
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 28
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహం చేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ప్లోర్చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవనవిధానానికి అలవాటుపడుతూ సాగుతున్న జంటప్రయాణం.
విశాల, విష్ణుసాయి ఉగాది తెలుగుసంఘం వేడుకలకు హాజరై, తెలుగు సినీ గీత రచయిత సి.నారాయణరెడ్డిగారిని, గజల్ శ్రీనివాస్ గారిని, ఇంకా ఎంతోమంది క్రొత్త తెలుగువారిని కలుసుకుని ఆనందంగా వెనుదిరిగారు.
***
జీవితం ఒక చదరంగం. కొంతమంది విషయంలో అడుగడుగునా ఊహించని పరిణామాలు చోటు చేసుకోవచ్చును. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠభరిత క్షణాలు ఎదురవుతుంటే, ఆ సమయంలో మనిషి ఎంతో ఉద్విగ్నతకి లోను కావచ్చు. అది సంతోషమైనాగానీ, దుఃఖమైనా గానీ అవ్వవచ్చు. చుట్టూ ఓదార్చేవారు లేకపోయినా, కొద్దిపాటి సంయమనం, ఓర్పు, నేర్పుతో ఆ సమయాన్ని ఒడిసి పట్టుకుని, తనివితీరా మనసులోనే ఆ ఘడియను ఆస్వాదిస్తూ, ఇది క్షణికం, మరుక్షణం ఏమౌతుందో తెలియదు, కర్తవ్యం చేయటం మాత్రమే నా చేతిలో ఉంది. ఫలితం ఎలా వచ్చినా ఫర్వాలేదు, నేను అన్నిటిని ఎదుర్కోగలను. ఇంతదూరం వచ్చాను, అర్థాంతరంగా నా ప్రయత్నాన్ని ఆపజాలను అని మనిషి ముందుకుసాగితే, ఆపేదెవరు. విధి కూడా తలవంచి, విజయంవైపు దారి చూపెడుతుంది ఆ మానవమాత్రునకు.
విశాల తను క్రొత్తగా మొదలెట్టిన డైరీలో పేజీలు తిరగవేస్తూ, అపురూపంగా గడచిపోయిన, క్షణాలను చదువుతోంది. విష్ణు నైట్ షిఫ్ట్ డ్యూటీ కి వెళ్ళటంవలన, తీరిక సమయంలో తనను తాను మలుచుకునే ప్రయత్నంలో భాగంగా, డైరీలో తన అంతరంగాన్ని, మనోభావాలను వ్రాసుకోవడం అలవాటు చేసుకుంటోంది.
“అపుడే పెళ్ళి అయిపోయి అర్థ సంవత్సరం గడిచిపోయింది. ఎపుడూ భారతదేశంలో ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేని నేను, కనీసం పూచిక పుల్ల ఇక్కడనుంచి, అక్కడ పెట్టని నేను ఇపుడు అన్ని పనులు నాకు నేనుగా చేసుకుంటున్నాను. రాత్రిపూట ఈ దేశంలో ఒక్కదానిని ఉంటున్నాను. కాదులే నేను ఒక్కదాన్ని అని ఎందుకు అనుకోవాలి, నా ప్రక్కనే రాములవారు, సీతమ్మతల్ల్లి, లక్ష్మణ పరివారం, హనుమంతుడు ఉండగా ఒంటరిదానిని ఎందుకు అవుతాను. పాపం విష్ణు నా కోసం రాత్రిళ్ళు కష్టపడుతూ డ్యూటీ చేస్తున్నపుడు, నా ఊహలలోకీ ఇటువంటి ఆలోచనలు రానీయకూడదు. నా దశ మారకముందే, నేను చేయాలనుకున్న పనులు పూర్తి చేయాలి. మళ్ళీ నాకంటూ పిల్లలు కలిగిననాడు, బాధ్యతలు పెరుగుతాయి, కాని తరగవు.” ఇలా ఆలోచిస్తూ విశాల తను మరుసటి రోజు చేయాల్సిన పది పనులు వ్రాసుకుని, నిద్రలోకి జారుకుంది.
విష్ణు, తెల్లవారుఝామున డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకుని నిద్రలోకి జారుకున్నాడు. విశాల దైనందిన కార్యక్రమాలు ముగించుకుని, తను సబ్మిట్ చేయవలసిన ఎసైన్మెంట్ గురించి నోట్స్ వ్రాసుకుంటోంది. ఇంతలో విష్ణు మొబైల్ మ్రోగటంతో గదిలోకి వెళ్ళింది.
“విశాలా! ఫోన్ ఎవరో చూసి, నువ్వు మాట్లాడు” అని ఆమె చేతిలో పెట్టాడు విష్ణు.
అవతలివైపునుంచి, హాయ్! దిసీజ్ లీసా! రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆంగ్లలోనే ఇంకా ఇలా అంది. మీరు ఇంట్లోకి దిగి మూడు నెలలు కావస్తోంది కదా! ఇల్లు ఇన్ స్పెక్షన్ కి నెక్స్ట్ వీక్ వచ్చి చూస్తాము. గెట్ ఇట్ క్లీన్డ్ అండ్ టైడీ. ఏమైనా రిపేర్ వర్క్ ఉంటే చెప్పండి.” అని చెప్పింది.
“అమ్మో! మళ్ళీ క్రొత్తగా ఇదేంటి. క్లీనింగ్ అంటే ఎడిషనల్ గా ఏమి చేయాల్సిఉంటుంది? అని ఆలోచనలో పడింది విశాల.
విష్ణు లేచి, టిఫిన్ తిన్న తరువాత విశాల ఫోన్ ఎవరిదగ్గర్నించి వచ్చిందో విషయం చెప్పింది.
దానికి విష్ణు, “ఓ అదా! నువ్వు దానిగురించి ఏమి వర్రీ అవకు. ఇక్కడ రెగ్యులర్ చెకప్ చేయటం లీస్ కాంట్రాక్ట్ లో భాగం. బాత్రూమ్, మౌల్డ్ రిమూవల్, టాయ్ లెట్ క్లీనింగ్, వేక్యూమింగ్ ప్రొఫెషనల్ క్లీనర్ చేత చేయిస్తాను. చేయించినట్లు రిసీట్ చూపిస్తే వాళ్ళు చెక్ చేసుకుని, కాంట్రాక్ట్ ఎక్సెండ్ చేస్తారు. డోర్ నాబ్స్ మార్చమని చెప్పాలి. ఇదిగో ఇపుడే క్లీనర్ కి ఫోన్ చేసి, పిలిపిస్తాను.” అన్నాడు విష్ణు.
“అమ్మబాబోయ్! నేను ఎలాగా అని తర్జనభర్జన పడుతున్నాను. మనకి భారతదేశంలో నౌకర్లు, చాకర్లు ఉంటారు. ఇక్కడ మనకు ఎవరూ రోజు రారు కదా! అద్దె ఇల్లు అంటే మామూలు విషయం కాదు. ప్రతీది లెక్క చూస్తారన్నమాట.”
“అవును, ఇల్లు ఇచ్చేటపుడు కండిషన్ ఎలా ఉందో ఫోటోలు తీసుకుంటారు. రెంట్ బాండ్ మనీ కడతాము. ఇల్లు ఖాళీ చేసేటపుడు ఏ మాత్రం తేడా ఉన్నా, ఆ బాండ్ మనీ లోంచి తెగ్గోస్తారు. ఇలాంటి వాటిలో గొడవలు, ఏమైనా తేడాలుంటే, స్ట్రేటా ఆ సమస్యలను పరిష్కరిస్తుంది. అందుకే డబ్బు ఖర్చు ఐనా గాని,నేను ప్రొఫెషనల్ క్లీనర్ పెట్టి, క్లీన్ చేయించడానికి వెనకాడటం లేదు” అన్నాడు విష్ణు ధీమాగా.
“వావ్! యుఆర్ సచ్ ఏ సెన్సిబుల్, స్మార్ట్ మేన్, వైస్ థింకింగ్, ప్రౌడాఫ్ యు మేన్!” అంటూ విశాల విష్ణు భుజం తట్టింది.
విష్ణు, విశాల ప్రశంసకు ఆరాధనగా ఆమె కళ్లలోకి చూసాడు.
“మీకు అలసట లేకపోతే, ఇండియన్ గ్రోసరీ షాప్ లో బియ్యం, పప్పు, కూరగాయలు తెచ్చుకోవాలి, కలిసి వెడదామా?” అంది విశాల.
విశాల, విష్ణు పావుగంటలో గజానంద్ ఇండియన కిరాణా షాపు కి వెళ్ళారు. అక్కడ నోటీస్ బోర్డ్ వైపు చూస్తూ, బిజినెస్ కార్డ్ వివరాలు తన పాకెట్ బుక్ లో వ్రాస్తూ, విష్ణుకి చూపించింది.
“చూడండి మన ఇంటికి దగ్గర్లోనే క్లీనర్స్ ఉన్నారు, వీళ్ళని కనుక్కుందామా?”
“అలాగే! చూద్దాం. ముందు కావలసిన సరుకులు తీసుకో. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేద్దాము.”
విశాల, మారు మాట్లాడకుండా అక్కడ తాజాగా ఉన్న వంకాయలు, ఆనపకాయ, బియ్యం, పప్పు, పచారీ సరుకులు తీసుకుని అక్కడనుంచి బయట పడ్డారు.
ఇంటికి చేరుకోగానే, విష్ణు క్లీనర్ కి ఫోన్ చేసి, టైమ్ శనివారం ప్రొద్దున్నే రావటానికి టైమ్ బుక్ చేసాడు.
ఇంతలో విశాల ఉన్నట్టుండి, విష్ణు భుజంమీద వ్రాలిపోయింది. విష్ణు, వెంటనే విశాలని అమాంతం పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుంటూ, బెడ్ మీద పడుకోబెట్టి, మంచినీళ్ళు త్రాగించాడు.
“విశాలా! ఏమైంది? ఆర్ యూ ఓకే? డాక్టర్ దగ్గరికి వెడదామా?”
“లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అలసటగా ఉంది. నిద్ర సరిపోలేదేమో!”
“హాయిగా ఎనిమిది గంటలు పడుకోవచ్చు కదా! ఆ కోర్స్, ఈ కోర్స్ అంటూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ఇక్కడ నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరూ మనని చూసుకోవడానికి లేరు. నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు ఈ మల్టీ వైటమిన్ టాబ్లేట్ వేసుకో, నేను ఈ రోజు షిఫ్ట్ కి వెళ్ళనా?”
“విష్ణు ఇచ్చిన రెవిటాల్ టాబ్లెట్ వేసుకుంది విశాల.
“అదేమీ లేదండీ, అవును రాత్రి నాలుగు గంటలకి మించి పడుకోలేదు. ప్రొద్దున్నే వెంటనే మెలకువ వచ్చింది. మీరు నిరంభ్యంతరంగా వెళ్ళండి. మీరు వెళ్ళగానే నేను రెస్ట్ తీసుకుంటాను” అంది విశాల.
విశాల, విష్ణుకి ఫుడ్ బాక్స్ లో సర్ది, అతను వెళ్ళిపోయాక వచ్చి, తెలియకుండా అలా బెడ్ మీద వ్రాలిపోయింది. పడుకుందన్నమాటే గానీ, మనసులో ఏదో తెలియని అల్లకల్లోలం. తలంతా దిమ్ముగా ఉంది.
ఒక్కసారిగా మనసులో అధైర్యం ఆవరించించి విశాలకి.
వెంటనే తల్లికి ఫోన్ చేసింది. కానీ ఫోన్ సమాధానం రాకపోవడంతో, దిగులుగా కూర్చుండిపోయింది.
“నాకు ఇపుడు ఎవరితోనైనా మాట్లాడాలని ఉంది, ఏం చేయాలి? నా అన్నవాళ్ళు ఎవరైనా నా దగ్గరుండి, నా తల నిమిరితే ఎంత బాగుంటుంది”
మళ్ళీ ఫోన్ తీసుకుని, తల్లితో మాట్లాడదామని ప్రయత్నించింది. ఇంక లాభం లేదని, మళ్ళీ తన అత్తగారికి ఫోన్ చేసింది. అవతలినుంచి, సమాధానం రావడంతో ఎగిరి గంతేసినంత పనిచేసి, అత్తగారితో కుశల సమాచారం మాట్లాడింది. తన ఆరోగ్యం గురించి చెప్పటానికి మోహమాట పడింది. మీరు అమ్మతో మాట్లాడారా? కలిసారా? అని అడిగింది విశాల.
“ఈ మధ్య కలవలేదు కాని, మొన్న కాశీ వెడుతున్నాము అని ఫోన్ చేసి చెప్పారు. నువ్వు ఆదుర్దా పడకు. ధైర్యంగా ఉండు” అన్నారు విశాల అత్తగారు.
ఆవిడతో మాట్లాడాక కాస్త స్థిమిత పడింది విశాల గారు. ఏమిటో ఈ మధ్య అమ్మకి, నాకు దూరం పెరిగిపోతోంది. నాతో మాట మాత్రంగానైన చెప్పలేదేంటి వాళ్ళు కాశీ వెడుతున్నట్లు” అనుకుంది విశాల.
* * * * *
(ఇంకా ఉంది)

నేను సిడ్నీ ఆస్ట్రేలియా లో ఉంటాను. మా తల్లిదండ్రులు శ్రీమతి శ్రీదేవి పెయ్యేటి మరియు శ్రీ రంగారావు పెయ్యేటి గార్లు ఇరువురు రచయితలు. ప్రవృత్తి పరంగా 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో తెలుగు రేడియో కార్యక్రమాలు, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తున్నాను. వృత్తి రీత్యా ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్థానికంగా తెలుగు వాణి రేడియో కన్వీనర్ గా సేవలు అందించాను. వందకు పైగా రేడియో కార్యక్రమాలు 15 రేడియో నాటికలు దర్శకత్వం చేపట్టి ప్రసారం చేశాను. ప్రముఖులతో ముఖా ముఖి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చిన్నారులకు పాఠశాలలో religious education లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ద్వారా హిందూ మత బోధన తరగతులు తీసుకున్నాను. జాగృతి కథల పోటీలో నా కథలు బహుమతులు అందుకున్నాయి. దాదాపు ఇరవై వరకు కథలు రాసాను, కథలు, కవితలు కొత్తవి రాస్తున్నాను. నా కథలు పలు పత్రికలలో, కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు, లలితగీతాలు, పాటలు పాడతాను. పలు వేదికలకు సమన్వయకర్తగా వ్యవహరించాను. సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా వాహిని అంతర్జాల మాసపత్రికకు సంపాదకురాలు గా నాలుగు సంవత్సరాలు సేవలు అందించాను. స్థానికంగా తెలుగువాణి మరియు జనరంజని రేడియో కార్యక్రమాలు, ఇంకా అంతర్జాలంలో తెలుగువన్ రేడియోలో వారం వారం కార్యక్రమాలు చేయటం నాకు అత్యంత ప్రీతికరం. “సకల కళాదర్శిని” వేదిక స్థాపించి, “స్త్రీ హృదయం” శ్రీ పెయ్యేటి రంగారావు గారి కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ తొలి కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించాను. మున్ముందు కళా, సాహిత్యం, సాహిత్య కార్యక్రమాలు “సకల కళాదర్శిని” ద్వారా అందచేయాలని భావిస్తున్నాను. వాహిని మాసపత్రిక “సాహితీ సదస్సు” అంతర్జాల మాధ్యమం జూమ్ ద్వారా విజయవంతంగా నాలుగు గంటలకు పైగా మూడు సదస్సులు నిర్వహించాను. దాదాపు ఐదు గంటలకు పైగా విజయవంతంగా విభిన్నమైన తెలుగు అంశాలతో కొనసాగింది. ప్రపంచ తెలుగు సాంస్కృతిక వారోత్సవాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. భారతదేశంలో సాహిత్యంలో పలు అంశాలపై పత్ర సమర్పణ అందచేశాను.
