ఏజంట్-2026 : అరగంట సినిమా వెనుక ఆరునెలల కథ! (భాగం-2)

ఫిల్మ్ లొకేషన్స్ లో సర్దుబాటు వల్ల కథలో మరికొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఫిల్మ్ మొత్తం మా ఇంట్లోనే షూట్ చెయ్యాలని ప్లాను చేశాను. మా ఇల్లు పెద్దది కావడం, ఇంటి చుట్టూ షాట్స్ చెయ్యాల్సొచ్చినా, బయటి లొకేషన్ లో షూటింగ్ చెయ్యాలన్నా మా ఊరు మోర్గాన్ హిల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఇంట్లోనే షూటింగ్ అయితే నాకు మా చిన్నమ్మాయి సిరివెన్నెలని సమయానికి చూసుకోవడానికి కూడా వీలవుతుంది. మొత్తానికి కథలోని మూడు ఇళ్ల ఇండోర్ షాట్స్ మొత్తం ఒక్క మా ఇంట్లోనే పూర్తి చెయ్యగలిగాం. ఇక అవుట్ డోర్ షాట్స్ లో కారు సీన్లు చుట్టుపక్కల వీథుల్లోనూ, పది మైళ్ళ పరిధిలో ఫ్రీ వే మీద చేసాం.

అనుకున్నట్టుగానే మే నెలలో రెండవ వారాంతంలో షూటింగ్ ప్రారంభించాను. ముందుగానే స్క్రీన్ ప్లే తో బాటూ, లాంగ్ షాట్స్, క్లోజప్, మిడ్ షాట్స్ వగైరాలు తీయాల్సిన డిటైయిల్స్, కెమెరా మూవ్మెంట్స్, లైటింగ్ వగైరాలన్నీ వివరంగా రాసుకున్నందువల్ల తియ్యడం కాస్త సులభమే అనుకున్నాను.

షాట్స్ కూడా కథ జరుగుతున్న వరుసలోనే తీసెయ్యొచ్చని కూడా అనుకున్నాను. శనివారం ఉదయం పదిగంటలకల్లా మొదలుపెట్టాలనుకున్నది శశి వచ్చేసరికి లేటు కావడంతో షూటింగ్ స్టార్ట్ చేసేసరికి పదకొండున్నర అయ్యింది.

మొదటి షాట్ హీరో ఉదయానే నిద్ర లేచే షాట్. పశ్చిమాన ఉన్న మా బెడ్ రూమ్ లో ఉదయం పూట ఎండ రాదు. పొద్దున్న 11:30కి ప్రారంభించి భోజనం సమయం వరకు కూడా అంటే దాదాపుగా 1:30, 2:00 గంటల వరకు ఒకటే సీను మళ్లీ మళ్లీ తీస్తూ ఉన్నాను. హీరో ఉదయాన్నే నిద్ర లేవడం, అక్కడక్కడే తచ్చాడుతూ డైలాగ్స్ వరుసగా చెప్పడం, తర్వాత అతను బాత్రూమ్ వరకు వెళ్లి తలుపు వేసుకోవడం అంతే. ఆ మొదటి సీనే రెండు మూడు గంటలు పట్టింది.

లైటింగ్ సరిగా లేకపోవడంతో కొంచెం మసకమసకగా వచ్చాయి షాట్స్. అంతే కాకుండా లాంగ్ షాట్స్ ఎక్కువ తీసేయడం, మిడ్ షాట్స్, క్లోజప్ షాట్స్ సరిగ్గా తీయకపోవడం లాంటి మిస్టేక్స్ జరిగేయి.

అదే రోజునాడు హీరో కార్లో బయటికి వెళ్లే షాట్స్ తీసి, తర్వాత నేను, శశి ఉన్న కాంబినేషన్ షాట్స్ కొన్ని తీసేసరికి సాయంత్రం ఏడు అయిపోయింది. దాంతో ఆ రోజు అంటే మే నెల మూడవ శనివారం నాడు షూటింగ్ అక్కడితో ఆపేయవలసి వచ్చింది.

మర్నాడు శశి ఒంట్లో బాలేదని ఉదయానే రాలేకపోయాడు. కానీ సమయానికి ఆదిత్య రావడం వల్ల ఉదయం షూటింగ్ సమయం వృథా కాకుండా గౌతమ్ క్యారెక్టర్ ఇండివిడ్యువల్ సీన్స్ పూర్తి చేశాను. ఈ లోగా శశి, మధ్యాహ్నం నుంచి జ్యోత్స్న కేరెక్టర్ వేస్తున్న పూర్వజ వచ్చారు. ఇక వరసగా అందరి కాంబినేషన్ షాట్స్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పూర్తి చేసేసాను.

హీరో, హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ సరిగ్గా అయిదు నిముషాలు కూడా ఉండవు. కానీ షూటింగ్ కి చాలా సమయం పట్టాయి. అయితే లక్కీగా మా పోర్టికోలో తీయడం వల్ల లైటింగ్ బాగా వచ్చింది.

అయితే టేక్స్, రీటేక్స్ బాగా చెయ్యాల్సి వచ్చాయి. ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ లో నాకు సంతృప్తి లేకపోవడం, వాళ్ళు డైలాగ్స్ తప్పుగా చెప్పడం వంటివి కొన్ని కారణాలు అయితే, అసలు ముందర ఏ సీన్ లో ఎక్కడ ఎవరు కూర్చోవాలి వంటివి చాలా సమయం తీసుకునేవి.

నేను సీన్స్ తీసేటప్పుడు లొకేషన్ బానే ప్లాను చేసుకున్నాను. అంటే ఏ గదిలో షాట్ తీయాలి అనేది. కానీ కరెక్ట్ గా ఏ ప్లేస్ లో తీయాలి, ఏ ఫర్నిచర్ ఇలా ఉండాలి అనే ఐడియా మాత్రం పెట్టుకోలేదు. దానివల్ల నాకు ప్రతి షాట్ తీసే ముందు సీన్ సెటప్ చేయడానికి కొంత టైం పట్టేది.

అమ్మాయి, అబ్బాయి పక్కపక్కన కూర్చుని ఉన్న సీన్ తీయాలనుకున్నాను. కానీ పక్కపక్కన కూర్చుంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూస్తూ డైలాగు చెప్పడం కష్టంగా ఉంది. కాబట్టి ఒకళ్ళని కుర్చీ పైన, ఒకళ్ళని కార్పెట్ మీద కూర్చోబెట్టవలసి వచ్చింది. ఇలాంటివే ఎన్నో.

నాకు అప్పుడు అర్థమైన విషయం ఏమిటంటే, సీన్లు రాసుకునేటప్పుడు ఏ గది అన్నది మాత్రమే కాకుండా, ఆ లొకేషన్ లో కరెక్ట్ గా ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఫర్నిచర్ ఎలా ఉండాలి, క్యారెక్టర్స్ ఎక్కడ కూర్చోవాలి వంటివన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి.

దానివల్ల ఎంతో టైం వేస్ట్ అవుతూ వచ్చింది నాకు. అదీగాక అప్పటికప్పుడు చేయడం వల్ల కొన్ని అవకతవకలు కూడా జరిగాయి. కొన్ని సీన్లలో గోడమీద మా ఫ్యామిలీ ఫోటోస్ మర్చిపోయి వదిలేయడం, తరువాత రీషూట్ చెయ్యడం జరిగాయి.

కొన్ని కవర్ చెయ్యగలిగినా, కొన్ని వదిలెయ్యక తప్పలేదు. లక్కీగా ఐఫోన్ లో సినిమాటిక్ మోడ్ వీడియో షూటింగ్ లో బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అయ్యి అవన్నీ కవరయిపోయాయి.

ఇక అమ్మాయితో కాంబినేషన్ సీన్స్ చాలా ఎక్కువ షాట్స్ తీశాను. అంటే ఒకే డైలాగ్ కి క్లోజ్ అప్, మిడ్ షాట్స్, లాంగ్ షాట్స్..ఇలా రిపీట్ చేసుకుంటూ పోయాను. అందువల్ల ఎడిటింగ్ లో చాలా మంచి కట్స్ తీసుకోగలిగేను. కానీ షూటింగ్ చెయ్యడానికీ, ఎడిటింగ్ కీ ఎంతో సమయం పట్టింది.

ఇక అనుపమ్ క్యారక్టర్ కి, గౌతమ్ క్యారెక్టర్ కి మధ్య ఉన్న కాంబినేషన్ షాట్స్ తీయడం మొదలుపెట్టాను.

అక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఫస్ట్ సీన్ లో, లాస్ట్ సీన్ లో గౌతమ్ అనుపమ్ తో మాట్లాడడం తప్ప, మిగతా సీన్స్ అంటే వాళ్ళిద్దరూ మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉండే సీను, మొత్తంగా వీళ్ళిద్దరికీ కాంబినేషన్ ఫోను సీన్స్ వంటి అన్నీ రాత్రి పూట తీయాల్సినవే. ఇక్కడ వేసవిలో తొమ్మిది వరకు బయట వెలుతురు ఉంటుంది. మా ఇంటికి అన్నీ అద్దాల కిటికీలతో బాగా వెంటిలేషన్ ఉంటుంది. ఇక తప్పక నైట్ సీన్స్ అన్నీ డేలైట్ లోనే కవర్ చేసి, చెయ్యవలసి వచ్చింది. హాల్ లో మొత్తం పరదాలు వేసి, చీకటి చేసి, లైట్లు వేసి, మొత్తానికి ఏదోలా పూర్తి చేశాను.

ఇక మందు సీను కోసం మా ఇంట్లో ఆల్కహాల్ ఉండదు కాబట్టి శశిని తెమ్మని చెప్పాను. తను మర్చిపోయి వచ్చాడు. అప్పటికప్పుడు తేవడానికి టైం లేదు. మా ఇంట్లో కనీసం ఆల్కహాల్ లాగా కనిపించే కూల్ డ్రింక్ కూడా లేదు. ఇక మందుకు బదులు గ్లాసుల్లో చల్లని బ్లాక్ కాఫీ వేసి ఇచ్చి ఆ సీను షూటింగ్ పూర్తి చేశాను.

ఇక శశితో కొన్ని సీన్స్ మిగిలిపోయాయి. ముఖ్యంగా ముందు రోజు షాట్స్ బాగా రానివి మళ్ళీ చేయాల్సి వచ్చాయి. అవేవీ ఆ రోజు టైం సరిపోక తీయలేకపోయాను. ఇక వాటిని ఆ మరుసటి వారానికి వాయిదా వేసాను.

*****

(సశేషం)

 

Leave a Reply

Your email address will not be published.