చిత్రం-77

-గణేశ్వరరావు 

ప్రకృతి మానవ చిత్రీకరణ: బెవ్ డూలిటిల్ ( Bev Doolittle)

ఈ చిత్రంలో ఒక ఒంటరి రౌతు సామాను మోసే గుర్రంతోపాటు కొండ రాళ్ళ మధ్య నుంచి వాగులో పోతూ, ఆదివాసీలు దాక్కున్న ప్రాంతం చేరుతాడు. తన చుట్టూ పెరుగుతూ వస్తూ ఉన్న దట్టమైన చెట్ల వైపు చూస్తాడు. అవి అతన్ని తమ కౌగిలిలో బందిస్తున్నాయా అన్నట్టు కమ్మున్నాయి భయం అతన్ని ఆవహిస్తుంది, ‘అడవికి కళ్ళున్నాయి ‘ అని అనిపిస్తుంది.

అమెరికా సంస్కృతికి సంబంధిన చిత్రం ఇది. అమెరికన్లు స్థానికులని తరిమేశారు. చిత్రంలోని ఈ చారిత్రిక నేపథ్యాన్ని పక్కన పెడితే – ఈ చిత్రంలో చిత్రకారిణి బెవ్ డూలిటిల్ తన నైపుణ్యం (Camoflague technique) కనబరచింది. తన బొమ్మలో ఎన్నో బొమ్మలను గుప్తంగా ఉంచింది. అష్టావధానంలో సమస్యాపూరణంలా .. ఈ రకమైన సమస్యాత్మక చిత్రాలు అందరినీ ఆకర్షిస్తాయి. అమెరికా రౌతు కదలికను కొన్నిజతల ఆదివాసుల కళ్ళు రహస్యంగా గమనిస్తున్నాయి ! మీరు గుర్తించగలరా ఆ కళ్ళని? ప్రయత్నించండి. దూరం నుంచి.. జాగ్రత్త గా పరిశీలిస్తే .. చిత్రంలో 13 మొహాలు కనిపిస్తాయి.

డూలిటిల్ దంపతులు అర్ధ శతాబ్దం క్రితం తమ హనీమూన్ ఒక అటవీ ప్రాంతంలో గడిపారు. ఇన్నాళ్ళకి మళ్ళీ అక్కడికి చేరారు. ప్రకృతి వాళ్ళని రారమ్మని పిలిచింది. పట్నవాసం ఆ దంపతులకి నచ్చలేదు. ప్రకృతి అందాల మధ్య గడపాలనుకున్నారు. అందుకే తమ ఉద్యోగాలు వదులుకున్నారు. . ప్రయాణాలకి అవసరమైన సామాను సర్దుకున్నారు. బండి మీద బయలు దేరారు. ఆ బండికి చేత్తో రాసిన ‘ప్రయాణించే కళాకారులు చిత్రించిన ప్రపంచ చిత్రాలు’ అన్న అట్ట బిగించారు. . తామెంచుకున్న జీవన విధానం వాళ్ళ చిత్ర కళపై ప్రభావాన్ని కనబరచింది.

ప్రతి రోజూ బొమ్మలు వేయగలిగే నైపుణ్యం, క్రమశిక్షణ వారు అలవరచుకున్నారు. తమ అవసరాల కోసం తమ చిత్రాలను దక్షిణ అమెరికా నగరాల వెంట బోతున్నప్పుడు మాల్స్ లో అమ్మసాగారు. తోవలో ఎదురుపడ్డ వారు ఆసక్తి కనబరిస్తే, వారికి కూడా ఎంతో కొంత ధరకి ఇచ్చేసేవారు. అయినా వాళ్ళు ‘ఆకలి ఆర్టిస్ట్లు’ గా ఉండిపోయారు, ఒక వారాంతం 45 బొమ్మలు అమ్ముడయినా, వారికి దక్కింది కేవలం 700 డాలర్లే! 1979 లో విజయం వారిని వరించింది. ఒక పేరు పొందిన ప్రచురణకర్త వారి సచిత్ర గ్రంథాన్ని ప్రచురించడానికి చిత్రాలని కొనుగోలు చేసాడు. ఆ గ్రంథంలో అన్నీ ఇలా మనల్ని మభ్య పెట్టే చిత్రాలే!

‘మభ్య పెట్టే ప్రక్రియ ‘ లో చిత్రించే వారి చిత్రాలు అందరినీ ఆకర్షించడం మొదలు పెట్టాయి. బెవ్ డూలిటిల్ కు తన బొమ్మలతో జనాన్ని ఎవరికీ హాని కలిగించని ‘మోసం ‘ చేయడం అంటే సరదా! తన చిత్రాలు – చూసే వారికి మార్గదర్శకత్వం వహిస్తాయి, తన బొమ్మలు వారికి కథలు చెబుతాయి అని అంటారు ఆమె. . అందుకే బొమ్మల్లో దాక్కున్న మరిన్ని బొమ్మలు వేయడానికి ఆమె ఇష్టపడతారు. నిజానికి అదెంతో కష్టమైనా పని. వాటికో లక్ష్యo ఉంది.. నిర్జన ప్రాంతాలకి ఆమె చిత్రాలు జనాన్ని తీసుకొని వెళ్తాయి , స్థానికులకి ప్రకృతితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని వివరిస్తాయి. దృశ్యం మాద్యమం ద్వారా మనుషులకి – నింగీ నేలతో ఉన్న అనుబంధాన్నిచెబుతూ – మనకు ఒక తాత్వికత దృక్పథం కలిగిస్తాయి అవి.

*****

Leave a Reply

Your email address will not be published.