
నీహార పథం – భాగం-1
తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 3
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
పెద్దవాళ్లు అంటే ముఖ్యంగా అమ్మా బాపులు తెల్లవారుఝామున 3.30 , 4 గంటల వరకే లేచి పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వ్యవసాయానికి ‘వెంకటేశ్వర్ల బావి’, ‘ఇరుకు బావి’ ఊళ్లోనే ఉండేవి.’కుంట ముందర బావి’ హనుమకొండ హైదరాబాద్ హైవే దగ్గర కొచ్చేరి వాగు పక్కన ఉండేది. 1950 లలో కావచ్చు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ రైల్వే లైన్ మా రేగడి భూములమధ్య నుండే వేశారు. ఇవుతల రేగడి, అవుతల రేగడి అనేవాళ్లు. ఇవతల రేగడి అమ్మ తన సొంత డబ్బులతో కొనుక్కున్న భూమి. అక్కడ కూడా పంటలువేయిస్తుండేది. అంతంత దూరాలు నడిచే వెళ్లి వచ్చేది. వడ్లు పండే పొలాలను ‘తరి పొలాలు’ అని ,మొక్కజొన్న, కందులు, జొన్నలు వంటివి పండేదాన్ని ‘చెల్కలు’అని అంటారు. మాకు భూస్వాములన్న పేరే గాని పంటలు పండడం, రాబడి రావడం కష్టంగా ఉండేది. కుటుంబ బాధ్యతలూ ఎక్కువే. మా బాపు తదుపరి జీవితమంతా అంటే, తన ఎం. పి. పదవి తర్వాత, కొన్నేళ్లు గ్రామ సర్పంచ్ గా చేసినా ఎప్పుడైనా, కొత్త కొత్త వంగడాలనూ, కొత్త పంటలనూ పండించిన వ్యవసాయదారునిగానే ఉన్నారు.
మనందరికీ తెలుసు బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం వచ్చిందికానీ,హైదరాబాద్ స్టేట్ కి నిజాం కబంధహస్తాల నుంచి విముక్తి లభించలేదు. ఈ రాజ్యం పై నిబంధన ఉన్నది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాడు. ఇతణ్ణే ఏడవ నిజాం రాజు అంటారు. భారత ప్రభుత్వం పోలీస్ చర్య ద్వారా నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకుని 1948 సెప్టెంబర్ 17 న ఒప్పందం కుదుర్చుకోవడంతో రాచరిక పాలన అంతమైంది. ఈ విజయాన్ని సాధించడానికి తెలంగాణ ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో కలిపేయాలని కమ్యూనిస్టులు నిజాం వ్యతిరేక పోరాటాలు చేశారు. 1952 లో మొదటి ఎన్నికలు జరిగాయి. 1952- 57 వరకు M.P గా ఉన్నారు. మా బాపు పెండ్యాల రాఘవరావు 1921లో ప్రారంభమైన ఆంధ్ర మహాసభ నుండి మొదలుకుంటే 1923లో ప్రారంభమైన ఆర్య సమాజం నుండి మొదలుకుంటే ఇక ఎప్పుడు ప్రజా పోరాటాల లోనే ఉన్నారు. 1935 -36 Conversion movement వ్యతిరేకించినందుకు బ్రిటిష్ ప్రభుత్వం 300 రూపాయల జరినామా విధించి ఖైదీ చేసింది. ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటాలు ముమ్మరమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అతివాదులు మితవాదులుగా విడిపోయి కమ్యూనిస్టులుగా ఏర్పడిన తర్వాత మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీ లో చేరి వరంగల్ జిల్లాకు నాయకత్వం వహించారు. ఈ సేవా కార్యక్రమాల వల్ల ఉద్యమాల వల్ల వల్ల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అజ్ఞాతవీరుడిగా సాయుధ పోరాటాలు చేసి, తెలంగాణ రైతాంగ పోరాటాలకు సారధ్యం వహించి, మూడుసార్లు జైలు పాలైన కార్యసాధకుడు. అందుకే 1952 ప్రప్రథమ సార్వత్రిక ఎన్నికల సమయంలో మహారాష్ట్ర జాల్నా జైల్లో మూడున్నర ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. జైలు నుంచే నామినేషన్ వేసి, ఏ ప్రచారాలూ లేకుండానే P.D.F.పార్టీ తరఫున నిలబడి అద్వితీయమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండు M.L.A స్థానాలను ఒక ఎంపీ స్థానాన్ని గెలిచారు. అప్పుడు ఆయన ఎవరిమీద గెలిచాడో తెలుసా? మన ప్రముఖ కవి కాళోజి నారాయణరావు గారిపైన ! ఈ విషయం కాళోజీ గారే నాతో స్వయం గా ఈ విషయాన్ని చర్చిస్తూ, బాపు గురించి ఎంతో గొప్ప గా చెప్పారు.
మా బాపు రెండు ఎమ్మెల్యే సీట్లకు రిజైన్ చేసి, వరంగల్ M.P. పదవిని చేపట్టారు. ఢిల్లీ లో ప్రధాని నెహ్రూ కు ప్రతిపక్ష పార్టీ హోదాలో నాయకుడుగా, ప్రజల గొంతుక గా ఐదేళ్లు పూర్తి స్థాయిలో సేవలు అందించారు. మేం మా నాన్నగారి ఇలాంటి రాజకీయ జీవిత ప్రళయ ప్రభంజనాల గొప్ప కాలాన్ని, చూడలేదు. కానీ వారి ప్రజానుబంధాల జీవితాన్ని కొంత చూసాం. మా బాపు ప్రజా నాయకుడు జైలు నుంచే ఎన్నికల్లో గెలిచిన ధీరుడు. రెండు ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానం గెలిచి చివరికి వరంగల్ ఎంపీగా సేవ చేసిన నాయకుడు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మహనీయుడు.
మా ఇల్లొక సత్రం లా, ఒక దైవ సన్నిధి లా, ఒకానొక అభ్యుదయ భావాల వేదికగా ఉండేది. ఇవి పరస్పర విరుద్ధాలు కావని మాకు చిన్నప్పటి నుంచి అలవర్చారు. కుటుంబం విలువల పాఠశాల!
ఈ ఇన్నింటిలో మా అమ్మ పెండ్యాల కౌసల్యాదేవి గారు మా నాన్నగారి తోబాటు ప్రతి దశలోనూ ఉన్నారనడం అతిశయోక్తి కాదు. అమ్మ బాపుల పెళ్లి బాపు ఎం.పి.గా ఉన్నప్పుడు ఢిల్లీ లోని పార్టీ ఆఫీసులో ఆదర్శ వివాహం జరిగిందట. ఆనాటి నుంచి ఆయన నీడలా మరెందరికో నీడనిచ్చే చెట్టు లా మా అమ్మ ఉండేది. నేను 1963 డిసెంబర్ లో పుట్టాను. నాకు అక్కయ్య కు ఓ రెండున్నరేళ్ల తేడా. నా తర్వాత తమ్ముడు ఏడాదిన్నర కు పుట్టాడు. వాడే అందరిలో చిన్నవాడు.
నాకు గుర్తున్నంతవరకు ఆ తొలినాళ్లలో నా చిన్నతనంలో చూసిన అనుభవాలలో మా అమ్మ ఒక దేవత! దేవతలెలా ఉంటారు? మనం చూసామా? లేదు. కానీ ఒక దివ్య భావన…. ఒక భవ్య భావన! మంచితనపు స్వభావానికీ, పరోపకార గుణాలకు ప్రతిరూపం. మా అమ్మ లో ఈ లక్షణాలతో పాటు ఓపిక, సహనాల మృదు స్వభావానికి ప్రతిరూపమూ ఉండేది.
బాపు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా చాలా ఏళ్లుగా రాజకీయ నాయకులు చాలా మంది వచ్చిపోయేవాళ్ళు. కొన్ని తడవలు వేడి వేడి చర్చలు జరిగేవి. ఒక్కోసారి ఓ పది మంది కార్యకర్తలతో బాపు దిగేవారు. అప్పటికప్పుడు అందరికీ వంట చేసి పెట్టేది అమ్మ. గ్యాస్ స్టవ్లు లేవు గ్రైండర్లు లేవు మిక్సీలు లేవు హెల్పర్లు లేరు అమ్మ అలా అలవోకగా , కట్టెల పొయ్యిల మీద అంత త్వరగా ఏమాత్రం విసుగు లేకుండా ఎలా కమ్మని వంట చేసేది ? ఆశ్చర్యం మావంతయ్యేది! ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే పని చేయాలి మగ పిల్లలు చేయకూడదు అనే నియమాలు ఏవి ఎన్నడూ లేవు. అయినా మాకు పనులేవి చెప్పేది కాదు. తనే చేసుకునేది. మమ్మల్ని కోప్పడడాలు, తిట్టడాలు ఎన్నడూ లేదు. వేరే వాళ్లమీద చాడీలు చెప్పడాలు దుర్భాషలాగడాలు ఎప్పడూ చూడలేదు. ఇటువంటి సుగుణాలు ఆమెలో చాలా ఉన్నాయి.
మా గ్రహస్థులలో ఆడవాళ్లెవరూ పొలాల వైపు వెళ్లరు. అలాంటిది మా అమ్మ అలా బావుల దగ్గరికి , చెల్కల దగ్గరికీ వెళ్లి వ్యవసాయం చేయించేది. చాలా కాలం క్రితం తన నగలను అమ్మి, పిండి గిర్నీ, వడ్ల గిర్నీని పెట్టిందట . ఒక పని అబ్బాయి పనిచేస్తుండేది. అమ్మ మధ్య మధ్యలో గిర్నీ కి వెళ్లి చూసుకునేది. ఏదో డబ్బులు సంపాదించాలన్న పేరాశతో కాదు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు గిర్నీ లేక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ ఘనపూర్ కి వెళ్లి వడ్లు పట్టించుకోవాల్సిన రావడం అనే క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో పెట్టింది. నార్మల్ వేజెస్, తక్కువ తీసుకోవడం అనే పద్ధతే ఉండేది.
ఇంట్లో ఎంతో మందిమి. ఎప్పుడు చూసినా బంధుగణం వస్తూ పోతూ ఉండేది. వాళ్ళ భోజనభాజనాది విషయాలూ తనే పట్టించుకోవాలి. మేము బడికి వెళ్లాలంటే మాకు వంటచేసిపెట్టేది. మమ్మల్ని పంపించాక, నాయనమ్మ వాళ్లకి మడి కట్టుకొని వంట చేసి పెట్టేది. దేవత సినిమా లో సావిత్రి పాత్ర లా అనుకోండి!
*****
( ఇంకా వుంది )

ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం .
