ఇలాభట్

 -నీలిమ వంకాయల

    మార్పు కు నాయకత్వం వహించి, పేదరికాన్ని పారద్రోలడంలో భాగస్వామ్యం తీసుకుని, ఒంటి సత్తువ అమ్ముకున్నా పూట గడవని మహిళా కార్మికులను అక్కున జేర్చుకుని అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమ స్ఫూర్తి  ప్రదాతగా నిలిచిన సేవామూర్తి ఇలాభట్.

    మహాత్ముని జననంతో పవిత్రమైన గడ్డ అహమ్మదాబాద్ లో 1933లో  ఇలాభట్ జన్మించారు. ఇలా తండ్రి సుమంత్ భట్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.  ఆమె తండ్రి న్యాయవాది. ఆమె తాతగారు డాక్టరు. ఆయన ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని జైలుకెళ్ళారు.  ఆమె  సూరత్‌లోని సర్వజనిక్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఎంటీబీ ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఆంగ్ల సాహిత్యములో పట్టభద్రులయ్యారు. 1951లో  కళాశాలలో చదువుతున్నప్పుడు  భారత ప్రభుత్వం దేశమంతటా జనాభా లెక్కలు నిర్వహించింది. ఒక ఉద్యమంలా సాగిన ఆ జనగణనలో ఇలాభట్ స్వచ్ఛందంగా పాల్గొన్నారు.  ఆ సమయంలో తనకు పరిచయం లేని మరో ప్రపంచాన్ని సమీపం నుంచి దర్శించారు. కడుబీదల, నిరుపేదల కష్టాలను ప్రత్యక్షంగా పరికించారు. బ్రతుకు బండిని లాగలేక  గ్రామసీమల నుంచి  పట్టణాలకు వలస వచ్చిన నిర్భాగ్యులను  ఆమె చూశారు.  పచ్చడిమెతుకుల్నే పరమాన్నంగా భుజిస్తున్న  చాలా మంది దినసరి మహిళా కార్మికుల దుర్భర దారిద్య్రానికి ఆమె చలించారు.  ఆ విధంగా సామాజిక అవగాహన పెంచుకుని తన జీవితాన్ని బడుగు వర్గాల సంక్షేమానికే అర్పించాలని ఆనాడే నిర్ణయించుకున్నారు.  

    డిగ్రీ పూర్తి అయ్యాక అహ్మదాబాద్  లో  ‘లా’ చదివి,  1954లో  ‘లా’ పట్టాఅందుకున్నారు. తర్వాత కొద్ది కాలం ముంబయి మహిళా యూనివర్శిటీ లో ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసారు. ఆ ఉద్యోగం ఆమెకు  సంతృప్తి ఇవ్వలేదు. మాతృభూమి పట్ల మక్కువ తో   అహమ్మదాబాద్ తిరిగి వచ్చారు. న్యాయవాద వృత్తిని చేపట్టాలని  నిర్ణయించుకున్నారు. 1955లో INTUC అనుబంధ సంస్థ  టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్ (TLA) అని పిలువ బడే టెక్స్‌టైల్ కార్మికుల యూనియన్‌ సభ్యత్వం తీసుకున్నారు.1917లో మహాత్మాగాంధీ  ప్రారంభించిన సంఘం అది. ప్రపంచంలోనే ఆ యూనియన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  తమ ఇళ్ళు, ఊళ్ళు వదిలి కూలీలుగా వచ్చిన వారి భద్రత కోసం ఇలాభట్  పని చేయడం ప్రారంభించారు.  వారికి ఎలాంటి సామాజిక భద్రత కానీ,  కార్మికులుగా ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు గాని లేవు.  వారి పరిస్థితులను చూసి ఆమె చలించిపోయారు.  ఆ లేబర్ అసోసియేషన్  న్యాయ విభాగంలో జూనియర్ లాయర్ గా చేరారు. లాయర్ గా రాణిస్తున్న ఆ రోజుల్లోనే 1956 లో సూరత్ కళాశాలలో తన సమకాలికుడు, విద్యార్థి నాయకుడు రమేష్ భట్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.  రమేష్ భర్త గా ఆమెకు  తోడు నీడగా ఉంటూ ఆమె ఆశయ సాధనకు అన్ని విధాలా తోడ్పడ్డారు.  

    కార్మిక సంక్షేమానికి ఇలాభట్ చేస్తున్న కృషిని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.  గుజరాత్ వర్శిటీ లో ఉపాధి కల్పనాధికారి  గా 1961 లో నియమితులయ్యారు.  ఈ సమయంలో  తన దార్శనికత తో ఎందరికో మార్గనిర్దేశం చేసారు. వాస్తవానికి చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం అనేది పగటి కల వంటిది అని తెలియజెప్పారు.  స్వయం ఉపాధి బాట లో సాగమని నిరుద్యోగులను ప్రోత్సహించారు. యువతను ఎండమావుల వెంట పరుగుపెట్టడం ఆపి వాస్తవ ప్రపంచంలో నిలబడేలా చేసారు. వారికి వృత్తివిద్యలలో శిక్షణ ఇప్పించారు.  1968 వరకు ఆమె ఆ వర్శిటీ లో వివిధ హోదాల్లో కొనసాగి ఉన్నత స్థానం చేరుకున్నప్పటికి  కార్మిక సంక్షేమం కోసం ఉద్యోగం వదిలి ఉద్యమ బాట పట్టారు. తరువాత ఆమె  TLA మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు.  

    మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరు పొందిన  అహమ్మదాబాద్ లో కార్మికులు కష్టాల కడలి లో మునిగిపోయేవారు. ఆ సమయంలో కొత్త టెక్నాలజీ వల్ల వస్త్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. గుర్తింపు లేని సేవలు చేస్తున్న ఎందరో మహిళలు ఉపాధి కోల్పోయారు. ఇలా మహిళాకార్మికనేత గా ఈ సమస్యలకు పరిష్కారం కోసం శ్రమించారు.  వారి సంక్షేమం కోసం కొత్త మార్గాలు వెతకడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో TLU మహిళా కార్మికులకు భద్రత కల్పించాలని INTTUC సంకల్పించింది. ఇజ్రాయిల్ దేశంలోని ట్రేడ్ యూనియన్ లను కార్మికుల స్థితి గతులను అధ్యయనం చేయడం కోసం  INTTUC తరపున వెళ్లారు.. అక్కడ ఆర్థో  ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లేబర్ అండ్ కో ఆపరేటివ్ లో మూడు నెలల పాటు విస్తారంగా అధ్యయనం చేసారు.  మహిళలందరికి ట్రేడ్ యూనియన్ల సభ్యత్వం ఇస్తూ ఉపాధి కల్పిస్తున్న ఇజ్రాయిల్ లోని  పారిశ్రామిక విధానాల పట్ల ఆమె ఎంత గానో ప్రభావితులయ్యారు. ఆ విధానాలను భారతదేశంలో చిరు ఆదాయం కలిగిన ఎందరో మహిళలకు అమలు చేయాలని, ఉపాధి భద్రత కల్పించాలని సంకల్పించారు. వారిని సమైక్య పరిచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని 1972 లో ఇలాభట్ ఒక మహోన్నత సంస్థకు శ్రీకారం చుట్టారు.  సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (SEWA)  అనే స్వయం ఉపాధి మహిళా సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా మహిళా కార్మికులకు భద్రతకల్పించాలనే తన ఆశయ సాధనకు ఆమె కృషి చేసారు. కూరగాయలు, చీపుళ్ళు, పూలు అమ్మేవారు, పాలు పోసేవారు ఇలా అన్ని వృత్తుల మహిళలు ‘సేవా’ సంస్థ పరిధి లోకి వచ్చేటట్లు చేసారు. లక్షలాది  అసంఘటిత మహిళలు తమ జీవితంలో కొత్త చిగుళ్ళు మొలకెత్తుతాయని ఆశ తో స్వయం ఉపాధి మహిళా సంస్థ లో సభ్యులు గా చేరారు. అసంఘటిత మహిళలను  ఒక చోటకు చేర్చి వారికి  ప్రాధమిక విద్య మొదలుకుని అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం వరకూ రాజకీయ చైత్యన్యం లో భాగంగా నేర్పారు. తమ సమస్యలను తామే చట్ట సభల ముందు, మంత్రులు కలెక్టర్ ల వద్దకు ప్రతినిధులుగా వెళ్ళి చెప్పుకోవడం నేర్పారు. చివరకు భట్ యొక్క కృషి వల్ల  వారిలో భద్రత భావం వచ్చాక  తమంత తామే చదువుకోవాలి అని కోరుకోసాగారు. భట్ వారి కొరకు ‘జీవనశాల’  అని రాత్రి పాఠశాల పెట్టి అక్షరాలు చదవడం, లెక్కలు వేయడం నేర్చుకునేలా చేశారు. ఎన్నో శ్రమల కోర్చి చిరు ఆదాయం గడిస్తున్నప్పటికి మహిళలు వెనుకబడి ఉండటానికి కారణాలు అన్వేషించారు. వారు గడించే ఆదాయం అంతా వ్యాపారులకు వడ్డీలకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని అర్ధం చేసుకున్నారు.  వారిని వడ్డీల బాధ నుంచి విముక్తి చేయడానికి ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు. స్వయం ఉపాధి ద్వారా అల్పాదాయం గడిస్తున్న మహిళలే డిపాజిట్ దారులు గా 1974 లో ది మహిళా సేవా బాంక్ ను నెలకొల్పారు. స్థాపించిన మొదటి సంవత్సరము లోనే మూడులక్షల మూలధనం సేకరించి బ్యాంక్ ను దానిద్వారా ఎందరో మహిళల జీవితాలను నిలబెట్టారు. స్వల్ప వడ్డీతో రెండువేలకు మించని ఋణాలు ఇచ్చేటట్లు ఏర్పాటు చేశారు. డిపాజిట్స్ వేగంగా పెరిగాయి. మహిళలకు గృహనిర్మాణాలకు కూడా ఋణాలు ఇచ్చి వారి సొంత ఇంటి కల నిజమయ్యేలా చేశారు. ఈ విధంగా వారికంటూ ఏర్పాటు చేయబడిన కో ఆపరేటివ్ బాంక్ వల్ల మహిళలు వడ్డీవ్యాపారుల విషవలయం నుంచి బయట పడ్డారు.  

    మహిళల కోసం బ్యాంక్  నెలకొల్పడం భట్  విజయపథం లో మొదటి మలుపైతే రాజ్యసభ సభ్యురాలిగా నియమించబడటం మరొక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు.  ఆ హోదాలో ఆమె మహిళాసాధికారతకు చెందిన జాతీయ కమిషన్ లను కలిసి ఎన్నో సహాయక చర్యలు చేపట్టారు. “శ్రమశక్తి” సంస్థ ను స్థాపించడం తన జీవితంలో మరొక మలుపు గా ఆమె భావిస్తారు. సేవా సంఘ సభ్యుల ఆరోగ్యం, విద్య కోసం అనేక పథకాలు ప్రారంభించారు. చిన్న వ్యాపారులను క్రుంగదీసే మరొక సమస్య పోలీసుల జులుం. భట్ పోలీసులు వసూలు చేసే మామూళ్ళ ను ఎదుర్కోవడానికి మహిళలంతా అనేక ఉద్యమాలు చేపట్టాడానికి ప్రోత్సహించారు. ఇలాభట్ నాయకత్వం వల్ల గుజారాత్ లోని చిన్న వ్యాపారులు సాధించిన మరొక విజయం తోపుడు బళ్ళ వ్యాపారం చట్టబద్ధమైనదని గుర్తింపు తెచ్చుకోవడం. వీధి దుకాణాదారులకు భద్రత కల్పించటం పై ఆమె దృష్టి సారించారు. వీధి దుకాణాలు సామాన్యజనులకు అందుబాటులో ఉంటాయి. అందుకే వీధి దుకాణదారుల హక్కుల కోసం ఆమె పోరాడి వారి హక్కులు వారికి వచ్చేలా చేసి గెలిచారు.

    ఇలాభట్ అవిశ్రాంత కృషి వల్ల SEWA సంస్థ ఎదుగుతూ ఆరులక్షల మందికి పైగా సభ్యులుగా మారి ప్రయోజనాలు పొందుతున్నారు. మూడు లక్షల రూపాయిల మూల ధనం తో ప్రారంభమయిన మహిళా సేవా బాంక్ కోట్ల రూపాయల మూలధనం సంపాదించే స్థాయి కి  చేరుకుంది. నిరక్షరాస్యులుగా ఉండే సభ్యులు కంప్యూటర్ అక్షరాస్యులు గా మారేటట్లు కృషి చేశారు. తద్వారా వారి ఉత్పత్తులను ఆధునిక సాంకేతిక మాధ్యమాల సహాయంతో తమ ఉత్పత్తులను ప్రపంచమంతా విక్రయాలు జరుపుతున్నారు. ఇలాభట్ అసంఘటిత మహిళా కార్మికుల గురించి తదుపరి రోజుల్లో అంతర్జాతీయ వేదికల పై ప్రసంగించడం మొదలుపెట్టారు. అంతర్జాతీయ సంఘాల స్థాయి కి SEWA సంస్థను తీసుకుని వెళ్లారు. అయితే ఆమె ఎప్పుడూ తమ ఆ సంస్థను తన వ్యక్తి గత ఆస్తి గా భావించలేదు. కేవలం సామాజిక ప్రయోజనాలకోసమే తాను ఆ సంస్థ అభివృద్ధి కి కృషి చేశానని ఆమె చెబుతుండేవారు. చివరకు ఆ సంస్థ ద్వారా మహిళలలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపారంటే ఆ సంస్థలో మహిళలు చేపట్టే ఉద్యమాల్లో తోడ్పాటు ఉంటుందనే ఆలోచనతో పురుషులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని తలచినప్పుడు పురుషుల పెత్తనం తమకు అవసరం లేదని  ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.  

    అసంఘటిత  మహిళలను సంఘటితం  చేసి వారిని చైత్యన్యవంతులుగా  చేయడం కోసం ఇలాభట్  సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలను అందుకున్నారు. 1977 లో ఫిలిప్పైన్స్ రామన్ మెగాసెస్ ఫౌండేషన్ కమ్యూనిటీ లీడర్‌ షిప్‌ కేటగిరీ కింద మెగాసిస్ అవార్డు ను ప్రకటించింది. భారత ప్రభుత్వం 1984 లో పద్మశ్రీ , 1986 లో పద్మ భూషణ్ పురస్కారాలతో గౌరవించింది. 2001 లో హార్వర్డ్ యూనివర్శిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 2003 లో ఎకనామిక్ టైమ్స్ అవార్డు, 2004 లో ఉత్తమ కార్యనిర్వహణకు గుర్తింపుగా లాల్ బహుదూర్ శాస్త్రి పురస్కారం, అదే సంవత్సరం లో FICCI మిలీనియం  జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2010 లో జపాన్ దేశపు ప్రతిష్టాత్మక పురస్కారం నివానో పీస్ ప్రైజ్ లభించింది. ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయి  లో అనేక హోదాల్లో పని చేశారు. అమెరికా లోని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ కు ట్రస్టీ గా ఉమన్స్  వరల్డ్ బాంక్ వ్యవస్థాపకురాలిగా, ఇంటర్నేషనల్ ఎలయన్స్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ కు చైర్ పర్సన్ గా సేవలందించారు. భారత ప్రభుత్వ  ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 2011లో గాంధీ శాంతి బహుమతి సైతం ఆమె అందుకున్నారు. 2007లో ఆమె నెల్సన్ మండేలా స్థాపించిన ఎల్డర్స్ అనే గ్రూప్‌లో చేరి మానవ హక్కులు, శాంతిని పెంపొందించడానికి కృషి చేశారు. అసంఘటిత మహిళా కార్మికుల కోసం అంతర్జాతీయ కార్మిక సమావేశంలో ఆమె ప్రవేశ పెట్టిన  తీర్మానం ILO సభ్యులు మారు మాట్లాడకుండా హర్షధ్వానాలతో ఆమోదించడం విశేషం. 

    మహిళ కేవలం ఉత్తమ గృహిణి గా మిగిలిపోవడం మినహా  మానవత్వమున్న మహోన్నత మూర్తి గా తీర్చిదిద్దాలనే తన కలను సాకారం  చేసుకోవడానికి అనితర సేవలనందించి మహిళలను విజయపథం వైపు నడిపించిన ఇలా భట్ నవంబర్ 2, 2022 న దివగంతులయ్యారు. అయితే కూటి కోసం, గూటి కోసం పరితపించే లక్షలాది అసంఘటితుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.