అనుబంధాలు-ఆవేశాలు – 12

– ప్రమీల సూర్యదేవర

నాలుగవ బుధవారం భ్రమరను కలిసినప్పుడు, సురేష్ కలిసాడని చెప్పాను. చివ్వున తలెత్తి చూసింది.

“అవును, మా ఇంటి చిరునామా ఎలా కనుక్కున్నాడో ఏమో వచ్చి కలిశాడు. మిమ్మల్ని ఇక్కడ్నుండి బయటకు తీసుకెళ్ళి పోవటానికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయటానికి అతను వెనుకాడనని చెప్పమని చెప్పాడు. మీ విషయంలొ అతను చాలా బాధ పడ్తున్నాడు.” భ్రమర ముఖంలో మారుతున్న కవళికలు గమనిస్తూ అన్నాను.

బల్ల మీదకు ఒంగి, మోచేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడవ సాగింది. ఇది మంచి శకునం. మనస్సులొ ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో బయటకు వస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. మనస్సు విప్పి మాట్లాడాలంటే ఇన్ని రోజులుగా కరడు గట్టి, అట్టడుగున దాచుకున్న తన దుఃఖం, తను పడుతున్న వేదన, అంతా బయటకు రావాలి. ఇది మొదటి మెట్టు. నా నిరాశ తొలిగి పోయి, నేనీమెకు సాయపడగలననే నమ్మకం ఏర్పడింది.

రక్షకభటులు వచ్చి తీసుకు వెళ్ళే వరకు ఏడుస్తూనే ఉన్నది. ఉబ్బి పోయిన కళ్ళతో, ముఖంతో వెళ్ళే ముందు నావైపొక్కసారి జాలిగా చూసింది. ఆ చూపు నా గుండెని త్రాకి నా కళ్ళలొ నీరు తెప్పించింది.

భ్రమర ఆలోచించుకోవటానికి కొంత వ్యవధి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వచ్చే బుధవారం అంజమ్మని కలవటానికి అనుమతి తీసుకున్నాను.

మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండ కురిసి వెలిసిన వర్షం తరువాత ఆరోజు ప్రశాంతంగ ఉన్నది. ప్రకృతి అంతా వరుణుడు కడిగేశాడా అన్నట్లు ఎంతొ నిర్మలంగా ఉన్నది. అడవిలో కారు టైర ఇరుక్కు పోతుందేమోనమ్మ. గోవిందు అనుమానం వ్యక్తం చేశాడు.

ఈ అవకాశం జారిపోతే అంజమ్మని కలవటం కుదరదు. “ప్రయత్నించి చూద్దాం. అట్ట ముక్కలు ఏమైనా ఉంటే కార్లో పెట్టు ,”అనిచెప్పి బయలు దేరాను.

***

భ్రమర జాగ్రత్తగా సంచిలొ పెట్టి గట్టిగ బిగించి కట్టిన పుస్తకమైతే అంజమ్మ తెరిచిన పుస్తకం.

గదిలోకి వస్తూనే నడుం మీద రెండు చేతులు పెట్టుకుని నన్ను ఆపాదమస్తకం చూసింది. మెడలొ పూసలగొలుసులు లేవు–చేతులకు రంగు రంగుల చెక్కగాజులు లేవు–ముక్కుబుళాకి లేదు–జుట్టుమడిచిపెట్టిన పెద్దకొప్పు లేదు–కొప్పులొ పువ్వులు లేవు–కండలుతిరిగిన శరీరం స్థానె ఎముకలు బయటకు కనిపిస్తున్న శరీరం, లోతుకుపోయిన కళ్ళు , కళ్ళ క్రింద నల్లటి చారలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు—ఉన్న ఒక స్తీృమూర్తి నా ఎదుట నిల్చుంది.

నేను లేచినిల్చుని, పరిచయం చేసుకుందామని, చేయిచాచి, “నాపేరు నియతి,” అని మొదలు పెట్టాను.

“నుయ్యారో నాకెరుకేలె తల్లి. జలజ నువ్వెందుకొచ్చినవొ కూడ సెప్పింది. అయినా ఇంక నువ్వు నాకు ఏరే సేసే సాయం ఏటంట? నూకాలికి బుద్ది సెప్పాలని తలకాయ మీద మోదిన. దానికాలం తీరి అది సచ్చిపోనాది. నా బిడ్డల్ని, దాని బిడ్డల్ని తల్లిలేని పిల్లలుగ సేసిన. ఈడ అనుబగిస్తున్న.” కళ్ళల్లో నీళ్ళు చిమ్ముతుండగా అన్నది.

నేనెక్కువ కష్టపడకుండానే ఈమె తన జీవిత గాధ చెపుతుందేమో అనిపించింది.

“మీ స్నేహితురాలికి ఎందుకు బుధ్ది చెప్పాలనుకున్నారు?” సందేహిస్తూ అడిగాను.

“ఓయబ్బో! అదిశాన పెద్ద కతలె తల్లి! ఇయ్యాల్రేపటిది కాదది. అన్నది కూర్చుంటూ.

అంజమ్మని నేనేమీ అడగ తలుచుకో లేదు. తననే చెప్పనీ అనుకుని ఎదురుగ కుర్చీలో కూర్చున్నాను.

కొంచెం సేపు ఏమీ మాట్లాడ లేదు. చేతులు రెండు ఒళ్ళో పెట్టుకుని వాటి వైపే చూస్తూ తల ఒంచుకుని కూర్చున్నది. “నూకాలు బిడ్డని నా మగడు సంపేసిండు,” అన్నది ఉన్నట్టుండి.

ఆశ్చర్యంగ చూశాను! నేను చదివినంత వరకు ఆమె ఫైల్లో ఈ విషయం ఎక్కడా ప్రస్తావించ లేదు.

“సంపాలని కాదులె. పెమాదంలొ సనిపోయిండు.” తల పైకెత్తి కిటికీలో నుండి కనుపిస్తున్న నీలి ఆకాశం వైపు చూస్తూ అన్నది. ఆ చనం నాకుబాగా యాదుకున్నదమ్మ. అడవిలో పిట్టలు కూత ఎయ్యటం మరసి పోయినయి, సెలయేటి పారుదల ఆగి పోయి, వింతగా సూసింది. గాలిదేముడు కదలటం ఆపేసి దిగులుగ సూసిండు.సాగరంలో అలలు పరుగు లెత్తటం మానేసినయ్‌, సందమామ బిత్తర పోయిన రోజు—పెపంచంలో దుష్టగెహాలన్నీ ఏకమై మమ్ముల శపించినై ఆరోజు.

అదే సమయాన అడవిలో ఆడుకుంటున్న సిన్నారి కెవ్వున కేక పెట్టిండు. ఆకేక నాలుగు దిక్కుల్లో యాపించింది. పక్కనె కొద్ది దూరంలొ కట్టెలేరుకుంటన్న నూకాలు, నేను, కేకొచ్చిన దిక్కు లగెత్తుకెల్లినం. నూకాలుబిడ్డ, షెరా, గుండెలో గుచ్చుకున్న బాణంతో ఎల్లకిల పడి సొక్కాలేని వాడి సిన్న శరీరం రగతంతొ తడిసి ముద్దై పోయి గిలగిల తన్నుకుంతన్నడు. నూకాలు సేతిలొ కట్టెలు దబేల్న కింద పడేసి, గుండెలు బాదుకుంట బిడ్డకాడికి లగెత్తు కెల్లింది. అది సూసి, నాకాల్లు సేతులు ఆడల. ఎర్రిసూపులు సూత్త నిల్చున్న. యాడ్నుంచి వొచ్చిండొ ఓబులు, మా ఇంటాయన, అధాట్టున పిల్లోడ్ని రెండు సేతుల్లో ఎత్తుకుని పల్లె ఏపు పరుగు పెట్టిండు. నూకాలు, నేను ఏడుత్త ఆయన ఎంట ఎల్లాం. పల్లెదొర బాణం లాగేసి పసర్లు పూసిండు కాని వాడు తిప్పుకోలేక పోయిండు. గిలగిల కొట్టుకుని ఆల్లమ్మ ఏపు జాలిగ సూసి పాణాలొదిలిండు. ఆసూపు మా అందరి గుండెల్లో గునపంనాగ గుచ్చుకున్నది.

ఆ సుట్టుపక్కలె బాగా బలిసిన దుప్పొకటి తిరుగాడుతుందని, దానేలు, ఓబులు,ఇద్దరు, ఆ దుప్పినె తలుచుకుంట, గూడెం అంత మాంసం తినొచ్చని నోరూరించుకుంట, సీకట్నె లెగిసి, సద్దివణ్ణాలు మూటకట్టుకుని, విల్లు, బాణాలు భుజాలకు తగిలించుకుని రామ, లచ్చనులమల్లె ఎల్లారు.

సీకట్తొఎల్లి , దుప్పికోసం దుప్పల మాటున మాటేసుక్కూకున్నరు కాని, దుప్పి ఈల్లని పసిగట్టిందేమొ ఎంతకీ రాలేదు. పొద్దు వాలే ముందు గూడెం దిక్కుగ గెంతటం సూశారిద్దరు. ఓబులు మాంచి విలుకాడు. విల్లు ఎక్కుపెట్టిండంటె జంతువు సావాల్సిందె. దుప్పి ఎల్లిన దిక్కు గురిసూసి బాణం వదిలిండు. అదే సమయానికి కోతి-కొమ్మచ్చి ఆడుకుంటున్న పిల్లలు సెట్టు దుమికారు. ఓబులు ఎక్కుపెట్టిన బాణం అప్పుడే సెట్టుమీద నుంచి దుమికిన షెరా గుండెల్లో నుంచి దూసుకు పోయింది. బిడ్డలందరు అడవిలో సేచ్చగ తిరిగే వారు. క్రూర మృగాలవల్ల గాని, ఇషప్పురుగుల వల్ల గాని ఎన్నడు పాణ నట్టం జరగల. కాని ఓబులు బాణానికి ఒక బిడ్డ బలై పోయిండు.

ఇషకీటకాలకి మా పల్లెదొర కాడ మూలికలు, అవుషదాలు ఉంటయి. బాణం గుండెల్లో గుచ్చుకున్నోల్లకు కూడ బాణం లాగి వయిద్యం సేసేటోడు. మా అందరి దురద్దుట్టం షెర తిప్పుకోలేక పోవటం.

గుక్క త్రిప్పుకోకుండ ఏదో లోకంలో ఉన్నట్లు నీలి ఆకాశం నుండి చూపులు మరల్చ కుండా ఇంత వరకు చెప్పి, కన్నీరు కారుస్తూ కూర్చుండి పోయింది. రక్షకభటులు వచ్చేవరకు అలాగే కూర్చున్నది.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Leave a Reply

Your email address will not be published.