
ఈ తరం నడక – 27
రాజీ ముచ్చట్లు
-రూపరుక్మిణి

రాజీ కన్నా…ఎంతో ఆత్మీయంగా పలకరించే అమ్మాయి. మనసులో ఇన్ని కథలు దాగున్నాయా అనిపించింది. తెలంగాణ యాసలో అక్షరాన్ని బంధించడం అంత తేలికైన విషయం కాదు. ఈ రచయితపడ్డ కష్టం ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. తెలంగాణ మాండలికంలో ప్రతి మాటని అక్షరాల్లో పొందికగా అమర్చింది. తెలంగాణ యాసను, భాషను పొరపచ్ఛాలు లేని ఎంతో గౌరవప్రదమైన పద సంపదను ఉపయోగించి రాసిన ఈ కథలు. ( అంటే చాలామంది మాండలికమనంగానే బూతు ప్రపంచాన్ని చూపించి ఇదే మా భాష అన్నప్పుడు, ఆ భాష నిండా స్త్రీలని అవమానిస్తున్న శబ్దం సుడితిరిగిన బాధని మనసు నిండా నింపేసింది. అందుకే అంటున్న ఒకటికి రెండుసార్లు గౌరవప్రదమైన అనే పదాన్ని నొక్కి చెప్తున్నా. )
నడుస్తున్న కాలాన్ని, తాను చూసి వచ్చిన నడకని కథా గమనంగా ఎంచుకొని కథా వస్తువుగా ఏర్చి కూర్చింది. రచయిత రాజీకన్నా.
కథా, శిల్పము, నడక గురించి నేను మాట్లాడటం లేదు. కథా గమనంలో రాజి చెప్పే పద్ధతి మనల్ని కథ లోపలికి తీసుకొని వెళుతుంది. సంఘటనల్లో ప్రతి దృశ్యం చిత్రించినట్టు అనిపిస్తూనే, చీకటి పొరలు విప్పుకుంటూ ఎక్కడో మనసు తడి అద్ధి పోతుంది. ప్రాంతీయతను గురించి ఎక్కడ చర్చ లేకుండానే భాష భూమికగా తీసుకొని తెలంగాణాను ప్రతిబింబించిన కథలు ఇవి.
మోదుగు పువ్వు లాంటి ఎర్రకలువలు… చీకటి మాటున వెలిసిన నల్ల సూర్యుడు మనకు కనిపిస్తారు. వేగుచుక్క లాంటి ఆలోచన రాజీకన్నాది. తెలంగాణ అక్షరాల్లో కలికితురాయి ఈ అమ్మణి ముచ్చట్లు.
నేను పుట్టి పెరిగింది తెలంగాణ ప్రాంతమే అయినా ఖమ్మం జిల్లా అమ్మాయిగా నాకు తెలంగాణ యాస, భాష సరిగ్గా అబ్బలేదనే చెప్పాలి. అందుకు కారణాలు అనేకం వాటిని పక్కన పెడితే నా వాళ్ళు మాట్లాడే భాష నన్ను దాటిపోయింది ఏనాడు లేదు. నా నోటి వెంట వచ్చే పదాలలో తక్కువ యాస పదాలు ఉంటాయి. అయినా ఎవరైనా స్వచ్ఛమైన తెలంగాణ యాసలో మాట్లాడితే మాత్రం ఆ మాటల్లోని స్వచ్ఛత స్థానికతలో పలికే ప్రతి పథంలో మట్టివాసనల్తో నిండి మనసుకి ప్రశాంతత వస్తుంది. వాళ్లు నా వాళ్ళు అన్న అభిమానం గుండె నిండా నిండి పోతుంది. మొహాన వెలుగులు నిండుతాయి. ఆ అభిమానమే రాజీకన్నా పోస్టులు చదివేలా నన్ను ఆకట్టుకున్నాయి. ఈ అమ్మాయి చెప్పే ముచ్చట్లు భలే బాగుంటాయి. ఒక్కో రోజు ఉదయాలు వాటిని చదువుకోవాలని ముచ్చటగా దాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎఫ్బి వాల్ పై అప్పుడప్పుడు తన కొడుకు గురించిన కబుర్లు పెడుతూ, ఊరి ముచ్చట్లు చెబుతూ ఉంటుంది. చాలా సరదాగా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టు ఆహ్లాదంగా అనిపించేది. అటువంటి అమ్మాయి కథల పుస్తకం తీసుకొస్తే చదవకుండా ఎట్లా.. బోధి ఫౌండేషన్ వారి ఈ “అర్రాసు” కథల పుస్తకం నా ఇల్లు చేరింది.
పుస్తకంలోకి వెళ్తే ఈ పుస్తకాన్ని ఏక బిగిన చదవలేదు. నచ్చిన వస్తువుని మురిపంగా చూసుకున్నట్టు ఇందులోని ప్రతి అక్షరాన్ని చదువుకోవడంలో నాకు కలిగే సంతోషం నాలోని అనేక జ్ఞాపకాలని, మరుగున పడిన మనుషుల కథలు గుర్తుచేసింది.
రాజి నీ అక్షరాలు బంగారం, అపురూపం వడికట్టు పదాల మధ్య పునాస పువ్వులా, గునుగు పూల మెరుపుతో తెలంగాణ పల్లె చిత్రాన్ని చూపించావు.
అచ్చంగా ఆదిలాబాద్ మండలికంలో రాసిన కథలు ఇవి. ఆ మట్టి మనుషుల జీవన చిత్రం. ఈ కథల్లో గ్రామీణ జీవనంలో కలిసిపోయిన మనుషుల ముచ్చట్లు ఇప్పుడు దాదాపు అందరం మర్చిపోతున్న అనేక ఆనవాళ్లను చరిత్రకు సాక్ష్యంగా ఈ పుస్తకం అనే శిల్పాన్ని చెక్కి మనకు అందించింది బోధి ఫౌండేషన్.
ఈ కథల గమనంలో అడుగు పెడితే.., చంటి బిడ్డ మనసుపై పేదరికం ఇచ్చిన అవమానపు గాయం పచ్చి పుండులా పలకరిస్తుంది. “ “వంద లోటు “కథలో. “భీమి” కథ చెప్తుంది చంద్రయ్య పటేల్ అహంకారానికి సామాజిక చైతన్యం లేని అమాయకపు మనుషులు వాళ్ళ జీవితాల్ని ఎట్లా కోల్పోతారు కళ్ళ ముందు కనిపిస్తుంది.
‘జీతగాడు’ కథ ‘భీమి’ కథ కు కొనసాగింపు గానే ఉంటుంది. భూస్వామ్య వ్యవస్థ ఉక్కు పాదాలతో అణిచివేసిన జీవితాలను గురించి, కష్టపడి పని చేసే వారికి యజమానుల దాస్యం లో నుండి విడిపించుకోవడంలో ఎంతటి కఠినమైన సమస్యలు వాళ్ళ లోగిళ్ళలో కళ్లాపి చల్లి పోతాయో చూపిస్తుంది.
బానిస సంకెళ్లగురించి, దొరల ఆకృత్యాలు గురించి కూడా మాట్లాడింది రాజవ్వ. గ్రామాల్లో ఎర్రజెండా స్థాపనకు మూల కారణాలను వెతికి పట్టి కథ చెప్పింది. అర్రాసు కథ స్త్రీ అస్తిత్వంతో పాటు ఆర్థిక విషయాల పట్ల పల్లెల్లో స్త్రీల బ్రతుకు గమనం పట్ల ఎంతో అవగాహనతో ఉంటారు అని చెప్తూనే సామాజిక అంశాలను స్పృషిస్తూనే, నైసర్గిక పరిస్థితులను పశువు గాసరం ఉన్న ఇంటి స్త్రీల చాకిరీ, మగవాడి నోరు మెదపని తనంలోని హింసను, అత్తింటి ఆరళ్లను, అమాయకపు పల్లె పిల్ల పడే మానసిక వ్యధ అన్ని కలిసి ఓ ఆడబిడ్డ చావుకు ఎట్లా కారణం అయ్యాయో చెప్పే కథ ఈ పుస్తకాన్ని నిలబెట్టిన కథ ఈ కథలో కొంత సాగదీసినట్టుగా ఉన్న కథ ఉనికిని కాపాడుకుంటూ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
రాజవ్వ ముచ్చట్లు – ఇక్కడ చరిత్రలో జ్ఞాపకం గా నిలబడి అనేక విషయాల గురించి మాట్లాడింది. పూరిళ్లు ఇప్పుడు చూడటానికి కూడా కనపడని ఆ కట్టుబడి గురించి మాట్లాడింది. ఆ రోజుల్లో ఎంత పకడ్బందీగా ఓ ఇంటికి పైకప్పు గడ్డితో కట్టేవారు. దానికోసం ఎన్ని రోజుల శ్రమ ఉండేదో శ్రమజీవుల కథలా చెప్పింది.
అమ్మ కొంగులో కట్టుకొచ్చి ఇచ్చి తాయిలం మక్కలు, జొన్న పేలాలు నోరూరించే యెల్లుల్లి కారాలు.. శనగిత్తుల పచ్చడి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పదు కానీ ముచ్చట్లలో అన్ని దొర్లుతూ వెళ్ళిపోతాయి. ఎక్కడా ఒక ప్రాంతం గురించి ఒక వంట గురించి పొగిడినట్టుగా ఉండదు ప్రత్యేకించి తీసుకొచ్చి అలంకరించినట్టుగా ఏ వస్తువు గురించి మాట్లాడదు. చాలా సహజంగా ఒక ప్యూర్ సోల్ తో రాసిన కబుర్లు ఇవి.
ఊరి బడి గురించి మాట్లాడుతుంది, బడికి వెళ్లే దారి గురించి మాట్లాడుతుంది, బడిలో పాఠం చెప్పే మాస్టారు వెలివేసిన విధానాన్ని చెప్తుంది. ఎక్కడ కులం గురించి మాట్లాడదు కానీ కథలో కులం కొట్టిన దెబ్బ అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడ నా అస్తిత్వాన్ని కాపాడండి అని మాట్లాడదు. కానీ ప్రతి పదంలో స్త్రీ అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం ఆ కథల్లో వచ్చే పాత్రలే చెప్తాయి.
ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని ఎక్కడ వేడుకోదు. కథల్లో, ముచ్చట్లలో ఎంచుకున్న ప్రతి వ్యక్తి పాత్ర మాట్లాడే మాటల్లో ఆత్మగౌరవం తోణికిసలాడుతుంది.
తనలోని పిరికితనం గురించి మాట్లాడుతుంది, ఆలోచనల్లోని ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది. ఊరి మధ్య వెలివేయబడ్డ మనుషుల గురించి మాట్లాడుతుంది. పండుగల గురించి పుకార్ల గురించి అలంకరణల గురించి కులమత అంతరాలు లేకుండా జీవించిన కలత లేని మనుషుల గురించి మాట్లాడుతుంది ఇలా రాజి చెప్పే ముచ్చట్లు వినాల్సినవి. విని కాసేపు నవ్వుకోవచ్చు కాసేపు ఆశ్చర్యం కలగొచ్చు. ఓసి ఇంతేనా ఈ కబుర్లు అనిపించవచ్చు కానీ ఈ కబుర్లకు అంటించిన ఘుమఘుమ తెలంగాణ యాస భాష పట్ల తన అభిమానాన్ని చాటుకున్నది రాజీ
రాజీ రాసుకున్న ముందుమాటలో తీగ తెగిపోకుండా రాస్తా అన్నావు రాస్తూనే ఉండు. కానీ కొత్త కథలు కొత్త తరం అనుభవిస్తున్న వ్యధలు మన భాషలో మన యాసలో రాస్తావని ఆశిస్తూ మనసారా అభినందనలు. ఈసారి రాసే అప్పుడు అరుదుగా వచ్చే యాస పదాలకి అర్ధాన్ని తప్పకుండా మెన్షన్ చెయండి… అందరికీ అర్థం అవడం కోసం.
పుస్తకం : అర్రాసు
రచయిత: రాజీ కన్న
పరచురణ : బోధి ఫౌండేషన్.
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
