తొలి కవిత – అరవింద్ ( డోగ్రీ కవిత)

                                                                        ఇంగ్లీషు అనువాదం: శివనాథ్

తెలుగు సేత: వారాల ఆనంద్

పొగమంచు ఆవరించిన ఓ సాయంకాలాన్ని గురించి
నేను రాయడం మొదలుపెట్టిన తొలి కవితే
అందమయిన కవిత

అపరిచిత భావనేదో నాలో కదిలింది

చాలా సున్నితమయిన లేత భావన
నాకు సిగ్గేసింది
నేను గ్రహించలేదు వ్యక్తం చేయలేదు కూడా
అట్లని లోపాలే అణచి వుంచుకోనూ లేదు

ఓ కాగితం ముక్కనూ కలాన్నీ తీసుకున్నాను
నాకు యతి ప్రాస చంధస్సూ ఏమీ తెలీదు

నా భావం వానాకాలం ఉప్పొంగి పారే కాలువలాగా
నా కళ్ళలోంచి పొంగింది
నా చేతులు వణికాయి
ఏవో కొన్ని పిచ్చి గీతాలు గీసాను
కొన్నింటిని చెరిపేశాను
కాగితం తడి తడయింది

ఆ తీయతియ్యని మాటలన్నీ కలిసి
నా తొలి కవితయ్యింది
నా కవితలన్నింటిలోకీ
అందమయిన ఉత్తమ కవితయ్యింది

*****

Leave a Reply

Your email address will not be published.