అనుసృజన

శరీరం

హిందీ మూలం: గీత్ చతుర్వేదీ

అనుసృజన: ఆర్ శాంతసుందరి

ఇంతసేపటినుంచీ చీకటిని చూస్తున్నావు తదేకంగా
అందుకే నీ కనుపాపలు మారాయి నల్లగా
పుస్తకాలని కప్పుకున్న తీరు
నీ శరీరాన్నే మార్చేసింది కాయితంగా
మృత్యువు వస్తే
నీటికి వచ్చినట్టు
రావాలని అంటూ ఉండేవాడివి
అది ఆవిరైపోతుంది
చెట్టు మరణిస్తే
మారుతుంది తలుపుగా
నిప్పుని మృత్యువు మార్చేస్తుంది
బూడిదగా
నువ్వు మారిపో ఆవు పొదుగుగా
కురిసిపో పాల ధారలుగా
ఆవిరై నడిపించు పెద్ద పెద్ద ఇంజన్లని
అన్నం ఉడికించు
ఎప్పటికీ మూసుకునే ఉండమని
శపించబడ్డ దారికి
తలుపుగా మారి తెరుచుకో
బూడిదతో తోము
అనారోగ్యంతో పడుకున్న
అమ్మ మంచం కింది గిన్నెలని
వెలిగించు ఒక అగ్గిపుల్ల
చాలాసేపు దానివైపే చూడు తదేకంగా

*****

Leave a Reply

Your email address will not be published.