నా అంతరంగ తరంగాలు-6

-మన్నెం శారద

మాచర్ల…!
దాని అసలు పేరు మహాదేవచర్ల అని నాకు చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన చక్రపాణి మాస్టర్ గారు చెప్పారు. నాకప్పుడు ఆరేళ్లయిన మాస్టారి మొహం స్పష్టంగా గుర్తుంది. మాచర్లని ఎవరన్నా హేళనగా మాట్లాడితే మాస్టర్ గారు భాస్వరంలా మండిపడేవారు.
అందుకే శ్రీనాథుడంటే ఆయనకు వళ్ళు మంట!

          ఆయన పల్నాడు మీద రాసిన చాటువులు కొన్ని చెప్పి మండిపడి “అందుకే అలాంటి శిక్ష అనుభవించాడు అనేవారు. వాటిలో ఒకటి రెండు గుర్తున్నాయి.
1. చిన్న చిన్న రాళ్లు, చిల్లర దేవుళ్ళు
నాగులేటినీళ్లు నాప
రాళ్లు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులునుదేళ్లు
పల్లెనాటిసీమ పల్లెటూళ్ళు.

2. జొన్న కలి, జొన్న యంబలి
జొన్నన్నము జొన్న పిసరు,జొన్నలు తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ బలినాటి సీమ ప్రజలందరికీన్!

          నిజానికి అప్పట్లో ఆఁ ప్రాంతం అలానే ఉండేది. ఎటు చూసినా పాములు, తేళ్ళు, మండ్రకప్పలు, కాళ్ల జెర్రెలు.. ఎంత దారుణమంటే ఒక వస్తువు పెట్టిన పది నిముషాల్లో దానికింద తేలో , మండ్ర కప్పో ఉండేది.

          మూడు సంవత్సరాలు మా నాన్నగారు అక్కడ పని చేసినా మేము వాటి వాత పడకుండా మా అమ్మా నాన్నా మమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడేరు.

          మొదటి సారి పల్నాడు లోంచి రైలు వెళ్తుంటే మేం ఆ వూళ్లు చూసి చాలా ఏడ్చాం.
అయితే మాచర్ల నాకు చాలా నచ్చింది. మట్టి రోడ్లయినా అటూ ఇటూ వున్న చింత, వేప, రావి ఎత్తయిన వృక్షాలు ఒకదానితో మరొకటి పచ్చని పందిరిలా అల్లుకుపోయి నీలా కాశాన్ని జల్లెడ పడుతుండేవి.

          ఊరిని అర్ధ చంద్రాకారంలో చుట్టుకుని పారుతున్న చంద్రవంక, వంక దాపులో వున్న చెన్నకేశవ స్వామి ఆలయం, దగ్గరలో ఉన్న ఎత్తిపోతల జలపాతం, నాగార్జున కొండ,… నల్లమల అటవీ ఛాయలు అంతటా కనిపిస్తుండేవి.

          మాయింటికీ ఎదురుగా మండాది అనే పల్లెటూరుకి వెళ్లే రోడ్డుండేది. ఆఁ ప్రాంత మంతా చుట్టూ ఆకు పచ్చని తివాసీ మీద పసుపు ఆరబోసినట్లు విరబూసిన తంగేడు పూలు! వినాయక చవితికి పత్రి అంతా నేనే తెచ్చేదాన్ని. నిజంగా మాచర్ల గురించి చెప్పా లంటే నాకు ఒక ఎపిసోడ్ చాలదు. 

          నా తెలిసీ తెలియని అల్లర్లకు, మానస వికాసానికి, అనుభూతులకు, పట్టుకొమ్మ మాచర్ల! ఇవన్నీ నేను నా బాల్యం గురించి రాసిన “చిగురాకు రెపరెపలు “లో వివరించాను. అక్కడే నాకు బొమ్మలు వేయాలన్న కోరిక, రచనల పై ఆశక్తి, డాన్స్ మీద మమకారం ఏర్పడ్డాయి. అయితే మాచర్ల పక్కన వున్న పల్లెటూర్లలో తెగ హత్యలు జరుగు తుండేవి. ఆ వార్తలు విన్నప్పుడు చాలా భయం వేసేది. 

          ఒకసారి ధర్మవరం అనే పల్లెటూరులో ఘోరమైన హత్య జరిగింది. వాళ్ళు అన్న దమ్ములేనట. ఎవరిదో తల నరికి అన్నగారు తమ్ముడి ఇంట్లోకి విసిరేడట! తమ్ముడు తిరిగి అన్న ఇంట్లోకి ! ఆలా దాదాపు పోలీసులు వచ్చే రెండుమూడు గంటల వరకు బంతాటలా ఆడు కున్నారు. అప్పుడు మాచర్లలో ఒక క్రిస్టియన్ లేడీ డాక్టర్ ఉండేవారు .
పేరు సుగుణ అని గుర్తు !ఆమె మా నాన్నగారికి ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్ అట ! ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలోనే క్వార్టర్స్ లో ఉండేవారు. నాకు బాగా గుర్తుంది , హాస్పిటల్ ఆవరణ చాలా నిర్మానుష్యంగా ఉండేది. అక్కడొకటి అక్కడొకటీ విసిరేసినట్లు క్వార్టర్స్ ఉండేవి ‘అప్పట్లో మాచర్లకు ఎలెక్ట్రీసిటీ కూడా లేదు .

          పోస్టుమార్టం రిపోర్ట్ తమకు అనుకూలంగా ఇవ్వమని లేకుంటే చంపేస్తామనిరెండు పార్టీలు వత్తిడి చేయడంతో ఆమె బెదరిపోయి మా ఇంట్లో ఉంటానని రిక్వెస్ట్ చేసింది. మా క్వార్టర్ పెద్దది కావడంతో ఆమెకు ఒక గది ఇచ్చారు అమ్మానాన్నా కలిసి. అలా ఆమె మా ఇంట్లో ఒక ఆరేడు నెలలు వున్నారు. మా పిల్లల్ని కూర్చోబెట్టుకుని ధర్మా మీటర్ టెంపరేచర్ చూడటం ,స్టెత్ లోని సౌండ్స్ కి అర్ధాలు చెప్పడం …ఇలా ఏదోకటి … చెబుతుండేవారు .

          కానీ రోజూ పోలీసులు ఏవో గాజు సీసాలు తీసుకుని వచ్చి మా ఇంటి ఎదురుగా వున్న వేపచెట్టు క్రింద కూర్చునేవారు. మా పెదనాన్న వలన పోలీసులంటే ఏ మాత్రం భయం లేని నేను వాళ్ళ దగ్గరకెళ్ళి “ఇక్కడెందుకు కూర్చున్నారు ?” అని అడిగేదాన్ని.

          ‘డాక్టరమ్మ గారి కోసం ” అని చెప్పేవారు వాళ్ళు .

          ఆ సీసాలో ఏంటి?”మళ్ళీ నా ప్రశ్న .

          “వాడెవడో పెళ్ళాం ముక్కూ చెవులూ కోసినాడులే !”

          ఆ జవాబు విని నేను నివ్వెర పోయేదాన్ని .

          “అదేంటి ….ఎందుకూ ?”

          “ఏదోలేమ్మా పోయి డాక్టరమ్మకి మేం వచ్చినామని చెప్పు !”

          “చెప్పాలంటే నాకు ముందు అవి చూపించు “

          “వద్దు తల్లీ ,భయపడతావ్ “

          చివరకు చూపించే వరకు నేను వదిలేదాన్ని కాదు .

          అలా ఒకరోజు చేతులూ, కాళ్ళూ ,,,వస్తుండేయి. పగలు వాటిని చూడ్డం, రాత్రి భయపడటం…

          ఆమె ఆఫీసర్స్ క్లబ్ లో మెంబర్ ! మా నాన్న క్లబ్ సెక్రెటరీ ! ఆమె రోజూ బాడ్మింటన్ ఆడటానికి క్లబ్ కి వెళ్ళేవారు. నిజంగా నాకు ఇక్కడ ఎలా రాయాలో కూడా తెలియడం లేదు. కావాలని బంతిని ఆమె గుండెలకు తగిలేలా బేటింగ్ చేసి నవ్వుకునేవారట.
చూడటానికి అందరూ చదువు కుని జాబ్స్ చేస్తు న్నవాళ్ళే…

          అంతటితో ఆగక “ఏంటి ‘సీతారామయ్య గారూ.. కథ.!”అని వ్యంగ్యంగా జోక్స్ వేసేవారట. (ఇవన్నీ మేం కొంచెం పెద్దయ్యాక తెలిసిన సంగతులు )

          మా నాన్నను నిజంగా సీతారాముడే అనేవారు అందరూ. కానీ వుంటారుగా అక్కడక్కడా నీచ మానవులు! దానితో నాన్న తప్పని పరిస్థితుల్లో బాధ పడుతూ ఆమెకు అమ్మ చేత చెప్పించారట. ఆమె అర్ధం చేసుకుని లాంగ్ లీవ్ లో గుంటూరు వెళ్లిపోయారు.
వెళ్ళేటప్పుడు ఒక వెండి ట్రే లో అమ్మకు చీర పెట్టి థాంక్స్ చెప్పారు. మాకు మంచి బొమ్మలు కొనిచ్చారు.

          “పిల్లల్ని బాగా చదివించు సీతారామయ్యా, బాగా తెలివైన వాళ్ళు “అని చెప్పడం నాకు బాగా గుర్తుంది.

          కొన్నాళ్ళు చాలా దిగులుగా అనిపించేది. సంకుచిత్వానికి, త్వరపడి చెడు మాటలు నమ్మి నిందించడానికి ఏ కాలమైన ఒకటే! అందరూ న్యాయాన్ని పరిరక్షించే జడ్జీలగా మారిపోతారు.

          చెన్నకేశవ ఆలయంలో తరచూ భోగాలు జరుగుతుండేవి. స్వామికి ఎవరో ఒకరు అలా మొక్కుకుని మొక్కులు తీర్చుకునేవారు. అందువల్ల మేం తరచూ గుడికి వెళ్లే వాళ్ళం. సన్నాయి మేళం పెట్టేవారు. పులిహోర, ఇంకేవో ప్రసాదాలు తయారు చేసి స్వామికి సమర్పించేవారు.

          Queractor గారి భార్య వెంకటలక్ష్మి గారు తమిళ్ అయ్యం గారు.. చాలా స్నేహశీలి. ఆమె చెవి డైమండ్ దుద్దులు ధగధగ లాడిపోతుండేవి. మా పెరటి వైపు ఇల్లు. నేను వీళ్ళ గోడ మీద నుండే బాదం చెట్టు ఎక్కి మా బావిలోకి తొంగి చూసేదాన్ని. అదొక ప్రహసనం.
తెల్లటి గ్లాస్కో బ్లౌజ్, కంచి చీరలు కట్టేవారు. ఆవిడ ఎక్కడికయినా వెళ్లాలంటే అమ్మని తొందర పెట్టి అమ్మ స్నానం చేస్తుంటే తనే పొయ్యిమీద కూర కలబెట్టేవారు. ‘అయ్యో వద్దండీ ‘అని అమ్మ అంటే నేనేం తినేయను లేమ్మా “అని నవ్వేవారు.

          డాక్టర్ గారి భార్య , హెల్త్ ఇన్స్పెక్టర్ గారి భార్య… ఇలా చాలా మంది అమ్మకు ఫ్రెండ్స్! అప్పట్లో భార్య, భర్త అనే పదాలు వాడటం పిల్లలకు పెద్ద తప్పు. మేం వాళ్ళని సుశీలత్త నాన్న గారు .. డాక్టర్  మామయ్య అమ్మగారు అని చెప్పేవాళ్ళం. పెద్దయ్యాక తలచుకుంటే నవ్వొచ్చేది.

          ఇక్కడే ప్రముఖ చిత్రకారుడు గుర్రం మల్లయ్య గారు నా బొమ్మలు చూసి ఫ్యూచర్ లో గొప్ప ఆర్టిస్ట్ నవ్వుతానని తన దగ్గరకి పంపితే నేర్పిస్తా నని చెప్పేరు. తర్వాత కాలం లో నాన్నకు నాగార్జునసాగర్ ట్రాన్ఫర్ అయినప్పుడుఅక్కడ మోడల్ డాం తయారు చేసింది ఆయనే అని తెలిసి ఆయన దగ్గర పెయింటింగ్ నేర్చుకోలేక పోయినందుకు చాలా బాధ పడ్డాను. ఇక్కడే స్కూల్ పక్కన మల్లెపూలబ్బాయి స్నేహం, చంద్రవంకలో ఈతలు, స్మశానంలో దయ్యాల కోసం పరిశోధనలు  జరిగాయి.

          మా బావగారు మాచర్లకు ఇంజినీర్ గా వచ్చి ఆకు పసర్లతో, దానిమ్మ పూలతో రంగులు వేసుకుంటున్న మా బొమ్మలు చూసి మొదటి సారి రంగులు, బ్రష్ లు కొనిచ్చారు.

          అలా ఎన్నో..ఎన్నెన్నో అనుభూతుల్ని,ఆనందాల్ని పంచి ఇచ్చి నా మానసిక వికాసానికి తోడ్పడిన మాచర్లని ఏనాటికీ మరువలేను గాక మరువలేను.

          I Love you Macherla ever and forever         

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.