నారి సారించిన నవల-36

                      -కాత్యాయనీ విద్మహే

          రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు సమాజ భావజాల రంగంలోకి, భాషా ప్రపంచంలోకి స్త్రీవాదం అన్న మాట ఇంకా వేరూనుకోక ముందే రమాదేవి స్త్రీపురుష సంబంధాలను గురించి తాత్విక గాఢతతో ఈ నవలలో చర్చించటం నిజంగా అబ్బురమనిపిస్తుంది. రాజీ జీవితంలో నలుగురు పురుషులు ఉన్నారు. తల్లి చివరి కోరికగా మేనమామ తో పెళ్లి అయినంత పని అయింది. మేనమామకు రాజీ తో ఆ రకమైన అనుబంధం ఇష్టం కాలేదు. అది ఆమెకు కూడా కష్టం కలిగించలేదు. అక్కడికి అది భాగం.

          ఢిల్లీ లో ఉద్యోగానికి వచ్చి ఒంటరిగా ఉంటున్నప్పుడు అనంత్ తో ఆమెకు ఒక భావోద్వేగ సంబంధం ఏర్పడింది. అతను  తాను పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంగీత నృత్య నాటక విభాగపు సలహాదారు. దాదాపు ఆమెకంటే పదేళ్లు పెద్దవాడు. భార్యాపిల్లలు ఉన్నవాడు. అతని రాక , పలకరింపు , పరిచయం ఆమెను మోహంలో పడేశాయి. గతానికి సంబంధించిన ఆమె ఆలోచనల ద్వారా వాళ్ళ అనుబంధం  కథా కాలానికి రెండేళ్ల పూర్వం ఏర్పడి దృఢపడింది అని స్పష్టం అవుతుంది. ఒంటరి ద్వీపకల్పంలో ఆమె కు మానసికంగా దగ్గరైనవాడు అతను. అతని కోసం, అతని ఫోను పిలుపు కోసం  ఎదురు చూపులు, అతను దగ్గరలేనప్పుడు మనసు మూగబోయే  స్థితి, అహర్నిశం  అతని గురించి ఆలోచనలు ప్రేమ అంటే , ఆనందం అంటే ఇదేనా అని , ఈ ఒత్తిడిని భరించగల శక్తి తనకు ఉందా అన్న విచికిత్సకు లోను చేస్తుంటాయి. అతని  సామీప్యం తన పాటకు, పనికి స్ఫూర్తి గా ఉంటుందని గ్రహించి అలా తన జీవితం అతని మీద ఆధారపడే స్థితికి వచ్చిందే అని దిగులు పడుతుంది. అతని కంటే భిన్నమైన స్వతంత్ర వ్యక్తిగా తాను నిలబడటం గురించి ఆలోచిస్తుంటుంది కూడా. అతనితో తన సంబంధం ఒకరితో చెప్పుకోలేనిది కదా అన్న దిగులు ఆమెను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది.

          అనంత్ భార్య అతని అక్క కూతురే . పెద్దగా చదువుకోలేదు. మెట్రిక్ పాసయింది. పెళ్లయిన పదేళ్లకు అతనికి మరొక స్త్రీతో పరిచయం ఏర్పడింది.   సంసార మర్యాదకు లోబడిన అతని ప్రవర్తన ఆమెను అసంతృప్తికి ఎంతగా లోను చేసిందో ఆమె తోటి అతని సంబంధం గురించిన ఎరుక  భార్యను అంతగా అసహనానికి లోను చేసింది. రాజీకి ఈ విషయం అనంత్ ద్వారానే తెలుసు. ఈ ఇద్దరి మధ్య నలిగిడిలో తాను సేద తీరే స్థావరమైందా అని రాజీకి ఒక క్షణం అనుమానం కూడా కలుగుతుంది. అయినా అబద్ధాలు ఆడకపోవడం, ఏదో దాచి ఏమో చెయ్యాలన్న ఉద్దేశం అతనికి లేకపోవటం అర్ధం అవుతుంటే భావోద్వేగ సంతృప్తికి  అతను తనకు ఎట్లా ఒక అవసరమో అనేకానేక జీవిత సంక్షోభాల నుండి సేద తీరటానికి తాను కూడా అతనికి అలాంటి భావోద్వేగ అవసరమే అయ్యానని రాజీ ఒక అవగాహనకు వస్తుంది.  ఆమె  మీద ప్రేమ అనంత్ హృదయం దాటి బయటకు వ్యక్తం కావటం అంటే తరచు  కళ్లలో  కదలాడే కన్నీరుగానే ఉండటం అంతకన్నా ఆమెకు తాను సామాజికంగా దగ్గర కావటానికి, తాను ఆమె కోసం ఉన్నానన్న విషయం నిరూపించుకొనటానికి లేని అవకాశాల గురించిన దిగులువల్లే కావాలి.

          పెళ్ళిలో స్త్రీ పురుషులు ఒకళ్లకు ఒకళ్ళు బాధ్యులు. అనంత్  కు భార్యపట్ల- తన పిల్లల తల్లి  పట్ల-  అదే బాధ్యత. ఆ  బాధ్యత కారణంగానే ఆమె దగ్గర లభ్యం కాని ఏదో సహవాస స్వాంతనకు రాజీ కి  ఆమె కంటే పదిహేనేళ్ల పూర్వం మరొక స్త్రీకి సన్నిహితుడు అయ్యాడు. అయితే భార్యను వదిలి ఆ సంబంధాలలో ఉండిపోవాలని అతను అనుకోలేదు. భార్యకు తన సంబంధాల గురించి అనుమానం వస్తే కొన్ని రోజుల వరకైనా వాళ్లకు దూరంగా ఉండటానికి సిద్ధపడటం  భార్య పట్ల బాధ్యత కారణంగానే.  ఎన్నో ఏళ్లుగా కలిసి బతుకుతున్న ఆవిడ పట్ల ఆప్యాయత ఉందని, ఆవిడ బాగోగుల్ని చూడటం తన విధి అని అతను నమ్ముతాడు. కానీ ఆవిడకు తన ఆలోచనల్లో పాలు పంచుకొనే శక్తి , తన అన్వేషణలో తోడివ్వ గల నేర్పు ఆమెకు లేవన్నదే అతని బాధ.  ఒకరికొకరు బాధ్యత వహించవలసిన అవసరం లేని సంబంధాలకైన అన్వేషణ అనంత్ ది. 

          ఇక అనంత్ భార్య సంగతి ఏమిటి? భర్తకు వేరే స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తున్నా ఆరాలు తీసి అతనికి చిరాకు తెప్పిస్తుందే కానీ  అతని అవసరాలను కనిపెట్టి తీర్చటంలో ఏమరుపాటు చూపదు. పెళ్లి భర్తపట్ల భార్యకు నెరవేర్చవలసిన విధులను నిర్దేశించింది కనుక ఆ పరిధిలో ఉంటుంది ఆమె వ్యవహార సరళి అంతా.  ఇంటి దగ్గర మా ఆవిడా , ఆఫీసులో పిఎ ఎప్పుడూ తనని కనిపెట్టుకొని ఆలనా పాలనా చేస్తుంటారని అనంత్ చెప్తాడు కూడా. బాస్ కు  పిఎ కు ఉండే సంబంధం లాంటిది భర్తకు భార్యకు ఉన్న సంబంధం అంటే అది హృదయానికి సంబంధించినది కాక వ్యవహారానికి సంబంధించిందిగా యాంత్రికతకు లోనవ్వటమే. ఆ యాంత్రికత నుండి విముక్తి కైన పెనుగులాటలో  అనంత్ వంటి వాళ్ళు భావోద్వేగ మేథోపర అవసరాలకు రాజీ వంటి స్త్రీలను ఆశ్రయిస్తారని అనుకోవచ్చు. రవికాంత్ కూడా అంతే. అతనికీ పెళ్లయింది. భార్యా పిల్లలు ఉన్నారు. రాజకీయాలలో , ప్రభుత్వ పనులలలో తిరుగుతుండే అతనికి ఆవేదనలు వెళ్లబోసుకొనటానికి రాజీ కావాలి. రాజీ ప్రేరణ లేకపోతే తానేమీ చేయలేనని అనుకొంటాడు. శాంతి దొరకదని అనుకొంటాడు. అందుకోసం ఆమె సమయాన్ని, స్నేహాన్ని అర్ధిస్తాడు. రాజీ జీవితంలో ప్రతి మలుపులోనూ అతను ఉన్నాడు. రాజీ నవలలోనే  కాదు, దానికి సీక్వెల్ గా వచ్చిన మిగిలిన మూడు నవలలోనూ అతను కనబడతాడు.   

          అనంత్  రాజీకి తనకు మధ్య ఉన్నది ప్రేమతో కూడిన స్నేహం అంటాడు. ఒకరినొకరు అర్ధం చేసుకొనటం స్నేహ లక్షణం. స్నేహం వల్ల ప్రేమ ఉదాత్తీకరించ బడుతుంది. మిగతా ప్రపంచాన్ని సానుభూతితో చూడగల సంస్కారాన్ని ఇస్తుందని భావిస్తాడు. లోకాన్ని సానుభూతి తో చూడటం అంటే సహజ ప్రతిస్పందనా చర్యగా వుండే స్త్రీపురుష సంబంధాలను నియంత్రించ చూసే మంచి చెడు తీర్పుల విధి నిషేధ సూత్రాల అసహజ వ్యవస్థలను నిరాకరించి నిలబడగల జీవిత విధానం. తనకు అనంత్ కు మధ్య ఉన్నది స్నేహాన్ని మించిన వ్యామోహం అని  రాజీ  అన్నప్పుడు అనంత్  తమ మధ్య ఉన్న బాంధవ్యం శరీర సంబంధానికి మించిందని  “ఒకరినొకరం, ఒకరి సాయంతో ఒకరం మనల్ని మనం గుర్తుంచుకోవడానికి చేసే యత్నం” అని అంటాడు. అది నిజమే నని అంగీకరిస్తూనే రాజీ అతని భార్యను తలచుకొన్నప్పుడు తప్పు చేస్తున్నట్లు బాధగా ఉంటుంది అంటుంది. సమాజంలో అందరూ అనుకొనే మంచిచెడుల ఆంక్షలను అధిగమించలేకుండా వున్నావ్ అని అనంత్ ఆమెను హెచ్చరించటం అతను కలగంటున్న జీవితవిధాన  ఫలితమే అనుకోవచ్చు. ప్రేమ బంధం బంధనం కాకూడదు అన్నది  అనంత్ జీవిత సూత్రం అయింది.

          ఒకరిని ప్రేమిస్తే ఒకరిని ద్వేషించాలని లేదు అన్నది అనంత్ ఆలోచన. రాజీ తో స్నేహం అయ్యాక భార్య మీద ఆర్ద్రత పెరిగింది అంటాడు. ప్రేమ కలగవచ్చు కానీ ఎప్పుడూ ఒకే ఉధృతిలో అది ఉండదని అతని అభిప్రాయం. “పుస్తకాలలో చదివే శాశ్వతమైన ప్రేమలో చలనం వుండదు. జీవితానుభవంలో దొరికే ప్రేమలో చలనం వుంటుంది. ఒకప్పుడున్న ఉధృతం మరొకప్పుడు ఉండక పోవచ్చు. ఒకప్పుడున్న ఆరాటం మరొకప్పుడు ఉండకపోవచ్చు. ఒకరి నుంచి ఒకరం వేరుగా జీవించలేం కనుక కలిసి చచ్చిపోవాలనుకునే వెర్రి ఆతృతతో వేగిపోయే జంట కాలక్రమేణా ఆ ప్రేమకు అలవాటు పడే స్థితికి వస్తారు. అది సహజం “ ఇది అనంత్ వివరణ. ఈ సందర్భంలోనే రాజీ వారిద్దరి మధ్య ప్రేమ అలా ఉండగానే వారికీ మరొకరి మీదకూడా ప్రేమ కలిగే అవకాశం ఉందా అని ఒక జటిలమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. ఒకరికి ఏకకాలంలో ఇద్దరిమీద ప్రేమ పురుషుడి విషయంలో పౌరాణికమైనదే . ఒక పురుషుడికి అనేక మంది స్త్రీలపట్ల ప్రేమ , అందరినీ సమంగా చూసుకున్నాడు వంటి కథనాలు శ్రీకృషుడు మొదలైన వాళ్ళ  విషయం లో ఉన్నాయి.  అలాంటి కథనాలలోని ఆత్మవంచనను, పరవంచనను కూడా ఎత్తి చూపింది మనుచరిత్ర ప్రబంధం. అదలా ఉంచి ఏక కాలంలో ఇద్దరి పట్ల పురుషుడి ప్రేమలో వ్యత్యాసాలు ఉండాటానికే వీలున్నదన్నది అనంత్ అనుభవం నుండి చెప్తాడు. జాలిని ప్రేమగా భ్రమపడటం గురించి సూచించాడు.

          అనంత్ కు పూర్వ ప్రేమికురాలైన మిసెస్ సుందర్ ను చూసాక రాజీ అనంత్ కు తనకు  మధ్య అంతులేని దూరాన్ని ఊహించుకొని బాధపడింది. తనకు అతనిపట్ల ఉన్నది వ్యామోహమా , ప్రేమా అన్న విచికిత్సకు లోనైంది. వ్యామోహం కనుక అసూయ పడుతున్నాని అనుకొంది. పెళ్లి పేరుతో అతన్ని తనకు కట్టి పడేసుకోగలను అనుకొనే భార్యకు, ప్రేమ పేరు మీద కట్టిపడేసుకోవాలనే తనకు పెద్ద తేడా లేదని దిగులుపడింది. ఆ విధమైన తర్క క్రమంలో ఒక మనిషిని మరో మనిషి ఏ పేరుతో కట్టి పడేయాలని చూసినా అది అక్రమమే అన్న నిర్ధారణకు వస్తుంది. ఆ రకంగా బంధం బంధనం కాకూడదన్న అనంత్ అభిప్రాయానికి దగ్గరగా వచ్చింది రాజీ. విద్యావంతురాలైన , ఉద్యోగంతో ఆర్ధిక స్వావలంబనను సాధించుకొన్న ఆత్మగౌరవం గల ఆధునిక మహిళగా రాజీ పెద్దలు కుదిర్చారనో , అందం, అంతస్థు చూసో కాక తన మనసును కదిలించి, తన ఒంటరి జీవితం లోకి ఆప్యాయతను, లాలనను తీసుకొని వచ్చిన  అనంత్ తో గాఢమైన అనుబంధాన్ని – సామాజిక నైతికతకు భిన్నంగా ఏర్పరచుకొనగలిగింది. అతనిని ప్రేమించకుండా ఉండటం తన శక్తికి మించిన పని అనుకొంటుంది. అతను తన దగ్గరకు వచ్చిపోవటం ఎవరికైనా తెలుస్తుందేమోనన్న శంక ఒక వైపు, బాహాటంగా అతనితో కలిసి బతకాలన్న కోరిక మరొక వైపు అందుకు అవకాశం లేక ఏది నీతి అన్న విచికిత్సలో లోలోపల సంఘర్షణ పడిన వ్యక్తి రాజీ . ఈ సంఘర్షణను తట్టుకోలేకనే కావచ్చు అనంత్ నుండి ఎంత వరకు వీలైతే అంత దూరంగా బతకాలన్న నిర్ణయానికి వచ్చింది. ఒక విమాన ప్రమాదంలో అనంత్ మరణించటం తో రాజీ జీవితంలో మరొక అధ్యాయం పూర్తయింది.

          రాజీ జీవితంలోకి రావాలనుకున్న మరొకవ్యక్తి కరుణాకర్. స్వేచ్ఛలేని సమాజంలో స్వచ్ఛమైన ప్రేమకు తావు లేదన్నది అతని అభిప్రాయం. తన తో ఉన్న పరిచయం కారణంగా ఎమర్జన్సీ కాలంలో పోలీసులు రాజీని  నిర్బంధించి వేధించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు.  ఏ వ్యక్తికి ముఖ్యంగా ఏ స్త్రీకి జరగగూడని అన్యాయాలు ఆమె పట్ల జరిగినా స్థైర్యం కోల్పోని రాజీ పట్ల గౌరవాభిమానాలు. ఆరాధన అతనికి. అందుకనే  ఎమర్జన్సీ తరువాత ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాధికార పగ్గాలు చేపట్టిన జనతాపార్టీ కార్యదర్శిగా బాధ్యతలలో ఉంటూ  ఆమెతో పెళ్లి, సహజీవనం తనకర్తవ్యంగా  భావించాడు. తనకు సంబంధించిన ఎమర్జన్సీ కాలపు రికార్డు చూసి , తనకు జరిగిన అన్యాయానికి పరిహారంగా పెళ్ళికి సిద్ధపడి గౌరవకరంగా వ్యక్తం చేసిన కరుణాకర్ ను సున్నితంగానే రాజీ తిరస్కరించింది. ఎమర్జన్సీ లో తనలా అన్యాయాలకు , అత్యాచారాలకు , హింసకు బలైన ప్రజలు  ఎందరో ఉన్నారు. నిజానికి  వాళ్లలో చాలామంది కన్నా తాను పడిన హింస ఎక్కువ కాదు. ప్రభుత్వాధికారంలో ఉన్న పార్టీ ముఖ్యడుగా అతను  ప్రజలపట్ల  కర్తవ్యాన్ని సరిగా నిర్వహించగలిగితే తనపట్ల కూడా నిర్వహించినట్లేనని సున్నితంగానే అయినా ఖచ్చితంగా చెప్తుంది. అంతవరకే ఆమె జీవితంలో అతని ప్రమేయం.

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.