ప్రమాదంలో ఆలోచన

-కందేపి రాణి ప్రసాద్

అడవిలోని మృగరాజుకు చాలా రోజులకు సంతానం కలిగింది. లేక లేక కలిగిన సంతానాన్ని గారాబంగా పెంచుకుంటున్నారు మృగరాజు దంపతులు. కాబోయే యువరాజును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

పిల్ల సింహానికి అన్నం తినిపించడానికి ఎంతో అవస్థ పడుతుంది తల్లి సింహం ఎన్నో మాటలు కబుర్లు చెపితే గానీ అన్నం తినదు. తండ్రిని చూసి భయపడుతుంది గానీ ప్రేమ ఎక్కువై భయం తగ్గి పోతున్నది. తండ్రి సింహంతో పాటు ‘లయన్ కింగ్’ సినిమాని చూసి తనూ గర్జించటానికి ప్రయత్నం చేసి చూసింది. సినిమాలో వలె ‘నీ తరువాత నేనేనా రాజును నాన్నా’ అని అడిగింది. అవును నీవే యువరాజువు. ఈ కనిపించే అడవంతా నీ పాలనలోకే వస్తుంది” అని తండ్రి సింహం గర్వంగా జూలు దువ్వుకుంటూ చెప్పింది.

“నాన్నా అప్పుడు నేనేమి చెప్పినా అందరూ వింటారా? నేనేం చెపితే అదే చేస్తారా. అందరూ నా మాట ప్రకారమే నడుచుకుంటారా” అని అమాయకంగా తండ్రిని చూస్తూ అడిగింది. పిల్ల సింహం “అవున్రా అపుడు నీవు రాజువి అవుతావు కాబట్టి ఎవరైనా నీ మాట వినాల్సిందే. అలాగని తప్పు మాటలు చెప్పకూడదు. అందరికీ మంచి చేకూర్చే పనులే చేయాలి. అందరి సమస్యలు పరిష్కరించాలి. ప్రజలందరికీ మేలు చేసే రాజువి కావాలి” అని సింహం గర్వంగా అన్నది. ‘నువ్వు చెప్పినట్లే చేస్తాను నాన్నా. అమ్మ మాట కూడా వింటాను’. అన్నది పిల్ల సింహం దృడంగా. “మా బంగారు తండ్రి మంచివాడు” అంటూ తండ్రి సింహం కొడుకును ముద్దుపెట్టుకున్నది.

తల్లి పిల్ల సింహానికి స్నానం చేయిస్తూ మంచి మాటలు చెబుతున్నది. “తోటి పిల్లలతో జగడాలాడవద్దు. అందరితో కలసిమెలసి ఆడుకోవాలి. కాబోయే రాజునని అహంకారం చూపకూడదు” అంటూ ఎన్నో మంచి విషయాలు కొడుకుతో చెబుతున్నది తల్లి. నేను ఎప్పుడూ అలా ఉండను కదా! అందరిలో స్నేహంగా ఉంటానమ్మా. నేను కూడా నాన్నలాగే మంచి పేరు తెచ్చుకుంటానమ్మా! నీ మీద ఒట్టు ఎన్నడూ మీ మాట జవదాటనమ్మా ఎంతో విశ్వాసంగా పిల్ల సింహం తల్లికి మాట ఇచ్చింది.

అంతేకాదు అడవిలో ఎన్నో అపాయాలు వస్తుంటాయి. వాటిని ఎదుర్కోవాలి భయపడకూడదు. ప్రమాదాలు జరుగుతుంటాయి. బయట పడేందుకు ప్రయత్నించాలి. ఉపాయంతో అపాయాన్ని ఎదుర్కోవాలి. వెనకడుగు వేయకూడదు. రాజనేవాడు తనను తాను రక్షించుకోవాలి. తన రాజ్య ప్రజలను రక్షించుకోవాలి. ముఖ్యంగా మానవుల నుంచి వచ్చే ప్రమాదాలను జాగ్రత్తగా తట్టుకోవాలి” తనకు తోచిన విషయాలన్నీ చెప్పింది తల్లి. సరేనని తలూపింది పిల్లసింహం.

ఒకనాడు పిల్ల సింహం తన స్నేహితులతో ఆడుకుంటూ ఆడుకుంటూ చాలా దూరం వెళ్ళారు. ఆడుకుంటూ పిల్ల సింహం స్నేహితుల్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ చెత్త బురద కనిపిస్తోంది. ఆ మధ్యన ఏదో మెరుస్తూ కనిపిస్తోంది. ‘ఏమి మెరుస్తుందా? అని చూస్తూ ముందుకు ముందుకు అడుగు వేస్తూ వెళ్ళింది అంతే ధబాల్న లోపలికి పడిపోయింది పిల్ల సింహం. సింహం పిల్లతో వచ్చిన స్నేహితులంతా దగ్గరకు వెళ్ళి చూశారు. అదొక ఊబి అని అర్ధమైంది. అందరూ వెనక్కి వచ్చేసి దూరంగా నిలబడి చూడసాగారు. ఏం చేయాలో అర్థం కాలేదు.

అక్కడే ఉన్న ఒక కాకి ఎగురుకుంటూ వెళ్ళి గుహలో ఉన్న సింహానికీ, సివంగికి చెప్పింది. సింహం ఒక్కుదుటున బయటకు పరుగులు తీసింది. సివంగి కూడా భర్తను అనుసరించింది. పిల్లవాడికి ఏమైందో అని భయపడుతూ ఆఘమేఘాల మీద పరుగులు తీశారు. ఊబి దగ్గరకు చేరుకున్నారు. మిగతా స్నేహితులంతా చుట్టూ నిలబడి చూస్తున్నారు. పిల్ల సింహం మునుగుతూ తేలుతూ ఉన్నది. భయంతో కేకలు పెడుతున్నది. సింహానికి కూడా కాలూ, చెయ్యి ఆడలేదు. సివంగి కూడా పిల్లవాడినాస్థితిలో చూసేసరికి ఏడువు ఆగలేదు. తనూ ఏడపటం మొదలు పెట్టింది. పిల్ల సింహాసికి భయంలో ఏం చేస్తున్నదో అర్ధం కాలేదు. అప్పుడే సింహం ఒక విషయాన్ని గమనించింది.

ముందుగా పిల్ల సింహనికి ధైర్యం ఇవ్వాలని అనుకున్నది. “చూడు నాయనా!, మనం రాజులం. ఏడవకూడదు, భయపడకూడదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కునే ధైర్యం కలిగి ఉండాలి. ప్రమాదం అంటేనే చెప్పి రాదు అనుకోకుండా జరిగేదాన్నే ప్రమాదం అంటారు. ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. భయపడుతుంటే అలోచన పని చేయదు. ఆలోచన సరిగా రావాలంటే మెదడు ప్రశాంతంగా ఉండాలి కాబట్టి మెదడును భయం నుంచి బయట పడేయాలి” అంటూ పిల్ల సింహంతో రకరకాలుగా మాట్లాడటం మొదలు పెట్టింది.

సింహం తన పిల్ల వాడితో మాట్లాడుతూనే ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నది. తండ్రి మాటలకు పిల్ల సింహం కొద్దిగా ప్రభావితమైంది. ఇందాక ఉన్న భయం కొంచెం తగ్గింది. అప్పుడు చుట్టూ చూసింది. ఏమైనా కర్రదుంగలు, చెట్లు కాళ్ళకు అందుతాయేమో అని చూసింది. ఏమీ కనిపించడం లేదు.

ఒడ్డున ఉన్న జంతువులన్నీ తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తున్నారు. కోతి తన తోకను చాపి పట్టుకోమని అడిగింది. కానీ పిల్ల సింహానికి అందడం లేదు. ప్రయత్నించింది. చిన్న చిన్న కర్ర పుల్లల్ని తెచ్చి ఆ ఊబి నీటిలో పడేశారు. కానీ వాటిని పట్టుకోవడానికి సరిపోలేదు. పిల్ల సింహం బరువుకు అవి వంగిపోతున్నాయి. పిల్ల సింహం కూడా ఆలోచన చేస్తున్నది.

అంతలో అక్కడికి ఏనుగు వచ్చింది. పరిస్థితిని గమనించింది. తన తొండాన్ని ముందుకు చాపి పట్టుకొమ్మని చెప్పింది. తాను బలంగా ఉన్నాను కాబట్టి బయటకు లాగగలనని చెప్పింది. కానీ పిల్ల సింహం ఒడ్డుకు కొంచెం దూరంగా ఉన్నది. అందుకే అది ఏనుగు దగ్గరకు రాలేకపోయింది.

“ఒక చెట్టును విరుచుకొస్తాను ఉండండి” అంటూ గబగబా ముందుకు పోయింది ఏనుగు. ఏనుగు అడవి లోపలికి వెళ్ళిన కొద్ది సేపటికి జిరాఫీ వచ్చింది. విషయం ఏమిటో తెలుసుకున్నది” నేను ప్రయత్నిస్తాను” అంటూ ముందుకు వచ్చింది. జిరాఫీ తన మెడను ఊబి వైపు వంచింది. పిల్ల సింహాన్ని కొంచెంగా ముందుకు రమ్మని చెప్పింది. జిరాఫీ నోటికి దగ్గరగా ఉన్నది కానీ, పూర్తిగా పట్టు చిక్కడం లేదు. పిల్ల సింహం ముందుకు కదలడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇంకొన్ని కర్రల్ని ఊబిలో వేశారు. దాని కాలు కింద ఒక కర్ర దుంగ ఉండడం వల్ల దాని కాలు కొద్దిసేపు నిలబడింది. దాంతో కొద్దిగా ముందుకు కదలగలిగింది. అదే సమయంలో జిరాఫీ ఒడుపుగా తన తలను వంచి పిల్ల సింహన్ని పట్టుకున్నది. మొదట కొద్దిగా జారి పోయినా రెండో ప్రయత్నంలో పిల్ల సింహాన్నిపట్టుకొని బయటుకు లాగి పడేసింది. జిరాఫీ ప్రయత్నంలో పిల్ల సింహం ఒడ్డుకు చేరింది.

సివంగి తన బిడ్డడిని చూసుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. సింహం కూడా తనకు లేకలేక కలిగిన సంతానాన్ని చూసి దగ్గరకు తీసుకున్నది. పిల్ల సింహం దిమ్మెర పోయింది. కొంచెం సేపటికి తేరుకున్నది. తను ప్రమాదం నుంచి బయటపడ్డానని అర్థం చేసుకున్నది. అమ్మా నాన్నలకు అతుక్కుపోయింది.

ఆ తరువాత సింహం అవతలకు వచ్చి జిరాఫీకి కృతజ్ఞతలు చెప్పింది. మిగిలిన జంతువులకు కూడా కృతజ్ఞతలు చెప్పింది. రాజు గారికి జంతువులన్నీ నమస్కారం తెలిపాయి రాజ్యంలోని వారందరూ కలసికట్టుగా ఉండి ఏదైనా సమస్యలు ప్రమాదాలు వచ్చినపుడు జట్టుగా ఎదుర్కోవాలని అనుకున్నారు. ప్రమాదంలో భయం కన్నా ఆలోచన అవసరమని తెలుసుకున్నాయి. పిల్ల సింహం భయం నుంచి బయటపడి ఆలోచించడం వల్ల, జిరాఫీ చెప్పినట్లుగా ముందుకు కదలడం వల్ల ప్రమాద తప్పింది. సింహం తన కొడుక్కి ఇచ్చిన దైర్యం పిల్ల సింహం మునిగి పోకుండా కాపాడింది. పిల్లలకు ఆపదలు ఎదురైనప్పుడు ఉపాయంలో తెలివిగా మసలుకోవాలని సూచించారు.:

*****

Leave a Reply

Your email address will not be published.