యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-19

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే లేచి, అయిదు గంటలకల్లా “ యూరోస్టార్” అని పిలిచే లండన్ నించి పారిస్ కి వెళ్లే రైలు ఎక్కడానికి సెయింట్ పాంక్రాస్ రైల్వే  స్టేషను కి ఊబర్ టాక్సీ బుక్ చేసుకుని బయలుదేరాం. ఊబర్ వచ్చేలోగా హోటల్ లాబీలో వేచి చూస్తున్న సమయంలో  సిరి పేచీ పెడ్తుంటే అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు దగ్గరకొచ్చి తెలుగులో పలకరించాడు. అతను లండన్ లో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎమ్మెస్ చేసి సరైన ఉద్యోగం రాక, భుక్తి కోసం ఈ పనిలో చేరాడట.

గత నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. వర్క్ వీసా వచ్చే ఏడాదిలో రాకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుందని వాపోయాడు. అయినా కేవలం డబ్బు కోసం తప్ప అసలు తనకు ఇలా దేశం కాని దేశంలో ఉండడం ఇష్టం లేదని చెప్పాడు. ఇదేమాట ఇంతకు ముందు మేం మాట్లాడిన ఇండియన్ ఊబర్ డ్రైవర్ కూడా చెప్పాడు. పై చదువుల కోసమంటూ అప్పులు చేసి, ఇలా ఇతరదేశాలకు వచ్చి, చదువులు పూర్తయినా, సరైన ఉద్యోగం రాక, డబ్బు సంపాదన కోసం ఏదొక ఉపాధిని వెతుక్కుని ఇతనిలా కష్టపడుతున్న వారెందరో. అతని చేతిలో ఇరవై  డాలర్లు పెట్టి, సెలవు తీసుకున్నాను.

హోటలు నించి రైలు స్టేషనుకి 30పౌండ్లు అయ్యింది.

ఇక ఈ ప్రయాణంలో నేను బాగా ఉత్సుకతగా ఎదురు చూసిన రోజు అది. అసలు ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ  ప్యాకేజీ బుక్ చేసేటప్పుడు ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ ల మధ్య ఫ్లైట్ కాకుండా ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రైలు ప్రయాణం కోసమే ఈ టూరుని బుక్ చేసుకున్నాం. గంటకి 320 కి.మీ లేదా 200 మైళ్ళ వేగంతో దూసుకుపోయే ఈ బుల్లెట్ రైలు సముద్రాంతర్భాగం నించి అంటే ఇంగ్లీష్ ఛానెల్ గుండా వెళుతుంది.

దాదాపు మూడున్నర గంటల ప్రయాణం. మనిషికి ఒక వైపు టిక్కెట్టు స్టాండర్డ్ క్లాసుకి 52పౌండ్లు, స్టాండర్డ్ ప్రీమియం ఫస్ట్ క్లాసుకి 97 పౌండ్లు, బిజినెస్ ప్రీమియం ఫస్ట్ క్లాసుకి 325 పౌండ్లు. మేం స్టాండర్డ్ ప్రీమియం ఫస్ట్ క్లాసులో ప్రయాణించాం. ఇందులో బ్రేక్ ఫాస్టు కూడా ఇస్తారు.

సెయింట్ పాంక్రాస్ రైల్వే  స్టేషను నించి పారిస్, ఆమ్ స్టర్ డామ్ వంటి చోట్లకి రైలు సౌకర్యం ఉంది.

ఈ స్టేషనులో ఎయిర్పోర్టులో లాగానే పాసుపోర్టు వగైరా చెకింగ్ కౌంటర్ ని దాటి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అంత తెల్లారగట్లా పెద్ద లైను ఉంది. అయితే చక్రాల కుర్చీ వల్ల మమ్మల్ని స్పెషల్ లైనులో త్వరగా పంపేసారు. ఇక లగేజీ చెకిన్ వగైరాలు లేవు. ఎంత పెద్ద లగేజీ అయినా, కూడా తీసుకెళ్లడమే. ఇక నీళ్లు వంటివి కూడా పట్టుకెళ్లొచ్చు. ఒకవేళ అనుమతించకపోతే అక్కడే వదిలేద్దామని నేను నాతో ఇంగ్లాండు మిత్రులిచ్చిన పువ్వుల బొకేని కూడా పట్టుకెళ్ళాను. అమెరికాలో ఉన్న రెస్ట్రిక్షన్స్ అక్కడ దేశాల మధ్య ఉన్నట్టు లేవు. పువ్వులు, పళ్ళు వంటివి కూడా నిరభ్యంతరంగా పట్టుకెళ్లొచ్చు.

మా రైలు ఏడు గంటల ఒక్క నిమిషానికి. ఆ ఒక్క నిమిషం రూలేంటో మరి! గంట సేపు అక్కడే స్టేషనులో వేచి ఉండాల్సి వచ్చింది. ఎంట్రన్సులోనే వైయిటింగ్ హాలు ఉంది. మేం లోపలికి వెళ్లేసరికి దాదాపు 5.45 అయ్యింది. ఆ సమయానికి బాగా రద్దీగా ఉండి కూర్చోవడానికి ఒక్క సీటు కూడా దొరకలేదు.

అయితే ఆరుగంటల రైలు కోసం ఎనౌన్స్ మెంట్ రాగానే  దాదాపు సగం హాలు ఖాళీ అయ్యింది. స్టేషనులో ఎయిర్పోర్టులో లాగా పరిశుభ్రంగా ఉండి, సీట్లు కూడా చక్కగా ఉన్నాయి. ఎదురుగా ఒక వైపు కాఫీ, బ్రేక్ఫాస్ట్ క్రొసాంట్స్  అమ్మే దుకాణం ఉంది. సత్య వెళ్లి కాఫీ, క్రొసాంట్ కొని తెచ్చుకున్నాడు. అయిదు డాలర్లకి ఒకటి అమ్మే పెద్ద క్రొసాంట్స్ ఆ దేశంలో చాలా బావున్నాయి. అయితే ఫ్రాన్సులో అంతకంటే బావున్నాయనుకోండి అది వేరే విషయం.

పైనంతా డూమ్ ఉన్న స్టేషనులో ఇంగ్లీషులో ప్లాట్ ఫారం (Platform) అని ఒక వైపు, అదే పదాన్ని ఫ్రెంచ్ భాషలో సూచిస్తూ “కె” (Quai) అని మరోవైపు బోర్డులున్నాయి. ఇలా రెండు దేశాల మధ్య రైలు ఎక్కడం ఇదే మొదటిసారి కావడంతో చాలా ఉత్సాహం వేసింది.

మొత్తానికి ఉదయం 6.45 కల్లా  పదవ ప్లాట్ ఫారమ్మీద సిద్ధంగా ఉన్న రైలులో మా సీట్లు ఉన్న ఒకటవ కోచ్ కి చేరుకున్నాం. ఏడుగంటల ఒక్క నిమిషానికి అంటే సరిగ్గా నిర్ణీత సమయానికి  రైలు ప్లాట్ఫారం నెంబరు 10 నించి బయలుదేరింది. “మేం ఎక్కవలసిన రైలు ఒక్క నిమిషమైనా లేటు కాదు” అని నవ్వుకున్నాం.

కోచ్ నెంబరు ఒకటిలో యాభైయ్యవ నంబరు సీట్లు మావి. సీట్లు ఎదురుబొదురుగా, మధ్య టేబుల్ తో కంఫర్టబుల్ గా, చక్కగా ఉంది సీటింగు. పెద్ద లగేజీని కోచ్ ఎక్కగానే ఉన్న కాబిన్లో పెట్టాలి. చిన్న సూట్కేసులు, బ్యాగులు వంటివి సీట్ల పైన ఉన్న లగేజీ ర్యాక్ లలో పెట్టుకోవచ్చు.

రైలు బయలుదేరుతూనే ప్రయాణీకులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎనౌన్సు చేసారు. ముఖ్యంగా పొగతాగవద్దని హెచ్చరికలు జారీ చేసారు. రైలు వేగంగా లండను నగరాన్ని దాటుకుని వెళ్ళసాగింది. ఎన్నో ఏళ్లుగా కలలు కనీ, ఎదురుచూసీ, వచ్చిన ఇంగ్లాండు దేశానికి ఆనందంగా వీడ్కోలు తీసుకున్నాం.

మనసులో ఎందుకో కొద్దిగా బాధగా ఉన్నా, మరొక పెద్ద కల అయిన పారిస్ చూడబోతున్నానన్న ఆనందం ముందు అదంతా పక్కకు వెళ్ళిపోయింది.

7.10 ని.ల కల్లా చాకోలెట్ స్విరల్, నారింజ, పైనాపిల్ ఫ్రూట్ పీసెస్, యోగర్ట్, ఆరంజి జ్యూస్,  మంచినీళ్లతో బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇచ్చారు.  కాఫీ, టీ లు పోసుకోవడానికి వీలుగా కప్పులు ఇచ్చి, విడిగా మగ్గులతో వేడిగా  తెచ్చి నింపారు. ప్రతి సీటుకి ఆనుకుని చేతి పక్క పైగా ఒక్కో లైటు, కుర్చీ సీటు దగ్గిర  స్విచ్ ఉంది. అదేవిటో కనిపెట్టడానికి కాస్సేపు పట్టినా పుస్తకాలు చదువుకోవడానికి పర్సనల్ లైటు అని అర్థమయ్యాక బావుందనిపించింది. అలాగే ఊసల్లేని పెద్ద పెద్ద గాజు కిటికీలకు మధ్య మధ్య కోట్లు తగిలించుకునే హుక్కులు కూడా ఉన్నాయి.

కాస్సేపట్లోనే రైలు 265కి.మీ వేగం అందుకుంది. ఈ వివరాలన్నీ ఎదురుగా పై కప్పుకి వేళ్ళాడుతున్న చిన్న తెర టీవీ మీద కనిపించసాగేయి. దాదాపు 7.40 ప్రాంతంలో ఇంగ్లాండు దేశాన్ని దాటుకుని ఇంగ్లీషు ఛానెల్ టన్నెల్ లోకి ప్రవేశించాం. ఎక్కడా మధ్యలో రైలు ఆగదు. ఇంగ్లాండులో చివరి ఊరి పేరు “ఫోక్ స్టోన్“ (Folkestone).

ఇంగ్లీషు ఛానెల్ టన్నెల్ పొడవు 31 మైళ్లు అంటే 50.5 కి.మీలు. టన్నెల్ లో రైలు వేగం తగ్గినట్లు అనిపించినా నాకు విపరీతంగా చెవులు పోటు రాసాగేయి. దాదాపు అరగంటసేపు ద్వారా ఇంగ్లీషు ఛానెల్ టన్నెల్ ని దాటుకుని ప్రయాణించిన తరువాత ఫ్రాన్స్ దేశంలోకి అడుగుపెట్టాం. టన్నెల్లో దారంతా సెల్ ఫోను సిగ్నల్స్ పోయాయి. తిరిగి సిగ్నల్ వచ్చేసరికి ఫ్రాన్స్ సమయంలోకి మారిపోయాం.

ఫ్రాన్స్ లో సమయం ఇంగ్లాండు కంటే ఇక గంట తరువాత ఉంటుంది. అలా 8.55కల్లా ఫ్రాన్స్ దేశంలోకి అడుగుపెట్టాం. అది మరొక విచిత్ర అనుభూతి.

ఫ్రాన్స్ దేశంలోకి ప్రవేశించగానే వచ్చిన ప్రాంతం పేరు ఎస్కాలెస్(Escalles). దేశంలోకి అడుగుపెట్టగానే ఇంగ్లాండుకి పూర్తిగా విభిన్నమైన వాతావరణం కన్పించింది. లండన్ నించి పారిస్ వెళ్తున్న ఆ ప్రయాణం ఎలా ఉందంటే- హైదరాబాద్ లో గౌతమీ ఎక్స్ ప్రెస్ ఎక్కి, పొద్దున్న లేచేసరికి విజయవాడ మీంచి తూర్పు గోదావరి జిల్లాలోని మా ఊరు జగ్గంపేట వెళ్తున్నట్టు అనిపించింది. భలే నవ్వు వచ్చింది ఫ్రాన్స్ దేశాన్ని చూస్తుంటే. నేను ఉహించుకున్నది వేరు, ఇక్కడ కన్పిస్తున్నది వేరు. పొగమంచు చేరిన పొలాలు, వైర్లు వేళ్ళాడుతున్న చిన్న కరెంటు స్తంభాలు, ట్రాక్స్ కి ఇరువైపులా కనుచూపుమేరలో పెంకుటిళ్లు దర్శనమిస్తున్న పల్లెటూళ్లు, మట్టిరోడ్లు. ఇక హై టెన్షన్ కరెంటు స్తంభాలైతే అచ్చుమచ్చు ఇండియాలో ఉన్నట్లే ఉన్నాయి.

పదింబావు ప్రాంతంలో ఎస్కాలెస్ ప్రధాన ఊర్లో రెండు మూడంతస్తుల ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని అంతస్తులున్నా ఇళ్ల పై కప్పులు పెంకులతో ఉన్నాయి. అక్కడి నించి పారిస్ మరొక ఏడూ నిమిషాల్లో వస్తుంది. ఈ ప్రాంతం పారిస్ కి సబ్ అర్బన్ అనిపించింది. అంతా దిగేందుకు సర్దుకోవడం మొదలుపెట్టారు. దార్లో  పట్టాల పక్క కనబడ్డ ప్రతి గోడ మీదా గ్రఫీటీనే. ఇలా ఎక్కడపడితే అలా వర్ణ చిత్రాలు గియ్యడం అమెరికాలో నిషిద్ధం. నిజానికి ఫ్రాన్స్ లో కూడా నిషిద్ధమేనట. అయినా ఎందుకు ఇవన్నీ బాగు చెయ్యలేదో మరి!

పక్కన వెళ్తున్న స్పీడ్ రైళ్లని పక్కన బెడితే పట్టాల వరుసలు పెరుగుతూ వస్తూ, అక్కడక్కడా కాస్త ఎత్తైన అపార్టుమెంట్లతో బాంబే స్టేషను చేరుకున్నట్టు అనిపించింది అంతలోనే. అమెరికాలో మా కాలిఫోర్నియాతో పోలిస్తే లండను బాగా పాత నగరం అనిపించింది. ఇక పూర్తిగా  పారిస్ స్టేషను దరిదాపుల్లోకి అడుగుపెట్టగానే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వచ్చి పడ్డట్లు అనిపించసాగింది.

పదిన్నరకి పారిస్ స్టేషనులో దిగాం. మేం దిగిన ఎదురు పట్టాలమీద కూడా మరో యూరోస్టార్ రైలు ఆగి ఉంది. ప్లాట్ ఫారమ్మీద జనాలు లేరు. కానీ పాతది అని మాత్రం తెలుస్తూ ఉంది. అక్కడక్కడా ప్లాట్ ఫారం ఊడ్చే వాళ్లలో నల్లవాళ్ళతో బాటూ, ఇండియన్స్ కనిపించారు.   ప్లాట్ ఫారాల మీంచి పెయిన్ డూమ్ కప్పివున్న రెండు అంతస్తుల స్టేషను లోపలకి అడుగుపెడితే పూర్తిగా గతకాలపు భవంతిలోకి వచ్చినట్లే ఉంది. బయటికి దారి తెలీక ముందు ఎడమ  వైపుగా నడిచాం. బయట రెండవ ప్రపంచ యుద్ధం నాటి జర్మన్ సినిమాలోని వీథిని చూసినట్టు అనిపించింది. పెద్ద కట్టడం బయట నిర్మానుష్యంగా ఉంది. పైగా బయట ఎముకలు కొరికే చలిగా ఉంది.

మళ్ళీ వెనక్కొచ్చి జనాలు లోపలికి వస్తున్నట్లు అనిపించిన దారి గుండా వెళితే ప్రధాన ద్వారం కనిపించింది. రోడ్డుకి ఎదురుగా ఇలాంటిదే మరొక పెద్ద కట్టడం కనిపించింది. స్టేషను బయట అటూ ఇటూ తిరుగుతూ జనం ఉన్నా ఎందుకో క్షేమంగా అనిపించలేదు. అక్కడక్కడా తాగి పారవేసిన డ్రింక్ డబ్బాలు, సిగిరెట్ పీకెలతో అపరిశుభ్రంగానే ఉంది స్టేషను బయట. స్టేషను గట్లకి, రోడ్డుకి తేడా లేకుండా సిమెంటు ఇటికెలు పేర్చినట్లు ఉంది రోడ్డు. ఆ సర్కిల్ చుట్టూ అంతా ఒకేలాంటి కట్టడాలున్నాయని గమనించాను.

పారిస్ లోని ఈ ప్రధాన రైల్వే స్టేషను పేరు “గారే డు నోర్డ్” ( Gare du Nord).  ఇది 1861లో ఇది ప్రారంభించబడినప్పటి  నించి నిరంతరాయంగా ఇతరదేశాల నించి రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయట. యూరపు ఖండంలోనే అతి పెద్ద స్టేషనట అది. సంవత్సరానికి దాదాపు రెండు వందల మిలియన్ల మంది ఈ స్టేషను గుండా వెళ్తూ ఉంటారట.

స్టేషను రోడ్డు దాటి ఎదురుగా ఉన్న భవంతి వైపు నడిచి లగేజీలు ఆన్చుకుని టాక్సీ వచ్చేవరకు చలిలో కూర్చున్నాం.  పాపం మా సిరి ఎంత చలైనా “కియ్ కయ్” అనకుండా ఊరుకుంటుంది. పదకొండు గంటల వరకు అక్కడే ఉండిపోయాం.

మొత్తానికి మమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చిన పెద్ద షేర్డ్ ఆటో లాంటి వ్యాను ఎక్కాం.  వ్యాను పైన రూఫ్  మొత్తం అద్దం ఉండడంతో చుట్టూ భవంతులు చక్కగా కనిపించసాగేయి. డ్రైవర్ కి మాకు మధ్య గ్లాసు బిగించి ఉంది.

ఎదురుబొదురుగా మూడు మూడు సీట్లు ఉన్నాయి. మా ఎదురుగా ఎవరూ లేనందున ఆ సీట్లు మడిచి మా లగేజీ మా కాళ్ళ దగ్గిరే సర్దిపెట్టేడు మా  డ్రైవర్. ఇక అతనితో మాట్లాడాలంటే వ్యాను డోర్ కి ఉన్న ఎర్ర బటన్ నొక్కి మాట్లాడొచ్చని చెప్పాడు. నేను వ్యాను ఎక్కగానే వీడియో తీసుకునే హడావిడిలో సీటు బెల్టు పెట్టుకోకపోతే ముందాపని చెయ్యమని మా  డ్రైవర్ స్పీకర్ లో చెప్పాడు.

స్టేషను 10వ వీథిలో ఉంటే మా హోటల్ 17 వ వీథిలో ఉంది. దార్లో రోడ్లన్నీ చిన్న సందుల్లా చాలా సన్నగా ఉన్నాయి. పైగా అటూ ఇటూ పార్కు చేసి వున్న కార్లొకటి. మొత్తానికి ఓల్డ్ సిటీ లాగే అనిపించింది. దాదాపు ఇరవై నిమిషాల్లో హోటలుకి చేరేం. ట్రిప్ మాస్టర్స్ లో బుక్ చేసుకున్న టూర్ కాబట్టి వాళ్ళు రికమండ్ చేసిన హోటలు బెస్ట్ వెస్ట్రన్ ప్లస్ ని తీసుకున్నాం. హోటలు లాబీ అనబడే చిన్న హాలు, మెట్లెక్కితే పైన చిన్న గదులు కాసిన్ని, అంతే. అయితే అన్ని చోట్లకీ అనువుగా ఉందా ప్రదేశం. దగ్గర్లోనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. అయినా మేం ఇంగ్లాండ్ లో లాగా ఇక్కడ బస్సుల్లో,లోకల్  రైళ్లల్లో మా సిరితో తిరగడం కష్టమని అనిపించి ఆ పని విరమించుకున్నాం.

లాబీలో పాతకాలపు కుట్టు మిషను, టైపు మిషను వంటివి ఆర్ట్ పీసుల్లా అలంకరించారు. హోటలు బయటంతా ఎలా ఉన్నా గది మాత్రం ఉన్నంతలో విశాలంగా బానే ఉంది.

అప్పటికి మధ్యాహ్న భోజన సమయం కావడంతో హోటల్లో సామాన్లు పడేసి బయటికొచ్చి అలా నడిచి చూద్దామని అనుకున్నాం. అయితే పక్కనే చిన్న లెబనీస్ రెస్టారెంటు ఒకటి కనబడగానే వెంటనే మరో ఆలోచన లేకుండా లోపలికి వెళ్లి కూర్చున్నాం. ఎందుకంటే ఫ్రాన్స్ కి చెందిన మా కొలీగ్ ఒకమ్మాయి పారిస్ లో లెబనీస్ ఫుడ్ కాస్త స్పైసీ గా బావుంటుందని చెప్పింది. నిజంగానే ఫుడ్ చాలా బావుంది.

అమెరికాలో మేం వెళ్లే మిడిల్ ఈస్ట్ రెస్టారెంట్ల కంటే చాలా రుచిగా వండేరు. ఫలాఫెల్ ర్యాప్, చికెన్ వంటివేవో ఆర్డర్ చేసాం. అయితే హడావిడిగా తినాల్సి వచ్చింది. ఎందుకంటే ఒంటిగంటకల్లా మేం మా టూర్లో భాగంగా ఊర్లో ప్రధాన విశేషాలు  తిప్పి చూపించేందుకు ఒక “టుక్ టుక్” అనబడే ఆటోని మాట్లాడుకున్నాం. నిజంగానే సరిగ్గా ఒంటి గంట కొట్టే సరికల్లా ఆ టుక్ టుక్ హోటలు ముందుకొచ్చి ఆగింది. ఆరుగురు కూర్చోగలిగే పెద్ద ఆటో అది. పైనంతా కూడా సీత్రూ తెరలు కట్టడం వల్ల చుట్టూ బిల్డింగులన్నీ బాగా కనిపించసాగేయి. అంతా బానే ఉంది కానీ చుట్టూ వర్షం వగైరా రాకుండా పలుచని ప్లాస్టిక్ తెరలు కట్టి ఉన్నా, ఆ రోజు మబ్బుగా ఉండడంతో చలి గాలిని తట్టుకోవడం కష్టమైపోయింది. మా బాధ భరించలేక డ్రైవరుకి చెపితే, అక్కడికీ ఒక చిన్న దుప్పటీ ఒకటి కప్పుకోమని ఇచ్చాడు మా డ్రైవరు కమ్ గైడు. కానీ ముగ్గురికీ అది ఏపాటి! టుక్ టుక్ ని మేం అయిదు గంటల పాటు అద్దెకి బుక్ చేసుకున్నాం. అంటే సాయంత్రం ఆరుగంటల వరకు ఆ ఆటో వంటి టుక్ టుక్ మాతోనే ఉంటుందన్నమాట!

ఇక టూరులో పారిస్ లోని ప్రధాన ప్రదేశాల్లో మేం అక్కడుండే రెండు రోజుల్లో చూసేవి తప్ప, మిగతా వాటిల్లో వీలైనన్ని చూడాలని నిర్ణయించుకున్నాం. అందులో మొదటిదైన సేక్రె కోర్ బసీలికా (Sacre Coeur Bascilica) కి ఇరవై నిమిషాల్లో చేరుకున్నాం. దార్లో చాలా వీథుల్లో రోడ్లు ముందు చెప్పినట్టు పలుచని రాళ్లు పేర్చినట్లు ఉండడంతో మా టుక్ టుక్ ఎగుడు దిగుడు రోడ్డులో పడ్డట్లు దడదడా అనసాగింది.

సరే బసీలికాకి వెళ్లే దారి ఉన్న మెట్లకి దగ్గర్లో ఆపేడు మా డ్రైవరు. తలెత్తి చూస్తే ఎదురుగా ఎత్తున గుట్ట మీద ఆ మూల నించి ఈమూల వరకు ఉన్న మూడు వందల వెడల్పైన మెట్ల పైన అతి పెద్ద గోపురంతో సేక్రె కోర్ బసీలికా అత్యద్భుతంగా దర్శనమిచ్చింది. అప్పటి వరకు అంత పెద్ద డోముతో ఉన్న చర్చిని ఎక్కడా చూడలేదు మేం. చుట్టూ బానే రద్దీగా ఉంది. చుట్టూ ఇనుప చువ్వలకి గేటు మీద ఎక్కడ చూసినా లక్షలాది తాళం కప్పలు వేసి ఉన్నాయి. మెట్ల మీద తాళం కప్పలు, తాళాలు, ఏవేవో చిన్న చిన్న బొమ్మలు అమ్మేవాళ్లు ఎక్క వాళ్లు, దిగే వాళ్ళని కొనుక్కోమని అడుగుతున్నారు.

ఆ ప్రదేశం చూస్తే ఎందుకో ఆగ్రా, తాజ్ మహల్ గుర్తుకు వచ్చాయి నాకు.

ఈ తాళం కప్పల్ని “లవ్ లాక్స్” అంటారట. అప్పుడప్పుడు ఈ తాళాలన్నిటినీ నగర నిర్వాహకులు తీసి పారవేయిస్తూ  ఉంటారట. పారిస్ లోని సీన్ నది (Seine River) మీద ఉన్న బ్రిడ్జిల మీద ఈ సంప్రదాయం అత్యధికంగా కనిపిస్తుంది. పారిస్ ప్రేమికుల నగరం కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రేమికులు ఇలా తాళం కప్ప మీద పేర్లు రాసి,  బ్రిడ్జి రెయిలింగుకి తాళం వేస్తే తమ ప్రేమ భద్రంగా ఉంటుందని నమ్మకమట. పైగా తాళం భద్రంగా ఉండడానికి, తాళాలు నదిలో విసిరివేస్తారు కూడా. ఈ బసీలికా దగ్గిర మేం చూసినది ఆ సంప్రదాయమే.

సేక్రె కోర్ బసీలికా, సేక్రెడ్ హార్ట్ సంప్రదాయానికి చెందిన కేథలిక్ చర్చి. ఇది మోంట్ మార్త్రే (Montmartre) కొండ మీద ఉంది. ఈ మోంట్ మార్త్రే పారిస్ కి ఉత్తర భాగాన 430 అడుగులఎత్తున ఉంది. ఈ సేక్రె కోర్ బసీలికా పారిస్ లోని ఈఫిల్ టవర్ తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని పొందిన కట్టడం. ఫెలిక్స్ ఫోర్నిర్ అనే క్రైస్తవ మత గురువు దీన్ని కట్టించాలని మొట్టమొదటగా తలపెట్టాడట.

1875లో మొదలుపెట్టి 1914 వరకు, అంటే  నలభై ఏళ్ల పాటు దీన్ని నిర్మించారట. పాల్ అబాదీ అనే ఆర్కిటెక్టు ప్రధానంగా దీని నిర్మాణానికి రూపురేఖలు దిద్దినా, మొత్తం అయిదుగురు భవనశిల్పులు (ఆర్కిటెక్టులు) దీని నిర్మాణ సారధ్యం వహించారట. దీని మధ్య గోపురం ఎత్తే 83 అడుగులు. మొత్తం ఎత్తు  దాదాపు 270 అడుగులు.

లోపల అతిపెద్ద హాలు ఉన్న ప్రధాన చర్చితో బాటూ, చుట్టూ విడివిడిగా ఉన్న చిన్న చిన్న ప్రార్ధనా ప్రదేశాలున్నాయి. అలాగే చిన్న మీనియేచర్ బ్రసీలికా కూడా ఉంది. ఇక ఎంట్రన్సులో గాజు గిన్నెల్లో కొవ్వొత్తులు కొనుక్కుని వెలిగించడానికి పెద్ద స్టాండు ఉంది. అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలనుకునేవారు స్టాండుని ఆనుకుని ఉన్న బాక్సులో ఒక్కో కొవ్వొత్తికి  రెండు యూరోలు చొప్పున వేసి వెలిగించ వచ్చు. మేమిద్దరం చెరో కొవ్వొత్తీ వెలిగించాం.

దాదాపు అరగంటలో చర్చి సందర్శనను ముగించుకుని మెట్లు దిగి వస్తూ ఓ సిక్కు పెద్దమనిషి అమ్ముతున్న పదేసి యూరోలు పెట్టి చెక్క బొమ్మలు కొన్నాం. అవి పిల్లల పేర్లలో అక్షరాల్ని కలుపుతూ రైలు బండి ఆకారంలో ఉన్న నేమ్ బోర్డులన్నమాట. విశేషంగా కనిపించింది నాకైతే. మా సిరికి కూడా బాగా నచ్చింది. ఇప్పటికీ తన గదిలో బుక్ షెల్ఫ్ మీద భద్రంగా దాచుకుంది దానిని.

అక్కణ్ణించి బయలుదేరి తరువాత ప్రదేశానికి చేరుకునేలోగా ఇండియలోలాగా ద్విచక్రవాహనాల్ని అధికంగా చూసేం. రోడ్లన్నీ రాళ్లు పేర్చినట్లు ఉండడంతో ఎక్కడికక్కడ గతుకుల్లోంచి నెమ్మదిగా సాగ సాగింది ట్రాఫిక్.

మరో అరగంటలో ప్లేస్ వెందోమ్ (Place Vendome)కి చేరుకున్నాం. “వెందోమ్ కాలమ్” అని పిలిచే ఈ ప్రదేశం అతి పెద్ద నలుచదరాకారపు కూడలి. మధ్య పెద్ద కిలుమెక్కిన రాగి స్తంభం మీద నెపోలియన్ విగ్రహం. చుట్టూ నలుచదరాకారాన్ని రెండు సగాలు  చేసినట్లు నిర్మించిబడిన నాలుగేసి అంతస్తుల రెండు పెద్ద భవంతులు. ఇప్పుడు ఇది ఖరీధైన  దుకాణాల సముదాయం, అత్యంత ఖరీదైన హోటల్ రిట్జ్ కి నిలయం.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.