బతుకు చిత్రం-15

– రావుల కిరణ్మయి

అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో  ఏమో !

సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది.

ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన మొహాలతో ఉన్న నలుగురు పిల్లలను తీసుకొని వచ్చింది. అవ్వ.

వస్తూనే, చూసినావే ..జాజులు ..!వీళ్ళ వాలకం?బురదల బొర్లిన పసువులొతికే. చెడుగుల లెక్క ఏడ వడితె ఆడ ఎగురవట్టిరి. బళ్ళు తెర్సేదాంక పటేలు కాడికి పనికన్న పంపుత. లేకుంటే చేతికచ్చేటట్టు లేరు. చెప్పితే ఇంటలేరు. కూసవెట్టి సాద నాకాడేమున్నయి. గయ్యే ఉంటే వీళ్ళ అవ్వయ్యలు నాకాడ ఈల్లను ఇడ్సి ఎందుకు పోతరు? అని బాధచెప్పుకుంటుంటే  పిల్లలు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చి,

అవ్వా !బువ్వెయ్యే. ఏన్కూరండినవ్?అన్నారు కంచాలు ముందట వెట్టుకుంటూ. అందులో అందరి కంటే పెద్దవాడు ..పొయ్యిలకు తొంగి చూస్తూ ..

అవునే !అవ్వా .! పొయ్యి అంటియ్యకుంట వంటెట్ల చేసినవే ?చుమ్మంత్రకాలి అని మంత్రం మేమన్న నేర్సుకున్నవా ?ఏంది ?అన్నాడు.

అనుకున్న ఈడు ఇంకా సప్పుడు జేత్తలేడేన్ది? అని. అనుమానం ముందు పుట్టి తరువాత వీడు పుట్టిండు.

అదిగాదే!చాట్ల బియ్యం చాట్లనే ఉన్నయ్ .నువ్వు ఏం బెడుతవని అడిగిన ,అన్నాడు.

అన్నం బెట్టక గడుక వోత్తే తాగుతార్ర మీరు?ఇగో !ఈ జాజులక్క వాల్లింటికాడ వండుకచ్చింది.కడుపునిండ తినున్డ్రి.అని నలుగురికి వడ్డించింది.

ఉన్ననాడు పెట్టవడితి, లేనినాడు ఉపాసం పండవెట్టవడుతి.ఈ ఈడున మీ గోస నాకేడ తలుగుతదో ! ఏమోరా !అని కళ్ళ నీళ్ళు దీసుకున్నది.

అయినా పిల్లలు ఇదేమీ పట్టించుకోకుండా

అక్కా …!అక్కా ..!నీ పెళ్ళట గదా!మేము రాములోరి గుడి కాడ చింత పిక్కలాదుకుంట ఉంటే అయ్యోరు గుడి కచ్చిన పక్కూరి పటేలుకు చెప్పిండు.మాకు ఇనవడ్డది.ఆయనను సుత రమ్మంటే తప్పకుండ వత్తనని పెళ్ళికి నన్ను ఏం తీసుకరమ్మంటారని ఆయన సుత అడిగిండు.

అయ్యా !ఆడపిల్ల పెళ్ళి.అన్ని అందినట్టే ఉంటయ్.తీర తక్కువవడుతయ్.అందుకని ఇదని నేనెట్లా చెప్పగలుగుత.మీరే ఏదో దయ జూడున్డ్రీ .అన్నాడు.అని పెద్ధవాడు చెప్పాడు.

వీనీయన్ని ఆరిందా ముచ్చట్లేనే.ఆటకు వొయినోడు ఆడుకొని రాక ఊరి మీది ముచ్చట్లన్ని తెచ్చి ముంగటేస్తడు.

కానిముచ్చటేమన్న చెప్పినాడే అవ్వ ,ఉన్నదేకదా!అని తలమీద చేయి వేసి నిమిరింది.

అక్కా …అక్కా …బావను మల్ల మేమే మస్తు గ ఆటవట్టించి కట్నం దొబ్బుతం.మల్ల నువ్వేమనద్దు మరి,అన్నాడు పెద్దవాడు మళ్ళీ.

నాకేమక్కర?నేనెందుకంట?బావా, బావమరుదుల పరాచికం లేకుంటే పెళ్ళి చప్పగుంటది.ఇంతకూ ఏమి జేత్తవురా?అన్నాది నవ్వుతూ జాజులమ్మ.

ఏమంటే

బావా …బావా …పన్నీరు

బావను పట్టుక తన్నేరు

వీధీ వీధీ తిప్పేరు

వీసెడు గంధం పూసేరు                                              

……………………..అని పాడుతూ కట్నమిచ్చేదాక ఇడ్సి పెట్టం అన్నాడు,పెద్దవాడు .

జాజులమ్మ ,నవ్వుతూ సరే గని ,అట్నే చేద్దురు గని ,ఇప్పుడయితే ముందుగాల బువ్వ తినుండ్రి  అన్నది.

మా మంచి అక్క,మా కోసం కోడిగుడ్డు సుతం తెచ్చింది అని సంబురంగ అన్నాడు మూడవ వాడు.

ఇట్లా పిల్లలు నలుగురూ బోజనం చేసి వెళ్ళాక ముసలమ్మ కు తానే స్వయంగా వడ్డించింది.జాజులమ్మ.

జాజీ !చూసినావె పొల్లగాండ్ల ఆత్రం? లగ్గమనగానే ఎట్ల కుషీ అయితాన్డ్లో.వాళ్ళే బామ్మర్దులమని ఫీలు గావట్టిరి.మీ అన్న ల ముందు వీల్లెంత ?వీళ్ళ బలమెంత ?అని తనది తనేనవ్వుకున్నది ముసలమ్మ.

అవ్వా!ఇప్పుడు వీళ్ళనే నా అసలు అన్నదమ్ములనుకుంట.నా తోడ బుట్టినోళ్ళు నన్ను కాదని పోయిండ్రు.ఒక్క మాటడుగుత నియతిగ జెప్పే !

ఏందే ?అది 

నీ మనుమల లెక్కన నా మేన కోడళ్ళు,అల్లుళ్ళు తిప్పల వడద్దంటే నేను వాళ్ళు తెచ్చిన ఆ కోటీశ్వరున్ని చేసుకుంటేనే బాగుండేదా ?

కోటీశ్వర్లు ఎవరే?పిల్లా ?

అయ్యో ..!నీకు అసలు ముచ్చట చెప్పనయితిని గదా!అని తన అన్నలు వదినలు ఏగిరం పెట్టుకొని వచ్చిన ముచ్చట ఉన్నదున్నట్టు చెప్పింది.

అవ్వా ..!నువ్వు కడుపుల ఉన్నది ఉన్నట్టు చెప్పే.నేను తీసుకున్న నిర్ణయం సరైనదే గదా!నా సార్థం నేను చూసుకున్ననా !వాళ్ళ బాగు కోరేదుండెనా?అడిగింది అవ్వను.

అప్పటికీ తినడం పూర్తి చేసి జాజులమ్మ తెచ్చిన గిన్నెలన్నిటినీ శుభ్రంగా కడిగి నిమ్మలంగా వచ్చి ముసలవ్వ …

జాజులూ !తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమని నీవు నీ కోసం కాక నీ అన్నల గురించి,వాళ్ళ పిల్లల గురించి ఇచారించుడు మాను.నీకు తెలువదు గని,నా బతుకు ఇట్లెట్ల అయిందనుకున్నవ్?నీ వోల్గనే నా వోళ్ళు సుత మంచిదని ,మామిడికాయని ఆయిమన్నోడని,అప్పటికే పెండ్లయి పిల్లలున్న మా ముసలాయనకు ఇచ్చి చేసిండ్రు.ఆయన మొదటి భార్యకు బాలింత రోగమేదో వచ్చి సచ్చిపోయింది.ఇగ నా పని ఈ పిల్లల చాకిరికే సరిపోయే!అడ్డాల   నాడు బిడ్డాలు గని గడ్డాల నాడు కాదన్నట్టు,లగ్గాలయెంత వరకు అమ్మా ..అమ్మా ..!అని కొంగు ఇడ్వనోళ్ళు,లగ్గాలయి పిల్లజెల్లయి ముసలోడు అవతల పడంగనే ఉన్నది పంచుకొని నాకీ ఇల్లు లాంటిది ఇడ్సి పెట్టి ఆస్తులమ్ముకొని దుబాయ్ ల మస్తు సంపాయించుకత్తమని ఇద్దరు ఒక్క తీరు అచ్చువోసినట్టే ఈ నలుగురు పొలగాండ్లను నా మీదేసి పోయిరి.మల్ల ఎన్కటి కథే ముంగట వడ్డది.పోయినకొత్తల్ల కొత్త మురిపమాని పైసలు మాగ పంపిండ్రు అపుడిప్పుడు,గని ఈ మధ్య అవి సుత బందువెట్టిండ్రు.ఏందంటే ఈడ మాకే తిప్పలయితాందే!నువ్వే పొల్లగాండ్లకు కలో గంజో పోసి సాదే అనవట్టిరి.వాళ్ళకు మా గెరికే,నేను ఉపాసం పండయిన వాళ్ళ కడుపు నింపుతనని అందుకే అట్లంటరు.నాకొక్కటే చింత,నాకేమన్నయితే ఈ పొలగాండ్ల గతేమిగాను ?ఆప్పుడన్నత్తరా!మగ పొలగాండ్లను సాదేదేందని పక్కకుంటరాని?

ఇప్పుడు నావోళ్ళు కొన్నొద్దులదాంక మా ఇంటి దేవతవు నువ్వేనని నెత్తిల వెట్టుకొని చూసుకున్నట్టే  మాట్లాడిండ్రు.కొత్త బట్ట మాపు వడ్డట్టు,వాళ్ళ పిలగాండ్లు బాగువడంగనే నా పేరు సుత ఉత్తరిత్త లేరయిరి.నా పుట్టుకే నావోళ్ళ కోసమాయేనా?అని కండ్ల నీళ్ళు తీసుకున్నది.

గందుకే జాజులు నువ్వు ఆ తప్పు చెయ్యకు.మంచోడో,చెడ్డోడో మన కడుపు మన కుండాలే.కాదు పోదంటే నువ్వు కలిగిన్నాడు ఆపతో సంపతో అంటే ఆదుకో,గని అమాంతం బరువు మీదేసుకోకు.ఇగ వాళ్ళ యవ్వారం ఇడ్సి పెట్టి నీ లగ్గం పనులు నువ్వు కానిచ్చుకో.నీ అయ్యే నీకు అన్నీ అనుకో.వాళ్ళు ఎన్నటికయినా నీకు ఎడమ చేతి లెక్కనే అన్నది యాది మరువకు అని మేలు చెప్పింది. 

ఇంకా ..

మాను పెరిగి పండ్లు చేతికందిన్నాడు …..

ఫలమునే తలుతురే తల్లీ..!మల్ల …

ఎవరూ సుత ఇత్తును  యాజ్జెయ్యరే తల్లీ….

పోషకం జేసినా మనిశెవడని మల్ల …..

మాట వరుసకన్న మారు అడగరే  తల్లీ ..

కటిక చేదుగున్న ఇదే నిజము తల్లీ …

——————————–

అని తన నోటికచ్చిన తత్త్వం పాడి వినిపించింది.

ఆమె మాటలతోనూ, పాట తోనూ జాజులమ్మ మనసు తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని బలంగా అనిపిస్తుండగా మనసు మరింత తేలిక పడగా గుడిసె చేరింది.

                                     ———————————

ఊరిలో రాములోరి కళ్యాణం పనులు చురుకుగా సాగుతున్నాయి.ఇటు ఈర్లచ్చిమి ఇంట్లో కూడా పెండ్లి పనులు మొదలు పెట్టింది.అంతకంటే ముందు ఊరి మధ్యలో ఉన్న గ్రామ దేవత ఊరడమ్మ పూజ చేసింది.

పెద్ద వేప చెట్టుకింద ఉన్న చిన్న గుడికి సున్నం వేసి,మామిడాకు,బంతిపూల తోరణాలు కట్టింది.పసుపు కుంకుమలతో అలంకరించింది. అమ్మ కు గాజులు.కొత్త చీర పెట్టింది.అడుగున బియ్యం పోసి పెద్ద మట్టి ప్రమిదల కొత్త దూది వత్తి వేసి దీపం వెలిగించింది.పూలు,పండ్లు. అగరు బత్తులు  వెలిగించింది. దట్టంగా సాంబ్రాణి తో ఊదు పొగ వేసి అమ్మకు హారతి ఇచ్చింది.  

పెళ్ళికి మూడు రోజుల ముందు నుండి దోరణపు ఆకు తేవడం,కూరాళ్ళు పట్టడం,పసుపుకొట్నాలు,తలంబ్రాల బియ్యం కలపడం,జిలుకర బెల్లం కలుపడం,గాడి పొయ్యిలు తియ్యడం,నీళ్ళు తేవడం,మయిలపోలు,ఐరోన్లు తేవడం,వాటిని అందంగా అలంకరించడం మొదలయిన పనులు మొదలు పెట్టింది. 

తాటినారను  తాడు గా పేని దానికి మామిడాకు మండలు కట్టడానికి మధునయ్యను పెద్ద మనిషిని పంపింది.ఆయన పెద్ద గంపలో సరిపడేంత ఆకును పట్టుకొని డప్పు చప్పుడు తో వచ్చాడు.పెద్ధరువాజకు,పందిరికి తనే కట్టాడు.శుభసూచకమయిన దోరణపు ఆకులు కట్టి  ఈర్లచ్చిమితో …

అవ్వా …!ఇగ నువ్వు శకునాలు,మంచి చెడ్డలు చూడకు,ఇల్లంతా కట్టి పోనా?మీరే కట్టుకుంటారా?అని అడిగాడు.

మేమే కట్టుకుంటం తియ్యే..!పెద్ధమనిషివి నీ చేత ఆకు తెచ్చిచ్చుడే నాకు మా బాగ్గెం.నా కొడుకు సంసారం కూడా గిట్లనే మామిడాకోలే,ఈ  ఈతాకు,కొబ్బరాకుల పందిరోలే పచ్చగుండాలని దీవెనార్థులు పెట్టవే అని బియ్యం,చింతపండు,మిరపకాయలు,కంది పప్పు ,ఉల్లిగడ్డ ఇచ్చి లగ్గానికి రమ్మని మరీ మరీ చెప్పింది.

లచ్చవ్వా ..!నీది మా దొడ్డ మనసు.నీ కొడుక్కు లగ్గమెట్ల అయితదని,అసలు కానేకాదని సవాళ్ళు వేసి నోళ్లందరి నోళ్ళు మూతవడేటట్టు భగమంతుడే పిల్లను చూపిచ్చి తన లగ్గం నాడే తన గుళ్ళనే జరిపియ్యబట్టే.ఇంక నీ కొడుకుకు  డోకా లేదు.మల్ల కోడలచ్చినంక కొత్త కట్నానికి మల్లత్త అనుకుంట సంబరంగా వెళ్ళిపోయాడు.అతను వెళ్ళిన దారినే చూస్తుండి  పోయింది.

మధునయ్య హస్త వాసి చాలా మంచిదని అతను దోరణం కట్టి పెళ్ళిళ్ళు తొక్కిండంటే ఇంక ఏ ఆటంకాలు రావని ఊరందరి గట్టి నమ్మిక.ఆ నమ్మకం తోనే ఇన్నాళ్ళూ ఆయన తన ఇంట ఏనాడు ధోరణం కడుతాడాని ఎదురు చూసింది.అది ఈ రోజు నెరవేరడం తో ఆమె మనసు కుదుట పడింది.

ఆడబిడ్డలు సాయంత్రానికల్లా రావడం తో ఇల్లు పెళ్ళి సందడి మొదలయినట్టు అయింది.

సైదులుకు ఇంటికి మొత్తం మావి దోరణం కట్టె పని అప్పజెప్పింది .ఇల్లు కదిలి పోకుండా తాగి చుట్టాల ముందు పరువు తీసుకోకుండా వెయ్యి కళ్ళ తో కాపు కాస్తున్నది.

రాజయ్యకు  ఈర్లచ్చిమి పద్ధతి ఏమీ నచ్చటం లేదు.కొడుకును ఆడంగి వెధవ లా అన్నీ పనులు చేయిస్తున్నదని గుణుక్కుంటున్నాడు.

చిన్న కొడుకు,కోడలు పిల్లలు  ఇంకా రాలేదేమని ఆడబిడ్డలు అడుగుతుండడం తో, ఈర్లచ్చిమికి గుండెల్లో వస్తాడో,రాడోననే భయం పట్టుకుంది.ఒకసారి ఫోన్ చేస్తే బాగుండని రాజయ్య కు చెప్పింది.

రాజయ్య ..వాడు నా కొడుకే !అమ్మ కొంగు పట్టుక తిరిగే నీ సైదులు లెక్కన గాదే!టయానికి వచ్చి దొరసాబు లా కూచుంటడు .అన్నాడు గర్వంగా.

సాల్లే ..!ఎప్పుడు చూసినా వాడేదో ఉద్ధరిత్తానట్టు జబ్బలెగరేత్తవ్ ,నీతో జెప్పుడు నాదీ బుద్ది తక్కువ అని తానే వీలయినంత తొందరగా రమ్మనీ చెప్పింది.

కొడుకు బలవంతాన్నే ఒప్పుకోవడం తో మనసు నొచ్చుకున్నది.ఏమయినా పెళ్ళి జరిగి నాలుగు అక్షింతలు వాడే దాక ఓపిక పట్టాలని నిమ్మలపడింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.