యాదోంకి బారాత్-2

-వారాల ఆనంద్

వేములవాడ-కొన్ని వెంటాడే దృశ్యాలు

          అయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆటవిడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు ముందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మా వూరు కరీంనగర్. తాతయ్య డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ సత్యమ్మ. ఎక్కడో మహాబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి వేములవాడ వచ్చి అక్కడి దేవస్థానంలో మొట్టమొదటి వైద్యాధికారిగా సేవలందించిన తాతయ్య కొల్లాపూర్ లో రాచరిక భూస్వామ్య వ్యవస్థ ముందు తల ఒగ్గ లేక వేములవాడ వచ్చినట్టు విన్నాను.

          ఆ విషయాలు తాతయ్యను ఎప్పుడు అడిగినా చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవాడు. నేను కరీంనగర్లో కార్ఖానాగడ్డ, గంజ్ స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు పరీక్షలు అవుతున్నప్పుడు తాతయ్యకు ఉత్తరం రాసేవాడిని  ఫలానా రోజుతో పరీక్షలయి పొతున్నాయని. సరిగ్గా ఆ రోజు పగటీలికల్లా  తాతయ్య కరీంనగర్లో మా మిఠాయి దుకాణం ఇంట్లో దిగేవాడు. అనేక మంది పిల్లలతో మున్సిపల్ స్కూలులా వుండే మా ఇంట్లో అందరికీ ఐస్ ఫ్రూట్లు ఇప్పించి నన్ను తీసుకుని వేములవాడ బయలు దేరేవాడు. అట్లా దాదాపు స్కూలు సెలవులన్నీ వేములవాడలోనే గడిచేవి. అక్కడి మిత్రులు దేవాలయ వాతావరణం నా బాల్యం లో భాగం అయిపోయారు.

          అమ్మమ్మ తాతయ్యలకు తమ కూతుళ్ళ పిల్లలంటే ఎంత అభిమానమంటే వాళ్ళని ఏమయ్యా అనేవాల్లె గాని అరేయ్ ఒరేయ్ అని పిలిచే వాళ్ళు గాదు. అమ్మమ్మయితే ఆడబిడ్డల కొడుకులను అరేయ్ అంటామా అని అందరి ముందూ అనేది. అదే మా ప్రసాద్ బావని మాత్రం అరేయి ప్రసాదూ అని పిలిచేది. అదీ అప్పటి పెద్దల అభిమానాలూ ఆదరణలూ.

          తాతయ్య వేములవాడ దేవస్థాన మొట్టమొదటి వైద్యాధికారి. దేవాలయ వెనకాల కట్టమీద ఆసుపత్రి నివాసమూ వుండేదని చెప్పేవారు. అక్కడే అనేక ఏళ్ళు గొప్ప సేవా తత్వంతో సేవలందించిన ఆయన ఆజానుబాహువు. ముఖంలో గంభీర్యంతో కూడిన చిరునవ్వుతో అందరి ఆదరణకూ పాత్రుడయ్యేవారు. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ లో 1960 ప్రాంతంలో లైబ్రేరియన్ గా పనిచేసిన శ్రీ శ్రీరంగా రావు గారు ఇటీవల నాతో మాట్లాడుతూ మీ తాతయ్య ఎంత అందగాడనుకున్నావు కట్టమీద నడుస్తుంటే ఎవరికయినా గౌరవంగా పలకరించాలనిపించేది. నేనూ తన దగ్గర నా చిన్నప్పుడు వైద్యం చేయించుకున్నాను అన్నాడు. అంతేకాదు ప్రైవేట్ గా ఆసుపత్రి తెరిచి ఆయన చేసిన సేవ గురించి దవాఖాన్ల అమ్మమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. (అవన్నీ మరెప్పుడయినా పంచుకుంటాను)  

          నాకయితే ఆర్ద్ర రాత్రి అపరాత్రి అనకుండా మందుల పెట్టె పట్టుకుని కాన్పులు చేయడానికి ఆపదలో వున్న వాళ్లకు వైద్యం చేయడానికి వెళ్ళిన ఆయనే గుర్తొస్తాడు. అట్లా వేముల వాడలోనే కాదు చుట్టూ పక్కల అనేక గ్రామాల్లోని ఆపన్నులకు ఆయన అందించిన సేవల్ని ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాలపాటు స్మరించుకున్నారు. చిన్నపిల్లలు మొదలు వృద్ధుల దాకా ఆ కాలంలో ఆయన చేతి కషాయం, దగ్గు మందు, దగ్గు పొట్లాలు వాడని వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి.

          ఆ మహానుభావుడి యాదిలో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు.

          వ్యక్తిగతమయినవి కాకుండా వూరి పరంగా సామాజిక పరంగా నన్నువెంటాడుతున్న మూడు దృశ్యాల్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

          1) తాతయ్య ఉదయాన్నే లేచి బావి వెనకాల చెట్లకు నీళ్ళు పారించి పిల్లల స్నాన పానాదులతో గడిపి గ్లాసెడు చాయ్, నోట్లో పాన్ బిగించి తన స్టాండర్డ్ డ్రెస్ లాల్చీ పైజామాలు ధరించి  ఆసుపత్రికి బయలు దేరేవాడు. అప్పుడప్పుడు నేనూ వెంట వుండే వాడిని. తాను ఇంటి గడప దాటింది మొదలు ఆయనకు కుడిచేయి దించే అవకాశం వుండేది కాదు. తాతయ్యా నమస్తే, తాతా నమస్తే అంటూ బడి పిల్లలూ ఆడుకునే పిల్లలూ ఆయన్ని పలకరిస్తే అందరికీ ప్రతిగా నవ్వుతూ చేయి ఊపుతూ దగ్గరికి వచ్చిన వాళ్లతో చేతులుకలపడం చేసేవాడు. ఇక పెద్ద వాళ్ళయితే ‘దండాలయ్యా’, నమస్తే డాక్టర్ సాబ్, అయ్యా దండం పెడ్తున్నా అనేవాళ్ళు ఇంకొందరు, అందరికీ బదులిస్తూ అందరినీ పలకరిస్తూ తాతయ్య ఆసుపత్రికి చేరే సరికి ఎంతో సమయం పట్టేది. నిజంగా ఒక మనిషి అంత మంది ఆదరణను ప్రేమని పొందడం అపురూపం. ఆ దృశ్యం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది. మనిషి కనిపిస్తే ముఖం చాటేసి వెళ్ళే ఈ కాలం లో అది అపురూప దృశ్యమే.

          2) ఇక రెండవది రాజ రాజేశ్వరుని  ‘సేవ’. ప్రతి దసరాపండుగ రోజు సాయంత్రం  వేములవాడ దేవస్థానం ఆధ్వర్యంలో రెండు సేవలు (దేవుని పల్లకీలు) బయలుదేరేవి. శివకేశవుల సేవలు అవి. ఆలయంలో బయలుదేరి జమ్మి చెట్టు నిలబెట్టే స్థలానికి చేరి ఇక అక్కడి నుంచి వూరు ఊరంతా అన్ని వీధులూ తిరిగి ఆలయానికి వచ్చేవి. ఆ రెండు సేవలూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందుకు వచ్చి అక్కడ గౌరవంగా నిలబడేవి. అప్పటికే అమ్మమ్మ తో సహా అనేక మంది మహిళలు హారతులు పట్టుకుని నిలబడేవారు. మేము పిల్లలమంతా సేవల కింది నుంచి అటూ ఇటూ దూరి పరుగులు తీసే వాళ్ళం. అదొక అద్బుతమయిన దృశ్యం. దేవుని సేవలు ఒక వ్యక్తి ఇంటి ముందు నిలబడడం ఒక అపురూపమయిన విషయం. ఆ ఆనవాయితీ తాతయ్య ఉన్నంత కాలం కొనసాగింది.

          ౩) ఇక మూడవది తాతయ్య అంతిమ యాత్ర. బహుశా నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని వెంటాడే దృశ్యం అది. అనారోగ్యం తో హైదరాబాద్ ఆసుపత్రిలో తన అంతిమ శ్వాస విడిచిన ఆయన అంతిమ యాత్ర వేములవాడలో మొదలయినప్పుడు వేములవాడ వూరు ఊరంతా ధుఃఖమే. రోదించని వాళ్ళు లేరు. అంతిమ యాత్ర ముగిసే వరకు దేవాలయ ప్రధాన ద్వారం మూసేసారు. ఊరంతా బందు. అంతిమ యాత్ర సాగినంత మేరా ఇళ్ళ ముందు పిల్లా పెద్దా అంతా తమ ఇంట్లో మనిషి పోయినట్టు రోదిస్తున్న దృశ్యం నా కళ్ళల్లో ఇప్పటికీ మెదుల్తూనే వుంది. ఇది కదా ఒక మనిషికి మహానుభావుడికి ప్రజలు ఇచ్చే నివాళి. గౌరవం.

          జయహో తాతయ్యా జయహో డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం జయహో.

          కన్నీళ్ళతో ఇక ఏమీ రాయలేను’

***

          “ఒక ప్రాంతం అక్కడి మనుషులు తన కేమిచ్చారు వారి నుంచి ఏమి స్వీకరించాం అన్న విషయంలో మనుషులందరికీ సోయి స్పష్టత వుండాలి , అంతేకాదు దానికి బదులుగా ఆ ప్రాంతానికి ఆ ప్రజలకు తిరిగి ఏమిచ్చామన్న బాధ్యత కూడా తెలిసి వుండాలని” నేననుకుంటాను. అది కూడా ఎలాంటి స్వార్థ రాజకీయ లాభాపేక్ష లేకుండా. 

          ఖచ్చితంగా అలాంటి సోయి తో భాద్యతతో వున్న మహానుభావుడు మా తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం అని నేను విశ్వసిస్తాను. దానికి ఆయన జీవిత కాలం లో చేసిన అనేక పనులు సాక్షీబూతంగా నిలుస్తాయి. వాటికి  సంభందించి  ఓ మూడు అంశాల్ని ఈ వారం మీతో పంచుకుంటాను.

***

          ఇటీవల వేములవాడ గురించి ముఖ్యంగా డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం గురించి నాకు తెలిసిన నాలుగు అనుభవాలు నాలుగు మాటలు రాయడం మొదలు పెట్టాక ఎంతో మంది మిత్రులు ఆత్మీయులు ఆయనతో తమ అనుభవాల్ని మాధ్యమాల్లోనూ వ్యక్తిగతంగా నాతోనూ పంచుకుంటున్నారు. అద్భుతంగా వుంది. ఒక మనిషి ఈ లోకం నిండి వెళ్ళిపోయి దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆయన్ని గుర్తు చేసుకుంటూ వుంటే ఆ తరం మనుషులు తమ నిబద్దతతో తమ సమకాలీన సమాజాన్ని, వ్యక్తుల్ని ఎంతగా ప్రభావితం చేసారో తెలుస్తుంటే నిజంగా మనసు ఆనందంతో ఉరకలు వేస్తున్నది. అలాంటి వారు ఈ లోకం లో తిరుగాడి నప్పుడే వారి చరిత్రను నిక్షిప్తం చేయాల్సివుండే. నిజం మాట్లాడుకుంటే మనకు ఆ స్పృహ తక్కువే.

          కొల్లాపూర్ మూలాలున్న కవి శ్రీ ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ కొల్లాపూర్ ఆ రోజుల్లో పెద్ద సంస్థానమని రాజా వారి కోటలో ఏనుగలు గుర్రాలు ఉండేవని  అన్నారు. రాజా వారికి మంచివారనే పేరే వుండేది, కాని రాజవ్యవస్థ ఒకటి వుంటుంది కదా బహుశా అది నచ్చకే డాక్టర్ గారు కొల్లాపూర్ వదిలి వచ్చి వేములవాడలో స్థిరపడి ఉంటారన్నారు. ఇంకా వివరాలు తెల్సుకోవాలి అని ఆయన ఉత్సాహపడ్డారు.

          ఇక ప్రముఖ సామాజిక కార్యకర్త అధ్యాపక సంఘాల్లో విశేషంగా కృషి చేసిన మిత్రుడు శ్రీ ఆర్.చంద్రప్రభాకర్ మాట్లాడుతూ మీకు గుర్తుందో లేదో మా చిన్న చెల్లెలు సుబ్రమణ్యం గారింట్లోనే పుట్టింది అన్నారు. తాము అప్పుడు శాత్రాజుపల్లె లో ఉండే వారమని ప్రసూతి కోసం డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఇంట్లోనే గది ఇచ్చారన్నారు. చెల్లెలు అక్కడే పుట్టిందని అన్నారు. అంతే కాదు అప్పుడు అందరమూ చిన్న వాళ్ళమే కదా మీ గుణక్క మీరు కలిసి నాకూ నా పెద్ద చెల్లెకు వేములవాడలోని నగరేశ్వరాలయం, పోచమ్మ గుడి మొదలు అన్నీ తిప్పి చూపించారని ప్రభాకర్ చెబితే చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. మరిచిపోయిన అందమయిన అనుభవాలు తిరిగి మననంలోకివస్తే ఉరకలు వేసే మానసిక స్థితి వర్ణించలేనిది. ఇట్లా ఎందరో ఎన్నో అనుభవాలు చెబుతున్నారు.

***

          ఇక ఇప్పుడు వేములవాడ లో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆ వూరికోసం చేసిన ఎన్నో పనుల్లో నాకు తెలిసిన మూడు అంశాల్ని మీతో పంచుకుంటాను.

1) వేములవాడ హై స్కూల్:

          పిల్లలు చదువు కుంటేనే ఎదుగుతారని భద్రయ్య బడి తర్వాత వేములవాడలో ఉన్నత పాఠశాల లేక పోవడంతో పై చదువుల కోసం సిరిసిల్లా, కరీంనగర్ వెళ్ళడం గమనించిన తాతయ్య వూర్లో పెద్దల్ని సమీకరించి వేములవాడలో హై స్కూల్ ఏర్పాటుకు నడుం  బిగించారు. ఆ కృషి ఫలితంగా స్కూల్ ఏర్పాటు కావడం తర్వాత అది కాలక్రమంలో ఎదిగి జూనియర్ కళాశాల కావడంతో వేములవాడనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.

2) సత్రం:

          వేములవాడ పోలీస్ స్టేషన్ దగ్గరలో శామ్కుంట చేరువలో తాను స్వయంగా నిర్మించిన సత్రం ఎంతో మంది అనాధలకు ఎన్నో ఏళ్ళపాటు నీడనిచ్చింది. మా ఇంటి ముందే వుండేది చిన్నప్పటి నుంచీ చూసాను ఎంత మందికి అది గూడులాగా  ఉండిందో అని ప్రముఖ కవి జర్నలిస్టు శ్రీ పి.ఎస్.రవీంద్ర తన అనుభవాలని వివరించారు

౩) ప్రజాబావి:

          ఇక శాంకుంట పక్కన తాతయ్య తవ్వించిన బావి అనేక దశాబ్దాలపాటు యాత్రికులకు చట్టు పక్కల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చిందో చెప్పలేం.

          ఇట్లా ఇవ్వాళ చూస్తే ఎవరికయినా అవి చిన్న పనులే అనిపించవచ్చు కాని అయిదు/ఆరు దశాబ్దాల క్రితం ఆయన ఎలాంటి రాజకీయ ఆర్ధిక లాభాపేక్ష లేకుండా చేసిన సేవలు విశేషమయినవి. ఆయనెప్పుడూ సర్పంచ్ కావాలనో ఎం.ఎల్.ఎ కావాలనో అనుకోలేదు. అది ఆయన గొప్పతనం.

          ఆయన వెళ్లిపోయిం తర్వాత ఆయన ఇంటి ప్రాంతాన్ని ‘సుబ్రహ్మణ్యం నగర్’ అని నామకరణం చేసి ఆ వూరు ఆయన్ని గౌరవించుకుందనే చెప్పుకోవాలి. 

          వైద్యుడిగా ఆయన అందించిన సేవలు సామాజికంగా చేసిన కృషి డాక్టర్ సుబ్రహ్మణ్యం తాతయ్యను చిరస్థాయిగా నిలబెడతాయి.

          ఇప్పుడు నేను ఆయనకు ఏమివ్వగలను తలవంచి నివాళి అర్పించడం తప్ప.

***

వేములవాడ: ‘లయ’ ఓ మినీ కవితా ప్రవాహం

          70 వ దశకం చివర 80వ దశకం తొలి రోజుల్లో తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత ఓ ఉప్పెన. దాదాపు ఆనాటి యువకవులంతా మినీ కవితా రచనలో మునిగి పోయారు. మరో వైపు కందుర్తి లాంటి వాళ్ళు మినీ కవితని అంగీకరించలేదు. అనేక వాదాలూ వివాదాలూ నెలకొన్నాయి. ఆ నేపధ్యంలో వేములవాడ పోయెట్రీ ఫోరం నుంచి వెలువడిన అయిదుగురు యువ కవుల సంకలనం ‘లయ’ (‘RHYTHM’). అందులో జింబో, వఝల శివ కుమార్, పి.ఎస్.రవీంద్ర, అలిశెట్టి ప్రభాకర్, వారాల ఆనంద్ రాసిన మినీ కవితలున్నాయి. అప్పుడు లయకు మంచి స్పందనే వచ్చింది. ప్రస్తుతం నా దగ్గర లేవు గానీ మంచి సమీక్షలూ వచ్చాయి. అట్లా లయ ఈ అయిదుగురు కవులకూ గొప్ప లాంచింగ్ పాడ్ అనే చెప్పుకోవచ్చు.

***

          “కవిత్వం మన జీవన విధానానికీ, జీవిత సంఘర్శనలకీ ప్రతిస్పందన”

          “ఎక్కడ సమస్యలుంటాయో అక్కడ సంఘర్శన వుంటుంది, అక్కడ కవిత్వమూ వుంటుంది, ఆ సంఘర్షణలకు “లయ”గా ఈ సంకలనం మీ ముందుకు తెస్తున్నాం”  అని ప్రకటించి ఈ సంకలనాన్ని తెచ్చాము. నిజానికి ఇది ఒక పరిణామ క్రమంలో జరిగింది. అప్పటికి అంటే 1978 ముందు వేములవాడలో నటరాజ కళానికేతన్ పేర ఒక సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో నేనూ సెలవుల్లో వచ్చినప్పుడు పాల్గొన్నప్పటికీ కరీంనగర్లో వుండే వాడిగా దాదాపు ఔట్ సైడర్ పాత్రనే పోషించాను. విలక్షణంగా జరిగిన ఆ కార్యక్రమాలు ఇంకా వివరంగా రికార్డ్ కావల్సే వుంది.

          ఇక 1978 నేనూ జింబో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరడం తను లా లోనూ, నేను ఆర్ట్స్ కాలేజీలో లైబ్రరీ సైన్సు లోనూ చేరడం, అక్కడ OSMANIA WRITERS CIRCLE తో సహా అనేక మంది మిత్రుల సహచర్యం మాకో కొత్త ప్రపంచాన్ని చూపింది. మా ఆలోచనా అవగాహానా విస్తృతి అనూహ్యంగా పెరిగింది(OSMANIA  విశేషాలు మరోసారి రాస్తాను). మిత్రులందరినీ కలుపుకుని   ఆ నేపధ్యంలో రాసిన మినీ కవితలతో సంకలనం తేవాలి అని ఆలోచించాము. నేను అప్పటికే కోర్సు పూర్తి చేసి మొదట మంథనిలో తర్వాత ఏప్రిల్ 1980లో సిరిసిల్ల జూనియర్ కాలేజీలో చేరిపోయాను. రవీంద్ర ఫోటో స్టూడియో ఏర్పాట్లల్లో, శివకుమార్ పై చదువులకు జబల్పూర్ వెళ్ళే ప్రయత్నాల్లోనూ వున్నారు. జింబో భరత్ భూషణ్ తీసిన ఫోటో, శేఖర్ తో లెటర్స్ రాయించి పుస్తకానికి కవర్ పేజీ ప్రింట్ చేయించాడు. ఇక ఇన్నర్ పేజీల కోసం భాద్యత నేను తీసుకుని సిరిసిల్లా లోని ఒక ప్రెస్ లో అచ్చు. బైండింగ్ పనులు చూసాను. అట్లా లయ వెలుగులోకి వచ్చింది. అప్పటికే కరీంనగర్లో శిల్పి స్టూడియోతో మాకు సన్నిహితుడయిన అలిశెట్టి లయలో భాగస్వామ్యానికి  అంగీకరించాడు. అట్లాగే మితృడు జూకంటి జగన్నాధం కూడా మొదట లయతో వున్నాడు.     

          అప్పుడు మొదలయిన కవుల్లోంచి అలిశెట్టి సెలవంటూ లోకం నుంచి వెళ్ళిపోగా ఇప్పటికీ జింబో, వఝల శివకుమార్ , పి.ఎస్. రవీంద్ర, వారాల ఆనంద్ సృజనాత్మక రంగంలో వుండడం, అందరూ దాదాపు అప్పటి అదే ఉత్సాహం కలిగి వుండడం నాకెంతో సంతోషంగా వుంది.

          లయలోని కొన్ని కవితల్ని ఇక్కడ ఇస్తున్నాను 1980ల నాటి ఈ మినీ కవితల్ని చదవండి

***

“బతుకు”           

నే చచ్చిపోతాననే కదూ

నీ బాధ

పిచ్చివాడా

ఈ వ్యవస్థలో మనం బతికింది

తొమ్మిది మాసాలే”

-జింబో

***

“వేదనా గీతం”

మాకు మీలా సేఫ్టీ లాకర్లల్లో
వసంతాల్ని బంధించడం చేత కాదు
వ్యధల్ని గుండెల్లో బంధించుకోవడం తప్ప

మాకు వెన్నెల్లో రమించడం తెలీదు
సూర్యుడిలో వెన్నెల్ని కోరుకోవడం తప్ప

ఊహా విహాసయంలో గంధర్వ
విపంచి వినిపించదు
పేగుల తీగల వేదనా సహిత గీతం తప్ప

కారణం
మీరు మా చెమటని
మేం మా ఆకల్నీ తిని బతుకుతాం

-వఝల శివకుమార్

***

“రాత్రి చనిపోయింది”

వర్షం భోరున ఏడుస్తోంది
అప్పుడే వెళ్ళిపోయాడు చంద్రుడు
నాకేమిటని

గాలి వీస్తోంది
నేనున్నాని
సూర్యుడు తొంగి చూస్తున్నాడు
మబ్బుల తెర అడ్డం వస్తుంది
నేను అప్పుడే లేచి చూసాను
చనిపోయింది ఎవరా అని

ఆలోచిస్తే తెలిసింది
చనిపోయింది రాత్రేనని

-పి.ఎస్.రవీంద్ర

***

“రీప్రింట్”

ఈ సమాజం
అచ్చు తప్పులున్న
ఓ గొప్ప పుస్తకం

ఇప్పుడు కావాల్సింది
తప్పొప్పుల పట్టిక
తయారు చేయడం కాదు

ఆ పుస్తకాన్ని
సమూలంగా
పునర్ ముద్రించడం జరగాలి

-వారాల ఆనంద్

***

“ఉనికి”

అలా
సమాధిలా
అంగుళం మేరకన్నా
కదలకుండా పడి వుంటే ఎలా

కొనాళ్ళు పోతే
నీ మీద నానా గడ్డీ మొలిచి
నీ ఉనికే నీకు తెలిసి చావదు

-అలిశెట్టి ప్రభాకర్

          అట్లా లయ కవితా సంకలనం నా యాదిలోనూ తెలుగు కవితా ప్రపంచంలోనూ మిగిలిపోయింది.

***

          అయితే లయ కవితా సంకలనం వస్తున్న తరుణంలో జరిగిన ఓ పరిణామాన్ని నేనిక్కడ గుర్తు చేసుకోకుండా ఉండలేక పోతున్నాను. ఇది నా భావోద్వేగమే కాదు చారిత్రకంగా రికార్డ్ కావాల్సిన అంశంగా భావించి రాస్తునాను. ఎవరి మీదా కోపం కానీ వ్యతిరేకత కానీ నాకులేవు, ఇతర లయ మిత్రులకూ లేక పోవడం సృజనాత్మక సంస్కారంగా నేను భావిస్తున్నాను.

          లయ సంకలనం లో ఎవరెవరి కవితలు ఉండాలి అని చర్చ జరుగుతున్నప్పుడు దాదాపు చివరి దశలో అనుకుంటాను జూకంటి జగన్నాధం  ఒక ప్రస్తావన తెచ్చాడు అదేమంటే అల్లం నారాయణ అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ ఆయన రాసిన గొప్ప కవిత్వాన్ని లయలో చేర్చాలన్నది ఆ ప్రతిపాదన. నారాయణ పట్ల ఆయన కవిత్వం పట్ల మిగతా అందరికీ ఇష్టమే అభిమానమే కానీ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఉద్యమ కవిత్వానికి మిగతా వాళ్ళం  రాస్తున్న కవిత్వానికీ రూపంలో కానీ ఇతరత్రా కానీ కుదరదు. కనుక చేర్చడం సమంజసం కాదని అన్నాము. దానితో ఏకీభవించని జూకంటి లయ నుంచి తాను కూడా వైదొలుగుతానన్నాడు.  దాంతో అప్పటికే కవర్ పేజీ వెనకాల అచ్చయిన పేర్లల్లోంచి జూకంటి పేరును తీసేయాల్సి వచ్చింది. అందుకు అందరం బాధపడ్డం. కానీ ఎవరి అభిప్రాయాన్నయినా  గౌరవించాలి కదా.

          కానీ ఇందాకే చెప్పినట్టు లయ తర్వాత కూడా ఎప్పుడూ అందరమూ స్నేహంగానే వున్నాం. ఎవరెన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని అవార్డులు తీసుకున్నా ఎంతగా ఎదిగినా ఇప్పటికీ కూడా అంతా ఆప్యాయంగానే వుంటాం.

ఇదీ మా లయ.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.