంకేముంటుంది  నా  అనారోగ్యం తోకముడిచి పారిపోతుంది” అంది ధరిత్రి

“నిజమేనమ్మా! గుండెల్లో పెట్టుకుని పూజించే  బావగారు, అభిమానించే అన్నయ్య   వచ్చేసాం  కదా, తప్పకుండా తగ్గిపోతుందమ్మా ,త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళతావు.అలాగే  ఇకపై బావగారు  కూడా దగ్గరుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు  “అన్నాడు సూర్య. 

“అవును ధరిత్రీ!,ఇకపై  నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటా, మీ అన్నయ్య నా కళ్ళు తెరిపించాడు” అని ప్రసాద్, ధరిత్రి ని తన రెండు బాహువులతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.

“ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు ధరిత్రి,ప్రసాద్ లు. సూర్య ఆనందానికి అంతే లేకుండా పోయింది.

***

( ఈ కధలోని ధరిత్రిలా ఆత్మగౌరవంతోబాటు సమస్యలను సహనంతో పరిష్కరించుకునే స్త్రీమూర్తులందరికి అంకితం… )

****

Please follow and like us:

One thought on “ధరిత్రీ నీ సహనానికి జోహార్లు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

Leave a Reply

Your email address will not be published.