
వడలుతున్న దేహం
– యామిని కొళ్లూరు
చిన్ననాటి నుంచి తనదైన లోకం
చిగురించే ప్రతి ఋతువులా ఆశలు
చీకటి చుట్టుముట్టిన చిందించే వెలుగులు
చిన్ని కుహరములో వెల్లువలా ఆలోచనలు ….
చుట్టూ ప్రభావితం చేసిన పరిస్థితులు
చీకటి కమ్మిన విజృంభించే నీడలా కష్టాలు
చిరునవ్వు నవ్వుతూ కానరాని కన్నీటి ధారలు
చిరుదీపమై వెలుగునిస్తూ మోసే భారాలు….
అర్ధం కాదు తరచి చూసిన తన లోగిలి
అల్లంత దూరంలో ఉన్న నిండు జాబిలి
అల్లుకుపోయి తొణకని నిశ్చలమైన కడలి
అనురాగంతో ఒదిగే ఔన్నత్యపు కౌగిలి
అన్యాయపు తీగలు దేహాన్ని చుట్టుముట్టిన
అడుగడుగులో అణచివేస్తూ సంకెళ్ళతో బంధించిన
అనుభవంలో చూసిన సంఘటలే వెన్ను తిట్టిన
అసమానతలే ఎటుచూసినా నీవెంతని నినదించిన
మడతలు దేహానికే కదా మనసుకి కాదుగా
మరువలేని జ్ఞాపకాలు ఎదుటే ఓ పరుగుగా
మనసు పలికే కాలం ఆగదు క్షీణించేది దేహమేగా
మమతలు చెదరువు *వడలుతున్న దేహంతో*
మరో ఉషోదయం గుర్తించకపోయిన…..
*****

నా పేరు యామిని కొళ్లూరు. గల్ఫ్ దేశరాజధాని అబుదాబిలో వుంటున్నాను. ఇక్కడ గత పధ్నాలుగు సంవత్సరాలుగా స్వచ్ఛందంగా తెలుగు బోధిస్తున్నాను. నేను చదివిన చదువుని నలుగురికి నేడు బోధించటమే కాకుండా, ఓనమాలు నేర్పుతూ ఇటీవలి కాలంలో చిన్న కవితలు, రెండు మూడు వ్యాసాలు రాశాను. నాకు తెలుగు భాష పట్ల ఎనలేని మక్కువ, ఆ మక్కువే సాహిత్యం పట్ల ఓ అడుగు ముందుకు వేయించింది.
