కొత్త ఋతువు శ్వాస

(నెచ్చెలి-2026 కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

– జె.డి.వరలక్ష్మి

వారు శాసిస్తున్నారు మా బ్రతుకులను
తాళంతప్పని శృతికి తోలుబొమ్మలమై
పసుపుదారాల కట్లలో అణువణువు బందీలమయ్యాం..
ఈ మానసికక్షోభ గొంతులో గరళమై మింగుడు పడటంలేదు
అణచివేత తాటాకుల్లో పుస్తకాలజ్ఞానాన్నిచుట్టబెట్టి అటకెక్కించాం
చేజారిపోయే జీవితపునిద్రలో మా లక్ష్యం కలలోకి రాదు.
ఎన్నో ఆశలను కొంగుచివర ముడుచుకున్న పెళ్లికూతుర్లం మేము.
జనారణ్యంలో మాకంటూ ఓ పూలచెట్టు ఉందని గంతులేసాం
అవమానాల గొడ్డలివేట్లుపడి పచ్చని బ్రతుకు బీడుబారి
బొట్టులేని స్త్రీ నుదురులా మా మనసు మిగిలింది.
ఇంతజరిగినా..
ఈ అవ్యక్తబందిఖానాలో మా పగిలిన పెదవులు నవ్వుతూనే ఉన్నాయి
గొడ్డుచాకిరీకి నిలువెత్తురూపంగా మా ఒంగిన నడుములు
వారి పాదాలకిందనే ఒరుసుకుపోయాయి..
ఎండిన బావులఒరలు పక్కపక్కనే పెట్టినట్టున్న మాకళ్ళు
ఎంత నిస్సహాయతతో పూడుకుపోయాయో ఎవరికెరుకా!
కట్టుబాట్లలో శిలైపోయిన గుండె నిశీధిలో రోదిస్తుంది
పిలిచే పిలుపుల్లో అవసరమే తప్ప ఆప్యాయతలేని కంఠస్వరాలకు

నూరేళ్ల జీవితాన్ని ఊడిగానికి రాసిచ్చేశాం..
కడుపున నలుసులు మెదిలినా భాగస్వామి ప్రేమకు నోచుకోని పుస్తెలతాళ్ళు
మా మెడల్లో పిన్నిసుల కోసమే వేళ్ళాడుతున్నాయి..
వంశాన్ని నిలబెట్టే గర్భసంచిది గుర్తింపులేని త్యాగమని చివరిదశ వెక్కిరిస్తుందేమో..
ఎదిగే పిల్లలబాల్యం ముందు ఎన్నిసార్లు చెంపదెబ్బలను రుచిచూసామో!
నలుగురి ఆకలితీర్చే మాకూ ఆకలేస్తుంది
మేము వేళకు తినడం వారెప్పుడైనా చూశారా..
బాధ్యతగా నాలుగు మెతుకులు నోటికివ్వని పెనిమిటి ప్రేమ
చచ్చిన శవంమీద రాలిన పూలరెక్క..
పడకగదుల్లో రాత్రిలాంతర్లు వెలిగాక
పెరటి గడపవైపు అంట్లగిన్నెల శబ్దాలు గుడ్లగూబల నిద్రను తరుముతుంటాయి..
మాసిపోయిన మనశ్శాంతి కోసం కాళ్లకు మొక్కిన బ్రతుకులు మావి
ఎన్ని వేకువలు ఆకాశంలో మొలకత్తినా నెరవేరని కలలు గుండెల్లో గడ్డకట్టిపోయాయి
ఈరాతి మనుషుల గుణాలు చూసి ఏడ్చిన నదులు ఇంకిపోయాయి
ఓదార్పు చేతులకోసం ఇక వెంపర్లాడం
స్వేచ్ఛ లేని మనుషుల ఎడారిలో మా బ్రతుకులు పుష్పించడానికి
ఏ ఋతువు రాగం పాడాలిప్పుడు!
కాదు కాదు మేము సృష్టికర్తలం
కొత్తమార్పుకోసం రుతుక్రమంలో

చైతన్యమైన ఋతువుకు ప్రాణంపోసి
రేపటితరంలో మా ఆశలఊపిరిని వెచ్చగా శ్వాశిస్తాం.

*****

Leave a Reply

Your email address will not be published.