రాగమాలిక

(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– బి.వి. శివ ప్రసాద్

తెల్లవారే జాము మరెంతో మిగిలేవుంటుంది
నేను సుషుప్తిలో గురకలు తీస్తూనేవుంటాను
కానీ నీ సగం నిద్ర కళ్ళు మాత్రం
నిన్ను నిర్దాక్షిణ్యంగా వంటగదిలోకి ఈడ్చుకుపోతాయి
నీ రోజువారీ రాగమాలిక మూడవ ‘కాలం’ లో మొదలౌతుంది
బ్రేక్ఫాస్ట్ బిలహరి రాగాన్నీ, లంచ్ బాక్సులు సర్దే మధ్యమావతి రాగాల్నీ ఆలపించి
అలసట థిల్లానా పాడుకుంటూనే ఆఫీసుకు చేరుకుంటావు
అక్కడ నీతోటివారూ, అధికారులూ
మరో మడత కచేరీ మొదలెడతారు
కాలగానం సాగి సాగి సాయంత్రమయ్యాక
సంధ్యారాగం సాయంతో ఇంటికి చేరుకుంటావు
ఆ వారం తన వయసును ముగించుకుంటూ
ఆదివారంలోకి అంతిమంగా అడుగుపెడుతుంది
అయినా నీ కాలపట్టిక పెద్దగా మారదు
ఈసారి అదనంగా ఇల్లు శుభ్రం చేసే ఇంకో దీర్ఘ రాగాన్ని
నీ నిస్సతువ శరీరంతో పాడడం ప్రారంభిస్తావు
వారాంతం ముగిశాక సోమవారం మళ్ళీ మా కోసం
నీ శ్రమదాన సంగీత కచేరీ మొదలౌతుంది
‘ప్రేమికుల దినం’ రోజు మాత్రం నేను నీకు ఐ లవ్యూ చెప్పి
ఒక ముద్దుతో సరిపెడుతూవుంటాను
రేపు ఉగాది-మన కొత్త సంవత్సరాది
నేను కూడా రేపటి నుంచి ప్రతిరోజూ
నీ దినచర్యలో పాలుపంచుకుంటాను
మా కోసం నువ్వు చేసే శ్రమయజ్ఞంలో
నా వంతు పాత్రను పోషిస్తాను

*****

Leave a Reply

Your email address will not be published.